Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మార్క్సు: ''సామాజికీకృత ఉత్పత్తిలో డబ్బు-పెట్టుబడి పూర్తిగా రద్దవుతుంది. సమాజం, వివిధ ఉత్పత్తి శాఖలకు శ్రమ శక్తినీ, ఉత్పత్తి సాధనాలనూ, పంపిణీ చేస్తుంది. ఉత్పత్తి దారులు, తమ శ్రమ కాలానికి అనుగుణమైన పరిమాణంలో చేసిన శ్రమ కంతకీ-అని. 'శ్రమ శక్తి'కి మాత్రమే అని కాదు. వినియోగ వస్తువులను (కన్ జ్యూమర్ గూడ్స్), వాటి సామాజిక సరఫరాల నించీ, పొందడానికి హక్కు నిచ్చే కాగితం ఓచర్లను (హామీ పత్రాలను) ఉత్పత్తిదారులు పొందుతారు. కానీ, ఈ ఓచర్లు డబ్బు కాదు. అవి చలామణీ కావు.'' (కాపిటల్-2, విశాలాంధ్ర అనువాదం, పేజీ-293)
'కమ్యూనిస్టు సమాజం' అన్నప్పుడు, దాని ప్రారంభ దశనీ, క్రమ క్రమంగా దాని అభివృద్ధి దశల్నీ, ఆ అభివృద్ధిలో ముగింపు దశనీ, - ఈ విషయాలన్నిటినీ తార్కికంగా అర్థం చేసుకోవాలి. అభివృద్ధిలో 'చివరి దశ' అంటే, ఉత్పత్తుల్లో మార్పులు ఇక జరగవని కాదు. 'సమానత్వ సంబంధాలలో' మార్పులు అక్కర లేదు-అని. సమానత్వం మారిందంటే, అది అసమానత్వం అవుతుంది. అది, మళ్ళీ సమానత్వంగానే మారవలిసి వుంటుంది.
ఇప్పుడు, కమ్యూనిస్టు సమాజం, ఫలానా దేశంలో సాగుతోందనీ, అక్కడ ఇలా జరుగుతోందనీ, చెప్పుకోవడానికి ఏమీ లేదు. ప్రపంచం నిండా ఈ నాటికీ సాగుతూ వున్నది, శ్రమ దోపిడీ సంబంధాలే. కాబట్టి, భవిష్యత్తులో ఏర్పర్చుకోవలిసిన విధానం గురించి చెప్పుకుంటూ, ఆ క్రమాలూ, ఆ దశలూ, ఎలా సాగాలో, మనం ఇప్పటి నించే, అంటే ఈ దోపిడీ సమాజం లో వున్నప్పటి నించే, చర్చించుకుంటూ వుండాలి. కమ్యూనిజం గురించి రాసిన పుస్తకాలను చదవడమూ, ఆ విషయాల గురించి చర్చించు కోవడమూ, చేస్తూ వుండాలి.
'డబ్బు' గురించి ఇంతకు ముందే తెలిసి వుంటే, ఇక్కడి నించీ నాలుగైదు పేరాలు చదవడం మానెయ్యండి! అయినా, చదవాలనిపిస్తేనే చదవండి!
మానవ సమాజంలో, 'డబ్బు' అనేది, మొదటి నించే వుందా? మనుషులు, తమ పనులతో ఒకటి రెండు రకాల వస్తువుల్ని తయారు చేసుకుంటూ వున్న కాలం లోనే డబ్బు ఉందా? మనుషులు చేసే పనులు పెరిగి, వస్తువుల రకాలు పెరుగుతూ వున్న కాలంలో ఒక రకం వస్తువుని ఇచ్చి, ఇంకో రకం వస్తువుని, తీసుకునే 'మారకాల' పద్ధతి ప్రారంభం కావడం జరిగి వుండవచ్చని మార్క్సు గ్రహించడం వల్లే, మారకాల్ని ఒక క్రమంలో చెప్పుకొస్తూ, డబ్బు ప్రవేశాన్ని చెప్పగలిగాడు.
వేరు వేరు రకాల 2 వస్తువులకు 'మారకం' జరగడం ప్రారంభమైందంటే, అప్పుడే 'మారకం విలువ' అనేది ప్రారంభమైనట్టు! ఆ మారకంలో, ఒక వస్తువుని ఇవ్వడం వల్ల, ఆ మారకం జరిగిన 2 వస్తువులకూ వుండే మారకం విలువ, రెండో వస్తువే. రెండో వస్తువుకి మారకం విలువ, మొదటి వస్తువే. ఈ మారకాల పద్ధతి ప్రారంభం కాక ముందే, 'మారకం' అనే మాట ఉండదు. 2 వస్తువులకు మారకం జరిగితే, ఆ 2 వస్తువుల మారకం విలువలూ తెలుస్తాయి.దీని మారకం విలువ అదీ, దాని మారకం విలువ ఇదీ.
ఈ పద్ధతిలో కనపడే 'మారకం విలువ'ని మార్క్సు, 'మారకం విలువకి మొదటి రూపం' (ఎలిమెంటరీ ఫామ్ ఆఫ్ వాల్యూ) అన్నాడు. ఈ పద్ధతిలో, ఫలానా ఫలానా 2 వస్తువులకు మాత్రమే మారకాలు ఎంత కాలం పాటు జరిగి వుంటాయో మార్క్సు అయినా ఊహించలేడు.
మారకాలు జరగడంలో రెండో పద్ధతి: ఒక రకం వస్తువు, ఫలానా ఇంకో రకపు వస్తువుతో మాత్రమే మారడం గాక, సమాజంలో దొరికే ఏ రకం వస్తువుతో అయినా మారే పద్ధతి ఇది. ఈ పద్ధతిలో వున్న మారకం విలువని మార్క్సు, 'విస్తృత (విస్తరించిన) విలువ రూపం' (ఎక్స్పాండెడ్ ఫామ్ ఆఫ్ వాల్యూ) అన్నాడు.
ఒక రకం వస్తువు, సమాజంలో వున్న ఏ రకం వస్తువుతో అయినా మారే పద్ధతి వున్నా, ఒక మనిషికి కావలిసిన ఇంకో రకం వస్తువుతో మారకం తప్పని సరిగా జరుగుతుందనడానికీ లేదు. ఆ రెండో వస్తువు సమాజంలో లేదని కాదు. అది వున్నా, ఆ వస్తువు గల మనిషికి, ఇంకో మనిషి ఇచ్చే వస్తువు అక్కర లేకపోవచ్చు. కాబట్టి, ఒక మనిషి ఇచ్చే వస్తువుతో అతనికి కావలిసిన వస్తువుతో తప్పని సరిగా మారకం జరుగుతుందనడానికి లేదు.
ఈ రెండో పద్ధతి మారకాల నించే 'డబ్బు పద్ధతి' ప్రారంభమైంది. ఈ పద్ధతి పేరు 'జనరల్ ఫామ్ ఆఫ్ వాల్యూ'.
సమాజంలో తయారయ్యే అనేక వస్తువుల్లో, డబ్బు కూడా ఒక వస్తువే. ఫలానా రకం 'ధాన్యాన్ని' డబ్బు వస్తువుగా అనుకుందాం. అన్ని రకాల వస్తువులూ, డబ్బుగా వున్న ధాన్యంతో మారగలవు. ఆ డబ్బు వస్తువుని ఇస్తే, ఏ రకం వస్తువైనా ఇబ్బంది లేకుండా మారే పద్ధతి మొదలైంది. ధాన్యమే కాదు, ఇంకా కొన్ని వస్తువులు కూడా 'డబ్బు వస్తువు' గా కొంత కొంత కాలం పాటు ఉండడమూ, క్రమంగా ఇంకో రకం వస్తువుకి డబ్బు వస్తువుగా హౌదా రావడమూ జరిగి, జరిగి, ఆఖరికి, వెండి-బంగారాలు డబ్బు వస్తువులుగా అన్ని దేశాల్లోనూ స్తిరపడిపోయాయి.
ప్రతీ మనిషీ, తను చేసే వస్తువుల్ని ఇచ్చి, డబ్బుని తీసుకోవచ్చు. ఇలా జరిగితే, ఒక మనిషి తన వస్తువుని అమ్మి, డబ్బుని తీసుకోవడం. ఆ డబ్బుని ఇచ్చి, తనకు కావలిసిన వస్తువుని తీసుకుంటే, ఇది డబ్బుతో ఆ వస్తువుని కొనడం. ఈ అమ్మడాలూ, కొనడాలూ అనేవి కూడా, డబ్బు వస్తువుతో మారకాలే.
'మారకం విలువ' అనే మాటతో ప్రారంభించి, 'డబ్బు' ప్రవేశాన్ని తార్కికంగా గ్రహించి చెప్పింది మార్క్సే.
