Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కష్టజీవికి ఇరువైపులా కాపుకాసేవాడే కవి అని నిర్వచించి ఆ కర్తవ్యాన్ని చివరివరకు కొనసాగించిన మహాకవి శ్రీశ్రీ (శ్రీరంగం శ్రీనివాసరావు). 1910 ఏప్రిల్ 30న శ్రీరంగం వెంకటరమణయ్య, అప్పన్నకొండ దంపతులకు విశాఖపట్టణంలో శ్రీశ్రీ జన్మించారు. 8వ ఏటనే ఛందోబద్ధంగా పద్యరచన చేసారు శ్రీశ్రీ.. 10వ ఏటనే ''వీరసింహ విజయ సింహ'' నవలను; 15వ ఏట ''పరిణయ రహస్యము'' అనే నవలిక; 18వ ఏట ''ప్రభవ'' అనే కావ్య సంపుటిని రాసారు. ఎక్కువ పద్యాలు, తక్కువ వచనంతో ''సావిత్రీ సత్యవంతులు'' అనే నాటికను శ్రీశ్రీ రాసారు. పురిపండ అప్పలస్వామి ప్రోత్సాహంతో ఆయన నిర్వహించిన ''స్వశక్తి'' పత్రికలో శ్రీశ్రీ తొలికవిత ''దివ్యలోచనలు'' 1925లో ప్రచురణ అయింది. మహాప్రస్థాన గీతాలు అప్పుడప్పుడే రాయడం ప్రారంభించారు. తరువాత కాలంలో ప్రణయ, ప్రేమ, ప్రబోధ గీతాల్ని అద్భుతంగా రాసాడు శ్రీశ్రీ. అదే ఏడాది 1925లో ఎస్ఎల్సి ఉత్తీర్ణులైనాడు. తెలుగు సారస్వతంతో తిక్కన, శ్రీనాథ, వేమనల ప్రభావం, కృష్ణశాస్త్రి, కవితా తత్వాన్ని, విశ్వనాథ సత్యనారాయణ శిల్పాన్నీ చేర్చుకొని, చక్కని కవిత్వం, చిక్కిని కవిత్వం ''ప్రభవ''లో పలికించారు శ్రీశ్రీ.. 1931లో మద్రాస్ క్రిస్టియన్ కళాశాలలో బీఏ పాస్ అయి ఉద్యోగాన్వేషణ చేసారు. 15 సంవత్సరాలలోనే వెంకటరమణమ్మతో వివాహం జరిగింది. ఎ.వి.ఎన్. కాలేజీలో డిమాన్‌స్ట్రేటర్‌గా, మద్రాస్ 'ఆంధ్రప్రభ'లో సబ్ ఎడిటర్‌గా, ఢిల్లీ ఆకాశవాణిలో (1942) తర్వాత మిలిటరీ లేబొరేటరీ అసిస్టెంట్‌గా లక్నోలో పనిచేసిన శ్రీశ్రీ, నిజాం సచివాలయంలో 1946లో చేరి పనిచేసారు. 1949లో ఆనందవాణి పత్రికలో చేరి 1950 కల్లా మద్రాస్ వెళ్ళి 'సినీరంగంలో డబ్బింగ్ రచయితగా 'ఆహుతి' చిత్రానికి పనిచేసారు.
''1930 వరకు తెలుగు సాహిత్యం నన్ను నడిపించింది. ఆ తరువాత నుంచి దాన్ని నేను నడిపిస్తున్నాను'' అని చెప్పుకున్నారు. అబ్బూరి రామకృష్ణరావు, కొంపెల్ల జనార్ధనరావులతో పరిచయం తరువాత శ్రీశ్రీలో బాగా మార్పు వచ్చింది. ప్రోగ్రెసివ్ రైటర్స్ మెనిఫెస్టో అధ్యయనం - 1930 హంగ్రీథర్టీస్ ప్రభావం.. ప్రజాకోణంలో సాహితీ సృజనకు ప్రేరణగా నిలిచాయి. ''మరో ప్రపంచం పిలిచింది'' అంటూ 1934లోనే గీతం రాసారు. ''నేనొక దుర్గం - నా దొక స్వర్గం -బ అనర్గళం అనితర సాధ్యం నామార్గం'' అన్నాడు శ్రీశ్రీ.
