Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కమ్యూనిస్టు ఉద్యమంలో సాధారణ కార్యకర్తగా ప్రారంభమైన అతడు.. సర్పంచ్‌గా మొదలై సమితి అధ్యక్షుడిగా, జిల్లాపరిషత్ సభ్యుడిగా, మార్కెట్ కమిటీ చైర్మన్‌గా, శాసనసభ్యుడిగా చివరికి సీపీఎం శాసనసభాపక్ష నేతగా ఎదిగిన క్రమం అద్భుతం. ఆయన జీవితంలో సుదీర్ఘకాలం ప్రజాప్రతినిధిగానే సాగడం ఓ ప్రత్యేకత కాగా.. ఆ దారిలో ఆయన పాదుకొల్పిన విలువలూ ఆదర్శాలూ అజరామరం. నిజాయితీ, నిస్వార్ధ ప్రజాసేవలోనే కాదు, పోరాడే తెగువలోనూ కమ్యూనిస్టు ప్రమాణాలకు ఆతడో నమూనా.. ఆయన శాసనసభాపక్ష నేతగా ఎన్నికైనప్పుడు పెద్దగా చదువులేని రాఘవరెడ్డి ఆ బాధ్యతలకు న్యాయం చేస్తాడా అనే సందేహాలనేకం పార్టీ లోపలా బయటా వెలువడ్డాయి. కానీ తన అసాధారణ ప్రతిభతో వాటిని పటాపంచలు చేసి అధికార, ప్రతిపక్షమనే తేడాలేకుండా అన్ని పక్షాలతోపాటే నాటి అఖిలాంధ్ర ప్రజావళినీ అలరించిన అరుదైన ప్రజాప్రతినిధి అతడు. స్వయంగా సుందరయ్యగారంతటివాడు 'ఏమో అనుకున్న... పార్టీ ప్రతిష్ట నిలబెట్టావు' అని అభినందించిన రోజున ఆయన హృదయం రెపరెపలాడే అరుణపతాకమే అయింది!
అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి.. ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రసంగాన్ని అధికారపక్షమంతా ఆకాశానికెత్తుతున్నారు.. బడ్జెట్ అద్భుతమంటే మహాత్భుతమంటూ వారంతా భుజాలు చరుచుకున్నాక... అప్పుడు లేచాడాయన..
'అయ్యా.. మంత్రిగారి బడ్జెట్లో పన్నులే తప్ప పద్దులేడ కనపడతలేవు..' అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించాడు.. అతడిని సజావుగా మాట్లాడనిస్తే తమ అసలు రంగు బయటపెడతాడని భయపడ్డాడో లేక ఆదిలోనే అడ్డుకుంటే తడబడతాడని భ్రమపడ్డాడో తెలియదుగానీ ఆర్థికమంత్రి అంతలోనే జోక్యం చేసుకున్నాడు.
'మీకు ప్రతీ దానికీ ప్రభుత్వాన్ని విమర్శించడం పరిపాటిగా మారింది.. నేనో మాటడుగుతాను సమాధానం చెప్పు? నువ్వు రైతుబిడ్డవే కదా, మీ ఇంట్ల బర్రె గడ్డి తినకుంట పాలిస్తదా? పన్నుల్లేకుంట ప్రభుత్వమెట్ల నడుస్తది? ఆమాత్రం తెలువకుండ అడ్డగోలుగ మాట్లాడితెట్ల..?' అంటూ ప్రసంగానికడ్డుపడ్డాడు. దాంతో అధికారపక్షానికి మరోసారి బల్లలు చరిచి అల్లరిచేసే అవకాశమొచ్చింది.. కానీ ఆ సభ్యుడు తొణకలేదు, బెణకలేదు. ఆ గోల సద్దుమణిగేదాకా ఆగి..
'అయ్యా మీరన్నది అక్షరాలా నిజం.. కానీ మా ఇంట్ల బర్రె అర్ధ రూపాయి గడ్డితిని రూపాయి పాలిస్తదేకానీ రూపాయి గడ్డితిని అర్ధరూపాయి పాలియ్యదు.. అట్లగనుకిస్తే దాన్ని కోతకేస్తం.. మరి రూపాయి పన్నేసి అర్ధ రూపాయి కూడా ప్రజల కివ్వని మీ ప్రభుత్వాన్నేంజెయ్యాలే..? అని తిరిగి ప్రశ్నించాడు.. ఈసారి అధికారపక్షం, ప్రతిపక్షం అన్న తేడా లేకుండా సభామం దిరమంతా నవ్వుల మయమైంది..!' పరిస్థితి చేయిదాటి పోతుందని గమనించిన సభానాయకుడే స్వయంగా లేచి ..
