Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'బరాబర్ తెలంగాణ కోసం నిలబడతా. తెలంగాణ ప్రజల కోసం కొట్లాడతా. పదవులు వచ్చినా రాకపోయినా నిలబడతా. ప్రజల సంక్షేమం కోసం కొట్లాడతా. నాకు అవకాశాలు ఇవ్వాలో లేదో ప్రజలు నిర్ణయిస్తారు. నాకు అవకాశం ఇస్తే ప్రజలకు నమ్మకంగా సేవచేస్తా. లేకపోతే వారి తరపునే పోరాటాలు చేస్తా. మాటమీద నిలబడే రాజన్న బిడ్డగా చెప్తున్నాను. తెలంగాణకు దక్కాల్సిన ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోం. తెలంగాణకు అన్యాయం జరిగే ఏప్రాజెక్టునైనా, ఏపనినైనా నేను అడ్డుకుంటా. నేను టీఆర్ఎస్ చెబితే రాలేదు. బీజేపీ అడిగితే రాలేదు. కాంగ్రెస్ పంపితే రాలేదు. నేను ఆమూడు పార్టీలకు గురిపెట్టిన ప్రజా బాణమై వస్తున్నా. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసమే వస్తున్నా. అందుకే పార్టీ పెడుతున్నా. నేను పెట్టబోయే ఈపార్టీ ఏ ఇతర పార్టీల కిందా పనిచేయదు' అని తనపై వస్తున్న ప్రశ్నలు, విమర్శలపై షర్మిల ఖమ్మం సభలో సమాధానం చెప్పారు. అయితే ఆమె ఎన్ని చెప్పినా తెలంగాణ ప్రజలకు సందేహాలే ఉన్నాయి. ఏడేండ్లుగా ఆమె తెలంగాణ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని సందర్శించలేదు. ఉద్రిక్తతలకు కేంద్రమైన ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లోనూ కాలు మోపలేదు. మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రైతులు పోరాడుతున్నపుడూ ఆమె కనిపించలేదు. తెలంగాణ ప్రజల కోసమే వస్తున్నప్పుడు రాష్ట్రం కోసం బలైపోయిన అమరవీరులను ఎందుకు తలచుకోలేదు? తన తండ్రి వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి ఖమ్మం సంక్పల్ప సభకు బయలు దేరారు. ఉన్నట్టుండి తెలంగాణలో 'రాజన్న రాజ్యం' అంటూ పార్టీ పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఆమె వెనుక ఎవరున్నారు? ఆమె ఎవరు వదలిన బాణం? ఆంధ్రప్రదేశ్‌ను వదిలేసి తెలంగాణ వైపు ఎందుకు చూస్తున్నారు? అనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు దొరకడంలేదు. వీటిపై పూర్తి స్థాయిలో స్పష్టత ఇవ్వకుండానే ఆమె జూలై 8, వైఎస్సార్ జయంతి రోజున పార్టీ పేరు ప్రకటించబోతున్నారు. ఈ లోపు ఆమె తెలంగాణలోని నిరుద్యోగుల పక్షాన నిలబడి పోరాడతానని ఖమ్మం సభలో ప్రకటించినట్టుగానే ఏప్రిల్ 15 నుంచి మూడు రోజుల పాటు నిరాహార దీక్ష చేయనున్నారు. ఖమ్మం సభలో ఆమె చేసిన ప్రసంగం అంత ఉత్తేజకరంగా లేకపోయినా, పార్టీ పెట్టాలనే పట్టుదలను వ్యక్తం చేసింది. షర్మిల రెండు అంశాలను తెలంగాణ ప్రజల ముందు పెట్టారు. ఒకటి తాను తెలంగాణ బిడ్డనే అని, రెండోది తెలంగాణ సమస్యలకు పరిష్కారం వైఎస్ రాజశేఖరరెడ్డి మార్గమే అని ప్రకటించారు. 2014లో తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి వైఎస్సార్ పేరు ఈ ప్రాంతంలో మరుగున పడుతూ వచ్చింది. 2014 ఎన్నికల్లో కొంత వినిపించినా, వైసీపీ తరుపున గెలిచిన ఒకే ఒక్క ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరారు. అప్పటి నుంచి వైఎస్సార్ పేరు వినిపించడం ఆగిపోయింది. అనేక కూడళ్లలో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాలను పట్టించుకోవడం మానేశారు. అవన్నీ దుమ్ము కొట్టుకు పోయాయి. గతంలో తెలంగాణలో రాజశేఖరరెడ్డి ప్రతిపాదించిన అనేక ప్రాజెక్టులు రద్దయ్యాయి. వాటి స్థానంలో కొత్తవి వచ్చాయి. రాజశేఖరరెడ్డి వర్థంతి గాంధీ భవన్‌కే పరిమితమయింది. ఇలాంటి చోట షర్మిల మళ్లీ వైఎస్సార్ ప్రస్తావన తీసుకు వస్తున్నారు. 