'డబ్బు' అంటే, 'మారకాల సాధనం' అని ఇతర ఆర్ధిక వేత్తలు కూడా అంటారు. డబ్బుతో అమ్మకాలూ, కొనడాలూ జరగడం చూస్తూ వుంటారు కాబట్టి. అన్ని వస్తువులూ శ్రమలతో తయారవుతాయనీ, డబ్బు వస్తువు కూడా శ్రమలతోనే తయారవుతుందనీ, గ్రహించిన ఆర్ధిక వేత్తలు ఉన్నారు. కానీ, వారు 'భూమికి కౌలు రావలిసిందనీ; పెట్టుబడికి వడ్డీ-లాభాలు రావలిసిందే- అనీ, ఆ పాటలు వదల్లేదు. ఈ రకంగా, శ్రమలూ, మారకాలూ, ప్రారంభమ్కెన తర్వాత, వందల వేల సంవత్సరాలు గడిచి పోయి, ఇంకా గడిచి పోయి, గడిచి పోతూనే వున్నాయి.
మార్క్సు వల్ల మాత్రమే 'శ్రమ దోపిడీ' విషయాలన్నీ బైట పడ్డాయి. ఎంగెల్సు కూడా మార్క్సు అంత వాడిగా, మార్క్సుతో కలిశాడు. జర్మన్ భాషలో 'కాపిటల్' పుస్తకం మొదటి సారి రాగానే, అది స్పష్టంగా అర్ధంకావడం లేదనే అభిప్రాయాలు రావడం వల్ల, మార్క్సు దాన్ని రెండో ముద్రణ నాటికి కొన్ని మార్పులు చేశాడు. తర్వాత రెండో ముద్రణలో కూడా కొన్ని మార్పులుచేసి ఫ్రెంచి ముద్రణ కోసం ఇచ్చాడు.
1870లో 'కాపిటల్'ని రష్యన్ లోకి అనువాదం చెయ్యడానికి 'హెర్మెన్ లోపాతిన్' అనే ఆయన మార్క్స్‌తో మ్లాడినప్పుడు, మార్క్సు, 'సరుకులూ, డబ్బూ' అన్న మొదటి భాగాన్ని ఇంకా తేలిగ్గా రాయాలనుకుంటున్నానని చెప్పాడు. రష్యన్ అనువాదకుడు, ఆ మొదటి భాగం వొదిలేసి, రెండో భాగం నించీ అనువాదం ప్రారంభించాడు. కానీ, మార్క్సు అనుకున్న ప్రకారం మొదటి భాగాన్ని తిరిగి మార్చి ఇవ్వలేకపోయాడు. చిన్న చిన్న మార్పులు మాత్రమే కొన్ని చేశాడు.
'కాపిటల్'కి రష్యాలో అనువాదాన్ని ప్రచురిస్తున్నప్పుడు, దాన్ని అనుమతించాలా లేదా అనే విషయంపై, జారు ప్రభుత్వంలోని ఒక సెన్సారు అధికారి: ''రష్యాలో ఈ పుస్తకం చదవగల వాళ్ళే తక్కువబీ దాన్ని అర్ధం చేసుకునే మాట దేవుడెరుగు''- అన్నాడట!
ఎంగెల్సు శైలి చాలా తేలిగ్గా సాగుతుంది. మార్క్సు లాగ కాదు. మార్క్సు శైలి కూడా కొన్ని చోట్ల అత్యద్భుతంగా ఉంటుంది. వందల, వేల సంవత్సరాల నించీ స్తిరపడిపోయి సాగుతోన్న తప్పుడు విషయాల్ని, మొదట గ్రహించడం పెద్ద కష్టం! గ్రహించిన దాన్ని సిద్ధాంత పరంగా చెప్పాలని ప్రయత్నించడం అంతకన్నా కష్టం! మనం కమ్యూనిజాన్ని తెలుసుకోవడం కోసం బాధ్యతతో, సహనంగా, సంతోషంగా, మార్క్సు-ఎంగెల్సుల్ని చదువు కోవాలి. 'మారకం విలువ' ని తెలుసుకోవడం, కష్టమేమీ కాదు. మారకం జరిగినప్పుడు వచ్చే రెండో వస్తువే, మొదటి వస్తువుకి మారకం విలువ. డబ్బుగా వున్న వస్తువు కోసం మన వస్తువుని అమ్మినా, లేదా డబ్బుతో మనమే ఇంకో వస్తువుని కొన్నా, అవి కేవలం మారకాలే.
రంగనాయకమ్మ
(ఇంకా ఉంది)