Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతదేశంలో కరోనా మహమ్మారి కులాలు, మతా లను చూసి కాటేస్తుందని బీజేపీ నాయకులు చెప్పుకుంటున్నారు. వైరస్ హిందూమతానికి చెందిన వారికి సోకదని, ఇతర మతాలవాళ్ల నుంచే అది దేశంలో వ్యాప్తి చెందుతుందని ప్రచారం చేస్తున్నారు. గత ఏడాది ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్లో జరిగిన తబ్లీగీ జమాత్తోనే దేశంలో కరోనా కోరలు చాచిందని, ప్రస్తుతం హరిద్వార్‌లో జరుగుతున్న కుంభమేళాతో ఎలాంటి ప్రమాదం లేదని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీర్థ్ సింగ్ రావత్ చెప్పడం విచిత్రంగా ఉంది. తబ్లీగీ జమాత్‌కు వచ్చినవారు పెద్ద సంఖ్యలో ఒక భవనంలో గుమికూడారని, ఇప్పుడు కుంభమేళాలో ప్రజలు బహిరంగ ప్రదేశంలో ఉన్నారని, ఇక్కడ తల్లిలాంటి గంగానది ప్రవహిస్తోందని, ఆమె ఆశీర్వాదాలతో కరోనా మనుషుల దగ్గరకు కూడా రాదని, దీనిని తబ్లీగీ జమాత్‌తో పోల్చవద్దని ఆయన విలేకరులతో మాట్లాడుతూ చెప్పడం అవివేకానికి నిదర్శనం. కరోనా పేరు చెప్పి కుంభమేళాకు రాకుండా ఎవరినీ ఆపకూడదని, దేవుడు కరోనా వైరస్‌ను హతమారుస్తాడనే నమ్మకం తనకు ఉందని అన్నారు. అయితే హరిద్వారాలో జరుగుతున్న కుంభమేళాకు వచ్చినవారిలో ఏప్రిల్ 10 నుంచి 14 లోపల 1701 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు తేలింది. అయినా మెయిన్‌స్ట్రీమ్ మీడియా దీనిని నదిలో పాపాలు కడుక్కుంటున్నారని, ఇది ప్రక్షాళన అని వర్ణిస్తోంది. గత ఏడాది ఇలాంటి మతపరమైన కార్యక్రమం 'తబ్లీగీ జమాత్' ఢిల్లీలో జరిగింది. ఏడాది తరువాత కూడా, ఇప్పటికీ కరోనా వ్యాప్తికి తబ్లీగీ జమాతే కారణమంటూ కొందరు మీడియా, రాజకీయనాయకులు అందరూ ఇందులో పాల్గొన్నవారిపై వేలెత్తి చూపారు. ప్రధాన స్రవంతి మీడియా వారిని 'మానవ బాంబు'లని పిలిచింది. అదే మీడియా ఇప్పుడు జరుగుతున్న కుంభమేళా కార్యక్రమాన్ని మాత్రం 'ప్రక్షాళన' అంటోంది. గత ఏడాది ఏప్రిల్‌లో కొన్ని మీడియా చానెళ్లు నిజాముద్దీన్ మర్కజ్‌ను లక్ష్యంగా చేసుకొని 'కరోనాజిహాద్' అనే హ్యాష్‌టాగ్ నడిపాయి. ఈ సమావేశాన్ని బాధ్యతారాహిత్యంగా అభివర్ణిస్తూ, వాళ్లను 'తాలిబన్లు' అని కూడా పిలిచారు. మర్కజ్ కోవిడ్ హాట్‌స్పాట్ అనీ, కరోనా వ్యాప్తికి వారే కారణమని అభియోగాలు మోపారు. ఈ సంఘటన తరువాత అనేక చోట్ల ముస్లిం దుకాణదారులను బహిష్కరించారు. ఎక్కడ చూసినా ముస్లింలపై విద్వేష పూరిత వ్యాఖ్యలు, ప్రసంగాలు వినిపించాయి. మర్కజ్లో పాల్గొన్నవారికి కఠిన శిక్షలు విధించాలని కూడా ప్రధాన స్రవంతి టీవీ మీడియా అభ్యర్థించింది. 2020 మార్చి 25 నాటికి దేశంలో రోజుకు సుమారు 250 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అలాంటి సమయంలో తబ్లిగీ జమాత్‌లో అంతమంది గుమికూడడం నేరమని బీజేపీ ఐటీ సెల్ అమిత్ మాలవీయ కూడా వ్యాఖ్యానించారు. గత గురువారం ఒక్క రోజే దేశంలో అత్యధికంగా రెండు లక్షల కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ 12, 14 తేదీల్లో కుంభమేళాలో పవిత్ర స్నానాలు చేశారు. 