Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆధునిక విశ్వ మానవాళి పునరుత్పత్తి సమస్యలను ఎదుర్కోబో తున్నారని, పురుషుల్లో శుక్ర కణ గణన (స్పెర్మ్ కౌంట్) తగ్గడం, పురుషాంగం చిన్నది కావడం, స్త్రీపురుషుల్లో పునరుత్పత్తి అభివృద్ధి దుష్ప్రభావానికి గురికావడం లాంటి పలు సమస్యలతో మానవ జాతి భవిష్యత్తు, ఉనికి ప్రమాదంలో పడనుందని న్యూయార్క్‌కు చెందిన 'ప్రొఫెసర్ షన్నా హెచ్. స్వాన్, స్టాసీ కొలీనో' సంయుక్తంగా రచించిన పుస్తకం 'కౌంట్‌డౌన్' తెలియజేస్తున్నది. ఎన్విరాన్మెంటల్ వెడిసిన్, పబ్లిక్ హెల్త్ విభాగంలో ప్రొఫెసర్‌గా అపార అనుభవం కలిగిన షన్నా హెచ్. స్వాన్ పరిశోధన ఫలితాల ఆధారంగా నవ్య మానవ జాతి జీవనశైలిలో వచ్చిన మార్పుల కారణంగా కొన్ని రసాయనాలు శరీరంలోని హార్మోన్లకు అంతరాయం కలిగిస్తూ పునరుత్పత్తి సామర్థ్యాన్ని తగ్గిస్తున్నాయనే భయానక వాస్తవాన్ని వెల్లడించింది. పర్యావరణ కాలుష్యం, ప్రమాదకర రసాయనాలు, వాతావరణ అననుకూల మార్పుల ఫలితంగా స్త్రీపురుష పురరుత్పత్తి అవయవాలు అసాధారణ మార్పులకు గురికావడం జరుగుతుందని తెలియజేశారు. 2045 నాటికి స్త్రీపురుష జంటలు ప్రత్యామ్నాయ పునరుత్పత్తి మార్గాలను (సంతానసాఫల్య కేంద్రాలు) అన్వేషిస్తారని వివరించారు. గత 40ఏండ్లలో పురుషుల స్పెర్మ్ కౌంట్ సగానికి పైగా తగ్గడం గమనించారు. 35ఏండ్లు దాటిన స్త్రీలలో సంతానోత్పత్తి క్షీణత గమనించామని, గర్భస్రావ రేటు పెరుతోందని హెచ్చరించారు.
ఆధునిక వేగవంతమైన మానవ జీవనశైలిలో మనం వాడే వస్తువుల ద్వారా వెలువడే రసాయనాలు శరీరంలోని పునరుత్పత్తికి దోహదం చేసే టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజెన్ లాంటి హార్మోన్లను అనుకరించడంతో సంతానోత్పత్తి మందగించడం గమనించారు. ఆహార పదార్థాల ప్యాకింగ్, తయారీ, ప్రాసెసింగ్‌లలో వాడే సాఫ్ట్ ప్లాస్టిక్‌లలో వెలువడే 'థాలేట్' రసాయనాలు అతి ప్రమాదకరంగా మారుతూ తొందరగా యుక్తవయస్సు రావడం, గర్భస్రావాలు పెరగడం, అండాశయ వైఫల్యం, అకాల ప్రసవాలు లాంటి దుష్పరిణామాలు కనిపిస్తాయని వెల్లడించింది. హార్డ్ ప్లాస్టిక్స్, ఆహార నిల్వ పాత్రలు, ఏటియంలలో వాడే నగదు రసీదుల్లో వెలువడే 'బిస్ఫినాల్-ఏ' రసాయనం వల్ల పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ (శుక్ర గణన) తగ్గడం, జననేంద్రియ కాన్సర్ రావడం, స్త్రీలలో సంతానోత్పత్తి తగ్గడం గమనించారు. ఈ రసాయనం వల్ల పురుషుల్లో