Authorization
Mon Jan 19, 2015 06:51 pm
4.5 బిలియన్ ఏండ్ల క్రితం సూర్యుడి సృష్టి జరిగిన సమయంలో విడుదలైన దట్టమైన దుమ్ము మేఘాలు మరియు వాయువులు ఘనీభవించిన క్రమంలో భూమితో పాటు ఇతర గ్రహాలు ఏర్పడ్డాయని ప్రతిపాదించ బడింది. భూమి పై పొర క్రస్ట్‌లో (5-20 కిమీ లోతు వరకు) సిలికేట్లతో కూడిన గట్టి పదార్థాలు పొర ఉంటుంది. రసాయన స్వభావాన్ని బట్టి లోపలి పొరలుగా మాంటిల్, ఔటర్ కోర్, ఇన్నర్ కోర్ అనబడే పొరలు ఉంటాయి. భూ పర్యావరణంలో నాలుగు ముఖ్య భాగాలు ఉన్నాయి. ధరణి చుట్టు ఆవరించబడివున్న వాయు భాగాన్ని 'వాతావరణం', జల భాగాన్ని 'జలావరణం', జీవ సంపదలను 'జీవావరణం'గా, భూ భాగపు పై పొర నేలను 'శిలావరణం' అంటాం. భూ గ్రహంపై వృక్ష, జంతు జీవకోటి ఉనికికి ప్రధాన కారణాలుగా గాలిలో ప్రాణవాయువు (ఆక్సీజన్) ఉండడం, నీటి లభ్యత, జీవ మనుగడకు అనువైన ఉష్ణోగ్రతలు ఉండడమే అని గుర్తించాలి. పర్యావరణంలో దాదాపు 15 మిలియన్ల జీవరాసులు ఉన్నప్పటికీ, 2 మిలియన్ల వరకు జీవజాతులను మాత్రమే వైజ్ఞానికశాస్త్రం గుర్తించగలిగింది. ధరణిపై ఉన్న జీవరాశుల్లో వక్షరాజ్యం, జంతురాజ్యాలు ఉన్నాయి. ఇలాంటి జీవ వైవిధ్యాల నడుమ భూతలంపై ఓ అద్భుత సహజ ప్రకతి నెలకొని, అనేక రకాల వృక్షాలు, జంతువులతో ఓ అద్భుతమైన సహజ ప్రకృతి నెలకొంది. కానీ నేడు మానవ సమాజం ఆధునిక డిజిటల్ జీవనశైలితో భూతల పర్యావరణంలోని జీవావరణం, వాతావరణం, శిలావరణం తమ సహజత్వాన్ని కోల్పోయి భయంకర వాయు, నేల, జల కాలుష్యానికి లోనవుతున్నాయి. దీనితో జీవరాశుల వైవిధ్య మనుగడ ప్రశ్నార్థకం కానున్నది.
భూ వాతావరణంలోని మార్పులు, పర్యావరణ విచ్ఛిన్నతల నేపథ్యంలో భూగ్రహాన్ని నివాసయోగ్య ఆవరణంగా పరిరక్షించుకోవడానికి 1970 నుంచి ప్రతి ఏటా 22 ఏప్రిల్ రోజున ఐరాస సభ్యదేశాలు 'ప్రపంచ ధరిత్రి దినోత్సవం' వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ ఏడాది 'ప్రపంచ ధరిత్రి దినోత్సవం-2021' నినాదంగా 'ధరణి సహజత్వాన్ని పునర్ ప్రతిష్ట చేద్దాం (రీస్టోర్ అవర్ ఎర్త్)' అనబడే అంశాన్ని తీసుకున్నారు. వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ శాతం పెరగడంతో భూతాపం (గ్లోబల్ వార్మింగ్) జరుగుతోంది. మహానగరాలు గాలి కాలుష్య కేంద్రాలుగా మారాయి. జల వనరులు విషతుల్యం కావడంతో జల జీవ సంపద మనుగడ కష్టంగా మారింది. ఇలాంటి గాలి, నీరు, నేల కాలుష్యంతో సకల జీవులతో పాటు మానవ ఆరోగ్యం ప్రమాదంలో పడింది. కరోనా మహమ్మారి కల్లోలంలో విధించబడిన లాక్డౌన్ నేపథ్యంలో సహజంగానే కాలుష్యం కొంత మేరకు తగ్గినా, ప్రగతి రథచక్రాల పరుగులతో తిరిగి కాలుష్య భూతం తన ప్రతాపాన్ని చూపిస్తూ, పూర్వపు కాలుష్య స్థితి రావడానికి ఎంతో కాలం పట్టదు. కార్బన్ ఉద్గారాలను 2030 నాటికి కనీసం 45శాతం తగ్గించగలిగితే భూతాప సమస్య కొంత మేరకు ఉపశమనాన్ని ఇస్తుందని నిపుణులు అంటున్నారు.