'రాజన్న రాజ్యం' అంటున్నారు. ఆమె ఆకట్టుకోవాలనుకుంటున్న ప్రజల్లో ప్రధాన వర్గం రెడ్లు అనే విషయంలో పెద్దగా ఎవరికీ పేచీ ఉండకపోవచ్చు. తెలంగాణలో రాజకీయ వర్గంగా రెడ్ల బలం ఎక్కువగా ఉంది. అంతేకాదు ఆర్థికంగా బాగా బలపడిన వర్గం కూడా. 2014లో తెలంగాణ వచ్చాక ఈ వర్గంలో చిన్న అలజడి మొదలయింది. 2009లో వైఎస్సార్ మరణంతోనే ఈ వర్గం కొండంత అండను కోల్పోయింది. 2014లో తెలంగాణ ఏర్పాటు వారికి శరాఘాతంగా మారింది. అటు ఆంధ్రలో చంద్రబాబు నాయుడు, ఇటు తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ వర్గం బాగా దిగ్భ్రాంతికి గురయింది. ఎందుకంటే 1956 నుంచి రాష్ట్రంలో రాజకీయాలను శాసించింది ఈ వర్గమే. ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి రూపంలో ఈ వర్గానికి ఉపశమనం దొరికినా, తెలంగాణలో కొంత అసంతృప్తిగా ఉంది. ఈ వర్గాన్ని తనదిగా చేసుకున్న కాంగ్రెస్ పార్టీ, వాళ్ల అభీష్టాలను నెరవేర్చే శక్తిని కోల్పోయింది. ఈ దశలో రాజకీయ భవితవ్యం చర్చించుకునేందుకు రెడ్లు కొన్ని సమావేశాలు కూడా జరుపుకున్నారు. మొదటి సమావేశం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగింది. ఈసమావేశానికి రెండు రాష్ట్రాల రెడ్డి ప్రముఖలు హాజరయ్యారు. సోషల్ మీడియాలో కూడా వాళ్లు బాగా యాక్టివ్‌గా మారారు. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రా రెడ్లకంటే తెలంగాణ రెడ్లు బాగా నిరాశకు లోనయ్యారు. వారు కాంగ్రెస్‌లో ఉండలేరు. తెలుగుదేశం పార్టీలో చేరదామంటే దానికే అస్తిత్వం కనిపించడం లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ స్వచ్ఛందంగా రాష్ట్రం విడిచి వెళ్లిపోయింది. ఏ దారి లేకపోవడంతో ఈ వర్గానికి చెందిన ప్రముఖులు చాలామంది టీఆర్ఎస్లోకి వెళ్లిపోయారు. ఈ వర్గంలోని కుల చైతన్యాన్ని గమనించిన టీఆర్ఎస్ కూడా వాళ్లందరికీ పెద్ద పీట వేసింది. అయితే, తమదంటూ ఒక పార్టీ లేకుండా పోయిందనే వ్యథ మాత్రం ఈ వర్గానికి బలంగా ఉంది. ప్రొఫెసర్ కోదండరామ్ కొత్త పార్టీ 'తెలంగాణ జన సమితి' విజయవంతమయి ఉంటే ఈ వర్గం అటు పోయి ఉండేదేమో? తరువాత తెలంగాణలో మరొక కొత్త పార్టీ రాలేదు. కాంగ్రెసూ బలపడలేదు. ఇక మిగిలింది బీజేపీయే. ఆ పార్టీని కులం పేరుతో ఆక్రమించుకోవడం కష్టం. అయితే అది రెడ్లకు ఒక ప్రత్యామ్నాయ పార్టీగా మాత్రం కనిపిస్తూ ఉంది. టీఆర్ఎస్లో చోటున్నా నాయకత్వం రాదు. కాంగ్రెస్‌లో నాయకత్వం వచ్చినా పార్టీ బలంగా లేదు. బీజేపీలో చోటు ఉన్నా పగ్గాలు ఢిల్లీలో ఉన్నాయి. ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి ఒక 'విశ్వసనీయ వేదిక' అవసరం చాలా ఉంది. ఈ నేపథ్యంలోనే షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారు. ఆమె విజయవంతమవుతారో లేదో వేచి చూడాలి. మరోవైపు తెలంగాణ. వేగంగా సాగుతున్న నగరీకరణ, దానితో పాటు వద్ధి అవుతున్న వ్యాపారాలతో మధ్య తరగతిలో ఒక సంపన్న వర్గం తయారయింది. వీరందిరికీ గమ్యస్థానం రాజకీయాలే. వీరి దగ్గర బాగా డబ్బుంది. కానీ వీళ్లని ఇముడ్చుకునే పార్టీయే లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాల్లో పెట్టుబడి పెట్టేందుకు అనువైన పార్టీ ఒక్క తెలంగాణ రాష్ట్ర సమితియే. కానీ ఈ పార్టీలో జాగా లేదు. కొత్త వారికీ చోటు దొరకడం కష్టమే. అందుకే ఈ వర్గం ఇప్పుడు షర్మిల వైపు వెళ్లే అవకాశం ఉంది. కులాలకు మతాలకు అతీతమయిన ఈ మధ్య తరగతి సంపన్న వర్గానికి పార్టీ ఏ వర్గం చేతిలో ఉందన్నది ముఖ్యం కాదు. తాము రాజకీయాల్లోకి వచ్చేందుకు అవకాశం కావాలి. ఇక సొంత సామాజిక వర్గ సమీకరణ షర్మిలకు సులువు అవుతుంది. రెడ్డి వర్గానికి చెందిన నేతలెవరూ కాంగ్రెసేతర పార్టీలలో సొంత ఇంట్లో ఉన్న అనుభవం పొందలేకపోతున్నారు. అక్కడ ఊపిరాడడం లేదని చెబుతున్నారు. అందువల్ల తన పార్టీ 'విశ్వసనీయ రాజకీయ వేదిక' అనే భరోసా ఇవ్వగలిగితే షర్మిల వైపు ఈ బలమయిన సామాజిక వర్గం పోలోమని వలస వస్తుందని అంచనా. నిజానికి ఆమె చేస్తున్న వైఎస్సార్ నామస్మరణ దీని కోసమే కావచ్చు. సొంత సామాజిక వర్గ సమీకరణలో విజయవంతమైనా చాలు. ఆమె పార్టీ తెలంగాణలో నిలబడుతుంది. దీని వెనుక ఆమె అన్న జగన్మోహన్ రెడ్డి కూడా ఉండవచ్చు. తెలంగాణలో తన చెల్లె షర్మిల రూపంలో వైఎస్సార్ కాంగ్రెస్ ను బలోపేతం చేసే వ్యూహమే కావచ్చు. ఇలాంటి ప్రయోగాలు కొన్ని రాష్ట్రాలలో జరిగాయి. పక్కనున్న తమిళనాడులో వచ్చిన పాట్టాళి మక్కల్ కట్చి (పీఎంకే) ఒక ఉదాహరణ. ఇది వన్నియార్ కులానికి చెందిన పార్టీ. బీసీ కేటగిరీకి చెందిన ఈ సామాజిక వర్గం చెంగల్పట్టు, నార్త్ ఆర్కాట్, సౌత్ ఆర్కాట్, సేలం వంటి జిల్లాల్లో మాత్రమే బలంగా ఉంది. ఈ వర్గాన్ని రాజకీయంగా వినియోగించుకునేందుకు వచ్చిన పార్టీయే పీఎంకే. ఆ విషయంలో ఇది సక్సెస్ కూడా అయ్యింది. కేంద్రంలో యూపీఏ, ఎన్డీయే ప్రభుత్వాలలో భాగస్వామి కాగలిగింది. తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉన్న ప్రాంతాలలో పది మంది ఎమ్మెల్యేలు, ఒకరిద్దరు ఎంపీలు గెలిచినా రాష్ట్ర ప్రభుత్వంలో చేరవచ్చు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి కావచ్చు. రామదాస్ అథవాలే, రాం విలాస్ పాసవాన్ లాగా ఎప్పుడూ అధికారంలో ఉండవచ్చు. ఈ భరోసాతోనే కావచ్చు నిర్మోహమాటంగా రాజశేఖరరెడ్డి పేరు మీద షర్మిల పార్టీ పెడుతున్నారు. చాలా స్పష్టంగా తాను రాజశేఖరరెడ్డి బిడ్డనని, ఆయన అడుగు జాడల్లోనే నడిచి, రాజన్న రాజ్యం స్థాపిస్తానని చెబుతున్నారు. ఇది సాహసోపేత ప్రకటనే. ఆమె తెలివిగా తెలంగాణ కోసమే ప్రత్యేకంగా స్క్రిప్ట్ తయారు చేశారని వేరే చెప్పాల్సిన పనిలేదు. ఆమె రాజశేఖరరెడ్డి మార్క్ తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడి ప్రజలు ఆమె వైపు వెళ్లాలంటే గత ఏడేండ్లుగా జరిగిందంతా శూన్యం అని షర్మిల ప్రజలకు వివరించి చెప్పాలి. బీజేపీ విభజన రాజకీయాలను ప్రజలు తిరస్కరించేలా చేయాలి. ఇవేమీ చేయకుండా ఆమె జోహార్ వైఎస్సార్, జై తెలంగాణ అంటున్నారు. దీనిని ప్రజలు ఎలా స్వీకరిస్తారో, తెలంగాణలోని రాజకీయ పార్టీలు ఎలా స్పందిస్తాయో చూడాలి.
- మేకల ఎల్లయ్య
సెల్ : 9912178129