1943 ప్రాంతంలో హైదరాబాద్‌లో సమాచారశాఖలో పనిచేస్తున్న శ్రీశ్రీ చిన్నగదిలో అమీర్‌పేటలో ఆర్థిక ఇబ్బందులు పడుతూ జీవించాడు. సమాచారశాఖ అధికారి కపిల కాశీపతి ఓ రోజు శ్రీశ్రీని కలసి ఏడో నిజాం ఉస్మాన్ అలీఖాన్ జీవిత చరిత్ర ''ఐడియల్ కింగ్''ను తెలుగులో అనువదిస్తే 5వేలు డబ్బు వస్తుంది అని చెప్పాడు. ఆర్థిక ఇబ్బందులు.. ఆకలి కష్టాలు తీరిపోతాయి అని అన్నాడట.. ''నా తిండి సమస్య నా తల్లి గర్భంలో ఉండగానే తీరిపోయింది'' తాను నిజాం రాజును కీర్తిస్తూ రాయలేనని కాశీపతికి చెప్పాడు శ్రీశ్రీ. శ్రమైక జీవన సౌందర్యానికి సాటిలేనిదేదీ లేదని నమ్మి దగా పడిన తమ్ముళ్ళ కన్నీళ్ళు తుడవాలని చివరివరకు సామ్రాజ్యవాదం కోసం కృషిచేసినవారు శ్రీశ్రీ. కమ్యూనిజం మానవ విముక్తికి మార్గం అని నమ్మినవాడు శ్రీశ్రీ. వారం వారం 1946, సంపెంగతోట 1947, మరో ప్రపంచం 1954, మహాప్రస్థానం 1950, రేడియో నాటికలు త్రీచీర్స్షర్మెన్ 1956, చరమరాత్రి 1957, మానవుడి పాట్లు, సౌదామిని 1958, మూడు యాభైలు, ఖడ్గసృష్టి 1966, మరో మూడు యాభైలు 1974, అనంతం 1986లో పుస్తకాలుగా ఆయన రచనలు ప్రచురణ అయ్యాయి. మహాప్రస్థానం ఇరవైసార్లుపైనే పున:ముద్రణలు పొందింది. సిరిసిరి మువ్వ శతకం - ప్రాసక్రీడలు - లివురిక్కులు - రెక్కిప్పిన రివల్యూషన్, మరో ప్రస్థానం - సినిమా పాటలు... శ్రీశ్రీ కలంలోంచి జాలువారాయి. ''పాడవవోయి భారతీయుడా'' పేరుతో పాటల సంకల్పనం వచ్చింది. ఈ దేశం సామ్యవాదదేశం అయ్యేదాకా పాడుకోవాల్సిన గేయం ''పాడవోయి భారతీయుడా.. ఆడి పాడవోయి విజయగీతిక (వెలుగునీడలు చిత్రం). అదే చిత్రంలోని కలకానిది విలువైనది బతుకూ... పాట కూడా చాలా చక్కటి భావగీతం. కమ్యూనిజాన్ని ప్రేయసిచేస్తూ.. నా హృదయంలో నిదురించే చెలీ కలలలోనే కవ్వించే సఖీ (ఆరాధన) దేవుడు చేసిన మనుషుల్లారా.. మనుషులు చేసిన దేవుళ్ళారా? ఎవరో వస్తారని ఏదో చేస్తారని మోసపోకుమా.. (భూమికోసం) అర్థరాత్రి స్వాతంత్య్రం అంధకార బంధురం.. (నేటిభారతం) లాంటి వందలాది పాటలు శ్రీశ్రీ రాసారు. ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభల్ని శ్రీశ్రీ వ్యతిరేకించాడు. అరెస్టు అయ్యాడు. 1953లోనే ఎమ్మెల్సీగా కొద్దికాలం పనిచేసాడు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తీసుకోవడం, ఇందిరమ్మ ఎమర్జెన్సీ కీర్తిస్తూ గీతాలు రాయడం.. ఒకరకంగా శ్రీశ్రీ విమర్శలకు గురైనాడు. అలాగే సమైక్య ఆంధ్ర కావాలన్నాడు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు 1983లో కాంగ్రెస్‌ను ఓడించాలన్నాడు శ్రీశ్రీ. సర్వాధికారాలున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జలగం వెంగళ్రావును హేయమైన పదజాలంతో కవితరాసాడు శ్రీశ్రీ.. ఓరోరి ముఖ్యమంత్రిగా.. ఇందిరమ్మగారి భాజా భజంత్రీగా.. ఔరారా వెంగళప్పగా.. జలగవునీ పేరంటే కడపునొప్పిరా.. బానిసకొక బానిసకొక బానిసవోయి బానిసా? మానిసి జన్మానికి మచ్చవు నడపీనుగా - కాంగిరేసు బాకిలింటిలో దిక్కుమాలి వంగి.. వంగి నడుచుగాడిదా! కరవారల కంపుగుడ్డుల - మూటలెత్తుకర్మగతి నిన్ను వీడదా?! కుట్ర కేసు బనాయించి కులికేవా దొమ్మరీ / గూడుపుఠాణి చేసిందెవరో చూద్ధామ్మరి నడి వీధిన నడవలేవురా - ఆదమరిచినడి రాతిరి నిదురపోవురా?! నక్సలైటు పేల్చినాడురా - నీ నెత్తిన నాటుబాంబు పేల్చుతాడురా..'' ఇలా ఈ కవిత సాగుతుంది.