ప్రపంచ ధరిత్రి దినం వేదికగా పర్యావరణ కాలుష్యానికి కారణాలను ప్రచారం చేయడం, కాలుష్య సమస్యల కట్టడికి పౌర కార్యాచరణ వివరించడం, అడవులను రక్షించుకోవడం, వృక్ష సంపదలను పోషించడం, జీవ వైవిధ్యాన్ని కాపాడడం, గాలిలో కార్బన్ ఉద్గారాలను తగ్గించడం, సాంప్రదాయేతర తరగని ఇంధనాల వినియోగాన్ని పెంచడం, తరిగే సాంప్రదాయ శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించడం, ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురావడం, సౌర, పవన, అలలశక్తి ఉత్పత్తిని అనేక రెట్లు పెంచడం, పరిశ్రమలు, మురికి కాలువల జల కాలుష్యాన్ని అరికట్టడం, ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించడం లాంటి అనేక అంశాల పట్ల అవగాహన కలిగించాలి. ప్రపంచ ధరిత్రి దినం రోజున చేపట్టాల్సిన కార్యక్రమాల్లో పుప్పొడి రేణువుల వ్యాప్తికి కారణమైన క్రిమి కీటకాలను రక్షించుకోవడం, ప్లాస్టిక్ వాడకాన్ని మన ఇంట్లోంచే తగ్గించడం, జీవ విచ్ఛిన్న ఉత్పత్తులనే వాడడం, ప్రతి ఒక్కరు మొక్కలు నాటి రక్షించడం, వర్ష, వ్యర్థ నీటిని ఒడిసి పట్టు కోవడం, ఇంట్లో తోటలను పోషించడం, రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగాన్ని తగ్గించడం, ప్రజా రవాణ/సైకిల్ వినియోగాన్ని పెంచడం, విద్యుత్తును ఆదా చేయడం, వన్యప్రాణులను కాపాడుకోవడం, పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఆహార వ్యర్థాలను తగ్గించడం, పిల్లలకు పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన కల్పించడం లాంటి అంశాలను చేపట్టాలి. పర్యావరణ పరిరక్షణ అవసరాన్ని విద్యాలయాల్లో చిన్నారులకు అవగాహన పరచడం మనందరి కనీస బాధ్యత.
మానవ ఆవాసమైన భూమికి హాని తలపెట్టడం, మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కోవడం లాంటిది అని గమనించాలి. డిజిటల్ యుగపు నవ్య మానవుడు అభివృద్ధి పేరున తలపెట్టిన అనాలోచిత కార్యాలతో తాగే నీరు, పీల్చే గాలి, నివసించే నేల కాలుష్య విష కోరల్లో చిక్కుకుంటున్నాయి. ఇలాంటి తీవ్ర కాలుష్యంతో ప్రజారోగ్యం ప్రమాదంలో పడింది. ఇదిలాగే కొనసాగితే కరోనా లాంటి మహమ్మారులు జనించి, విశ్వ మానవాళిని కబళించే ప్రమాదాలు మరి కొన్ని జరిగే అవకాశం ఉందని గుర్తుంచుకోవాలి.
డా||బి.ఎం.రెడ్డి
సెల్: 9949700037