Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెవ్వు...కెవ్వుమంటోంది. అవును.. వినాయకుడికి ఏనుగు చెవి ఉన్నట్టే, మనుషులకూ సైజుల వారీగా చెవులున్నాయిగదా! శబ్దాలను గ్రహించడం దాని పని. అదనంగా ఇప్పుడు దానికి అనేక కొత్త బాధ్యతలు వచ్చిపడ్డాయి. కరోనా కారణంగా మాస్కు తగిలించుకోవాలంటే చెవులే దిక్కయ్యాయి. అప్పట్లో వినికిడిలోపం ఉన్నవాళ్లు చెవిలో మిషన్ పెట్టుకోవడాన్ని నామోషీగా భావించేవారు. ఇప్పుడు అదే ఫ్యాషనై పోయింది. వయసుతో సంబంధం లేకుండా పోరీ, పోరగాళ్లు, తాతా, అవ్వలు అందరూ విరామం లేకుండా చెవుల్లో హియర్ ఫోన్లు పెట్టుకొని, ఎవరి లోకాల్లో వాళ్లు విహరిస్తున్నారు. ఒకప్పుడు మానసిక రుగ్మతలు ఉన్నోళ్లు ఎవరిలో వాళ్లే మాట్లాడుకొనేవారు. ఇప్పుడు ఎవరు ఎలాంటి వాళ్లో కనిపెట్టడమూ కష్టమై పోతుంది. బ్లూటూత్ అంటూ వైర్ లేకుండా చెవిలో ఓ చిన్న వస్తువు పెట్టుకొని, పిచ్చిపిచ్చిగా మాట్లాడుకుంటూ అడ్డదిడ్డంగా రోడ్లపై నడుస్తూ, వాహనదారులను బెంబేలెత్తిస్తున్న 'టెక్నాలజీ పిచ్చోళ్ళ' సంఖ్య పెరిగింది. ఇక ఆ స్తోమత లేనోళ్లు చెవికి ఫోన్ ఆనించుకొని...వంట అయ్యిందా...ఏం కూర...అనే పరామర్శలు రోడ్లమీద నడుస్తూనే జరిగిపోతున్నాయి. ద్విచక్రవాహనాలు నడుపుతూ, హెల్మెట్కూ, చెవికి మధ్య ఫోన్ పెట్టి సొల్లు మాట్లాడేటోళ్ల సంఖ్యా పెరిగింది. ఇంతకు ముందు ఇంట్లో మొగుడూ పెళ్లాం కొట్లాడితే నాలుగు గోడల మధ్యే ఉండిపోయేది. మొబైల్ఫోను, చెవి అనినాభావ సంబంధం వల్ల ఆ గోలంతా ఇప్పుడు వీధికెక్కి 'బతుకు జట్కాబండి' అవుతున్నది. చెవికి పని ఎక్కువయ్యాక, మనుషులకు విశ్రాంతి లేకుండా పోయింది. వద్దురా అయ్యా...చెవికి పని తగ్గించండిరా... అంటే వినే బాపతా మనోళ్లు. ఆమాట చెప్తే, మనల్నే పిచ్చోళ్లను చూసినట్టు చూసి 'యూ కంట్రీబ్రూట్స్...టెక్నాలజీ గురించి నీకేం తెలుసు' అన్నట్టు చూసే ఆ చూపులతోనే బిక్కచచ్చిపోవాల్సి వస్తున్నది. ఏదేమైనా, చెవికి కాస్తంత సుఖం ఏదైనా ఉందంటే ఇయర్ బడ్ పెట్టి తిప్పుకోవడమేనబ్బా...ఆ సుఖమే ఈ కష్టాలన్నింటినీ మర్చిపోయేలా చేస్తుంది!
-ఎస్ఎస్ఆర్ శాస్త్రి