Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతదేశం స్వాతంత్య్ర వజ్రోత్సవాలు జరుపుకుంటున్న వేళ జాతిని జాగృత పరిచిన వారి త్యాగాల స్ఫూర్తి, త్యాగ నిరతి, నిస్వార్థ కృషి, వారి లక్ష్యాలు, ఆశలు, ఆశయాల నుంచి నేటి తరంవారు స్ఫూర్తిని పొందాల్సి ఉంది. దేశభక్తుడు, కమ్యూనిష్టు నాయకుడు, నిష్కళంక స్వాతంత్య్ర సమరయోధుడు, శ్రమజీవుల ఉద్యమాల నేతగా, మార్కిస్టుపార్టీ నిర్మాణకర్తగా, తెలంగాణ పోరాట సారథిగా, మానవతావాదిగా పేరొందిన అసాధారణ వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య. అసలు పేరు పుచ్చలపల్లి వెంకట సుందర రామిరెడ్డి. కుల గొప్పలు తప్పని నమ్మి ఆనాడే తన పేరును సుందరయ్యగా మార్చుకున్నాడు. మే 1న 1913లో నెల్లూరుజిల్లా, కోవూరు తాలూకా అలగానిపాడు గ్రామంలో వెంకటరామిరెడ్డి శేషమ్మ దంపతులకు జన్మించాడు. చారిత్రాత్మక చైతన్యం మేడే లాగే.. ఆయన తన జీవితం కూడా ఓ చారిత్రక చైతన్యమే!
సుందరయ్య విద్యార్థి దశనుంచే హేతువాద, సేవాదృక్పథంతో భూస్వామ్య భావజాలాన్ని వ్యతిరేకించాడు. తన ఆస్తిని పేదలకు పంచాడు. తాను 10వ తరగతి చదువుతున్నప్పుడే సైమన్ కమిషన్ బహిష్కరణ ఉద్యమంలో పాల్గొన్నాడు. హరిజనులను అంటరాని వాళ్ళుగా చూడటం వ్యతిరేకించాడు. వారితోనే కలిసి సహపంక్తి భోజనం వారిగ్రామంలోనే ఏర్పాడు చేశాడు. తన జీవితంలో ఎప్పుడు అబద్ధం చెప్పేవాడు కాదు. నిజాన్ని నిర్భయంగా చెప్పేవాడు.
ఉప్పు సత్యాగ్రహంలో 1930లో, తన 18ఏండ్ల వయస్సులోపే పాల్గొని అరెస్టయ్యాడు. అందుకు అతన్ని తంజావూరులోని బోర్టల్ స్కూల్కు పంపారు. జైల్లో కూడా కుల, ప్రాంతీయ, వివక్షలపై పోరాటం చేశాడు. 1931 మార్చిలో జైలు నుంచి విడుదల చేశారు. ఆ తర్వాత బెంగుళూరు వెళ్ళి ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. క్రమేపి మార్క్సిస్టు సిద్ధాంత అధ్యయనంతో కమ్యూనిస్టుగా మారాడు. సుందరయ్య నిరాడంబరత, నిజాయితి, త్యాగశీలత అటు జాతీయోద్యమంలోనూ, ఇటు కమ్యూనిస్టు ఉద్యమంలోనూ ఒక కొత్త ఒరవడికి నాంది పలికినాయి.
