Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా మహమ్మారితో కోలుకో లేని దెబ్బతిన్నది విద్యారంగం. ఇప్పటికే విద్యార్థులకు చదువుల పట్ల ఆసక్తి లేక తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడూ వదిలి పెడితే ఈ విద్యాసంవత్సరాన్ని విద్యార్థులు గాలికి వదిలే అవకాశం ఉంటుంది. విద్యార్థుల భవిష్యత్తు, ఉపాధ్యాయుల గోసను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం దయచేసి ఆలోచించాలి. విద్యార్థులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి వసతి గృహాలలో ఆశ్రయం పొందుతున్నారు. వాటిని మూసివేయడం గురించి ప్రభుత్వం తప్పనిసరిగా ఆలోచించాలి. 2020-2021 విద్యాసంవత్సరం ఎటు పోతుందో చెప్పలేని అయోమయ పరిస్థితిలో విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావ్యాప్తి కోసం అంకితభావంతో పనిచేస్తున్న అధ్యాపకులు నిర్వాహకులు ఉన్నారు. ముఖ్యంగా కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో విద్యారంగం ఆన్లైన్ తరగతుల ద్వారా ఆశించిన ఫలితాలు సాధించలేక పోయింది. బోధనా రంగంలో ప్రత్యక్ష తరగతులకు మించిన ప్రత్యామ్నాయం లేదని మనందరికీ తెలుసు. దీనిని గ్రహించిన ప్రభుత్వం ఫిబ్రవరిలో తొమ్మిదో తరగతి నుంచి ఆ పై తరగతులకు ప్రత్యక్ష తరగతులకు కోవిడ్ నిబంధనలతో అనుమతులు జారీ చేసింది. దానికి అనుగుణంగా ప్రయివేటు, ప్రభుత్వ విద్యాసంస్థల్లో నిబంధనలకు అనుగుణంగా ప్రత్యక్ష బోధన కొనసాగుతున్న తరుణంలో రాష్ట్రంలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 23వ తేదీ నుంచి 6,7,8 తరగతులకు ప్రత్యక్ష బోధనకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. మార్చి 14న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఓటర్లకు కొన్ని రాజకీయ పార్టీలు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాయో తెలిసిందే. డిగ్రీ విద్యార్థులకు మూడో సెమిస్టర్, ఐదో సెమిస్టర్ పరీక్షలు మార్చి 24న ప్రారంభమై రద్దయ్యాయి. ఈ పరీక్షలు ఎప్పుడుంటాయో, ఉండవో చెప్పలేని పరిస్థితి. ఇంటర్మీడియట్ కాలమానం ప్రకారం ఏప్రిల్ 1న నైతికత, మానవ విలువల పరీక్ష, 3న పర్యావరణ విద్యా పరీక్షలున్నాయి. ద్వితీయ సంవత్సరం సైన్స్ విద్యార్థులకు 7 నుంచి ప్రారంభం ప్రయోగ పరీక్షలు నిర్వహించాలి. మే 1 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ థియరీ పరీక్షలు అయోమయానికి గురిచేస్తున్నాయి. ఎన్నికలు జరిగిన నాటి నుంచి కరోనా కేసులు ఎందుకు అధికంగా నమోదవుతున్నాయి. ఎక్కడ కేసులు నమోదవుతున్నాయి? ఇది గుర్తించకుండా దీనిని ఆధారంగా చేసుకొని రాష్ట్రవ్యాప్తంగా ఉన్నత విద్యాసంస్థలను మూసివేస్తునట్టు ప్రకటించడం ఎంతవరకు సమంజసం. