Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా మళ్లీ తిరగబెట్టింది. ఎలా తిరగబెట్టింది? కోట్లాది మంది ప్రజలు ముక్కోటి దేవుళ్లకు చేసిన పూజలన్నీ ఏమైపోయాయి? చేసిన యజ్ఞ యాగాదులన్నీ ఎందుకని విఫలమయ్యాయి? ఇలాంటి ప్రశ్నలు రానే రాకూడదు. ఎందుకంటే సర్వశక్తి సంపన్నుడైన ఆ భగవంతుడిని శంకించడం మహాపచారం! అందుకని అసలు ఆ ఆలోచనే మనసులోకి రానియ్యరు; ఒకవేళ వచ్చినా వెంటనే లెంపలు వేసేసుకుంటారు. కరోనా ముందు నిలవలేక భూమిపైనున్న దేవుళ్లందరూ తమ తమ గుడుల తలుపులు మూసేసుకుంటుంటే ఏమిటీ వైపరీత్యమని జనంలోనుంచి ఓ ప్రశ్న పుట్టడంలేదు. కరోనా ఇప్పటికి సుమారు అరకోటి మంది పౌరులను తన పొట్టనబెట్టుకుంది. దాని బారినపడి కోట్లాది మంది ఆసుపత్రిపాలవుతున్నారు. అయినా సరే 'ఎలా జరిగేది అలా జరుగుతుంది', 'అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడు' అని సరిపెట్టేసుకుంటున్నారు. అంతేగాని తమకొచ్చిన కష్టం - ఎందుకొచ్చిందీ, ఏ కారణంగా వచ్చిందీ అని సహేతుకంగా ఆలోచించడానికి ఎంతమాత్రం ఉద్యుక్తులు కావడంలేదు. దేవుడి ఉనికిని కరోనా ప్రశ్నిస్తున్న వేళ కూడా వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నాలు చేయకపోవడం విచారకరం. మనిషిని హేతువాది అనంటారు. కానీ ప్రజలలో నూటికి తొంభై తొమ్మిదిమందికి ఈ 'హేతువాది' అన్న పదానికి అర్థం కూడా తెలియదు. హేతువాది అంటే దేవుణ్ణీ, మతాన్నీ వ్యతిరేకించే అభిమతం గలవాడని ఆధ్యాత్మికవాదులు అర్థం చెబుతారు. నిజానికి హేతువాది అంటే దేవుణ్ణి వ్యతికేరించేవాడనే అర్థం కానే కాదు. మనిషి కారణాన్ని పట్టుకుని ఆలోచిస్తాడు గనుక అతడిని హేతువాది అంటున్నాం. మనిషిలో హేతుత్వం జీవ లక్షణంగా ఉంది. మెదడులోని 'సెరిబ్రం' మానవుడి వివేకం, విచక్షణలకు కేంద్రం. హేతుబద్ధ మానవుడు ఈ సెరిబ్రం కారణంగానే సాధ్యమయ్యాడు. మనిషి హేతుబద్ధంగా తప్ప మరోవిధంగా ఆలోచించలేడు. మతవాదులు కూడా కార్యకారణబద్ధంగా తప్ప మరోవిధంగా ఆలోచన చేయలేరు. కాకపోతే వారు పిడుగుకు, బియ్యానికీ ఒకటే మంత్రం జపిస్తారు. ఇంటా బయటా తమ జీవితంలో చీమ చిటుక్కుమన్నా అన్నింటికీ ఆ 'దేవుడే' కారణమని చెప్పి అక్కడితో ఆగిపోతారు. అసలు కారణాలను వెతకరు. వారి పుణ్యమా అని ఈరోజున జనంలో అత్యధికులు వారి అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. స్వతహాగా హేతువాది అయిన మనిషి ఇంత అహేతుకంగా ఎలా ప్రవర్తించగలుగుతున్నాడు? అసలు అతడి ఆలోచన ఎక్కడ దారి తప్పింది?
ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కోవడానికి మనం మనిషి ఆదిమ దశకు వెళ్లిపోవాల్సిందే. లక్షల ఏండ్ల క్రితం అతడు పరిణామక్రమంలో భూమిపై వానరుడిగా అవతరించిన దశలో జంతు సమానుడుగా ఉండేవాడు. చుట్టూ భయపెట్టే ప్రకృతి! నిస్సహాయుడిగా ఉండేవాడు. అలాంటి పరిస్థితిలో తనని తాను ఎలా రక్షించుకోవాలి? అమితంగా భయపడ్డాడు. భయంనుంచి ఆలోచన పుట్టింది; సాగింది. మనుగడ సాగించాలి అంటే తనకు అర్థం కాని ప్రకృతిని గురించి తెలుసుకోవాలి. గుడ్డిగానయినా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఆలోచన అతనికి రక్షణ ఆయుధమయ్యింది. జీవన పోరాటంలో అతనిలో ఎన్నెన్నో ఆలోచనలు రేగాయి. అనంతంగా ప్రశ్నలు ఉదయించాయి. తన కాలి కిందున్న భూమేమిటి? నెత్తిన మండే సూర్యుడేమిటి? తనను ముంచే నీరేమిటి? కాల్చే నిప్పేమిటి? తన ఆవాసాన్ని కూల్చే ఈదురుగాలులేమిటి? ఈ ప్రకృతి బీభత్సమంతా ఏమిటి? కబళించే ప్రకృతి శక్తులు తననెలా కరుణిస్తాయి? అసలు వాటినెవరు సృష్టించారు? ఇలా అనంతంగా ప్రశ్నించుకున్నాడు. కారణాలు ఊహించు కున్నాడు. ఆ కారణాలకి కారణాలను ఊహించుకున్నాడు. ఈ కారణాలన్నింటికీ అసలు కారణాన్ని, ఆది కారణాన్ని, దైవాన్ని ఊహించాడు. మరి దైవానికి కారణమేంటి అని ప్రశ్నించుకున్నాడు; సమాధానం లేదు. ఇక అదే అంతిమం అనుకున్నాడు. కణం గురించి కూడా కనీస పరిజ్ఞానంలేని ఆ కాలంలో తనను భయపెట్టే శక్తులు అంతర్గత నియమాల ఆధారంగా ప్రవర్తిస్తాయని, బాహ్యంగా ఏ శక్తీ వాటిని నడిపించదని గ్రహించలేకపోయాడు. అలా మనిషి భయం నుంచి అజ్ఞానం నుంచి దైవభావన పుట్టింది. ఆ భావన చుట్టూ మతాలు గూడుకట్టుకున్నాయి. రానురాను కొంతమంది స్వార్థపరులు మూఢాచారాలతో ఆ మతాలకు ఎనలేని పవిత్రతను ఆపాదించారు. పోను పోను మనుషులు బతుకుమీద భయంతో, తీపితో ఆ మతాలకే బానిసలయ్యారు. ఆ మానసిక దౌర్బల్యాన్ని పురోహిత వర్గాలు స్థిరపరిచాయి. ఇక మత విశ్వాసిగా మనిషి తన చుట్టూ ఉన్న పరిసరాలను గురించి ఆలోచించడం మానేశాడు.
