Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంతర్జాతీయ కరోనా సంక్షోభం నేపథ్యంలో గత ఏడాది నుంచి నేటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 24 మిలియన్ల పాఠశాల స్థాయి విద్యార్థులు డ్రాపౌట్లుగా మారినట్టు ఐక్యరాజ్యసమితికి చెందిన అనుబంధ సంస్థ యునెస్కో ప్రకటించింది. మార్చి 20, 2020 నాడు దేశవ్యాప్త లాక్డౌన్లో భాగంగా తెలంగాణలో విద్యా సంస్థలు మూసివేయటంతో విద్యార్థుల చదువులు నిలిచిపోయాయి. అనంతరం ప్రభుత్వం ప్రకటించిన వర్చువల్ విధానంలో ఆన్లైన్ తరగతులు పేరుకే మిగిలిపోయాయి. గ్రామీణ ప్రాంతాలలోని, పట్టణ ప్రాంతాలలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల-కులాల పేద విద్యార్థులు ఆన్లైన్ తరగతులు వినేందుకు అవసరమైన సౌకర్యాలు, కనీసం స్మార్ట్ ఫోన్ ఇంటర్నెట్ లేక తీవ్రంగా నష్టపోయారు. వీరి చదువులు నిలిచిపోయాయి. తెలంగాణలో ప్రాథమిక స్థాయి విద్యార్థుల నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థుల వరకు ప్రభుత్వం అట్టాహసంగా ప్రకటించిన టి-శాట్, దూరదర్శన్ తరగతులు పర్యవేక్షకులు, టీచర్లు లేక విద్యార్థులు వినలేకపోయారు. ఏజెన్సీ ప్రాంతాలలో 80శాతం గిరిజన విద్యార్థులకు కేబుల్ కనెక్టివిటీ, మొబైల్ నెట్వర్క్, స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టెలివిజన్ లేక ఆన్లైన్ పాఠాలు అందలేదు. ఈ కాలంలో పాఠశాల డ్రాపౌట్ విద్యార్థుల సంఖ్య విపరీతంగా పెరిగింది. 2021, పిబ్రవరి నెలలో తెలంగాణలో విద్య సంస్థలు ప్రారంభించడంతో ప్రయివేటు, బడ్జెట్ పాఠశాలలలో డ్రాపౌట్లు 10-20శాతం ఉండగా, ప్రభుత్వ పాఠశాలలలో డ్రాపౌట్ విద్యార్థుల సంఖ్య రెట్టింపుగా ఉంది. ఇక బడి మానేసిన బాలికలు చదివే ''కస్తూరిభాగాంధీ బాలికల విద్యాలయాల (కెజిబివి)''లో 50శాతం మించి విద్యార్థులు బడిమానేశారు. ఎకనామిక్ సర్వే 2019-20, విద్యార్థుల్లో డ్రాపౌట్ పెద్ద మొత్తంలో సూచించింది. 13.6శాతం విద్యార్థులు పేదరికంతో, ఆసక్తిలేక బడిమానేశారు. ప్రాథమిక విద్యలో 10శాతం, ప్రాథమికోన్నత విద్యలో 17.5శాతం, ఇంటర్మీడియట్ సెకండరీ విద్యలో 19.8శాతం విద్యార్థులు చదువుకు దూరమయ్యారని జనవరి 2020లో ప్రకటించారు. నేషనల్ సాంపిల్స్ సర్వే దేశ వ్యాప్తంగా 2017-18లో సేకరించిన ఈ డ్రాపౌట్ల సంఖ్య నేడు అంతకంతకు పెరుగుతుంటే సర్కారు చేపడుతున్న చర్యలు శూన్యం. 2020 నవంబర్లో ఢిల్లీకి చెందిన చైల్డ్ పండ్ ఇండియా అనే ఎన్జీఓ పదిరాష్ట్రాలలోని 20జిల్లాల్లో విద్యార్థులు, ఉపాద్యయుల సర్వేలో 64శాతం గ్రామీణ ప్రాంత విద్యార్థులు, పేద విద్యార్థులు డ్రాపౌట్లుగా మారారని నివేదిక విడుదల చేసింది. 2020-21 సంవత్సరానికి తెలంగాణలో డ్రాపౌట్ల సంఖ్యను తెలంగాణ సర్కారు ఇంకా ప్రకటించటం లేదు. డ్రాపౌట్ల సంఖ్య విపరీతంగా పెరగటమే ఇందుకు కారణం. భారత పాలకులు ఆన్లైన్ తరగతుల పేర ప్రపంచ పెట్టుబడిదారులకు ఈజ్ ఆఫ్ డూయింగ్ వ్యాపారంలా ఆన్లైన్ విద్యా భోదనను మారుస్తూ గూగుల్, జియో, జూమ్, రిలయన్స్ వంటి అంతర్జాల బడా కార్పొరేట్ కంపెనీలకు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు అమ్మే సామ్రాజ్యవాద కంపెనీలకు లక్షల కోట్లు దోచిపెడుతున్నారు. ఇక