'ఆయనతోటి ఎందుకుబెట్టుకుంటారయ్యా... ఆయన నవ్వుకుంట నవ్వుకుంటనే మనల నవ్వులపాలు జేస్తడు.. ఆయనను మాట్లాడనివ్వండిః అని స్వపక్షానికే సర్దిచెప్పాల్సి వచ్చింది. ఆ నవ్వుల చురకత్తే నర్రా రాఘవరెడ్డి.. ఆయన అద్భుత వాగ్ధాటికీ, ప్రజలపట్ల నిబద్ధతకూ ఇదొక మచ్చుతునక మాత్రమే!
నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం నుండి అప్రతిహాత విజయాల ప్రజాప్రతినిధిగా ఆయన జగమెరిగిన నేత... కానీ ఆ స్థాయికి చేరడానికి తన ప్రయాణంలో ఎన్ని కన్నీటి సంద్రాలను ఈదాడో, ఎన్ని మండుటెడారులను దాటాడో తెలుసుకుంటే ఆయన జీవితం బతుకు పాఠాలు నేర్పే ఓ పాఠశాలగా దర్శనమిస్తుంది.. పదకొండు రోజుల పసిగుడ్డుగానే తల్లిని కోల్పోయాడు. తల్లి మరణించిన పది రోజులకే తండ్రి మరో వివాహం చేసుకున్నాడు. కన్నతండ్రి నిరాదరణ, సవతి తల్లి వేధింపులు తట్టుకోలేక గాయపడిన హృదయంతో ఇంటినీ చదువునూ వదిలి గమ్యం లేని గాలిపటమయ్యాడు. హైద్రాబాదు కు చేరి ఓ హోటల్లో కప్పులు కడిగాడు.. బల్లలు తుడిచాడు.. తినడానికింత తిండి, తలదాచుకోవడానికో నీడయితే దొరికింది. కానీ.. ఇదికాదు జీవితం అనిపించి బొంబాయి రైలెక్కాడు. అక్కడ తక్షణావసరానికి ఓ పూటకూళ్ల ఇంట్లో సర్వెంటుగా చేరినా, తనకు తగ్గ పనికోసం వెతుకులాట మాత్రం మానలేదు. ఆ ప్రయత్నంలోనే బొంబాయి మారి, సూరత్ చేరి ఓ బిన్నీమిల్లులో ఉద్యోగం సంపాదించాడు. అక్కడ కార్మికుల కష్టాలు వర్ణనాతీతం. ఆ కష్టాలు తీర్చడానికా అన్నట్టు 'లాల్‌బావుటా' యూనియన్ పుట్టింది. ఆ యూనియన్‌లో సభ్యుడిగా చేరిన రాఘవరెడ్డి ఆ వెలుగులోనే కమ్యూనిజాన్ని తెలుసుకున్నాడు. కష్టాలకు కారణమేంటో కనుక్కున్నాడు. తన జీవితానికో లక్ష్యాన్నీ, తన ప్రయాణానికో గమ్యాన్నీ దొరకబట్టుకున్నాడు.
అవి స్వాతంత్య్రోద్యమం ఉధృతంగా సాగుతున్న రోజులు. లాల్‌బావుటా తన యూనియన్ కార్యకలాపాలకు తోడు స్వాతంత్య్ర పోరాటాన్ని కూడా ముమ్మరం చేసింది. ఆ పోరాటంలో రాఘవరెడ్డి క్రియాశీలకంగా ఎదిగాడు. పెరిగిన నిషేధాలు, నిర్బంధాల మధ్య ఉద్యోగం కూడా చేయలేని స్థితిలో తిరిగి సొంతూరు వట్టిమర్తికి చేరుకున్నాడు. కన్నతండ్రీ సవతితల్లీ 'వీడు మళ్లెందుకొచ్చాడురా' అన్నట్టే చూశారు....కానీ ఇప్పుడు కన్నీరు పెట్టడానికీ భయపడి పారిపోవడానికీ ఆయన మునుపటి రాఘవరెడ్డి కాడు కదా..!
