Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ధూమపానం ఆరోగ్యానికి హానికరం'' అనే ప్రకటన మనకి ఎక్కడ చూసినా కన్పిస్తుంది.ధూమపానాన్ని బహిరంగ ప్రదేశాల్లో చేయకూడదనే నిబంధన కూడా ఉంది. పొగతాగే వారిపై ఏ పౌరుడైనా జరీమానా విధించవచ్చు. 2003లో వచ్చిన కోఫ్తా చట్టం ప్రకారం పాఠశాలలకి దగ్గర్లో పొగాకు ఉత్పత్తులని అమ్మరాదు.18 సంవత్సరాలు లోపు ఉన్నవారికి పొగాకు ఉత్పత్తులని అమ్మరాదు. అనుతించిన స్థలాల్లో తప్ప బహిరంగ ప్రదేశాలలో ధూమపానం చేయరాదు. 2019 నుంచి పొగాకు వినియోగం తీవ్రమైన మరణాలకి కారణం అవుతుంది అనే క్యాప్షన్‌ని వివిధ స్థలాల్లో ప్రదర్శించాలని ఆరోగ్య శాఖ తెలిపింది. స్మోకింగ్ చేసే అలవాటు ఉన్నవారు త్వరగా వయసు మీద పడినట్లు కనిపిస్తారు. డీ హైడ్రేషన్ కారణంగా వారి చర్మం పాలి పోయినట్లుగా మారుతుంది. దంతాలతోపాటు పెదాలు, చిగుళ్లు రంగు మారతాయి. సిగరెట్ కాల్చే అలవాటు ఉన్న వారిలో గుండె జబ్బుల ముప్పు కూడా ఎక్కువే. పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల రక్తం గడ్డకట్టడం, ధమనులు గట్టిపడటం, అధిక రక్తపోటు, కిడ్నీలు విఫలం కావడం తదితర సమస్యలు అధికమవుతాయి. ఊపిరితిత్తుల పైన కూడా ధూమపానం ప్రభావం అధికంగా ఉంటుంది. పొగతాగేవారి నుండి దుర్వాసన వస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా పొగతాగేవారిలో 12శాతం మంది మనదేశంలో ఉన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో పెరుగుతున్న పబ్ కల్చర్ వల్ల మహిళలలో కూడా క్రమంగా ధూమపాన వినియోగం పెరుగుతుంది.
కరోనా వైరస్ కూడా ఊపిరితిత్తులపై ఎక్కువ ప్రభావం చూపి అధిక సంఖ్యలో మరణాలకి కారణం అవుతుంది. ఈ నేపథ్యంలో ధూమపానం వినియోగించే వారిలో కరోనా మరణాలు అధికంగా నమోదు అవుతున్నాయి. పొగతాగేవారి కే కాకుండా, ఆ పొగ పీల్చేవారికి కూడా అనారోగ్య సమస్యలు తలెత్తున్నాయి. పొగాకు నియంత్రణ నిబంధనలు ఎన్ని ఉన్నా సరైన పర్యవేక్షణ లేకపోవడంతో పొగరాయుళ్లు అడ్డూ అదుపు లేకుండా పొగలని రింగు రింగులుగా గాలిలో వదులుతున్నారు. గుట్కాల వినియోగం యువతలో అధికంగా ఉంది. దీని వల్ల నోటి క్యాన్సర్ వస్తుంది.
ప్రజారోగ్యమే అత్యంత ముఖ్యమైన అంశంగా పాలకులు భావించాలి. భూటాన్ ధూమపాన రహిత దేశంగా అవతరించి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది. ధూమపానం వల్ల వచ్చే నష్టాలని ప్రజలకి వివరించాలి. గాట్స్ సంస్థ చేపట్టిన సర్వేలో మన దేశంలో పొగాకు తాగేవారిలో ఐదుగురు ప్యాక్‌లపై హెచ్చరికలని చూస్తున్నారని, చూసిన ప్రతి ముగ్గురిలో ఒక్కరు ధూమపానం మాని వేస్తున్నారని తేలింది. అంటే ప్రభుత్వాలు మరికొంత ధూమపానానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తే పొగరాయుళ్ల శాతం తగ్గుతుంది. మరోవైపు దేశంలో లక్షల మంది బీడీ కార్మికులు ఉన్నారు. వీరికి ప్రత్యామ్నాయ మార్గాలను చూపించసాల్సిన అవసరం ఉంది. ప్రతి ఏడాది మే 31న నో టొబాకో డే ని నిర్వహిస్తారు. ఈ దినోత్సవానికి మరింత ప్రాధాన్యత కల్పించాలి. విద్యాలయాలలో పొగాకు వినియోగం వల్ల వచ్చే నష్టాలపై అవగాహన సదస్సులు నిర్వహించాలి. ధూమపానం, మద్యపానాలని ప్రభుత్వాలు ఆదాయ వనరులుగా చూడకూడదు.
- యం.రామ్‌ప్రసాద్
సెల్:9492712836