1970లో షష్టిపూర్తి ఉత్సవం అనంతరం విరసం (విప్లవ రచయితల సంఘం) అధ్యక్షడుగా శ్రీశ్రీ ఎన్నికైనాడు. ''దేశాధ్యక్ష పదవి కన్నా విరసం అధ్యక్ష పదవే గొప్ప'' అన్నాడు శ్రీశ్రీ. విరసం తన శాశ్వత చిరునామా అన్నాడు. 1973లో పౌరరక్షణ కమిటి అధ్యక్షులుగా, పౌర హక్కుల సంఘంసభల్లో పాల్గొంటూ మారుమూల గ్రామాలు తిరుగాడు శ్రీశ్రీ. ఆయన స్వీయ చరిత్ర ''అనంతం''లో తన తప్పుల్ని తన బలహీనతల్ని అంగీకరించాడు. 1975 ప్రపంచ తెలుగు మహాసభల్ని నిరసించి, ధర్నా చేసి శ్రీశ్రీ అరెస్టు అయ్యాడు. విశ్వనాథ బహిష్కరించి, సభల్లో పాల్గొన్నాడు. లెనిన్ గోర్కీకి లేఖరాస్తూ.. ''నువ్వు సాహిత్యంతో గొప్ప రచయితవు - కానీ రాజకీయాల్లో ఉత్త ఇడియట్వి'' అన్నాడు. ''ఇది నాకూ వర్తిస్తుంది'' అని శ్రీశ్రీయే ఒప్పుకున్నాడు. ఇందిరమ్మ ఎమర్జెన్సీ వామపక్ష నియంతృత్వంగా భ్రమపడ్డానని బహిరంగంగా క్షమాపణ కోరాడు. (1977). 1955 ఆంధ్రశాసనసభ ఎన్నికల్లో కమ్యూనిస్టు అభ్యర్థుల తరుపున శ్రీశ్రీ ప్రచారం చేసాడు. 1961 అవిభక్త కమ్యూనిస్టు పార్టీ మహాసభల్లో సాంస్కృతిక కార్యక్రమాలకు అధ్యక్షత వహించాడు. శ్రీశ్రీ నోబెల్ బహుమతి తిరస్కరించిన జీన్పాల్సార్త్రే కవిత్వాన్ని ఇష్టపడే వారు. అప్టన్సింక్లేర్, ఆడెన్ - స్పెన్డర్ - చెకోవ్, పుస్కిన్, పాల్ రాబిన్స్ - గోర్కీ - షెల్లీ - కీట్స్ - బోదిలేర్ - నెర్లాన్ - బైరన్ - మయకోవస్కీ లాంటి కవుల్ని బాగా శ్రీశ్రీ ఇష్టపడేవాడు.
ఐ ఈవెన్ ఐ 'గిబ్సన్' గేయ ప్రభావం శ్రీశ్రీపై ఉంది. ''నేను సైతం'' కవితలో అది కనిపిస్తుంది.
1974లో అల్లూరి సీతారామారాజు చిత్రంలోని ''తెలుగువీర లేవరా'' పాటకు జాతీయ పురస్కారం, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, 1979లో రాజ్యలక్ష్మి ఫౌండేషన్ (మద్రాసు) అవార్డు, సీపీఐ జాతీయ కార్యదర్శి చంద్ర రాజేశ్వరరావుగారిచే ''మహాకవి'' బిరుదు శ్రీశ్రీ పొందారు. ''బలవంతులు దోచిన రాజ్యం ప్రజలందరికీ భోజ్యం కాదా? అంటూ ''నేటి భారతాన్ని'' కలంతో ప్రశ్నించే శ్రీశ్రీ తన క(పె)న్న 1983 జూన్ 15 మూసి మరో ప్రపంచంలో చేరాడు శ్రీశ్రీ.
-టి. చక్రవర్తి
సెల్: 9393804472