Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా కాల చక్రంలో ధరల సమ్మెట సకల జనుల ముంగిట ప్రతిధ్వనిస్తోంది. పెట్రో ధరలపెంపు అన్ని రంగాలను అతలాకుతలం చేస్తోంది. నిత్యజీవనంలో పెరగడమే తప్ప తరగడం ఎరుగని వినియోగదారునికి నిట్టూర్పే మిగులుతోంది. అసలు కారకులెవరైందీ వినియోగదారుడు గుర్తించిన, గ్రహించిన రోజునే ధరలు అదుపులోకొచ్చే అవకాశం కలుగుతుంది.
గత ఏడాది నుంచి కరోనా చేస్తున్న వికటాట్టహాసం నుంచి సగటుజీవి ఇంకా కోలుకోలేకపోతున్నాడు. ప్రధానంగా మధ్యతరగతి, దిగువ తరగతి ప్రజల కడగండ్లు వర్ణనాతీతం. నిత్యావసరాల ధరలు కొండెక్కటంతో జీవనశైలిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఏ వస్తువును ముట్టుకున్నా తెలియని విధంగా కాటేస్తున్నాయి. ధరలు అదుపు లేకుండా పెరిగి పోతుండటంతో సామాన్యులు విలవిల్లాడి పోతున్నారు. వాస్తవంగా మొన్నటి వర్షాకాలంలో వానలు బాగా పడ్డాయి. దిగుబడులు అంచనాలను మించాయి. వరి ధాన్యమే కాకుండా పప్పుదినుసులు కూడా కొరతలేకుండా పండాయి. విచిత్రమేమంటే పప్పు ధాన్యాల ధరలు విపరీతంగా పెరిగాయి. పెరిగిన రవాణా చార్జీలు, ఇంధన ఖర్చులు తమపై విపరీత ప్రభావాన్ని చూపుతున్నాయని వ్యాపార వర్గాలు ఉటంకిస్తున్నాయి. తెలుగు వారికి ప్రీతిపాత్రమైన పప్పుల్లో మినప పప్పు, కందిపప్పు ధరలు ముఖ్యంగా మధ్యతరగతి ఆపై దిగువస్థాయి ప్రజానీకానికి అందుబాటులో లేకుండా పోతున్నాయి. పెరిగిన, పెరుగుతున్న రకరకాల సుంకాలు వీటికి ఆజ్యంపోస్తున్నాయి. ధరలను అదుపు చేసేందుకు ప్రభుత్వం చర్యలు ఉపకరించటం ఏమోగానీ నిత్యావసరాల ధరలు మాత్రం తగ్గడం లేదు. అప్పుడప్పుడూ, అక్కడక్కడ సబ్సిడీలు, సరఫరాను పెంచడంలాంటి చర్యలు తీసుకున్నా ధరలు ఒకటి రెండు రోజులు తగ్గినట్టు కన్పించినా తర్వాత యథాస్థితికి చేరుకుంటున్నాయి. నిత్యావసరాల కొరత, మార్కెటింగ్, రవాణా సౌకర్యాల మందగింపు, వ్యాపారుల దోపిడీపై నియంత్రణలేని విధానాలు, వివిధ ఉత్పత్తుల డిమాండ్ ఆధికమవటం, సప్లయికి బాగా వ్యత్యాసం ఉండటం, ప్రభుత్వ చర్యల లేమి ఇత్యాది ఎన్ని వల్లె వేసినా చిట్టచివరిగా వినియోగదారులను కూడలిలో నిలబెడుతున్నాయి. పెరిగి పోతున్న ఈ ధరాభారంతో అన్ని వర్గాల ప్రజలు తప్పేదేముంది అనడం తప్ప తప్పించుకునే మార్గం లేక నిట్టూరుస్తున్నారు.
