Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆయనొక విప్లవ కార్యదీక్షా పరుడు. తన చైతన్య స్ఫూర్తితో లక్షలాది మందిని ఉత్తేజ పరిచిన నాయకుడు. వ్యక్తి నిర్మాణం కంటే సమాజ నిర్మాణమే ముఖ్యమని చాటిన నేత. సంపన్న కుటుంబంలో పుట్టినప్పటికీ పేదలకోసం పాటుపడిన మహౌన్నత వ్యక్తి. శ్రమజీవుల వైతాళికుడు... మార్కిస్టు మేధావి... కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత.. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య.
సుందరయ్య నెల్లూరు జిల్లా అలగానిపాడులో ఓ భూస్వామ్య కుటుంబంలో 1913 మే1న జన్మించాడు. తల్లి శేషమ్మ, తండ్రి వెంకట్రామిరెడ్డి. తల్లి దండ్రులకు వారంతా ఏడుగురు సంతానం. సుందరయ్య కుటుంబానికి గ్రామంలో భూమి, పలుకుబడి ఎక్కువే. ఆరేండ్ల వయసులో తండ్రి చనిపోయాడు. అప్పటినుంచి ఇంటికి పెద్ద వారైన అన్నలు, అక్కలే ఇంటి బాధ్యతలు చూస్తూ వచ్చారు. సుందరయ్య మొదట్లో గ్రామంలోని పంచాయతీ పాఠశాలలో చేరాడు. ఆ బడిలోకి వ్యవసాయ దారుల పిల్లలు, చేనేతల పిల్లలు మాత్రమే వెళ్లేవారు. దళితులకు ప్రవేశం నిషిద్ధం. ఇది ఆయనకు నచ్చేదికాదు. బాల్యం నుంచే పోరాట శైలి అలవర్చుకున్నాడు. తన కండ్ల ముందు ఏ అన్యాయం జరిగినా సహించేవాడు కాదు. కొన్ని కులాల వాళ్లను తక్కువగా చూడటం, చులకనగా మాట్లాడటం, అంటరానితనం, సామాజిక అసమానతలు సరికాదని చెప్పేవాడు. దళితులను ఇంట్లోకి ఎందుకు రానివ్వరని అమ్మతో తగదా పడేవాడు. వ్యవసాయ కార్మికులకు రావాల్సిన కూలి విషయంలో మోసం ఉందని గొడవపడేవాడు. దళితుల పేర్ల చివర 'వాడు' అని ఎవరైనా అంటే వాగ్వాదానికి దిగేవాడు. 1930లో తన సొంత గ్రామంలో భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా తిరగబడ్డాడు. భూమిలేని పేదలకు భూమిని పంచాలని, కూలీ రేట్లు పెంచాలని పట్టుపట్టాడు. సమానత్వం కోసం జరిగిన ఈ పోరాటంలో ఆయన దళితులతో, వెనుకబడిన కులాలతో కలిసి పోరాడాడు. అప్పుడే కులానికి చిహ్నమైన తన పేరులో నుంచి సుందరరామి'రెడ్డి'ని తొలగించుకుని సుందరయ్యగా మార్చుకున్నాడు.
కమ్యూనిజం వైపు అడుగులు...
