Authorization
Mon Jan 19, 2015 06:51 pm
(గత సంచిక తరువాయి)
డబ్బుని రద్దు చేసినా, ఉత్పత్తులతో సమాజం నడవడం అనేది, హేతుబద్ధమైన విషయమే గానీ, హేతు విరుద్ధమైన విషయం కాదు. వోచరు అనే కాయితానికి, ఎంత విలువ వుంటుంది? ఆ కాయితం ముక్క తయారీకి అవసరమైన విలువే గానీ, అంత కన్నా ఏ విలువా దానికి వుండదు. ఏ వోచరు వల్ల అయినా, దాని మీద రాసి ఉన్న ఉత్పత్తులకు ఎంత విలువ వుంటుందో, ఆ ఉత్పత్తుల్ని ఇంకా తీసుకోక ముందు, అదే ఆ వోచరు విలువ.
ఒకళ్ళ వోచరుని ఎవరైనా దొంగ తనం చేసి, ఆ ఉత్పత్తుల్ని వాళ్ళు తీసుకోగలరా? అది సాధ్యం కాదు. ఎందుకంటే, ప్రతీ వోచరు మీదా, అది ఏ వ్యక్తికి, ఏ కుటుంబానికి చెందిందో, ఆ వివరాలన్నీ వుంటాయి. ఇతరుల వోచరుని దొంగతనం చేసినా, దానిలో రాసి వున్న ఉత్పత్తులు ఎలా వస్తాయి?
ఒక ప్రశ్న: ఒక నెలలో వాడ వలిసిన వోచర్‌ని వాడుకోకపోతే, ఆ ఉత్పత్తుల్ని తెచ్చుకోకపోతే, ఆ వోచరు రద్దయి పోతుందా? దాన్ని తర్వాత నెలలో వాడడానికి పనికి రాదా? దాన్ని దాచి వుంచితే, దానిలో రాసి వున్న ఉత్పత్తులు తర్వాత రావా? ఇదీ ప్రశ్న.
ఆ సమాజం, ఆ నియమాన్ని ఎలా పెట్టుకుంటే, అలా జరుగుతూ వుంటే, ఆ అనుభవాల వల్ల, ఆ నియమం సరైనదో కాదో తెలుస్తుంది.
(3) కమ్యూనిస్టు సమాజంలోనే, వోచర్లతో లాగ, డబ్బు నోట్లతో కూడా ఏ దొంగతనాలూ లేకుండా, అలాగే చేసుకోకూడదా?
'డబ్బు'తో అయితే, బంగారమూ, బ్యాంకులూ, దొంగ తనాలూ, వుంటాయి కదా? డబ్బు నోట్లతో కూడా ఏ దొంగతనాలూ లేకుండా, వోచర్లతో జరిగినట్టే జరగాలంటే? ఇక అలాగైతే, డబ్బు నోట్లు ఎందుకు? వోచర్ల విధానం అయితే, దాని వల్ల 'ఆస్తి' ని కూడబెట్టడం వుండదు. ఆరోగ్య వంతులు, రెగ్యులర్ గా శ్రమలు చెయ్యడం వుంటుంది. డబ్బు విధానం అయితే, బంగారం కోసం గనుల్ని తవ్వే అనవసరపు శ్రమా, తర్వాత కూడా ఇతర సమస్యలూ తప్పవు.
కమ్యూనిజంలో, అంటే డబ్బే లేని సమాజంలో, బ్యాంకులు వుంటాయా? డబ్బు వుంటే, బ్యాంకుల్లో కాకపోయినా, స్వయంగానే డబ్బుని అప్పులిచ్చి, పైసో, అర పైసో వడ్డీలు సంపాదించవచ్చు. డబ్బు వుంటే, దాని వల్ల పుట్టే వికారాలకు ముగింపు వుండదు.
(4) సమాజ నిధి: (సోషల్ ఫండ్ లేదా కామన్ ఫండ్):
'వోచర్ల పద్ధతి' -అంటే, కేవలం పోషణ కోసం ఉత్పత్తుల్ని తీసుకోవడం గా మాత్రమే వుండదు. బస్సు లెక్కీ, రైళ్ళెక్కీ, ప్రయాణాలు చేసినా, అనారోగ్యాల సమయం లో ఆస్పత్రులకు వెళ్ళాలన్నా, పిల్లలకు విద్యలు కావాలన్నా-అటువంటివన్నీ ఉచితాలే. ఆ ఉచితాలకు కారణం, ఉత్పత్తిదారుల శ్రమల్లో నించి, 'సమాజ నిధి' కోసం కొంత భాగాన్ని ఇవ్వడమే. నిజమైన అర్ధం తో చూస్తే, ఆ ఉచితాల్లో ఏదీ 'ఉచితం' అవదు. వ్యక్తుల శ్రమల విలువల్లో నించీ, సమాజ నిధి కోసం వెళ్ళే భాగమే వ్యక్తులకు ఉచితాల్ని కూడా ఇస్తుంది.
పాత కాలంలో, మారకాల సమస్యల వల్లే సమాజానికి, డబ్బు పద్ధతి అత్యవసరం అయింది. అలాగాక, మానవుల సంబంధాల గురించి మంచి చెడ్డలు తెలిసిన తర్వాత, శ్రమ దోపిడీని తీసివెయ్యడమే జరిగితే, డబ్బు పద్ధతితో పాత కాలపు అవసరం వుండదు.