ప్రకృతి శక్తుల గురించి ఏమీ తెలియని అటవిక దశలో ఆదిమానవుడు అజ్ఞానంకొద్దీ విశ్వానికి కారణం వెలుపల వున్నదని భావించాడు. కానీ విశ్వం దాని అంతర్గత నియమాల ప్రకారమే నడుస్తున్నదని, దానికి బాహ్య కారణం లేదని, అది స్వయం కారణమని, దాని ఆవిర్భావానికీ, అస్తిత్వానికీ, పరిణితికీ కారణం అంతర్గతమే అని ఈనాటి ఆధునిక విజ్ఞానం రుజువు చేసింది. అయినా ఇంకా ప్రపంచాన్ని, తమ జీవితాలను బాహ్యంగా ఏవో శక్తులు నిర్దేశిస్తున్నాయని, తమని ప్రభావితం చేస్తున్న వాస్తవ అంశాలను వదిలిపెట్టి లేనిపోని ఆయా శక్తులనే ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అంతలా మనిషి ఆలోచనను అన్ని మతాలూ భ్రష్టు పట్టించాయి. ఇప్పుడు తాజాగా భూగోళాన్ని చుట్టుముట్టి లక్షలాది మందిని చంపుతున్న కరోనా వైరస్‌నే తీసుకుందాం... దాని పుట్టుకకు కారణం బాహ్యమా? అంతర్గతమా? నావెల్ కరోనా అనేది కొత్త వైరస్. ఒకానొక కరోనా జాతి వైరస్ నుంచి ఇది పరిణమించింది. పరిణామవాదాన్ని కాదనేవాళ్లు దీనినెలా సమర్థిస్తారు? కరోనా పరిణామవాదం సత్యమని నిరూపించింది. అంతర్గత కారణాలే కరోనా పుట్టుకకు కారణం; 'బాహ్య' శక్తి వల్ల అది పుట్టలేదు. కాబట్టి ఏ సంఘటనకైనా కారణం విశ్వాంతర్గతమే అని గుర్తించాలి.
మత గ్రంథాలు ప్రవచించిన విధంగా ప్రకృతి క్రమరహితమైనది కాదు; నియమరహితమైనదీ కాదు. ఏ మంత్రాలనూ అనుసరించి అది నడవడంలేదు. జీవ, నిర్జీవ ప్రకృతిలో క్రమం ఉంది. అది కొన్ని నియమాలను అనుసరించి నడుస్తోంది. ఆ క్రమబద్ధమైన ప్రకృతి నుంచి వచ్చాయి కాబట్టి నిర్మాణరీత్యా జీవులన్నీ క్రమబద్ధమైన నిర్మాణం కలిగివున్నాయి. కరోనా వైరస్ కూడా అటువంటి నిర్మాణం కలదే. దాని జన్యుఛత్రంలో ఉంటుంది అంతుచిక్కని రహస్యం. అదేమిటో చేధిస్తేగానీ దానికి విరుగుడు మందు కనుగొనలేరు. శతకోటి కుంకుమార్చనలు చేయడంద్వారా ఆ రహస్యాన్ని ఏ భక్తుడైనా ఛేదించగలడా? లేడు. హేతుబద్ధ ఆలోచన చేస్తూ జరిపే శాస్త్రీయ పరిశోధనలతోనే కరోనా గుట్టుమట్లను తెలుసుకుని మందు కనిపెట్టగలరు. అంతేతప్ప ప్రార్థనలతో కరోనాని నిర్మూలించేద్దా మంటే కుదిరే పని కాదు. ఎప్పుడైనా ఎక్కడైనా శాస్త్రం మాత్రమే మనిషికి మేలు చేయగలిగింది. ఇంతవరకు ఏ సమస్యనైనా దేవుడు తీర్చిన దాఖలాలు లేవు. సవాళ్ళను ఎదుర్కోవడానికి మానవ ప్రయత్నం ఎప్పుడూ కావలసివచ్చింది. వానరుడిగా ఉన్నప్పుడే కాదు, ఆధునిక మానవుడి ిగా ఉన్న నేటి దశలోనూ మానవ ప్రయత్నమే కావలసివస్తోంది. ఇంతవరకు దేవుడితో సమాధాన పడిపోకుండా ప్రకృతి నియమాలను అర్థం చేసుకున్న మానవుడే సమస్యలకు పరిష్కారాలను అందిస్తూ పోతున్నాడని తెలుసుకోవాలి.
-వెంకటమణి ఈశ్వర్