సామాన్యుని ఆహార అలవాట్లలో వంట నూనెల వాడకం సింహభాగం ఆక్రమిస్తున్న సంగతి తెల్సిందే. గత జనవరి నెలలో ఉన్న నూనెల ధరలు అమాంతం పెరిగాయి. కేవలం నెల వ్యవధిలో లీటరు రూ.50 నుంచి 75 దాకా పెంచారు. వేరుశనగ నూనె, సన్‌ఫ్లవర్ ఆయిల్, పామాయిల్ రేట్లు సామాన్యుణ్ణి సతమతం చేస్తున్నాయి. ఈ ధరాభారానికి బోలెడన్ని అంశాలు దోహదం చేస్తున్నట్టు ఈ వ్యాపారులు నివేదిస్తున్నారు. సుంకాలు, ఇంధన ఖర్చులు రవాణా ఛార్జీలు పెరిగాయంటే ఆ భారమంతా ప్రజలే భరించాలంటూ ఫైనాన్స్ జడ్జిమెంట్ జనాల ముందు నిలుస్తోంది. వంట గ్యాస్ ధర సంగతి సరేసరి. 2014లో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక గ్యాస్ సిలిండర్ ధర రూ.400 ఉండగా ఇప్పుడది రూ.900 దాకా పరుగులు తీస్తోంది. సబ్సిడీలు తగ్గింపు శ్రేయస్కరమంటూ ప్రభుత్వం కసరత్తులు చేస్తూ ధరల పెంపునకు దొంగదెబ్బ తీస్తోందని కాస్తాకూస్తో అవగాహన ఉన్న వారందరూ గ్రహిస్తున్నారు.
కరోనా పుణ్యమాని రవాణా రంగం పూర్తిగా దెబ్బతిన్నది. డీజిల్, పెట్రోలు ధరలు పెరుగుతూ పోతుండటం తీవ్ర విఘాతంగా మారింది. ధరలు పెంచిన ప్రతిసారీ అంతర్జాతీయ మార్కెట్లో ధరలనే దీనికి కారణంగా చెబుతున్నారు, క్రూడాయిల్ ధరలతో లంకె పెడుతున్నారు. గత ఆరునెలల్లో పెట్రోలు, డీజిల్ ధరలు ఎగబాకి లీటరు రూ.100 వరకూ చేరుకుంటున్నాయి. మనదేశంలో పెట్రోలు, డీజిల్ వాడకం ఇతర దేశాలతో పోలిస్తే చాలా ఎక్కువగానే ఉంటుంది. 2003లో అమెరికా, ఇరాక్‌పై దాడి సమయంలో అంతర్జాతీయ మార్కెట్లు ముడిచమురు బ్యారెల్ 160 డాలర్లకుపైగా ఉన్నా మనదేశంలో లీటరు రూ.50లోపే ఉంది. ఇక సుంకాల విధింపులో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు వారి పరిధిని అనుసరించి, సూత్రీకరించి సెస్సులు నిర్ణయిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఒకరకంగా మరికొన్ని ప్రాంతాల్లో మరో విధంగా పెట్రోలు, డీజిలు ధరలు భరించడం వినియోగదారులకు భారంగా మారింది. ఎటొచ్చీ సుంకాల మాటెలా ఉన్నా అన్ని ఉత్పత్తులకు, రవాణాకు కీలకమైన ఇతర రంగాల పరిశ్రమలు వగైరా ధరలను పెంచుతూనే ఉన్నాయి.