సుందరయ్య సంకల్పం స్వచ్ఛమైనది, నిష్కళంకమైనది, నిస్వార్థమైనది, నిరహంకారమైనది. అలుపెరగని పోరాట జీవితాన్ని ఎంచుకున్నాడు. సరైన సమయంలో ''సమర్థ ప్రగతిశీల నిర్ణయ సామర్థ్యం'' అతనిలో ఎక్కువగా ఉండేది. అలా తనకు సంతానం కలిగితే స్వార్థం పెరిగి ప్రజాసేవకు అడ్డురావచ్చనే ఉద్దేశ్యంతో భార్య అంగీకారంతో ఆనాడే సంతాన నిరోధక శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. మహిళలు, పేద, బడుగు, బలహీన వర్గాల తాడిత, పీడిత వర్గాల అభివృద్ధి కోసం పరితపిస్తూ సాధారణ జీవితాన్ని గడిపి నిస్వార్థ ప్రజానాయకుడిగా పేరుపొందాడు. భూమి, భుక్తి, విముక్తి కోసం 1948 నుంచి 1952 వరకు జరిగిన తెలంగాణ సాయుధ పోరాటం నడిపిన నాయకుల్లో ఆయన ముఖ్యుడు. భయపడుతూ కూర్చుంటే బతకలేమని పోరుబాట పట్టేలా ప్రజలను ముందుకు నడిపిస్తూ వారిని భాగస్వాములను చేశాడు.
1952లో మద్రాసు నియోజక వర్గం నుంచి రాజ్యసభకు ఎన్నికై పార్లమెంట్లో భారత కమ్యూనిస్టు పక్షం నాయకుడైనాడు. 1955లో ఆంధ్రా అసెంబ్లీకి శాసనసభ్యుడుగా ఎన్నికైనాడు. శాసనసభలోనూ భారత కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా వ్యవహరించాడు. 1964 నుంచి 1976 వరకు మార్కిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు. సుందరయ్య రాసిన మూడు పుస్తకాలు ఆయన అధ్యయనానికి, సామాజిక స్పృహకు, మానవీయతకు నిదర్శనం. 1. ''విశాలాంధ్రలో ప్రజారాజ్యం'' దేశమంతటా భాషా ప్రయుక్త రాష్ట్రాల ఉద్యమానికి దారితీసింది. 2. ''ఆంధ్రప్రదేశ్ సమగ్ర నీటి పథకం'' దేశంలోని అన్ని ప్రాంతాల్లో నదీ జాలాల పంపిణీకి పరిష్కారమార్గం చూపింది. 3. ''వీర తెలంగాణ విప్లవ పోరాటం, గుణ పాఠాలు'' భావి పోరాటాలకు మార్గదర్శకం చేస్తోంది. ఆ తర్వాత కమ్యూనిస్టు పత్రికలు ''నవశక్తి'', ''ప్రజాశక్తి'' పత్రికల స్థాపనకు విశేష కృషిచేశారు. తను బతికిఉండగానే, ప్రజానాయకుడుగా, చారిత్రక వ్యక్తిగా, శక్తిగా పేరును పొందాడు. భావోద్వేగాలను రెచ్చగొట్టి కుల, మత, ప్రాంత విద్వేషాలు రెచ్చగొట్టే నేటి పాలకుల కాలంలో ప్రజలు సుందరయ్య నుంచి స్ఫూర్తి పొందాలి.
భారతదేశ రాజకీయాల్లో కమ్యూనిస్టుల ప్రాతినిథ్యం తగ్గడం వలన ప్రజా ప్రయోజనాలకు భంగం వాటిల్లుతున్నది. నేడు పాలకులు ప్రపంచ మార్కెట్లోని కార్పొరేట్ శక్తులకు దేశంలోని అన్ని రంగాల అమ్మకానికీ చట్టబద్ధంగా గేట్లు తెరిచారు. కర్షకులు, కార్మికులు, తాడిత, పీడిత, వర్గాల ప్రయోజనాల కోసం ప్రశ్నించేవారే కరువైనారు. పార్లంమెంట్ ముందు రైతుల పోరాటాన్ని ప్రభుత్వం పట్టించుకోకుండా ఉంటే పార్టీలు, ప్రతిపక్షాలు, మీడియా చోద్యం చూస్తున్నారు. ఈ సమయంలో సుందరయ్య మనకు స్ఫూర్తి కావాలి. ఆయన మార్గమే మనకు కర్తవ్యం కావాలి.
- మెకిరి దామోదర్
సెల్:9573666650