ఆయన ఇక్కడ తిరిగి కాలు మోపే నాటికి తెలంగాణ సాయుధ పోరాటం ఉవ్వెత్తున సాగుతున్నది.. అప్పటికే తన జీవిత గమ్యాన్నీ గమనాన్ని నిర్ణయించుకున్న రాఘవరెడ్డి కమ్యూ నిస్టు కర్తవ్యమై ఆ పోరాటంలోకి సాగిపోయాడు. కొరియర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ 1950లో పార్టీ సభ్యుడయ్యాడు. పోరాట విరమణానంతరం కూడా పార్టీ కార్యకలాపాల్లో కొనసాగుతూనే నాటి రజాకార్ల దాడిలో సర్వం కోల్పోయిన తారకమ్మను పెండ్లి చేసుకున్నాడు. వట్టిమర్తిలో మిత్రుల సాయంతో మూడెకరాల పొలం కొని సొంతంగా వ్యవసాయం మొదలు పెట్టాడు. కుటుంబ బాధ్యతలు భార్యకప్పగించి తను పార్టీ బాధ్యతలకు అంకితమయ్యాడు. కన్నీళ్లను దిగమింగుకుని, కష్టాలను కడుపులో దాచుకుని కమ్యూనిస్టుగా పరిణితిచెందిన జీవితమతడు. జీవితమంటే బతకడంకాదనీ, సాటి మనుషుల కోసం పోరాడట మని నమ్మిన సిద్ధాంతమతడు. అందుకే జనమే తానై తానే జనమై బతికిన జనరంజకుడుగా ఆయన ప్రఖ్యాతిగాంచాడు. రాఘవరెడ్డి అంతగా జనప్రియుడయ్యాడంటే కారణం.. అతడు నిశ్శబ్దానికి రంగులద్దిన భావుకుడు..! మౌనానికి మాటలు నేర్పిన నాయకుడు..! వీటన్నిటికీ మించి కన్నీళ్లకు కర్తవ్యాన్ని బోధించిన గొప్ప కళాకారుడు..! అదే ఆయనను ఎంతటి ప్రజా నాయకుడో అంతటి ప్రజా కళాకారుడిగానూ చరిత్రలో నిలిపింది. రాఘవరెడ్డి సభకొస్తుండంటే జనం తండోపతండాలుగా బండ్లు గట్టుకొని బయలుదేరే రోజులవి..
'భజగోవింద గోవింద.. బ్రహ్మం.. శివగోవింద గోవింద..
ఎందుకీ దారిద్య్రమెవరు సృష్టించారు
ఎరుకజెప్పుట కొరకె ఏతెంచినామయా... భజ
పంచభూతాలపై ప్రాణులందరి హక్కు
పుట్టినప్పుడె కలిగె భూమిపై తెలియదా... భజ
ఆదిలో మానవులు అందరొకటిగ మెలిగి
కలిమిలేములు లేక సమముగా బతికారు... భజ
హెచ్చుతగ్గుల భేదమీ మధ్య వచ్చెరా
నడుమంత్రమున బుట్టె నాది భూమనుమాట... భజ
ఇలా ఓ తత్వంలా సాగే ఆయన పాటల ప్రవాహం జనంలో కొత్త ఆలోచనలు నింపేది. ప్రకృతి సంపద గురించి ప్రజలందరికి చెప్పే మార్క్సిజం శాస్త్రీయ సత్యాన్ని ఎంత సరళంగా చెప్పాడో కదా! ఊపిరి పీల్చినంత సహజంగా, వెన్నెల కురిసినంత హృద్యంగా మార్క్సిజాన్ని ప్రజల కష్టసుఖాలకు అన్వయించి చెప్పగల నేర్పు ఆయన సొంతం! చట్ట సభల్లో, రాజకీయ సభల్లోనే కాదు ఆయన దైనందిన సంభాషణల్లో కూడా జానపదం పరవళ్లు తొక్కేది! అది అతన్నే ఓ జనపథంగా వెలిగించింది!
అది భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకోసం ఫజల్ అలీ కమిషన్ వివిధ రాజకీయపక్షాల అభిప్రాయాలను కోరుతున్న సందర్భం.. నాయకులందరూ ప్రసంగాల ద్వారా తమ తమ అభి ప్రాయాలను వ్యక్తం చేసారు. రాఘవరెడ్డిగారి వంతొచ్చింది... 'తుర్ర్ర్ర్.... వస్తున్న మారాజ్ వస్తున్న..' అని మొదలు బెట్టగానే సభ ఒక్కసారిగా ఉలిక్కిపడి అప్రమత్తమైంది...
'లత్కోర్‌సాబ్ లత్కోర్‌సాబ్ పోతుంది పోతుంది అన్నారంతా..
