Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తాజాగా అమెరికాలోని ఇండియానా పోలీస్ విమానాశ్రయం సమీపంలో ఉన్న ఫెడెక్స్ కొరియర్ సంస్థలో ఓ ఆగంతకుడు చొరబడి ఎనిమిది మందిని కాల్చి చంపాడు. గత నాలుగు నెలల వ్యవధిలో ఇండియానా రాష్ట్రంలో కాల్పుల ఘటన చోటు చేసుకోవడం ఇది మూడోసారి.
ప్రపంచ జనాభాలో అమెరికా వాటా 4శాతం. కానీ ఆయుధాల వినియోగంలో 46శాతంగా ఉంది. అమెరికా ప్రజలు తమ రక్షణకు, వేటాడేందుకు, వినోదం కోసం తుపాకులు వాడుతుంటారు. అమెరికాలో ప్రతి పది మందిలో కనీసం నలుగురకి గన్స్ ఉంటాయి. 2017లో ఫ్యూ సెంటర్ స్టడీ ప్రకారం 48శాతం మంది అమెరికన్స్ తాము తుపాకులున్న ఇండ్లల్లోనే జన్మించామని, 72శాతం మంది ప్రజలు తమకు తుపాకి పేల్చడం వచ్చని తెలిపారు. అమెరికా పౌరులు తుపాకులు ఉపయోగించేందుకు అక్కడి చట్టాలు అనుమతిస్తున్నాయి. ఇయితే ఇటీవల వీటిని దుర్వినియోగం చేయడం ఎక్కువైంది. అమెరికాలో ఇంకా ఏదో ఒక రూపంలో జాతి, వర్ణ వివక్ష కొనసాగుతుంది. శ్వేత జాతీయులు అక్కడి నల్ల జాతీయులపై నిత్యం దాడులు జరుపుతున్నారు. తుపాకీ కాల్పుల్లో ఎక్కువగా నల్ల జాతీయులే చనిపోతున్నారు. మరో వైపు మానసిక ఒత్తిడి వల్ల కొందరు యువకులు, ఇతర కారణాలతో మరికొందరు దుండగులు నిరంతరం కాల్పులు జరుపుతున్నారు.
2018లో మార్చ్ ఫర్ ఔర్ లైవ్స్ పేరుతో తుపాకీ సంస్కృతికి వ్యతిరేకంగా అమెరికాలో ఒక ఉద్యమం వచ్చింది. ఈ ఉద్యమానికి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. భారతదేశంలో ఇటువంటి కాల్పుల సంస్కృతి లేదు. మన దేశంలో వ్యక్తిగతంగా తుపాకులు ఉంచుకోవడం చట్టవిరుద్ధం. ప్రముఖులు, రాజకీయ నాయకులు కొన్ని పరిమితులకులోబడి, ముందస్తు అనుమతి తీసుకొని, తమ ప్రాణ రక్షణకు తుపాకులు తమ వద్ద ఉంచుకోవచ్చు. అయితే వీటిని ఎట్టి పరిస్థితుల్లో దుర్వినియోగం చేయరాదు. కొన్ని యూరోప్ దేశాలలో క్రమంగా తుపాకీ కల్చర్ పెరుగుతుంది. మానసిక ఒత్తిడి, ఒంటరితనం, మనిషిలో రోజూ రోజుకు పెరుగుతున్న స్వార్థం, పాలకులు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఉండటం వల్ల యువతలో నిరాశ, నిస్పృహలు పెరుగుతున్నాయి. పెరుగుతున్న నిరుద్యోగం కూడా యువతలో అసహనానికి కారణం అవుతుంది. దీనితో వీరిలో కొందరు తమ సమస్యల పరిష్కారానికి హింసామార్గాన్ని ఎంచుకుంటున్నారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ, నేటితరం సామాజిక శాస్త్రాలకు దూరం అవుతున్నారు. ప్రభుత్వాలు యువతకి శాశ్వత ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కార్యచరణని ప్రకటించాలి. అందుకు తగిన విద్యా విధానం ఉండాలి.
యం.రామ్‌ప్రసాద్
సెల్:9492712836