Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా మాటవింటేనే ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. టీవీల్లో, ప్రసారసాధనల్లో కరోనా హౌరెత్తుతోంది. ప్రాంతాల కతీతంగా అస్పత్రులు, స్మశాన వాటికల వద్ద భీకర దృశ్యాలు మరింత ఆజ్యం పోస్తున్నాయి. హాస్పిటళ్లలో బెడ్లు లేవు, ఆక్సిజన్ లేక అల్లాడుతున్నారంటూ ప్రకంపనలు వెలువడుతున్నాయి. ఉన్నట్టుండి పాజిటివ్ కేసులు లెక్కకు మించి బయటపడటంతో అటు పాలనాయంత్రాంగం, ఇటు జనం దిక్కుతోచని స్థితిలోకి నెట్టబడ్డారు. కేసుల సంఖ్యకు అనుగుణంగా ఆస్పత్రుల్లో సౌకర్యాలు కొరవడటం మరింత వేడి పుట్టిస్తోంది. మాములుగానే సాధారణ ప్రజలకు సేవలందించే ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులపై ఎప్పుడూ విమర్శలు ఉంటూనే ఉంటాయి. ఆయా ప్రభుత్వాలు చర్యలు తీసుకొంటున్నా సంపూర్ణ ఆరోగ్యం తీసికట్టేెనని అందరూ నిట్టూర్చడం మామూలే. వీటికి తోడు కరోనా పేరిట అన్ని చోట్లా స్మశాన వాటికలు కిక్కిరిసిపోతున్నాయి. నగరాలు, పట్టణ ప్రాంతాల్లోని వాటికల్లో దట్టమైన పొగలు అక్కడి దహన సంస్కారాలు, సామూహిక ఖననాలను చెప్పకనే చెబుతున్నాయి.
కరోనా ఎన్నో హృదయవిదారక ఘటనల్ని కండ్లకు కడుతోంది. కుటుంబ బంధాలను సైతం తెంచేస్తోంది. కొన్ని చోట్ల దహన సంస్కారాలకు సైతం బంధువులు గానీ, కుటుంబ సభ్యులు కాని రాకపోవటం దుర్భరమే. ఏ పని చేయాలన్నా కరోనా చుట్టుకుంటుందేమోనన్న భయం అందరిలో ఏర్పడుతోంది. కొంతమంది అంత్యక్రియలను పోలీసులు లేదా పాలక యంత్రాంగం చేతుల్లో పెట్టడం... అదీ మునుపెన్నడూలేని విధంగా అనాథలా ఆ తంతు జరిపించడం అనివార్యమవుతోంది. కరోనా చిట్టాను తిరగేసుకుంటూపోతే ఎన్నో చిత్రవిచిత్రాలు వినాల్సి వస్తోంది. ఎవరూ లేక, రాక పోవడంతో పోలీసులే మృతదేహాల దహనానికి దిక్కవుతున్నారు. ఇక సగటు జీవిపై కరోనా కాటు అనుభవపూర్వకమైంది. సమాజంలోని అన్ని వర్గాలకు శాపమైంది. ప్రతి పౌరునికి ఏదో రూపంలో కరోనా కండ్లెదుట ప్రత్యక్షమైంది. టూకీగా చూస్తే వ్యాపారాలు గణనీయంగా తగ్గాయి. నిర్మాణరంగంలో సంక్షోభం కొనసాగుతోంది. దీంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సన్నగిల్లాయి. రోజూవారీ సంపాదనలో కోత పడుతోంది. అయితే ఈ పరిస్థితికి తగ్గట్టు వైద్యం, ఆహారం అందుబాటులోకి రాక జనం అవస్థలు వర్ణనాతీతం. ఉదాహరణకు గతేడాది కరోనా సమయంలో రోగనిరోధక శక్తి పెంచుకోవాలని, తద్వారా ఈ కరోనా వైరస్‌ను కట్టడి చేయొచ్చని పలు విశ్లేషణలు, పరిశోధనలు వెలువడ్డాయి. ఇమ్యూనిటీ పెరిగితే సహజంగానే రోగం నయమవుతుందని జనం నమ్మారు. పౌష్టికాహారం కోసం పాకులాడారు. ఉన్నంతలో ఎంతో కొంత ఆహార అలవాట్లు మార్చుకున్నారు. రోగనిరోధక శక్తికోసం సమతుల ఆహారం మేలు చేస్తుందని ప్రచారం హౌరెత్తడంతో ఆ తరహా ఆహారం, మందుల కోసం వెంపర్లాడారు. ఇప్పుడు ఆ పరిస్థితిలో మార్పు కన్పిస్తోందన్న విశ్లేషణలున్నాయి. కేసులు పెరిగిపోయి, ఎక్కువ శాతం ఇండ్లలో శ్రేష్టమైన ఆహారం సమకూర్చుకోవడం గగనమవుతోంది. కారణం... ధరల దండయాత్రేనని అంతిమంగా నిర్థారణకొస్తున్నారు. గత కరోనా తొలిదశ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పెరిగిన పెట్రోధరలు నిత్యావసరాలపై తీవ్ర ప్రభావం చూపాయి. రవాణా ఖర్చులు ఇతరత్రా సుంకాలు భారమై సగటు జీవిపై ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. భయంకరమైన కరోనా రెండో దశలో పప్పులు, నూనెలు ఇతర వస్తువుల రేట్లు