వోచర్ల పద్ధతితో, ప్రతీ మనిషికీ, చీకట్నే పళ్ళు తోముకోడానికి కావలిసిన బ్రష్‌తో మొదల్కె, రోజంతా కావలిసిన ఉత్పత్తులన్నీ ఇంట్లోనే సిద్ధంగానే వుంటాయి. ఏదీ లేదనే సమస్య వుండదు. ఒక వేళ, ఇంటికి కావలిసిన వస్తువులు ఏవైనా వుంటే, ఆ వస్తువు కోసం వోచర్ ని తీసుకుని, ఆ వస్తువుని తెచ్చుకోవడమే.
సమాజంలో, డబ్బు పద్ధతి అనేది లేకపోతే, మానవుల్ని, మానవత్వం గల మానవులుగా చేసే సంస్కారం ఏర్పడుతుంది. ఇదంతా ఉత్త ఊహ కాదు. తార్కికమ్కెన ఊహ! ఈ ఊహ, ఎవరికి వుండాలి? భూస్వాములకూ, పెట్టుబడిదారులకూ కాదు. వాళ్ళకి ఈ ఊహ మీద ద్వేషాలు వుంటాయి గానీ, ఈ ఊహ ఉండదు.
డబ్బు పద్ధతిని రద్దు చెయ్యాలనే ఊహ శ్రామిక జనాభాకి కూడా లేకపోతే, ఆ జనాభా మిగతా ఊహలన్నీ వదిలెయ్య వలిసిందే. పూర్వ కాలం నించీ బ్రతికిన రకంగా బానిసలుగా బ్రతకడమే, అసల్కెన మార్గం. డబ్బునే దైవ ప్రసాదంగా భావిస్తూ చచ్చేదాకా బతకాలి.
'డబ్బు' అనే మాటకి, వందల, వేల సంవత్సరాల నించీ మానవుల్లో ఒక అర్ధం నడుస్తూ వుంది. ''డబ్బే దైవం'' అనే అర్ధం. ఈ అర్ధాన్నే తీసివేస్తే, ఇక 'డబ్బు' అనీ, 'దైవం' అనీ పేర్లు మాత్రం ఎందుకు?
'డబ్బు రద్దు' అంటే, డబ్బు నోట్లకు బదులు కాయితం వోచర్లు ప్రారంభం కావడం మాత్రమే కాదు. ఉత్పత్తిదారులు, ఎంత విలువ గల శ్రమలు చేస్తారో, ఆ శ్రమలకు తగిన విలువ గల ఉత్పత్తుల్ని పొందడం కాదు.
మనుషుల శ్రమ శక్తుల్లో తప్పని సరిగా తేడాల వల్ల మనుషులు చేసే శ్రమలు కనీసంగా అయినా, తేడాలతో వుంటాయనీ, మార్క్సు అంటాడు. ఇద్దరు మనుషుల్ని తీసుకుంటే, వాళ్ళు చేసే శ్రమలు ఎంతో కొంత తక్కువ ఎక్కువలుగా వుంటాయి. మనుషుల శ్రమ శక్తుల్లో ఇది సహజ లక్షణం. కొంత తక్కువ శ్రమ చేసిన మనిషికి తిరిగి అందేది కొంత తక్కువ ఉత్పత్తిగానూ, కొంత ఎక్కువ శ్రమ చేసిన మనిషికి అందేది కొంత ఎక్కువ ఉత్పత్తి గానూ అందే నియమమే అయితే, అది మనుషులకు సమానత్వం అవదు-అంటాడు మార్క్సు. 'సమానత్వం' అంటే, మనుషుల శ్రమ శక్తుల్ని బట్టి ఏర్పడవలిసింది కాదు. 'సమానత్వం' గా ఏర్పడే నియమం, శ్రమ శక్తుల్లో సహజమైన తేడాల్ని బట్టీ, చేసిన శ్రమల విలువల్లో తేడాల్ని బట్టీ వుండవలిసింది కాదు. కమ్యూనిస్టు సంస్కృతి, మనుషుల్ని సమానత్వ అవగాహనతో అభివద్ధి పరుస్తుంది. శ్రమలు చెయ్యడం లో, 'మోసం' అనే తప్పుడు భావం లేని అవగాహన అది. ఆరోగ్యవంతుడైన ఏ కమ్యూనిస్టు మనిషి అయినా, తన శక్తిని బట్టే శ్రమ చేస్తాడు. శ్రమల కొలతల్లో స్వల్పమైన తేడాలైనా అనివార్యం. ఆ తేడాల లెక్కలు అర్ధరహితం.
ఆరోగ్యవంతులైన స్త్రీ-పురుషులు, తమ శక్తిని బట్టి చెయ్యడమూ, చేసిన దాని లెక్కలు లేకుండా, తమ అవసరాల్ని బట్టి ఉత్పత్తుల్ని తీసుకోవడమూ జరుగుతుంది.
ప్రతీ మనిషీ, శ్రమలు చెయ్యడం తప్పని సరి. జరిగిన శ్రమల లెక్కల్ని బట్టి గాక, ఆ వ్యక్తి అవసరాల్ని బట్టి, ఉత్పత్తుల్ని పొందడమే సమానత్వ నియమం. మానవ సమాజం, ఈ అవగాహనకు చేరడమే సమానత్వ సంస్కృతి.
('కమ్యూనిస్టు సమాజాన్ని చూద్దాం!'
అనే రంగనాయకమ్మ కొత్త పుస్తకంలో ఒక భాగం ఇది.)
- రంగనాయకమ్మ