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు దేశవ్యాప్తంగా ఉన్న ఇతర రాష్ట్ర విద్యాసంస్థలు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాయి. రాష్ట్ర విద్యార్థులకు నష్టం జరిగే ప్రమాదం ఉంది. దానిని ప్రభుత్వం ఆలోచించకపోవడం ఎంతవరకు సమంజసం. దీనిపైనే ఆధారపడి ఉన్న లక్షల మంది ఉద్యోగులు రోడ్డున పడే పరిస్థితి కనిపించడం లేదా? వారిని ఆదుకునే బాధ్యత ప్రభుత్వంపై ఉండదా? ఎందుకు ఈ వివక్ష? వారు చేసిన తప్పేంటి? ఇటీవల మీకు ఓట్లు వేసి గెలిపించటమే వారు చేసిన తప్పా? విద్యావ్యాప్తి కోసం వారు పడుతున్న శ్రమ మీకెందుకు కనిపించడం లేదు. సినిమా థియేటర్లు, హోటళ్లు, బార్లపై ఉన్న ప్రేమ విద్యాసంస్థలపై కనీసం పది శాతమైనా చూపించి ఈ రంగాన్ని ఆదుకోవాలి. ఎక్కడైతే కరోనా కేసులు నమోదు కాలేదో ఆయా ఉన్నత విద్యాసంస్థలను జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలలను పునః ప్రారంభించడానికి దయచేసి ఆలోచన చేయాలి. విద్యార్థులు, తల్లిదండ్రుల ఆలోచన దష్ట్యా ఉపాధి కోసం పనిచేస్తున్న అధ్యాపకుల పొట్ట కోసం నలుగురికి ఉపాధి కల్పిస్తున్న నిర్వాహకుల కోసం తెరవాలి.
రోడ్డునపడ్డ ప్రయివేటు విద్యాసంస్థల్లోని సిబ్బంది
రాష్ట్రంలో ప్రయివేటు రంగంలో 1856 జూనియర్ కళాశాలలు, 11 వేల పైచిలుకు పాఠశాలలు 856 డిగ్రీ, పీజీ కళాశాలలున్నాయి. వాటిలో సుమారుగా మూడు లక్షలకుపైగా బోధనా, బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారు. విద్యాసంస్థలను బంద్ పెట్టడం కారణంగా వారందరూ రోడ్డున పడే పరిస్థితి మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నది. అయినా ప్రభుత్వానికి వారిని ఆదుకోవాలనే సోయి లేకపోవడం ఎంత వరకు సమంజసం. విద్యాసంస్థలను తెరవాలని ఎవరు కోరారు. ఎవరు మూయాలని అడిగారు. కనీసం ఎక్కడైతే కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయో వాటిని సరిదిద్దే ప్రయత్నం చేయలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసమే విద్యాసంస్థ లను తెరిచి ఫలితాలు వచ్చిన తర్వాత వాటిని మూసి వేయడం ఎంతవరకు సమంజసం. ఏవైతే బడ్జెట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు ఉన్నాయో నలుగురు కలిసి ఉపాధి కోసం ఏర్పాటు చేసుకున్న విద్యా సంస్థల నిర్వాహకులు రోడ్డున పడే పరిస్థితి ప్రత్యక్షంగా కనిపిస్తున్నది. కనీసం భవనాల అద్దెలు కట్టలేని పరిస్థితి. అక్కడ ఉన్న భవనాలకు పన్ను కట్టలేని పరిస్థితి ఉన్నది. కానీ ప్రభుత్వం మాననీయ కోణంలో ఈ పన్నులను, కరెంటు బిల్లులను వేటినీ తగ్గించక పోవడం శోచనీయం. విద్యాసంస్థల యాజమాన్యాలు, విద్యా సంస్థలలో పని చేస్తున్నటువంటి అధ్యాపకులందరూ ఒక్కతాటిపైకి వచ్చి సమస్యల పరిష్కారం కోసం ఆలోచన చేయవలసిన సమయం ఆసన్నమయింది. మన సంస్థలను కాపాడుకోవడానికి, విద్యార్థుల భవిష్యత్తును కాపాడు కోవడానికి, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చు కోవడానికి అందరం ఆలోచన చేయాలి. ఈ ప్రభుత్వం పునరాలోచించే విధంగా కార్యాచరణ రూపొందించి ముందుకు సాగాలి.
- గౌరీ సతీష్