Authorization
Mon Jan 19, 2015 06:51 pm
(క్రితం సంచిక తరువాయి)
కమ్యూనిస్టు సమాజంలో, అందరూ శ్రమలు చేసే ఉత్పత్తి సంబంధాలే సాగుతున్నాయి - అనుకుందాం. 2 దశల్నే తీసుకుంటే, విషయాల్ని తేలికగా చూడగలం. దాన్ని గురించే ఇప్పుడు చెప్పుకుందాం.
ఈ సమాజం, కనీసం 2 దశలుగా నడుస్తుంది -అనుకుందాం. డబ్బు వున్న దశా, డబ్బు లేని దశా. ఈ సమాజంలో, అందరూ శ్రమలు చేస్తారు కాబట్టి, అందరూ ఉత్పత్తిదారులే. ఎవరూ 'కార్మికులూ' కారు, యజమానులూ కారు. అందరూ శ్రమలు చేసే సమాజంలో, 'పని దినం' చిన్నదిగా అవుతుంది.
దీన్ని మొదటి దశగా అనుకుందాం. ఉత్పత్తిదారులకు, వాళ్ళు చేసే శ్రమల రకాల్ని బట్టీ, ఆ శ్రమలు చేసే కాలాల్ని బట్టీ, ఆ మొత్తం శ్రమల వల్ల వచ్చే విలువ లెక్క ఉంటుంది. ఈ శ్రమల విలువని, గత కాలంలో లాగే గంటల, రోజుల, లెక్కలతో చూడడమే. ఇలా చేసిన శ్రమల్ని బట్టే, అంత శ్రమల తోనే తయారైన డబ్బు వస్తుంది. ఈ రకంగా, ఇంకా డబ్బు వున్న దశనే చూస్తున్నాం.
(1) 'డబ్బు' వున్న దశ'' : దీన్ని మొదట చూస్తే, డబ్బు ఎలా వుంటుంది? - డబ్బు వుండడం అంటే, అది బంగారంతో వుండాలి. బంగారాన్ని తయారు చేయడానికి కూడా గనుల్లో నించీ శ్రమలు జరగాలి. 'బంగారం' అనేది, శ్రమలతోనే తయారై, ఆ శ్రమల్ని బట్టే, బంగారం విలువ వుంటుంది. తక్కువ బంగారానికి తక్కువ విలువా, ఎక్కువ బంగారానికి ఎక్కువ విలువా.
'డబ్బు'గా, బంగారం బిళ్ళలకు బదులుగా, ఇప్పుడు డబ్బు నోట్లు వుంటున్నాయని మనకు తెలుసు. ఈ 'డబ్బు నోట్ల' గురించి ఇప్పుడు చూడాలి.
కమ్యూనిస్టు సమాజం లో, ఉత్పత్తిదారులు కొన్ని శ్రమలు చేసి, ఆ శ్రమల విలువలకు తగ్గట్టు, కొన్ని 'డబ్బు నోట్లు' అందుకుంటా రనుకుందాం. ఇది అందరూ శ్రమలు చేసే సమాజం కాబట్టి, శ్రమల విలువలకు రావలిసిన డబ్బు అంతా వస్తుంది అనే గానీ, 'శ్రమ శక్తి'కి తగ్గ డబ్బు మాత్రమే అని కాదు.
శ్రమలు చేసి, డబ్బుని తీసుకోవడం అంటే ఏమిటి? - శ్రమల్ని 'అమ్మి', వాటి విలువకి తగ్గ డబ్బుని తీసుకోవడమే. ఆ డబ్బుని ఇచ్చి, కొన్ని ఉత్పత్తుల్ని తీసుకోవడం అంటే? ఆ డబ్బుని ఇచ్చి, దాని విలువకి తగ్గ ఉత్పత్తుల్ని 'కొనడం'. దీని అర్ధం, ఏ వ్యక్తి అయినా, తన శ్రమలకు తగ్గ ఉత్పత్తుల్ని తీసుకోవడమే. తక్కువ శ్రమ కి తక్కువ డబ్బూ, ఎక్కువ శ్రమకి ఎక్కువ డబ్బూ.
