Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచంలో అనేక విషయాల్లో మార్పులతో పాటు, శాస్త్ర సాంకేతికతలో, వైజ్ఞానిక రంగంలో నూతన ఒరవడికి దారులు ఏర్పాడ్డాయి. ప్రస్తుత్త కాలంలో అతి ప్రధానంగా తీవ్రమైన ప్రభావం చూపుతూ సమాజానికి అదుపుతప్పిన సరికొత్త అలవాట్లను పరిచయం చేస్తున్న సాంకేతిక సాధనాలలో ఒకటి మొబైల్. ఇది చరవాణి, దూరవాణి, సెల్ ఫోన్ అని వివిధ పేర్లతో పిలువబడుతున్నా దీని లక్ష్యం మాత్రం ఒక్కటే. దూరంగా ఉన్న వాళ్ల క్షేమ సమాచారాన్ని, వివిధ విషయాలను తెలుసుకోవడం. కానీ నేటి కాలంలో ఈ మొబైల్స్ వల్ల దూరంగా ఉన్న వాళ్ల విషయాలను తెలుసుకోవడం దేవుడుయేరుగు పక్కన ఉన్న వారిని, చుట్టూ ఉన్న పరిసరాలను పట్టించుకోవడమే కరువయింది. ఈ మధ్య కాలంలో అనగా కొన్ని సంవత్సరాల నుండి మొబైల్స్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఒక సర్వే ప్రకారం ప్రపంచ జనాభా 7బిలియన్లు అయితే అందులో 5బిలియన్ల మొబైల్స్ వాడకంలో ఉన్నాయట! ఈ ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒకరికి సెల్ ఫోన్ అనేది ఒక అత్యవసర వస్తువుగా మారిపోయింది. నేటి సమాజంలో ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తిని మొదలుకొని స్కూల్‌కి వెళ్ళే పిల్లవాడి నుంచి వృద్ధుల వరకూ మొబైల్స్ వినియోగం ఊపందుకుంది. మంచి ఆలోచనలతో, ఒక గొప్ప ఆశయంతో కనుగొని మొబైల్స్‌ను వాడుకోవడానికి శాస్త్రవేత్తలు అందుబాటులోకి తీసుకొచ్చారు. కానీ నేటి తరాన్ని, సమాజాన్ని ప్రస్తుత్తం ఆ మొబైల్స్ దారుణంగా వాడుకుంటున్నాయి. గంటల కొద్దీ అనవసరమైన విషయాల గురించి, పనికిమాలిన అవసరాల గురించి అవి మనుషుల్ని వాడుకుంటున్నాయి. మొబైల్స్‌కి అనుసంధానం అయిన వివిధ సోషల్ మీడియాకు సంబంధించిన ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ ఇలా మొదలైన వాటిలో విద్వేషపూరితమైన, అసందర్భమైన విషయాలను అనేక రకాలుగా పోస్టులుగా పెడుతూ, చూస్తూ వికృతానందాన్ని పొందుతున్నారు. కొంత మంది ఎదుటి వాళ్ల మనోభావాలను విలువలను గాలికి వదిలేసి స్టేటస్లు, ఫొటోలు, విడియోలు అప్లోడ్ చేస్తూ రాక్షసానందం పొందుతున్నారు. వ్యక్తిగతమైన, ఉన్నతమైన, విజ్ఞానపరమైన చరిత్రలను, తెలియని ఎన్నో మంచి విషయాలను తెలుసుకోవడానికి వినియోగించుకోవాల్సిన సాంకేతికతను ఎందుకు పనికిరాని విషయాలకు వాడుతూ ఒక ఉన్మాదపూరిత వాతావరణాన్ని సష్టిస్తున్నారు. కనీసం పక్కన ఉన్న వారిని ప్రేమగా, ఆపాయ్యతగా పలకరించే మానవ సంబంధమైన విలువలను సైతం ఈ మొబైల్స్ పక్కదారి పట్టిస్తున్నాయి అనడంలో ఆశ్చర్యం లేదు. నేటి సమాజంలో చాలా మంది వారికి సంబంధించిన వ్యక్తిగత విషయాలను మొబైల్స్ ద్వారా వివిధ సోషల్ మీడియాలో బహిరంగంగా ప్రచారం చేసుకుంటూ, అల్లరిపాలు అవుతూ, ఆర్థికంగా నష్టపోతూ, కుటుంబ గొడవలతో మానసిక ఆవేదనకు గురి అవుతూ ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. అంతేకాకుండా అధిక సమయం మొబైల్ వాడకం వల్ల దాని నుండి వెలువడే రేడియేషన్‌తో అనారోగ్య సమస్యలు వ్యాపిస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మితిమీరిన పోకడలతో, ఎక్కువ సమయం మొబైల్ వినియోగంపై ప్రతి ఒకరం దృష్టి పెట్టి, ఎవరికి వారు నిత్య జీవితంలో మొబైల్ వాడకం పట్ల నియంత్రణ కలిగి ఉండి ఉన్నతమైన విలువలతో కూడిన వ్యక్తిత్వాన్ని అలవర్చుకోని మంచి నడవడికకు నాంది అవ్వాలి. అవసరాలకు అనుగుణంగా సాంకేతికతను, మొబైల్స్‌ను వినియోగించాలి. అది అందరికీ ఆర్యోగకరం, ఆదర్శనీయం.
- ఆర్. రాజేశం
సెల్: 9848811424