Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పీఎం మోడీజీ...!
మీపై విశ్వాసానికి ప్రతిఫలం-మా శ్వాస ఆపేయడం!
మోడీజీ..మా ఆయుష్షు జుర్రుకొని సదా జీవించండి!
పక్కింటి వారికో, పొరుగు వీధి వాళ్లకో ఆపదొస్తేనే ముద్ద దిగదు, నిద్ర పట్టదు. బాధితుల క్షేమానికి మనవంతుగా ఏమి చేయొచ్చో ఆలోచించి, అది చేసేదాకా ఓ పట్టాన స్థిమితపడం. ఇదీ మన డీఎన్ఏ. మరి, మన దేశానికి దేశమే అగాధంలో కూరుకుపోతుంటే..మీకు నిదురెలా పడుతుందో? కరోనా వలయంలో జనం అల్లాడిపోతుంటే మీకు భోజనం ఎలా సహిస్తుందో!
కనీసం ఈ విపత్కర పరిస్థితుల్లోనైనా వైద్యాన్ని జాతీయం చేయాల్సింది కాదా? హద్దుల్లేని నిర్వేదం మిగిల్చి, అంతే లేని అపకారం చేశామన్న అపరాధ వేదన మీలో రేగకపోవడం మీ అమానవీయతకు తార్కాణం కాబోదా? కడపటి ఏడాదిలో అసలు వైరస్ దిగుమతి కాకుండా పసిగట్టి, జాగ్రత్త పడడంలోనే విఫలమయ్యారు. ఇప్పుడు మలి తరంగం (సెకండ్ వేవ్)ప్రజల మీద దండయాత్ర చేయబోతుందని తెలిసీ, తోలుమందంతో ఎట్లా ఉండగలిగారు? ఓట్లు, సీట్లు, ఎన్నికలు, అధికారం పిచ్చిలోనే ఎలా విహరించగలిగారు? ఎంతసేపూ మీరూ, మీ కోటరీ సమూహాలైన అంబానీ, అదానీ బాపతులు చల్లగా ఉంటే చాలా? దేశమంటే మట్టి కాదోరు దేశమంటే మనుషులోరు అని ఏనాడో ధ్వనించింది మా తెలుగు నేల. ఇండియాను వరుసగా రెండో పర్యాయం పాలిస్తోన్న మీలో ఆ సోయి గల్లంతైంది యధార్థం కాదా? లక్షల్లో న్రపజలు ప్రాణాలు కోల్పోతుంటే పాలకులుగా మీరు నేరస్తులు కారా? మీపై అచంచల విశ్వాసంతో బీజేపీ నేతత్వంలోని మీ ఎన్డీఏ సర్కారును రెన్యువల్ చేసిన దేశ ప్రజల శ్వాసనే ఆపేయడం మీకు న్యాయమేనా? మీరు గ్రేట్ మోడీజీ, మీరు గ్రేట్. మా ఆయుష్షు జుర్రుకొని సదా జీవించండి, మీరు మీ కార్పొరేట్ సోపతిగాళ్లు. దిన దిన గండం నుంచి క్షణ క్షణ గండానికి పడిపోయింది మా బతుకు. టీకా వేసుకోవాలనీ పదే పదే సుద్దులు వల్లించిన మీరు, ఇపుడా టీకానే దొరక్కుండా చేయడంలో ఏ మతలబు దాగి ఉంది? ఎవరికైనా ఎంతటి ధనదాహం ఉంటే మాత్రం యావత్ దేశాన్నే కబళించడం, సుడిగండంలోకి నెట్టడానికి మించిన ద్రోహం ఏముంటుంది సార్?
ఇదివరకే జరుగకూడని నష్టం, కష్టం విలయతాండవం చేస్తున్నాయి. ఇప్పటికైనా వైరస్ ఉనికిని తుంచేయండి. దాని బారిన పడిన ప్రజలకు న్యాయమైన సేవలూ, నాణ్యతగల చికిత్సలూ అందించండి. ప్రాణ, వ్యక్తిగత సంపదలకు నెలకొన్న హానికి తెరదించండి. వెంటనే వైద్యం, విద్యలను ఉచితం చేసి, దేశ ప్రజల అనుభవంలోకి తీసుకురండి. లేదూ, కూడదూ, మాకు అంబానీ, అదానీ టైపులే కావాలనుకుంటే సత్వరం సీటు దిగండి. భజనపరులారా! ఇకనైనా మీలో నిద్రాణమైన సున్నితత్వాన్ని తట్టిలేపండి. వ్యక్తి ఆరాధన.. వ్యవస్థకు ఎంతటి అపాయమో గ్రహించండి. మీదాకా విపత్తు రాకముందే, మీరు ఏ సోషల్ నెట్వర్కింగ్తో గద్దెనెక్కించారో, దాని ద్వారా కూడా మోడీజీని మేలుకొల్పండి!
- ఇల్లెందుల దుర్గాప్రసాద్
సెల్: 9440850384