'డబ్బు పద్ధతి' వుంటే, 'అమ్మడమూ, కొనడమూ' - అనే విషయాలు వుంటాయి కదా? ఒక నెలలో, ఒక వ్యక్తికి, డబ్బు పద్ధతిలో, తను చేసిన శ్రమల విలువల్ని బట్టే, ఉత్పత్తులు రావాలి. శ్రమలకు బదులుగా వచ్చిన డబ్బు నోట్లలో కొన్నిటిని మాత్రమే అతి పొదుపుగా వాడి, మిగతా నోట్లని దాచుకుంటే, దాచిన డబ్బు పెరుగుతుంది. ఆ దాచిన డబ్బుని కొంత కాలం తర్వాతైనా ఉపయోగించవచ్చు. ఇదంతా డబ్బు పద్ధతి. డబ్బు విషయంలో కొన్ని మోసాలకు అవకాశాలు కూడా వుంటాయి. ఒక అవకాశం, దొంగతనం. ఇతరుల డబ్బుని ఎలాగో దొంగిలించడం.
ఇక, ఇప్పుడు కమ్యూనిస్టు సమాజంలో, 'డబ్బు'ని రద్దు చేసే దశ ప్రారంభమైనట్టు అనుకుందాం.
(2) వోచర్లు ప్రారంభం:
ఉత్పత్తిదారులు, తమ శ్రమలకు బదులుగా, 'డబ్బు నోట్ల'ని తీసుకోవడం గాక, 'కాయితం వోచర్లని' (హామీ పత్రాల్ని) తీసుకుంటారు. ఇది, తమ శ్రమల్ని 'అమ్మడం' కాదు. శ్రమల్ని 'అమ్మి' వోచర్లని తీసుకోవడం కాదు. తర్వాత, ఆ వోచర్లతో తమ పోషణ కోసం కొన్ని ఉత్పత్తుల్ని తీసుకుంటే, ఇది వోచర్లతో ఆ ఉత్పత్తుల్ని 'కొనడం' కాదు.
'డబ్బు పద్ధతి' వుండడం అంటే, దాని కోసం బంగారం, గుట్టలుగా సమాజపు బ్యాంకులలో వుండాలి.
'వోచర్ల పద్ధతి' అయితే, ఆ కాయితం ముక్కల వెనక, ఏ వెండి బంగారాలూ అక్కర లేదు.
డబ్బు నోటుకి అయితే, '10 రూపాయల నోటు' అనో, '20 రూపాయల నోటు' అనో, '100 రూపాయల నోటు' అనో, ప్రతీ నోటుకీ కొంత బంగారానికి వుండే కొంత స్వంత విలువ వుంటుంది. ఒక 'డబ్బు నోటు' అది ఎంత విలువతో వుందో, అంత విలువ గల ఉత్పత్తులే దాని వల్ల వస్తాయి.
'డబ్బు'తో వుండే ఏ సమస్యా, 'డబ్బు' కాని కాయితం 'వోచర్ల'తో వుండదు. వోచర్ల వెనక బంగారం వుండదు కాబట్టి. వోచర్లు అంటే, స్వంత విలువలు లేని కాయితం ముక్కలే. కాబట్టి, వాటిని దాచడం కోసం బ్యాంకులు అక్కర లేదు.
'వోచర్ల పద్ధతి' అంటే, అది, డబ్బు రద్దే.
ఉత్పత్తిదారుల బాధ్యత, శ్రమలు చేసి, ఉత్పత్తుల్ని తయారు చెయ్యడమే. రవాణాలు గానీ, ఇంకా ఇతర శ్రమలు గానీ, అన్నీ జరగ వలిసిందే. శ్రమలు చెయ్యడంలో తేడాలు వుంటాయి. ఆ శ్రమలకు కొంత కొంత తక్కువ-ఎక్కువ విలువలు వుంటాయి కాబట్టి, కమ్యూనిస్టు సమాజంలో, డబ్బు రద్దు దశలో, అంటే వోచర్ల పద్ధతి ప్రారంభమైన మొదటి దశలో, ఉత్పత్తిదారులకు అందే ఉత్పత్తులు కూడా వోచర్ల లెక్కతో, తక్కువ-ఎక్కువలు గానే వుంటాయి. - ఈ తక్కువ ఎక్కువల సమస్య లేని దశని కూడా తర్వాత చూస్తాం. అది కూడా డబ్బు రద్దు దశే.