ఏం బోతుందోనని.. నేను నెత్తినున్న బుట్ట, చేతిలున్న లొట్ట, ఎన్నడు నిండని పొట్ట పట్టి పట్టి చూసిన..
అన్నీ ఉన్న చోటనే ఉన్నయి ఇంకేం బోతుందన్నాను..
నైజాం రాష్ట్రంబోయి మహారాష్ట్రలో కొంత, కర్ణాటకలో కొంత, ఆంధ్రలో కొంత, అండ్లగలిసి ఇండ్లగలిసి ఆయింత లేకుండబోతే నైజాంనవాబుగిరీ మంట్లె గలుస్తుందన్నారు...
అట్లయితే బూర్గుల రామకృష్ణారావెటుబోతడూ, వెంకటరంగారెడ్డెటుబోతడూ, చెన్నారెడ్డెటుబోతడూ...అని నేనంటుండంగనే.. ఆగు లత్కోర్‌సాబ్, నీ నసీబ్ నాకు బడుతుందని చెన్నారెడ్డి నన్ను పట్టుకోనేడ్వ నేను చెన్నారెడ్డిని పట్టుకోనేడ్వ..'
అనంగనే సభలో నవ్వులతోపాటే చప్పట్లూ మారుమోగాయి. కమిషన్ సభ్యులతోపాటు, అదే సభలో ఉన్న శ్రీశ్రీ, సి.నారాయణరెడ్డిలు సైతం ఆయనను అల్లుకుని అభినందనల్లో ముంచెత్తారు. ఎంతటి రాజకీయ సమస్యనైనా పండిత పామరులను రంజింపజేసేలా తనదైన శైలిలో వ్యక్తీకరించే ఆయన సామర్ధ్యానికి ఓ ప్రతీక ఈ సందర్భం.
సాయుధ పోరాటకాలంలో కొరియర్‌గా, అనంతరం కమ్యూనిస్టు ఉద్యమంలో సాధారణ కార్యకర్తగా ప్రారంభమైన అతడు.. సర్పంచ్‌గా మొదలై సమితి అధ్యక్షుడిగా, జిల్లాపరిషత్ సభ్యుడిగా, మార్కెట్ కమిటీ చైర్మన్‌గా, శాసనసభ్యుడిగా చివరికి సీపీఎం శాసనసభాపక్ష నేతగా ఎదిగిన క్రమం అద్భుతం. ఆయన జీవితంలో సుదీర్ఘకాలం ప్రజాప్రతినిధిగానే సాగడం ఓ ప్రత్యేకత కాగా.. ఆ దారిలో ఆయన పాదుకొల్పిన విలువలూ ఆదర్శాలూ అజరామరం. నిజాయితీ, నిస్వార్ధ ప్రజాసేవలోనే కాదు, పోరాడే తెగువలోనూ కమ్యూనిస్టు ప్రమాణాలకు ఆతడో నమూనా.. సమస్యల అధ్యయనానికి సాధారణ బాటసారిగా, పశువులకాపరిగా జనంతో మమేకం కావడంలో. వాటిని శాసనసభలో ప్రస్తా వించడంలో ఆయనది ప్రత్యేకశైలి. కరువుపై చర్చ జరుగుతుంది.. ముఖ్యంగా నియోజకవర్గాల్లో నీటి ఎద్దడి నివారణకు నిధులు కావాలని అడిగారు రాఘవరెడ్డి. ముఖ్యమంత్రి లేచి.. 'ఎంత అమాయకంగా మాట్లాడుతున్నారు రాఘవరెడ్డిగారూ! మీకు తెలియదా.. రూ.25 కోట్లు ప్రకటించాం' అన్నారు. 'అయ్యా తెలిసే మాట్లాడుతున్నాను.. ఊరికో కోడిస్తే ఇంటికో ఈక కూడా రానట్టు రూ.25కోట్లు ఏ మూలకు సరిపోతయిఃః అన్నాడు రాఘవరెడ్డి.. సభ ఒక్కసారిగా గొల్లుమంది.. ఇలా ఆయన మాటలు సభలో నవ్వులు పూయించడమే కాదు, ప్రభుత్వాలను ప్రకంప నలకు గురిచేసేవి. ఆయన శాసనసభాపక్ష నేతగా ఎన్నికైనప్పుడు పెద్దగా చదువులేని రాఘవరెడ్డి ఆ బాధ్యతలకు న్యాయం చేస్తాడా అనే సందేహాల నేకం పార్టీ లోపలా బయటా వెలువడ్డాయి. కానీ తన అసాధారణ ప్రతిభతో వాటిని పటాపంచలు చేసి అధికార, ప్రతిపక్షమనే తేడాలేకుండా అన్ని పక్షాలతోపాటే నాటి అఖిలాంధ్ర ప్రజావళినీ అలరించిన అరుదైన ప్రజాప్రతినిధి అతడు. స్వయంగా సుందరయ్యగారంతటివాడు 'ఏమో అనుకున్న... పార్టీ ప్రతిష్ట నిలబెట్టావు' అని అభినందిం చిన రోజున ఆయన హృదయం రెపరెపలాడే అరుణపతాకమే అయింది!