అంగస్తంభన సమస్య, శుక్ర కణ నాణ్యత తగ్గడం, కామేచ్ఛ పడిపోవడం జరుగుతుంది. ఇదే రకమైన దుప్షలితాలను ప్లేమ్ రిటార్డెంట్లు, కొన్ని పెస్టిసైడ్లు (అట్రాజిన్ లాంటివి) కూడా కలిగిస్తాయని గమనించాలి. బాల్యం, కౌమారదశ, యుక్త వయస్సులలో ఇలాంటి ప్రమాదకర రసాయనాలకు లోనైనపుడు పురరుత్పత్తి అవయవాలు ప్రతికూలంగా ప్రభావితం అవుతాయి. ఆనస్ (గుదము లేదా అపానము), జననేంద్రియాల మధ్య దూరం (ఆనోజెనిటల్ డిస్టాన్స్) పునరుత్పత్తి సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయి. థాలేట్ రసాయనాలు ప్రభావితం చేసే ఈ దూరం పురుషుల్లో తక్కువగా ఉన్నపుడు పురుషాంగం చిన్నది కావడంతో పాటు సంతానోత్పత్తి రేటు కూడా తగ్గుతుందని, స్త్రీల్లో ఈ దూరం ఎక్కువగా ఉన్నపుడు కూడా సంతానోత్పత్తి తగ్గుతుందని తెలిపారు. హార్మోన్లకు అంతరాయం కలిగించే ఇలాంటి రసాయనాల వల్ల 1960 నుంచి 2018 వరకు ఏడాదికి ఒక శాతం చొప్పున సంతానోత్పత్తి రేటు తగ్గడం గుర్తించారు. 2000 నుంచి 2016 మధ్య కాలంలో పిల్లల్లో ఏడాదికి 1.1 శాతం మూగవ్యధి (ఆటిజమ్ స్పెక్రమ్ డిసార్డర్) పెరగడం గమనించారు.
మానవాళి తరుచుగా వాడే సాఫ్ట్, హార్డ్ ప్లాస్టిక్ వస్తువుల్లో ఇలాంటి హార్మోన్లను ప్రభావితం చేసే ప్రమాదకర రసాయనాలు లేకుండా చూసుకోవడం, ప్రాసెస్డ్ ఆహారానికి దూరంగా ఉండడం, క్యారెట్/పొటాటో లాంటి ముడి కూరగాయలను (రా వెజిటెబుల్స్) వాడడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, ఆహారాన్ని ప్లాస్టిక్‌లో నిలువ ఉంచకపోవడం, థాలేట్లు/బిస్ఫినాల్లకు బదులు సురక్షిత ప్రత్యామ్నాయ రసాయనాలు వాడడం, టెఫ్లాన్ కోటింగ్ లేని పాత్రల్లో వండడం, ప్లాస్టిక్ పాత్రలను ఓవెన్లో పెట్టకపోవడం, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వినియోగాన్ని నిషేధించడం, ఎలక్ట్రానిక్ ఉపకరణాల వాడకాన్ని తగ్గించడం లాంటి చర్యలు ఆరోగ్య సమస్యల తీవ్రతలను తగ్గిస్తాయి. గర్భిణి స్త్రీలు ఇలాంటి రసాయనాలకు మాత్రమే కాకుండా గాలి కాలుష్యానికి, ప్లాస్టిక్ పాక్డ్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఆధునికత పేరుతో నవ్య మానవుడు తన గోతిని తానే తవ్వుకోవడం జరుగుతోందని, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే భావనను మేలుకొలిపి సుందర సుమధుర భవిష్యత్తుకు పునాదులు వేసుకుందాం. ఆరోగ్య పరిరక్షణ వైపుకు నవ్య యువ అడుగులు పడాలని ఆశిద్దాం.
- డా||బి.ఎం.రెడ్డి
సెల్:9949700037