వోచర్లు అంటే, ఉత్పత్తిదారులు, ఏ యే ఉత్పత్తుల్ని, ఎంతెంత కొలతలతో తీసుకోవాలో రాసి వుండే కాయితం ముక్కలే. ఒక ఉత్పత్తిదారుడి చేతిలో వున్న ఆ కాయితం మీద, ఇన్ని కిలోల బియ్యం, ఇంత పప్పు, ఇంత పంచదార, ఇంత నూనె - ఇలా, ఉత్పత్తుల కొలతలు రాసి వుంటాయి. ఆ ఉత్పత్తుల కొలతలు, ఆ వ్యక్తి చేసిన శ్రమల విలువల్ని కాబట్టి రావలసినవి, అలా నిర్ణయం అవుతాయి. ఆ ఉత్పత్తుల్ని ఇచ్చే చోట, వోచరు తెచ్చిన వ్యక్తి, దాన్ని చూపించి, ఆ ఉత్పత్తులు తీసుకుంటాడు. దానితో వోచరుల వల్ల జరగ వలిసిన పని అయిపోతుంది.
ఉత్పత్తిదారులు, తమ పోషణ వస్తువుల్ని తీసుకోవడం, వారానికి ఒక సారో, నెలకి ఒక సారో కావచ్చు. వోచర్ మీద రాసి వున్న ఉత్పత్తుల్ని తీసుకునే పని అయిపోయాక, ఇక ఆ వోచరు, చిత్తు కాయితమే. దాన్ని మళ్ళీ ఉపయోగించడానికి అవదు.
ఒక వ్యక్తి, ఒక నెలలో వాడవలిసిన వోచర్ని, ఆ నెల లోనే వాడకపోతే, ఆ నెలలో వచ్చే ఉత్పత్తుల్ని తీసుకోకపోతే? ఎందుకు తీసుకోరు? ఆ కుటుంబానికి, మొదటి నెలలో చేసిన శ్రమల వల్ల వచ్చిన ఉత్పత్తులే, తర్వాత నెలకి కూడా సరిపోయేలా వున్నాయనీ, కొత్తవి అక్కర లేదనీ, అనుకుందాం. అలా అక్కర లేకపోయినా, వాటిని తీసుకుని, ఎవరికైనా అమ్ముకోవచ్చు గదా? అని మనకి ప్రశ్న రావచ్చు. ఉత్పత్తుల్ని 'అమ్మా'లంటే, వాటిని 'కొనే' వాళ్ళు ఎవరుంటారు? సమాజం లో 'డబ్బు' వుండదు కదా? ఇతరులకు అక్కరలేని ఉత్పత్తుల్ని ఎవరైనా తీసుకుంటే, వాటికి బదులుగా ఏం ఇస్తారు? ఉత్పత్తుల్ని తీసుకుంటే, మళ్ళీ ఉత్పత్తుల్నే ఇవ్వాలి. ప్రతీ వాళ్ళకీ, వాళ్ళ శ్రమల వల్ల, ప్రతీ నెలా వచ్చే ఉత్పత్తులన్నీ వాళ్ళకీ వుంటాయి కదా? నెలకి 20 కిలోల బియ్యంతో సరిపోయే వాళ్ళకి, 40 కిలోల బియ్యం దొరికినా, వాటి ని ఏంచేస్తారు? 'అమ్మే' అవకాశం వుండదు కదా?
వోచర్ వున్న వ్యక్తి, తమకు అక్కర లేని ఉత్పత్తిని రహస్యంగా అమ్మాలంటే, ఆ ఉత్పత్తిని ఇచ్చి, దానికి బదులుగా ఏం తీసుకుంటాడు? 'డబ్బు' వుండదని చెప్పుకున్నాం. ఆ ఉత్పత్తుల్ని తీసుకుంటే, వాటికి బదులుగా, వాటి విలువలకి తగ్గట్టుగా తన శ్రమలే ఇవ్వాలి. అదెలా సాధ్యం? - దీన్ని గురించి చర్చించాలి మనం.
ఒక కుటుంబానికి, ఒక నెలలో తీసుకోవలిసిన ఉత్పత్తి అక్కర లేకపోయినా, దాన్ని తీసుకుని, మర్నాటి నెలలో శ్రమలు చెయ్యకుండా వుండడమా? ఒక నెలలో ఎంత శ్రమ చేసుకోవాలో ఆ లెక్క మొదటే తెలుస్తుంది. శ్రమల్ని తగ్గించడమో, కొంత ఎక్కువగా చెయ్యడమో, ఆ లెక్క కూడా తెలుస్తుంది.
(ఇంకా ఉంది)
రంగనాయకమ్మ