Authorization
Mon Jan 19, 2015 06:51 pm
70సంవత్సరాల షెడ్యూలు కులాల షెడ్యూలు తెగల రిజర్వే షన్లు, 30సంవత్సరాల ఇతర వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లు ఇప్పుడు విపత్కాల పరిస్థితి ని ఎదుర్కొంటున్నాయా? ఇందిరా సాహ్ని కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతున్న సందర్భంలో సమీక్ష అటుంచితే రిజర్వేషన్లు 50శాతం కన్నా మించితే సమాజంలో అసమానతలు పెరగవా అని గౌరవ సుప్రీంకోర్టు ప్రశ్నించడాన్ని బట్టి రిజర్వేషన్లు 50శాతం కంటే ఎక్కువ పెరగనట్టేనా? జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లను అమలు చేయాలనే డిమాండ్ ముందుకొస్తున్న సందర్భంలో మరాఠా రిజర్వేషన్ల విషయంలో గౌరవ సుప్రీంకోర్టు వ్యాఖ్యల ప్రకారం ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు కొన్ని రాష్ట్రాల్లో తగ్గిపోనున్నాయా? 70సంవత్సరాల స్వాతంత్య్ర భారతదేశంలో రిజర్వేషన్ల వల్ల అభివృద్ధి చెందిన కులాలే లేవా అని గౌరవ సుప్రీంకోర్టు ప్రశ్నించడాన్ని బట్టి రిజర్వేషన్లపై సమీక్ష జరగనుందా? గౌరవ సుప్రీంకోర్టు రిజర్వేషన్లల్లో 50శాతం పరిమితిపై అన్ని రాష్ట్రాలు తమ అభిప్రాయాలను తెలపాలని ఆదేశించిన సందర్భంగా ఆయా రాష్ట్రాలు సుప్రీంకోర్టు ముందు రిజర్వేషన్ల పరిమితి పై ఏ వాదనలు వినిపించాయి? మొదలైన విషయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశాలు అయ్యాయి.
సుప్రీంకోర్టు వ్యాఖ్యల ప్రకారం రిజర్వేషన్లపై సమీక్ష జరిగి ఉండవచ్చని తెలుస్తోంది. ప్రధానంగా ఇందిరా సాహ్ని కేసులో ఇచ్చిన తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50శాతానికే పరిమితం కావాలనే విషయంపై రాష్ట్రాల అభిప్రాయం ఏమిటి? రాష్ట్రాలు కోరుతున్నట్లు రిజర్వేషన్ల నిర్ణయాధికారం రాష్ట్రాలకు వదిలి వేయలా? కేంద్రం తెచ్చిన 102వ రాజ్యాంగ సవరణవల్ల రాష్ట్రాల అధికారాలు హరించబడ్డాయా? మొదలైన విషయాలపై సమీక్ష జరిగి ఉండవచ్చు.
ప్రధానంగా గౌరవ సుప్రీంకోర్టు వ్యక్తపరచిన అభిప్రాయంలో 70సంవత్సరాల రిజర్వేషన్ల చరిత్రలో ఏ ఒక్క కులం కూడా అభివృద్ధి చెందలేదా అనే ప్రశ్న ఉదయించింది. కచ్చితంగా ఈ ప్రశ్నకు ప్రభుత్వాలు సమాధానం చెప్పాల్సిందే. చెప్పాలన్నపుడు రిజర్వేషన్లు పొందుతున్న వర్గాల ప్రస్తుత జనాభా లెక్కలు తేలాలి. ఆయా వర్గాల జనాభా లెక్కలను, జనాభా లెక్కల సేకరణ లో భాగంగా సేకరించాలి. అన్ని డిపార్ట్మెంట్లలో ఆయా వర్గాలకు రిజర్వేషన్ల ప్రకారం విద్యా, ఉద్యోగాల్లో వాటా దక్కిందా అనే విషయాన్ని నిగ్గు తేల్చాలి. ఆయా వర్గాల్లో సామాజిక, విద్యా పరంగా ఎంత అభివృద్ధి సాధించారో గుర్తించాలి. అప్పుడు రిజర్వేషన్లు 50శాతానికే పరిమితం చేయాలా లేక పెంచాలా? అనే నిర్ణయం తీసుకోవచ్చు.
భారతదేశం విభిన్న వైవిధ్య భరితమైన పరిస్థితులు ఉన్న దేశం. కాబట్టి రాష్ట్రాలు స్థానిక సామాజిక, విద్యా పరిస్థితులను బట్టి రిజర్వేషన్లను మార్చుకునే అధికారం రాష్ట్రాలకే ఉండాలనే నిర్ణయం రాజ్యాంగమే కల్పించింది. రాష్ట్రాలకు రాజ్యాంగం ప్రకారం ఉన్న రిజర్వేషన్ల మార్పు, పెంపు అధికారాన్ని కేంద్రం 102వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చిన 342(ఎ)ప్రకారం అడ్డుకుంది. కాబట్టి గౌరవ సుప్రీంకోర్టు కేంద్రం పెత్తనం లేకుండా రాష్ట్రాలకు తిరిగి అధికారాన్ని కల్పించాలి. ఛత్తీస్ఘర్ 82శాతం, మహారాష్ట్ర 75శాతం, తమిళనాడు 69శాతం, ఆంధ్రప్రదేశ్ 66శాతం రిజర్వేషన్లతో 50శాతం పరిధిని ఎప్పుడో దాటిపోయాయి. కాబట్టి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేసి అందరికి న్యాయం చేయడమే ఉత్తమం. ఇక్కడ ముఖ్యంగా కొన్ని విషయలపై చర్చ జరగాలి. ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రభుత్వరంగం తగ్గిపోయి, ప్రయివేటు రంగం పెరుగుతున్నది. మొత్తం ఉద్యోగాల్లో సుమారు 10శాతం ఉద్యోగాలే ప్రభుత్వ ఉద్యోగాలు. మిగిలిన 90శాతం ప్రయివేట్ ఉద్యోగాలే. ఆ ప్రయివేటు రంగంలో రిజర్వేషన్ల మాటేమిటి? ఇప్పటికీ ఏ రిజర్వేషన్లు లేకపోగా ఇకపైనా ఉండబోవని, కేంద్రం సంకేతాలిస్తోంది. ఇది న్యాయమా? ఆయా వర్గాల్లో వెనుకబాటు తనం ఎంత? ప్రస్తుతం రిజర్వేషన్ వర్గాలు ఓపెన్ క్యాటగిరి వర్గాలతో పోటీపడేస్థాయిలో ఉన్నాయా? సామాజిక వెనుకబాటు, విద్యలో వెనుకబాటు, అందునా ఉన్నత విద్యలో వెనుకబాటు, కులం, లింగం ఆధారంగా వివక్షత, సరైన ప్రాతినిధ్యం లేకపోవటం, ఆర్థిక అసమానతలు ఉన్నన్ని రోజులు రిజర్వేషన్లు ఉండాల్సిన అవసరం ఉంది. ప్రయివేట్ సెక్టార్లో రిజర్వేషన్లు తేవాల్సిన అవసరం ఉంది. మరో సమీక్ష జరగాలి.
- జుర్రు నారాయణ
సెల్: 9494019270