12న సోమవతి అమావాస్య రోజున, 14న మేష సంక్రాంతి రోజున విశేష సంఖ్యలో భక్తులు గంగానదిలో స్నానాలు చేశారు. ఈ రెండు రోజుల్లో 48.51 లక్షలమంది గంగానదిలో పవిత్ర స్నానాలు చేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి. వీరెవ్వరూ కోవిడ్ జాగ్రత్తలు తీసుకున్నట్టు కనిపించలేదు. మాస్కులు ధరించలేదు. వ్యక్తి గత దూరం పాటించలేదు. మీడియా వ్యాఖ్యాతలేమో ప్రధానమంత్రి నరేంద్రమోడీని 'వ్యాక్సీన్ గురు' అని సంబోధిస్తూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కానీ ప్రధానమంత్రికి కుంభమేళాలో అంతమంది జనం గుమికూడడం ప్రమాదకరంగా కనిపించడంలేదు. అక్కడ కోవిడ్ నిబంధనలన్నీ గంగలో కొట్టుకుపోయాయని స్పష్టంగా కనిపిస్తోంది. మెజారిటీ మీడియా ఎలాంటి అభ్యంతరాలూ లేవనెత్తలేదు. విదేశీ మీడియాలో మాత్రం కుంభమేళాలో కోవిడ్ నిబంధనలు గంగలో కొట్టుకుపోవడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వ చర్యలపై మెయిన్‌స్ట్రీమ్ మీడియా గొంతు విప్పడంలేదు. ఈ అంశంలో స్వదేశీ మీడియా అధిక భాగం మౌనం వహిస్తోంది. సోషల్ మీడియాలో మాత్రం పలు విమర్శలు వస్తున్నాయి. కొన్ని మీడియా సంస్థలు తబ్లిగీ జమాత్‌ను గుర్తు చేస్తూ మైనారిటీల పట్ల వివక్ష చూపిస్తున్నారని ఆరోపిస్తున్నాయి. ధార్మిక సంస్థల నాయకులకు ప్రధానమంత్రి అనుకూలంగా ఉంటున్నారని విమర్శిస్తున్నారు.. ప్రధాన స్రవంతి మీడియా కుంభమేళాను మతం, సంప్రదాయం దష్టితోనే చూస్తోంది. దీనిని వైద్య, ఆరోగ్య కోణంలో చూడడంలేదు. తబ్లిగీ జమాత్‌కు ముందు రెండు సంఘటనలు జరిగాయి. ఒకటి షాహీన్‌బాగ్‌లో సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు, రెండు ఢిల్లీలో జరిగిన అల్లర్లు. ప్రధాన స్రవంతి మీడియా చాలా వరకు వీటన్నిటినీ అధికార పార్టీ కండ్లతోనే చూపించింది. బీజేపీ ప్రచార యంత్రాంగం ముస్లింలను సామాజిక బహిష్కరణకు గురి చేయడమే లక్ష్యంగా పని చేసింది. కుంభమేళా విషయంలో కూడా ప్రధాన మీడియా ఇదే పద్ధతి పాటిస్తోంది. మొత్తం విషయాన్ని అధికార పార్టీ ఎజెండాలకు అనుగుణంగా చూపిస్తోంది. ఇప్పుడు దేశంలో మీడియా కాషాయం ధరించినట్టుగా ఉంది. కరోనావ్యాప్తి గురించి వారికి ఎటువంటి చింత లేదు. అధికార పార్టీ ఎజెండాలను ముందుకు తీసుకెళ్లడమే వారి లక్ష్యం. ప్రతి విషయాన్నీ హిందూ-ముస్లిం కండ్లజోడు పెట్టుకొని చూస్తున్నారు. తబ్లిగీ జమాత్ అప్పుడు ముస్లింలను విమర్శిస్తూ చెలరేగిపోయారు. ఇప్పుడేమో హిందూ పండుగలు, పవిత్ర స్నానాలు అంటూ నీళ్లు నములుతున్నారు. అయితే కుంభమేళాలాంటి కార్యక్రమాలు ప్రజలకు ప్రమాదకరంగా పరిణమిస్తాయని వారికెందుకు బోధపడడంలేదో తెలియడంలేదు. జాతీయ మీడియాలో కొన్ని నియమాలు పాటించేవారు. ఇప్పుడు అవేమీ లేనట్టుగా కనిపిస్తోంది. నిజాలు చెప్పడం అనేది గతించిన మాటగా మారింది. కరోనా వ్యాప్తిని పెంచుతున్న కుంభమేళాను పాపాల ప్రక్షాళన అంటున్నారు. అందులో పాల్గొన్నవారిని భక్తులు, యాత్రికులు అని గౌరవంగా పిలుస్తున్నారు. ప్రజల చావులను మాత్రం ఎవరూ పట్టించుకోవడంలేదు.
మేకల ఎల్లయ్య
సెల్ : 9912178129