Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ రాష్ట్రంలో గత వారంరోజుల నుంచి కురుస్తున్న అకాల వర్షాల వల్ల తీవ్ర నష్టం జరిగింది. ముఖ్యంగా అన్నదాతలు నష్టపోయారు. పంట చేతికొచ్చే దశలో ఒక్కసారిగా గాలి దుమారంతో పాటు, పిడుగులు పడి, భారీవర్షం పడటం వల్ల చేతికొచ్చిన ధాన్యం, మొక్కజొన్న, పసుపు, మిర్చి, అరటి, మామిడి కాయలు రాలి అన్నదాతకు తీరని శోకం మిగిలింది. తాజాగా నిన్న రాత్రి ఈదురు గాలులతో ఉరుములు, మెరుపులతో, వడగళ్ల వర్షం కురవడం వల్ల జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తీవ్ర స్థాయిలో నష్టం జరిగింది. రేగొండ మండలంలో పోలీస్ స్టేషన్ ఆవరణలో భారీ వక్షాలు కూకటి వేళ్లతో సహా నేల కూలాయి. హౌర్డింగులు విరిగిపోయాయి. రేగొండ నుంచి భూపాలపల్లి వరకు ప్రధాన రహదారి వెంబడి గల వక్షాలు నేల కూలి రాక పోకలకు అంతరాయం కలిగింది. అన్ని గ్రామాలలో రేకులు గాలి దుమారానికి కొట్టుకుపోయాయి. కరెంటు స్తంభాలు విరిగాయి. రామన్నగూడెం తండాలో అనేక చెట్లు విరిగిపడ్డాయి. చెట్లు కూలి ఇంటి మీద పడటం వల్ల చాలా ఇండ్లు నేలమట్టం అయినాయి. చిట్యాల, ఘన్పూర్, టేకుమట్ల, భూపాలపల్లి మండలాలలో తీరని నష్టం జరిగింది. కల్లాలలోని ధాన్యం వర్షానికి కొట్టుకు పొయింది. వరి పంట పూర్తిగా నేలమట్టం అయింది. ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాలలో పిడుగుపాటుకు పలు ఇండ్లు, కరెంటు స్తంభాలు విరిగిపడి భారీ నష్టం జరిగింది. అకాల వర్షాల వల్ల పూర్తిగా నష్టపోయిన అన్నదాతలను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని, విరిగిపోయిన కరెంట్ స్తంభాలను మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు. వ్యవసాయ అధికారులు పంట నష్టం అంచనా వేయాలి. ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలి.
కామిడి సతీష్‌రెడ్డి,
జయశంకర్ భూపాలపల్లిజిల్లా,
సెల్:9848445134