Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజ్యాంగంలోని 25వ అధికరణం ప్రకారం ఇతరులకు ఇబ్బంది కలగకుండా దేశంలో ప్రతి ఒక్కరికి తమ మతాన్ని అవలంభించడం, అనుసరించడంతో పాటు, ప్రచారం చేసుకునే హక్కు ఉందన్న విషయాన్ని తాజాగా సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. అంటే ఇతర మతాలని విమర్శించరాదు. ఇతరులపై తమ భావజాలాన్ని బలవంతంగా రుద్ధరాదు. మత ప్రచారం పేరుతో శబ్ద కాలుష్యం సృష్టించరాదు. అంటే మతం వ్యక్తిగతం. ఇదొక జీవన విధానంగా ఉన్నంతవరకు పర్వాలేదు.
భారత దేశం తనను తాను లౌకిక దేశంగా ప్రకటించింది. అంటే ఏ ఒక్క మతాన్ని అధికార మతంగా దేశం స్వీకరించలేదు. ఏ ఒక్క మతాన్ని ప్రోత్సహించదు. ప్రజలలో శాస్త్రీయ దృక్పథం పెంపొందించడాన్ని ప్రభుత్వ కర్తవ్యంగా మన రాజ్యాంగం నిర్దేశిస్తుంది. అంటే పాలకులు మతపరమైన విషయాల్లో ఎంత తక్కువ జోక్యం చేసుకుంటే అంత ఎక్కువ ఉపయోగం ప్రజలకి ఉంటుంది. ప్రజలకి కొన్ని బలాలు, మరికొన్ని బలహీనతలు ఉంటాయి. వారు నిత్యం ఏదో ఒక సమస్యతో బాధపడుతుంటారు. వారు వారసత్వంగా కొన్ని ఆచారాలని పాటిస్తుంటారు. అన్ని ఆచారాలు చెడ్డవి కావు. ఈ ఆచారాలు కొన్ని విశ్వాసాలపై ఆధారపడి ఉంటాయి. ఈ విశ్వాసాలు వ్యక్తిగతంగా ఉన్నంత వరకు ఇతరులకు ఎటువంటి నష్టం ఉండదు. ప్రజల యొక్క వ్యక్తిగత విశ్వాసాలలోకి రాజకీయ నాయకులు ప్రవేశిస్తే, ఘర్షణలు చెలరేగుతాయి. ఆయా మతాల మౌలిక సిద్ధాంతాలు వేరుగా ఉంటాయి. ప్రతి కొత్త మతం అక్కడ ఉన్న పాత సాంప్రయాదాయాలని వ్యతిరేకించే పుడుతుంది.
1893 సెప్టెంబర్‌లో అమెరికాలోని చికాగోలో అంతర్జాతీయ సర్వమత సమ్మేళనం జరిగింది. మనదేశం తరుపున స్వామి వివేకానంద హాజరయి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని విదేశాలకి వివరించాడు. తన ప్రసంగంతో సభికులని అలరించించాడు. 15వ శతాబ్దానికి ముందు అన్ని మతగ్రంధాలలో దేవుని మహిమలు, పరలోకం, స్వర్గం వంటి విషయాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఉండేది. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ మతంలోని డొల్లతనం బయటపడటం జరిగింది. మతాలు తమ ఉనికిని చాటుకోవడానికి తమ తమ గ్రంథాలలో ఉన్న విషయాలకి నూతన భాష్యాలు చెప్పడం ప్రారంభించాయి. దీనిలో భాగంగానే మత గ్రంథాలలో నైతిక విలువలకి స్థానం దక్కింది. మానవ సేవ అనే భావనని మత గురువులు తమ విధానంగా ఎంచుకోవాల్సివచ్చింది. మత బోధనతో పాటు, సైన్స్ విషయాలని కూడా మత గురువులు తమ విద్యార్థులకి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.
చరిత్రలో అక్బర్ వంటి రాజులు సర్వమత సమ్మేళనాలని నిర్వహించారని చదువుకున్నాము. శివాజీ వంటి రాజులు పరమత సహనాన్ని ప్రదర్శించారు. మనదేశ తొలి ప్రధాని నెహ్రూ కూడా శాస్త్రీయ దృక్పథం కలిగి ఉండేవారు. క్రేత్ర స్థాయిలో హిందూ ముస్లింలు ఐక్యంగానే ఉంటారు. దర్గాలకి ఇరు మతస్థులు వెళ్ళతారు. క్యాథలిక్ చర్చిలలో కూడా క్రైస్తవులు హిందూ మత ఆచారాలని కొంత వరకు పాటిస్తుంటారు. పీర్ల పండుగని హిందూ ముస్లింలు నేటికీ కలిసి జరుపుకుంటారు. మతాల మౌలిక సిద్ధాంతాలు వేరైనా, నైతిక విలువల బోధనలో వివిధ మతాల్లో సారూప్యత కన్పిస్తుంది. ఈ సారూప్యత ఆధారంగా ప్రభుత్వాలే సర్వమత సమ్మేళనాలని ఏర్పాటు చేయాలి. మెజారిటీ మతస్థులున్న చోట మైనారిటీలు కొంత అభద్రతా భావంలో ఉంటారు. ఇటువంటి ధోరణి ప్రపంచ వ్యాప్తంగా ఉంది. సైన్స్ మనమెదుర్కొనే సమస్యలకి పరిష్కారం చూపించగలదు. అయితే సైన్స్ పరిశోధనలు కూడా కార్పొరేట్ వర్గాల చేతుల్లోనే ఉన్నాయి. అందువల్ల పరిశోధనా ఫలాలు సామాన్యులకు అందకపోవడంతో వారు తమ సమస్యల పరిష్కారం కోసం మతాలని ఆశ్రయిస్తారు. మతం వారికి ఓదార్పుని ఇస్తుంది. కానీ సమస్యలకి పరిష్కారం చూపదు. ఒక మతంలో వివక్షకు గురైన ప్రజలు మరొక మతంలోకి మారతారు. లేదా బలమైన యంత్రాంగం ఉన్న మతం చేసే ప్రచారం వల్ల కూడా కొంతమంది మరొక మతంలోకి మారవచ్చు. అయినా హేతువాదులు, నాస్తికులు ప్రజలు ఆచరించే ప్రతి సాంప్రదాయాన్ని విమర్శించనవసరం లేదు. వీటిని ఒక ప్రాంతం యొక్క సంస్కృతిగా చూడాలి. సంగీతం, నాట్యం వంటివి కూడా దీనితో ముడిపడి ఉంటాయి. హేళన ద్వారా మనం సమాజాన్ని మార్చలేము. అన్నమయ్య, నారాయణగురు, వివేకానంద వంటి వారు ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తూనే, మతంలో ఉన్న లోపాలను సరి చేయడానికి ప్రయత్నం చేశారు.
ఐక్యరాజ్య సమితి వంటి సంస్థలు పెట్రేగిపోతున్న మతోన్మాదులనుంచి ప్రపంచాన్ని రక్షించేందుకు తరచుగా సర్వ మత సమ్మేళనాలని ఏర్పాటు చేయాలి. ప్రజల సమస్యలని ప్రభుత్వాలు సానుకూలంగా పరిష్కరించాలి. వివిధ ప్రాంతాల్లో ఉన్న మైనారిటీలకు ప్రభుత్వాలు భరోసా కల్పించాలి. లౌకిక భావనలను కాపాడాలి. తద్వారా సమాజంలో పెరుగుతున్న అసహన ధోరణులను కొంతవరకైనా తగ్గించవచ్చు.
- యం.రామ్‌ప్రసాద్
సెల్:9492712836