Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఒక్క సిరాచుక్క లక్షల మెదళ్లకు కదలిక'' అని ఒక్క వాక్యంతోనే సాహిత్యం విలువేంటో తెలియజేసిన గొప్పవ్యక్తి కాళోజి. తెలుగుతోపాటు ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ప్రావీణ్యంకలిగి, పలురచనలు చేసి ప్రఖ్యాతిగాంచారు. ''పుట్టుక నీది - చావు నీది- బతుకంతా దేశానిది'' అంటూ జయప్రకాశ్ నారాయణ మరణించినపుడు ఏకవాక్యంతో సందేశాన్నిచ్చిన సాహితీవేత్త. ''హింస తప్పు - రాజ్యహింస మరీతప్పు'' అని పాలకవర్గానికి హెచ్చరికలు జారీచేసే నినాదాలు ఎన్నో ఆయన కలం నుంచి జారిపడ్డాయి. ''సామాన్యుడే నా దేవుడు'' అని ప్రకటించి, ప్రజలపట్ల తనకు మక్కువ ఎక్కువని తెలియజేశారు. నిజాం పాలనకాలంలో వారి పనితీరును, ప్రజలపై నిరంకుశపోకడను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ఎన్నో రచనలుచేసి, అప్పటి నిజాంరాజు ఆగ్రహానికిగురై కూడా, మరింత తీవ్రంగా అంకితభావంతో అక్షరం సంధించి 1939, 1943లలో రెండుసార్లు జైలుకు వెళ్లారు.
బాల్యం: ''కాళోజి- కాళన్న''గా సుపరిచితులయిన రఘుదీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరామ్ రాజా కాళోజి 1914 సెప్టెంబర్ 9న కర్నాటక రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో రట్టిహళ్లి అనే గ్రామంలో జన్మించారు. తల్లి రమాబాయమ్మ కన్నడిగుల ఆడపడుచు, తండ్రి కాళోజీ రంగారావు రాష్ట్రీయుడు. కాళోజీ జన్మించిన అయిదారు నెలలకే తన తల్లి చనిపోవడంతో అన్న కాళోజి రామేశ్వరరావు అమ్మగామారి తన తమ్ముడు కాళోజిని పెంచి పెద్దచేశాడు. వారి కుటుంబం బీజాపూర్ నుండి వరంగల్ జిల్లా మడికొండలో స్థిరపడింది.1940 లో రుక్మిణి బారు తో వివాహం జరిగింది.
విద్యాభ్యాసం: హైదరాబాదు పాతబస్తీలోని చౌమహల్ న్యాయ పాఠశాలలో కొంతకాలం చదివి ఆ తరువాత సిటీకాలేజీలోనూ, హన్మకొండలోని కాలేజియేట్ ఉన్నత పాఠశాలలోనూ చదువు కొనసాగించి మెట్రిక్యులేషన్ పూర్తిచేశారు. 1939లో హైదరాబాదులో హైకోర్టుకు అనుబంధంగావున్న న్యాయకళాశాల నుంచి న్యాయశాస్త్రంలో పట్టాపొందారు.
ఉద్యమ స్ఫూర్తి: విద్యార్థిదశ నుండే ఎన్నో ఉద్యమాలలో పాల్గొన్నారు. 1930లో గ్రంథాలయోద్యమంలో ఎంతో చురుగ్గా పాల్గొన్నారు. తెలంగాణలోని ప్రతిగ్రామంలో ఒక గ్రంథాలయం ఉండాలన్నది ఆయన ఆకాంక్ష. సత్యాగ్రహౌద్యమంలో పాల్గొని పాతిక సంవత్సరాల వయసులో జైలుశిక్ష అనుభవించారు. నిజామ్ ఆంధ్ర మహాసభ, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్తో కాళోజి అనుబంధం విడదీయరానిది అని చెప్పవచ్చు.
మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, జమలాపురం కేశవరావు, బూర్గుల రామకష్ణారావు, పీవీ నరసింహారావు వంటి వారితో కలిసి అనేక ఉద్యమాలలో పాల్గొన్నారు. విద్యార్థి దశలోనే నిజాం ప్రభుత్వ నిషేధాజ్ఞలను ఉల్లంఘించి వరంగల్లో గణపతి ఉత్సవాలు నిర్వహించాడు. తెలంగాణలో అక్షరజ్యోతిని వ్యాపింపచేయాలన్న తపనతో ఆంధ్ర సారస్వత పరిషత్తును స్థాపించిన ప్రముఖులలో ఇతను ఒకరు. రజాకార్ల దౌర్జన్యాన్ని ప్రతిఘటిస్తూ 1945లో పరిషత్తు ద్వితీయ మహాసభలను దిగ్విజయంగా నిర్వహించడంలో కాళోజీ ప్రదర్శించిన చొరవ, ధైర్యసాహసాలు ఎంతో సూÊఫర్తిదాయకం. వరంగల్ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించినందుకు అతనికి నగర బహిష్కరణశిక్ష విధించడం జరిగింది. స్వరాజ్య సమరంలో పాల్గొని ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు బహిష్కరణకు గురైనప్పుడు, వారిని నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేర్పించి ఆదుకోవడంలో ఆయన పాత్ర అనన్యం అని చెప్పవచ్చు.
సమాజంలోని అసమానత్వం, అవినీతిని ఎండగడుతూనే, వివిధ సమస్యలతో బాధపడే వారిని చూస్తూ, కంటనీరు తెచ్చుకొని వారికోసం పాలకపక్షాలపై వ్యతిరేకంగా రచనలుచేస్తూ, పేదలపక్షాన నిలిచిన మహౌన్నత వ్యక్తి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతెందుకు సమాజంలో ప్రతిఒక్కరూ ధైర్యసాహసాలతో ప్రశ్నించే తత్వాన్ని నేర్చుకోవాలని చాటిచెప్పిన మహానుభావుడాయన. ఎక్కడైనా, ఎవరైనా తనవారి కోసమే స్వార్థంగా ఆలోచించే తరుణంలో, ప్రతిఒక్కరి బాధను తనబాధగా భావించి రచనలుచేసి ఎందరికో ఆదర్శప్రాయం అయ్యాడంటే ఎలాంటి వ్యక్తిత్వమో అర్థంగాకమానదు.
రాజకీయ జీవితం: 1958లో ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎన్నుకోబడి ఆంధ్ర ప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులుగా పనిచేశారు. సారస్వత పరిషత్ వ్యవస్థాపక సభ్యుడిగా, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యుడిగా, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షునిగా, 1957-61 కాలంలో గ్లోసరి కమిటీ సభ్యునిగా పనిచేశారు. 1977లో ఖమ్మంజిల్లా సత్తుపల్లి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావుపై పోటీ చేశారు కానీ ఓడిపోయారు. 2002 నవంబర్ 13న తుదిశ్వాస విడిచారు. వర్తమాన కవులు, రచయితలు కాళోజీ ఆదర్శాలను అందిపుచ్చుకోవాలి. న్రపజల పక్షాన నిలబడాలి. ఆయన స్ఫూర్తిని కొనసాగించాలి. అదే ఆయనకు నిజమైన నివాళి.
- కె. అంజిలమ్మ
సెల్: 8500033855