Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్వాతంత్య్రం సిద్ధించి 74ఏండ్లు పూర్తి కావస్తున్నది. 75వ సంవత్సరంలో అడుగుపెట్టబోతున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఆజాదీకా అమృతోత్సవాలకు అనే పేరిట దేశవ్యాప్తంగా ఘనంగా సన్నాహాలు ప్రారంభించింది. లక్షలాదిమంది అమరుల రక్త తర్పణంతో స్వాతంత్య్రం సిద్ధించింది 1947 ఆగస్టు 15న. ఈ 74 సంవత్సరాల కాలంలో మనదేశ ప్రజాస్వామ్యం, పార్లమెంటరీ వ్యవస్థ అనేక ఒడిదుడుగులకు లోనైంది. బ్యాంకుల జాతీయకరణ, రాజభరణాల రద్దు లాంటి నిర్ణయాలను ప్రగతిశీల శక్తులు, వామపక్షాలు అభినందించాయి, స్వాగతించాయి. తృతీయ ప్రపంచ దేశాల ఐక్యతకు నాయకత్వం వహించింది మనదేశం. 1975లో ఎమరెన్జీని విధించి పౌరహక్కులు, న్యాయవ్యవస్థ మీద దాడి ప్రతిపక్ష నాయకులను జైల్లో పెట్టడం, రాజ్యాంగ వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకున్నప్పుడు ఇందిరాగాంధీ నిరంకుశ విధానాలను యావత్తు భారత ప్రజానీకం వ్యతిరేకించింది. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి వరుసగా 1977 వరకు స్వాతంత్య్ర పోరాటానికి నాయకత్వం వహించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. 1977 తరువాత దేశ రాజకీయాలలో పెనుమార్పులు సంభవించాయి. ఏక పార్టీ మెజార్టీ పరిపాలన నుంచి బహుళ పార్టీలతో కూడిన ప్రభుత్వాలు అధికారంలోకి రావడం జరిగినది. ఇవన్నీ చారిత్మక వాస్తవాలు. సోవియట్ యూనియన్ పతనానంతరం ప్రపంచ బలాబలాలలో వచ్చిన పెనుమార్పులు, ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ లాంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల ఒత్తిడులు, ఆదేశాలు, అనేక అంతర్జాతీయ ఒప్పందాల ఫలితంగా 1991లో నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు అమలులోకి తీసుకురావడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ, ప్రజాస్వామ్య వ్యవస్థ పార్లమెంటరీ వ్యవస్థ ఒక నూతన ఒరవడికి లోనైంది. సరళీకృత ఆర్థిక విధానాల ఫలితంగా ప్రయివేటు రంగం, కార్పొరేట్‌రంగం చాలా జెట్స్పీడ్తో అభివృద్ధి చెందింది. అనేక కార్పొరేట్ సంస్థల ఆధీనంలోకి అనేక కీలక రంగాలు రావడం జరిగింది. ధనిక పేద ఆర్థిక అసమానతలు మరింత పెరిగాయి. అలాగే పార్లమెంటరీ ప్రజా స్వామ్యంలో అనేక రుగ్మతలు రావడానికి కూడా ఇది దోహదం చేసింది.
ఎన్నికల ప్రక్రియ ఒక ప్రహసనంగా మారుతూ వస్తున్నది. ధనబలం, మందబలం, మందు, ఆర్భాటాలతో ఓట్లను కొనడానికి ప్రయత్నం జరుగుతున్నది. నేరరాజకీయ చరిత్ర ఉన్న అభ్యర్థులు అటు పార్లమెంటుకు ఇటు శాసనసభలకు ఎన్నుకోబడుతున్నారు. ధనబలం ఎన్నికలలో ప్రధాన పాత్ర వహిస్తున్నది. నేర చరిత్ర కలిగిన వారు శాసనకర్తలుగా ప్రజాస్వామ్యాన్ని నడిపిస్తున్నారు.
గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అనేక తప్పిదాలను, ఘోరాలను, ప్రజావ్యతిరేక విధానాలను సరిదిద్దుతామని సుపరిపాలన అందిస్తామని, ప్రజలకు జవాబుదారీగా ఉంటామని, ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుతామని మోడీ నేతృత్వంలోని బీజేపీ 2014 మేలో అధికారం చేపట్టింది. తరువాత ప్రభుత్వం విదేశాంగ విధానపరంగా అమెరికాతో వ్యుహాత్మక భాగస్వామ్యం ద్వారా అమెరికా జూనియర్ పార్టనర్‌గా తయారైంది. కీలకరంగాలైన రక్షణ, రైల్వే, బ్యాంకు, ఇన్సూరెన్స్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్, కమ్యూనికేషన్స్, రవాణా రంగాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 26శాతం నుంచి తాజాగా 74శాతం పెంచడం జరిగింది. బహుళజాతి సంస్థలకు ఎర్రతివాచీ పరుస్తున్నది. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయాలనే తలంపుతో నష్టాల్లో నడుస్తున్నాయనే కుంటిసాకుతో 100కుపైగా ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం, మూసివేయడం చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వరంగ పరిశ్రమలను ఆధునిక దేవాలయాలుగా వర్ణించారు పండిట్ నెహ్రూ. నేడు మోడీ ప్రభుత్వ రంగ పరిశ్రమలను స్మశానవాటికలుగా వర్ణిస్తున్నారు. రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేయాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నది ఈ ప్రభుత్వం. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘాలు, సీబీఐ, ఇన్‌కంట్యాక్స్, సెంటర్ ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వంటి సంస్థల ద్వారా ప్రజాగొంతుకను వినిపిస్తున్న ప్రతిపక్ష పార్టీల నాయకులను తప్పుడు కేసులు పెట్టి భ్రయబ్రాంతులను చేస్తున్నది. ఎలక్ట్రోలర్ బాండ్స్ ద్వారా కార్పొరేట్ సంస్థల నుంచి వేల కోట్ల రూపాల విరాళాలను సేకరిస్తూ ఎన్నికలలో ఈ బాండ్స్ ద్వారా సమకూర్చుకున్న ధనాన్ని ఖర్చుచేస్తూ ఓట్లు కొనుగోలు చేస్తూ ఎన్నికలను అపహాస్యం చేస్తున్నది.
వంద సంవత్సరాలకుపైగా అనేక పోరాటాలు త్యాగాలు రక్తతర్ఫణం గావించి భారత కార్మికవర్గం సాధించుకున్న 44కార్మిక చట్టాలను 4కోడ్ల రూపంలో కుదించి కార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా మారుస్తున్నది. సంఘం స్థాపించే హక్కు, సంఘటితంగా పోరాడే హక్కు, సమ్మెహక్కును హరింపచేస్తోంది. 8గంటల పని విధానాన్ని యావత్తు ప్రపంచ కార్మికవరవ్గం మేడే స్ఫూర్తితో సాధించుకున్నది. కానీ నేటి మోడీ ప్రభుత్వం కొత్త కార్మికకోడ్లలో పనిగంటలు పెంచుకునే సులభతర సదుపాయాన్ని పరిశ్రమల యాజమానులకు కల్పించింది.
భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం వెన్నుముకలాంటిది. నేటికీ 72 శాతంపైగా ఆర్థిక వ్యవస్థ వ్యవసాయంపై ఆధారపడి ఉన్నది. కానీ గత సంవత్సరం పార్లమెంటు సమావేశాలలో మూడు వ్యవసాయ సాగు చట్టాల ద్వారా యావత్తు రైతాంగానికి తీవ్ర నష్టం కలిగించింది ఈ ప్రభుత్వం. మతపరంగా దేశాన్ని విభజించడానికి అన్ని రకాల యుక్తులు, కుయుక్తులు పన్నుతున్నది ఈ ప్రభుత్వం. ఈ ప్రజా వ్యతిరేక విధానాలనన్నిటినీ ప్రతిఘటించడమే ఆజాదీకా అమృతోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో మనముందున్న ఏకైక కర్తవ్యం.
జి.టి.గోపాల్‌రావు