Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాకులు దూరని కారడివి.. చీమలు దూరని చిట్టడివి...అనే పదాల గురించి మనం చిన్నప్పుడు బాలమిత్ర, చందమామ కథల పుస్తకాల్లో చదివాం, విన్నాం. అదే తరహలో రెండు రోజుల నుంచి ఒక పదం పదే పదే వినబడుతున్నది. అదే ప్రజా ప్రతినిధులకు ప్రవేశం లేని ప్రగతి భవన్. ప్రతిపక్ష నేతలకుగానీ, ప్రజా సంఘాల నాయకులకుగానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ భవన్‌లోకి అనుమతి ఉండదంటే ఉండదు. ఆఖరుకు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, చివరాఖరుకు మంత్రులైనా సరే... అందులోకి అడుగు పెట్టాలంటే వారం రోజుల ముందు అపాయింట్మెంట్ తీసుకోవాల్సిందే. కానీ విచిత్రం, మహా విచిత్రం ఏంటంటే... 'కొద్ది రోజుల క్రితమే మెదక్ జిల్లాకు చెందిన ఎనిమిది మంది సాధారణ పేద రైతులకు ప్రగతి భవన్‌లోకి అనుమతి లభించింది. మంత్రి ఈటల రాజేందర్... తమ భూములను కబ్జా చేశారంటూ వారు సీఎం కేసీఆర్‌కు మొరపెట్టుకున్నారు...' ఆ వెంటనే సినిమా రీల్ యమ స్పీడ్‌గా తిరిగింది. ఈటలపై విజిలెన్స్ అధికారులతో విచారణ ప్రారంభమైంది. ఆయన వైద్య, ఆరోగ్యశాఖ...కేసీఆర్‌కు బదిలీ అయింది. ఇక్కడే యావత్ తెలంగాణ ప్రజానీకానికి ఓ ధర్మ సందేహం వచ్చిపడింది. 'పెద్ద పెద్దోళ్లకే ప్రగతి భవన్‌లోకి ప్రవేశం లేనప్పుడు... గీ సాధారణ రైతులకు సీఎం అపాయింట్మెంట్ ఎట్ల దొరికింది...? దొరికినా చడీ చప్పుడు కాకుండా సీఎం కరోనాతో బాధపడుతున్న సమయంలో ఆఘమేఘాల మీద ఈటలపై విచారణకు ఎందుకు ఆదేశించారు....?' అంటూ జనాలు మస్తు గందరగోళ పడుతున్నరు. వీటికి ఇప్పుడప్పుడే సమాధానాలు దొరికేటట్టు లేదు... కాబట్టి వెయిట్ అండ్ సీ...
-బి.వి.యన్.పద్మరాజు