మిన్నంటాయి. రోగనిరోధక శక్తి పెంచుకుందా మనుకున్నా ఈ వేళ జనం ధరాఘాతానికి గురవుతున్నారు. వైద్య సౌకర్యాల కోణంలో చూస్తే ఎన్నో దృశ్యాలు ఆవిష్కృతమవుతున్నాయి. బెడ్లులేవని, పరిశుభ్రత లేదని, వైద్య పరికరాలు అరకొరగా ఉన్నాయని చెప్పుకుంటూ పోతే ఈ చిట్టా చాంతాడేనని రోజూ పత్రికలు, టీవీలు ఘోషిస్తున్నాయి. ముఖ్యంగా ఆస్పత్రుల్లో తీవ్ర అనారోగ్యానికి గురైన రోగులకు ఆక్సిజన్ చాలినంత లేకపోవడం సమస్యలకు హేతువైంది. దేశ వ్యాప్తంగా రోజూ ఎక్కడో చోట ఆస్పత్రుల్లో, ప్రాంగణాల్లో అనర్థాలు జరుగుతున్నాయి. ఘోరాలు వింటూనే ఉన్నాం. ఇక్కడే జవాబుదారీతనం తెరపైకి వస్తోంది. వైద్య పరంగా అందరి అవసరాలు తీర్చాల్సిన ప్రభుత్వాలు తమ బాధ్యత నుంచి తప్పించుకొంటున్నాయి. దేశంలో రోజువారీ కేసుల సంఖ్య భారీగా పెరగడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఏప్రిల్ 1 నుంచి 45ఏండ్లు దాటిన వారందరికీ టీకాలు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో డిమాండ్‌కు తగ్గట్టుగా టీకాలు దొరకని పరిస్థితి ఏర్పడింది. పైగా మే 1 నుంచి 18ఏండ్ల వయస్సున్న వారికీ టీకాల కార్యక్రమం మొదలు పెట్టనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవానికి ముందు అనుకున్నట్లు 45ఏండ్లు పైబడిన వారికే టీకాలు లేక అల్లాడుతుంటే 18ఏండ్ల గీటురాయి సమంజసమేనా అన్న మీమాంస మొదలైంది. అయితే వయస్సు పరిమితి, టీకాల లభ్యత, ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్‌పై రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ఓ అడుగు ముందుకేసి ఉచిత వ్యాక్సినేషన్ అంటూ ప్రకటన లిస్తున్నాయి. ఈ అంశాలపై నెలకొన్న గందరగోళం నుంచి రోగులు, సంబంధీకులు ఇంకా స్పష్టతకు రాలేక సతమతమవుతున్నారు. అలాగే వ్యాక్సిన్ ధరలపైనా ప్రజల్లో అయోమయం తొలగిపోలేదు. ఆస్పత్రుల్లో రకరకాల ధరల నిర్ణయం పైనా అసంతృప్తులు, నిరసనలు, నిట్టూర్పులు వేదిక మీదకు వచ్చాయి. ఆక్సిజన్ తతంగం, వ్యాక్సిన్ ధరలు, లభ్యత ఇప్పుడు వైద్య రంగాన్ని కుదిపేస్తున్నాయి.
ప్రభుత్వాల జవాబుదారీతనంపై భిన్న పార్శ్వాలున్నాయి. ప్రభుత్వానిదే తప్పంటూ పలు సంస్థల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కార్యాచరణలో లోపముందన్న వాదనలూ ఉన్నాయి. కరోనాకు అసలు కారణం చైనాయేనంటూ అప్పట్లో తప్పుడు కథనాలు కుప్పలు తెప్పలుగా వచ్చాయి. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన చైనాలో ఇప్పుడా భయంకర పరిస్థితులు ఉన్నట్లు నిరూపితం కావడం లేదు. ఎటొచ్చీ రెండో జనసాంద్రత దేశమైన భారత్‌లోనే కరోనా రెండో దశ విజృంభించడం పాలకుల నిర్వాకమే.
అయితే కరోనా కట్టడిలో ప్రభుత్వంతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా మెరుగైన ఫలితాల సాధనకు ఉపకరిస్తుందని విజ్ఞులు పేర్కొంటున్నారు. ప్రజల్లో అవగాహనే రక్షగా ఉంటుందని వైద్య సిబ్బంది చెబుతుండటం గమనార్హం. కరోనా కేసులు మే నెలాఖరులో లేదా జూన్ 10నాటికి తగ్గుముఖం పడతాయని ఓ అంచనా. అయితే మరోవారం రోజులపాటు దేశంలో కరోనా విలయతాండవం తప్ప దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రెండో దశలో ఎంత వేగంగా కేసులు పెరిగాయో అదే వేగంతో తగ్గుతాయని పేరొందిన ఆర్థిక సేవల సంస్థ క్రెడిట్ సూయిస్ అధ్యయనంలో తేలింది. ఏతా వాతా కరోనా పెరుగుదల ఎన్నాళ్లు?.. కట్టడి ఎప్పుడు? ఎలా? ఇదే అందరినీ కలచి వేస్తున్న ప్రశ్న.
- సిహెచ్. రామారావు
సెల్:9959021483