ప్రజా ప్రతినిధిగా ఆయనది ఎంతటి ప్రతిష్టో పార్టీ కార్యకర్తగా, నాయకుడిగా అంతటి విశిష్టత. నల్లగొండ తాలూకా కార్యదర్శిగా, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యునిగా, రాష్ట్రకమటీ సభ్యునిగా వివిధ బాధ్యతల్లో ఆయన కృషి మరువలేనిది. అనేక చీలికలు, విచ్ఛిన్నాలలో కార్యకర్తలను నిలబెట్టుకోవటంలోనే కాదు, అందుకు పాల్పడే నాయకులనెదిరించడంలోనూ ఆయనది గొప్ప పాత్ర. ఇందుకు అద్దంపట్టే సంభాషణొకటి ఇక్కడ ప్రస్తావించాలి. ఇద్దరు పెద్దనాయకులు రాఘవరెడ్డి క్వార్టర్లో చర్చించుకుంటున్నారు. రాఘవరెడ్డి ఆసక్తిగా వినడమే తప్ప స్పందించకపోవడంతో అనుమానమొచ్చిన
ఆ నాయకుడు...
'ఏం రాఘవరెడ్డీ.. అర్థమవుతుందా.. రేపు జరుగబోయే ప్లీనంలో మన వాదం గట్టిగా వినిపించాలి' అన్నాడు
'ఏం వాదం' అన్నాడు రాఘవరెడ్డి
'నీకు తెల్వదా?'
'ఇందాకటి నుంచి ఇంటున్నగనీ మీ వాదమేందో నాకర్థమయితలేదు'
'ఓహో ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యేవి కదా.. పెద్దోనివయినంక ఎందుకు అర్థమవుతుందిలే'
'ఎమ్మెల్యేనయ్యి నేనేం పెద్దోన్నయిన? ఇల్లు (క్వార్టరు) పార్టీకిచ్చిన.. సగం జీతం పార్టీ నిర్వహణకే ఇస్తున్నా.. నాకున్నొక్క మంచం, పరుపూ మీకిచ్చిన.. నేలమీద పాతపేపర్లేసుకొని నేను పండుకుంటున్న. నా గది నేనే ఊడ్చుకుంటున్న, నా బట్టలు నేనే ఉతుక్కుంటున్న, నా బువ్వ నేనే వండుకుంటున్న, వచ్చినప్పుడల్లా మీలాంటోళ్లకింత వండిపెడుతున్న... ఇగ అర్థంగానంత పెద్దోన్ని నేనేడయిన?''.... ఈ సంభాషణ ఆయన నిరాడంబర జీవనశైలికీ, పార్టీ పట్ల విశ్వాసానికే కాదు.. తన సైద్ధాంతిక నిబద్ధతకూ, విచ్ఛిన్నవాదులెంతటివారైనా ఎదిరించడానికి వెనుకాడని నిర్భీతికీ ఓ నిదర్శనం. ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసినా, అంతకుముందు సమితి అధక్షుడైనా, సర్పంచ్ అయినా ఆయన జీవనం నిత్యం ప్రజాక్షేత్రంలోనే. ఆయన ఆస్థి ఆ మూడెకరాలే! ఆర్థిక సమస్యలు వేటాడుతున్నా, ఆరోగ్య సమస్యలు వెన్నాడుతున్నా కర్తవ్యదీక్షలో వెన్నుచూపని కార్యసాధకుడతడు. ఒక్క మాటలో చెప్పాలంటే మళ్లీ మళ్లీ చినుకై వర్షించడానికి పదే పదే ఆవిరైనవాడు.. అత్యున్నత కమ్యూనిస్టు విలువలతో తను జీవించిన కాలాన్ని వెలిగించినవాడు.. అచ్చమైన పేదలపెన్నిది... స్వచ్ఛమైన విలువల సన్నిధి. అందుకే... అతడు జనరంజక నేత.. జనహృదయ విజేత!
- రాంపల్లి రమేష్
సెల్ : 8639518341