Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతదేశ మానవాళి కోవిడ్-19 నిప్పుల కొలిమిలో సలసల మరుగుతోంది. రెండవ అల సునామీకి జనం పిట్టల్లా రాలుతున్నారు. నేటికి దేశంలో కోవిడ్-19 కేసులు 2 కోట్లు దాటి వేగంగా పెరుగుతున్నాయి. రోజుకు సగటున 3.78 లక్షల కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా మరణాల సంఖ్య 2.22 లక్షలు దాటింది. రోజుకు 3 - 4 వేల మరణాలు జరుగుతూ హదయాలను ద్రవింపజేస్తున్నాయి. ఈ ఉదతి ఎంత కాలం ఉంటుందో తెలియక, మరణం ఏ వైపు నుంచి దాడి చేస్తుందో అర్థం కాక, సామాన్యులు సహితం ఊపిరి పీల్చడానికి భయ పడుతున్నారు. మహమ్మారి మాయదారి దుచ్ఛేష్టలకు చరమగీతం పాడటానికి జనం ఆతతతో ఎదురు చూస్తున్నారు. ఆసుపత్రులు రోగులతో, శ్మశానాలు శవాల కుప్పలతో, టీకా కేంద్రాలు చాంతాడంత క్యూలతో భయానక వాతావరణం నెలకొంది. ప్రాణాలు పోసే ప్రాణవాయువు కోరతతో శ్వాసలు ఆగుతున్నాయి. తొలి అలను అవలీలగా దాటామని, మలి అల మమ్మల్ని ఏమీ చేయలేదని భావించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. మలి అల సంక్షోభానికి కారణం కరోనా వేరియంట్‌దా, ప్రజలదా లేదా ప్రభుత్వాలదా? లాక్డౌన్లు పరిష్కారం కాదని, ఆర్థికంగా చితికి పోతామని మీనమేషాలు లెక్కిస్తున్న పాలకులే ఈ మారణహౌమానికి కారణమని గట్టిగా నమ్మేవారు లేకపోలేదు. బతికుంటే బలుసాకైన తినవచ్చని, ప్రాణం ఉంటేనే ప్రగతి అని అరుస్తున్నారు. జనం లేని ఆర్థికాభివద్ధికి అర్థం లేదనే చిన్న విషయాన్ని విస్మరించింది నేటి 'సుపరిపాలన'. జనాభాలో సగానికి పైగా వ్యాధినిరోధకతను పొందారని, భయపడాల్సిన పని లేదని పాలకులు ధైర్యం నూరి పోశారు. పాలకుల అంచనాలు, విశ్వాసాలు రెండవ అల సునామీలో పత్తాలేకుండా కొట్టుకు పోతున్నాయి. తొలి కరోనా అలను నియంత్రించామని చెప్పుకున్న వారందరూ మలి అల మహా విపత్తు సష్టిస్తున్న సంక్షోభానికి బాధ్యత తీసుకోవలసిందే.
జనవరి-2021లో ఐసియంఆర్ నిర్వహించిన సర్వే ప్రకారం 21 శాతం జనులు మాత్రమే కరోనా వైరస్ వ్యతిరేక ఆంటీబాడీలను కలిగి ఇమ్యూనిటీ పొందారని తేలింది. శాస్త్రసాంకేతిక నిపుణులు ఫిబ్రవరి-2021లో రెండవ వేవ్ తీవ్రంగా రానుందన్న హెచ్చరికలు ప్రభుత్వాలు పట్టించుకోలేదు సరకదా ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలు, కుంభమేళ ఉత్సవాలు కార్చిచ్చులా కరోనా వ్యాప్తి అగ్నికి ఆజ్యం పోసినట్లు అయ్యిందని ఆలస్యంగానైనా గుర్తిస్తే మంచిది. రెండవ అల హెచ్చరికలను తీవ్రంగా తీసుకొని ఎన్నికలకు తాత్కాలిక బ్రేకులు వేసి, జన సమూహాలను నివారించి, ఉత్సవాలకు అనుమతులను నిరాకరించి, వైద్య వసతులను పటిష్ట పరిచి, ఆక్సీజన్ ఉత్పత్తి సామర్థ్యాలను పెంచి, వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసేలా బహుముఖీన కట్టడి చర్యలు తీసుకోవలసిందని పౌరులు అభిప్రాయ పడుతున్నారు. టీకాల కోరత కారణంగా నేటికి 2 శాతం జనాభా మాత్రమే టీకాల రక్షణ పొందారు. యూపీ, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల పరిస్థితులు పెనెం లోంచి పొయ్యిలో పడినంత దుస్థితికి చేరాయి. నిపుణులు ఊహించినట్లుగానే విపత్తును తట్టుకోలేక చేతులు ఎత్తేసే దయనీయ స్థితికి చేరాయి. కేరళ, ఒడిసా లాంటి రాష్ట్రాలు రెండవ అలను తట్టుకోవడంలో కొంత వరకు సఫలం అయ్యాయని తెలుస్తున్నది. సత్వరమే టీకాల సరఫరాను మెరుగు పరిచి వీలైనంత వేగంగా రాబోయే 3 మాసాల్లో టీకాలను 18 ఏండ్లు దాటిన వారందరికీ ఇవ్వాల్సిన బాధ్యత పాలకులది. దీనికి 200 కోట్ల టీకా డోసులు సిద్ధం చేసుకోవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని అంగీకరించక తప్పదు. ముందు జాగ్రత్త పడకుండా 6.6 కోట్ల టీకా డోసులను ఇతర దేశాలకు అందించడం ప్రస్తుత పరిస్థితికి కొంత కారణమని చెప్పవచ్చు. టీకా ఉద్యమాన్ని 80 కోట్ల గ్రామీణ నిరుపేద భారతానికి ఇవ్వటానికి తగు యంత్రాంగాన్ని సమాయత్తం చేయుటకు నడుం బిగించాలి. నేడు ఇజ్రాయిల్, యూకె, యూఏఈ, యూయస్ఏ దేశాల్లో కేసులు మరియు మరణాలు పూర్తిగా తగ్గడానికి అందరికీ టీకా కార్యక్రమ విజయమేనని వింటున్నాం.
రెండవ అల వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి ప్రజల్లో అవగాహన కల్పించడం, కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం అవసరం. రాష్ట్రాలు రోజువారీ కరోనా కేసులు మరియు మరణాల వివరాలను తక్కువగా చూపడం, తేలికగా తీసుకోవడం కూడా వైరస్ వ్యాప్తిని పెంచుతున్నది. కరోనా వైరస్ జీనోమ్ సీక్వెన్సింగ్ పరిశోధనలు వేగిర పరిచి, లోతైన శోధనలు చేసి, వేరియంట్ల వ్యాప్తిని కట్టడి చేయుట వెంటనే జరగాలి. స్థానిక ప్రభుత్వ యంత్రాంగాలు కళ్ళు తెరిచి మాస్కుల వాడకం, సామాజిక దూరాలను పాటించేలా చూడడం, సమావేశాలను నిషేధించడం, స్వీయ- క్వారంటైన్ కావడం, పరీక్షలు చేయించుకోవడం, టీకాలు వేయించు కోవడం లాంటి కనీస అంశాల అమలు జరిగేలా చూడాలి. పలు సంస్థల అంచనాల ప్రకారం ఇండియాలో ఆగష్టు-2021 వరకు ఒక మిలియన్ కోవిడ్-19 మరణాలు జరుగవచ్చని తేల్చారు. ఇదే జరిగితే పూర్తి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే తీసుకోవలసి ఉంటుంది. ప్రభుత్వం ఏప్రిల్-2021లో ఏర్పాటు చేసిన కోవిడ్-19 టాస్క్‌ఫోర్స్ కమిటీ నేటి వరకు సమావేశం కాకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ప్రస్తుత కోవిడ్-19 సంక్షోభ సమయంలో ప్రభుత్వాలు ఇప్పటికైనా బాధ్యతాయుతంగా నిర్ణయాలు తీసుకొని, పొరపాట్ల నుంచి గుణపాఠాలు నేర్చుకొని, ప్రజారోగ్యానికి పట్టం కట్టాలి. పొరపాటును పొరపాటని అంగీకరించక పోవడమే మహా పొరపాటని, పర్యవసానంగా జరుగబోయే విరత్తులో భారీమూల్యం చెల్లించక తప్పదని మరువరాదు.
- డాక్టర్ బుర్ర మధుసూదన్‌రెడ్డి
సెల్: 9949700037