గత ఏడాది మార్చిలో లాక్డౌన్లు మొదలైనప్పటినుంచి ప్రజా రవాణా సౌకర్యాలు దెబ్బతిన్నాయి. బస్సులు, రైళ్ళు బంద్ కావడంతో బతుకు బండిని ఈడ్చేందుకు అవసరాల కనుగుణంగా వ్యక్తిగత వాహన సౌకర్యాలవైపు జనం మొగ్గు చూపారు. అప్పులు చేసి మరీ వాహనాలను కొనుక్కున్నారు. వేరే దారి లేక రవాణా కోసం మోటారు సైకిళ్ళు ఇతరత్రా వాహనాలను సమకూర్చుకున్నారు అప్పట్లో (కరోనా సమయంలో) పెట్రోలు, డీజిల్ ధరలు కొంచెం అటు ఇటుగా ఉన్నాయి. అయితే లాక్డౌన్లు సద్దుమణిగి లాకులు ఎత్తాక ఇంధన ధరలు విజృంభించడం మొదలైంది. పైగా వాహన తయారీ కంపెనీలు తమ వంతు నిర్వాకాన్ని రుచి చూపించేందుకు సిద్ధమయ్యాయి. డీజిల్ ధరల పెంపు నేపథ్యంలో వాహన తయారీ కంపెనీలు స్పేర్ పార్టులు, ఇతర సామగ్రి ధరలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. బైకులు, కార్లు ఏప్రిల్ ఒకటి నుంచి తమ కొటేషన్లు పెంచి వాహన ధరలు నిర్దేశించాలను కుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. కరోనా.... గత ఏడాది ప్రభావం చూపినా అంతకు ముందే వాహనాలకు బీఎస్ 6 ప్రామాణికతలు మారడం కూడా రేట్లు పెరిగేందుకు దోహదమయ్యాయని ఆయా కంపెనీలు వివరిస్తున్నాయి.
వ్యక్తిగత వాహన సౌకర్యంతోపాటు ప్రజారవాణాపైనే ఎక్కువ ప్రజానీకం ఆధార పడుతున్నది. బస్సులు, రైళ్ళు ఆటోలు ఆశ్రయిస్తుంటారు. అంశాలవారీగా చూస్తే... ఆర్టీసీ బస్సుల్లో సీనియర్ సిటిజన్లకు 25శాతం రాయితీలు, క్యాట్ కార్డులు వగైరా లబ్దిచేకూరేది. కరోనాలో ప్రజారవాణా స్తంభించడంతో అందుబాటులో ఉన్న రాయితీలన్నీ బంద్ అయ్యాయి. పూర్తి చార్జీలు భరించాల్సి రావడం అనివార్యమైంది. ఇక రైళ్ళలో ఉన్న వయోవృద్ధుల రాయితీకి తిలోదకాలిచ్చారు. కరోనా సాకుగా అన్ని రాయితీలకు స్వస్తి చెప్పారు. ప్రయాణాల తగ్గింపునకు, కరోనా వ్యాప్తి కట్టడికే రాయితీల జోలికి ప్రస్తుతానికి వెళ్లడం లేదంటూ ప్రభుత్వం సన్నాయి నొక్కులు నొక్కుతోంది. ఏతావాతా ఉన్న రాయితీలు నిలిచిపోవడం, ప్రజా రవాణా అనుకున్నంతగా అందుబాటులో లేకపోవడంతో పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదలతో సగటు జీవులు సతమతమౌతున్నారు.
ఉద్యమాల బాట పట్టిన రైతాంగానికీ కంటి మీద కునుకులేదు. గిట్టుబాటు ధరలేమి, మార్కెటింగ్ దోపిడీ ఇతరత్రా సతమతమవుతున్న రైతుపై మరో పిడుగుపడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. పెట్రోధరల పెంపుతో సామాన్యుడి నడ్డి విరుస్తోన్న కేంద్రప్రభుత్వం వ్యవసాయ రంగం పైనా అదనపు భారం మోపేందుకు కన్నేసింది. ఇదివరకే అగ్రిసెస్ పేరిట 5శాతం వాత పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ ఏప్రిల్ నుంచే ఎరువుల ధరలు పెరుగుతాయని సంకేతాలిచ్చారు. ఎరువులధరలపెంపుతో రైతుకు సాగు మరింత భారం అవుతుంది. ఇప్పటికే ఎకరా వరి సాగుకు రూ.60 వేలు, పత్తికి రూ. లక్ష దాకా ఖర్చు అవుతోంది. పెట్టుబడులు అధికమై రుణాలు, వడ్డీలు భారమై మద్దతు ధరలు లభించక ఈ పాటికే రైతాంగం నష్టపోవడం చూస్తూనే ఉన్నాం. ధరాభారం తగ్గితేనే రైతన్న సంతసిస్తాడు. సకల జనులూ హర్షిస్తారు !!
- సిహెచ్.రామారావు
సెల్:9959021483