విద్యార్థుల తల్లి తండ్రులు వారికున్న ఎకరా, అర భూములమ్మి పిల్లలకు స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టెలివిజన్లు కొంటున్న పరిస్థితి నేడు దేశంలో ఏర్పడింది. కటిక దారిద్య్రంలో మగ్గుతున్న తల్లితండ్రులు వారి పిల్లలను వారితో పాటు పనిలోకి తీసుకెళ్తున్నారు. గిరిజన పిల్లల బాల్యం ఇప్పపూల సేకరణ, మొర్రి పండ్లు, తునికి పండ్లు సేరకరించి మైధాన ప్రాంతాలలో అమ్మటంలో మగ్గుతుంది. నాడు వేద విద్యను అభ్యాసించడానికి అనర్హులుగా మారిన శోశిత జనసమూహల ప్రజల పిల్లలు, నేడు పెట్టుబడిదారీ ప్రయోజనాలు నెరవేర్చే ఆన్లైన్ విద్యా పేరుతో జరుగుతున్న హిందుత్వ కుట్రలో చదువుకు దూరంగా గెంటివేయబడుతున్నారు. డ్రాపౌట్ విద్యార్థులను గుర్తించటంలో పాలకులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. పిబ్రవరి నెలలో పాఠశాలలో భౌతిక తరగతులు ప్రారంభించే ముందు దేశవ్యాప్తంగా డ్రాపౌట్లుగా మారిన విద్యార్థులను గుర్తించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యవసర చర్యలు చేపట్టాల్సి ఉన్నప్పటికి తీవ్ర నిర్లక్ష్యం వహించాయి. కేంద్ర విద్యా శాఖ బడిబయటవున్న 6-18సంవత్సరాల విద్యార్థులను గుర్తించి పాఠశాలలో చేర్పిచాలని 10 జనవరి 2021 నాడు ఇచ్చిన ఆదేశాలు నామమాత్రంగా మిగిలిపోయాయి. ఒక్క డ్రాపౌట్ విద్యార్థినిగాని బడి బయట ఉన్న వలస కార్మికుల పిల్లలను గాని గుర్తించలేదు. కనీసం స్పెషల్ ట్రైనింగ్ క్యాంపులు గాని పాఠశాలలకు సన్నధం చేసే బ్రిడ్జి కోర్సులు గాని కేంద్ర విద్యశాఖ నిర్వహించలేదు. పేదలపట్ల, రైతు కూలీల బిడ్డలపట్ల సర్కారు నిర్లక్ష్యవైఖరికీ, లేకితనానికి నిదర్శనమిది.
జాతీయ విద్యా విధానం 2020లో ప్రటించినSustainable Development Goal(SDG)-4 (సస్టేనబుల్ అభివృద్ధి లక్ష్యం-4) అనే ఎజెండాలో భాగంగా ప్రభుత్వం 2030 కల్లా ఇండియాను సర్వ సమగ్ర విద్య అభివృద్ధి దేశంగా మారుస్తామని అందుకొరకు నవోదయ విద్యాలయ స్కీమ్స్, వ-జశీఅ్వఅ్, ఇ-పాఠశాల, దీక్ష(DIKSHA-Digital infrastructure of knowledge platform), ప్రధాన మంత్రి ఇన్నోవేటివ్ స్కీమ్ వంటి ఆన్లైన్ వేదికలు ఏర్పాటు చేస్తామని ప్రకటించటం సామ్రాజ్యవాద కంపెనీల పైనాన్స్ పెట్టుబడిని విద్యారంగంలో చొప్పించేందుకే అనేది స్పష్టమవుతున్నది. అనియత ఆన్లైన్ విద్యతో పాలకులు ఒకవైపు విద్యనందించే బాధ్యతనుంచి తప్పుకొంటూ, మరో వైపు పెట్టుదారుల ప్రయోజనాలను నెరవేర్చుతున్నారు. కరోనా సంక్షోభం పేరుతో ప్రారంభించిన ఆన్లైన్ విద్య, నూతన విద్యా విధానం 2020తో సుస్థిరమవుతూ వేల సంఖ్యలో పేద విద్యార్థులను డ్రాపౌట్ విద్యార్థులుగా తయారు చేస్తూ, సామాజిక వివక్షతను పెంపొందిస్తుంది. బాలకార్మిక వ్యవస్థ, బాలిక వివాహలను ప్రోత్సాహిస్తూ, గ్రామాల్లో అర్థ బానిసలను తయారు చేస్తుంది. ఆన్లైన్ విద్యా బోధన దారిద్య్ర రేఖకు దిగువనున్న పేదలకు అందేవిధంగా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, డ్రాపౌట్ విద్యార్థులను గుర్తించే క్యాంపెయిన్లు యుద్ధప్రతిపాదికన చేపట్టాలని, అందరికి విద్య హక్కు అమలు కోసం పోరాడాల్సిన కర్తవ్యం మనందరిపై ఉన్నది.
కె. ఆనంద్
సెల్:9652357076