సుందరయ్య ప్రాథమిక విద్య తమిళనాడులోని తిరువూరు ఆ తర్వాత రాజమండ్రి, ఏలూరు పట్టణాల్లో కొనసాగింది. చరిత్ర పుస్తకాలపై సుందరయ్యకు పాఠానాసక్తి ఎక్కువ. రాజమండ్రిలో 1924-26 మధ్య అక్కడ చదువుతున్న క్రమంలో రోజూ గ్రంథాలయానికి వెళ్లేవాడు. కందుకూరి వీరేశలింగం, చిలకమర్తి లక్ష్మీ నరసింహం, పానుగంటి లక్ష్మీ నరసింహం వంటి సంఘ సంస్కర్తల గురించి తెలుసుకున్నాడు. వారు రాసిన పుస్తకాలు చదివాడు.1926లో రాజమండ్రిలో రెండేండ్లు ఉన్న తర్వాత తమ్ముడు రామ్‌తో కలిసి మద్రాసుకు వచ్చాడు. మద్రాసుకు చేరేనాటికి ఆయన వయస్సు13ఏండ్లు. అప్పటికీ వ్యక్తిగత జీవితంలోనూ, రాజకీయంగానూ తగినంత అనుభవం సంపాదించుకున్నాడు. 1928 ఫిబ్రవరిలో 'సైమన్ కమిషన'్ బహిష్కరణకు దేశవ్యాపితంగా ఇచ్చిన పిలుపునందుకుని ఉద్యమంలో తొలిసారిగా పాల్గొన్నాడు. తర్వాత లయోల కాలేజీలో చేరిన సుందరయ్య, అదే కాలేజీలోకి వచ్చిన బొంబాయి యువజన సంఘం ప్రతినిధి హెచ్డి రాజా కలుసుకున్నారు. ఆయనే సుందరయ్య బృందానికి 'కమ్యూనిస్టు ప్రణాళిక'ను పరిచయం చేశాడు. సుందరయ్యను కమ్యూనిస్టు ప్రణాళిక ఎంతగానో ప్రభావితం చేసింది. దాన్ని చదివాక కమ్యూనిజమే సరైన రాజకీయ దృక్పథం అని నిర్ణయించు కున్నాడు.1931లో బెంగుళూర్లో ఉన్నప్పుడు కమ్యూనిస్టు నేత హైదర్ అలీఖాన్ ఆహ్వానం మేరకు పార్టీలో చేరి దక్షిణ భారతదేశం బాధ్యతలు చూశాడు.
వీర తెలంగాణ
సాయుధ పోరాట ఘట్టం...
సుందరయ్య ప్రత్యక్షంగా పాల్గొన్న అతి ముఖ్యమైన పోరాట ఘట్టం... విరోచిత సాయుధ తెలంగాణ పోరాటం. రజాకార్ల అమానుషం, భూస్వాముల ఆకృత్యాలు, దేశ్‌ముఖ్‌ల వేధింపులతో విసిగిపోయిన పల్లె ప్రజలు కమ్యూనిస్టులతో కలిసి సాయుధ పోరాటం చేశారు. వరంగల్ జిల్లా కడివెండిలో విసునూరు రాంచంద్రారెడ్డికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో దొడ్డి కొమురయ్య తొలి అమరుడయ్యాడు. ఈ క్రమంలో ఊపందుకున్న ఉద్యమం 10వేల మంది గ్రామ మిలిటరీ సభ్యులు, 2వేల మంది సాధారణ గెరిల్లాలు నైజాం సర్కార్‌పై తిరుగుబాటు చేశారు. 1946 నుంచి 1952వరకు సాగిన ఈ మహాత్తర పోరాటంలో 4వేల మంది కమ్యూనిస్టులు వీరమరణం పొందారు. 10వేల కార్యకర్తలు జైలు పాలయ్యారు. 50వేల మంది పోలీసు క్యాంపుల్లో నిర్భందించబడ్డారు. 10లక్షల ఎకరాల పేదలకు కమ్యూనిస్టులు పంపిణీ చేశారు. ఈ చారిత్రక పోరాటానికి సారథ్యం వహించిన నేత సుందరయ్య.
శాసన సభ్యుడైనా సైకిల్‌పైనే...
తెలంగాణలో విరోచిత తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత కమ్యూనిస్టులు బల పడ్డారు. అప్పటికి తెలంగాణ కమిటీకి సుందరయ్యే నాయకత్వం వహిస్తున్నారు. 1952లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ మీద వంద సీట్లలో పోటీ చేసి 45 సీట్లు గెలుచుకున్నారు. ఆంధ్రా నుంచి 18 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుని ప్రధాన ప్రతిపక్షంగా నిలిచారు. ఈ ఎన్నికలు హైదరాబాద్, మద్రాసు రాష్ట్రాల్లో కమ్యూనిస్టు పార్టీకి మంచి ఫలితాలు తెచ్చాయి. ఆ కాలంలోనే సుందరయ్య రాజ్యసభకు ఎన్నికయ్యారు. ప్రతిపక్షనేతగా 1955వరకు మూడేండ్లపాటు సమర్థవంతమైన బాధ్యతలు నిర్వహించారు. ఆ కాలంలోనే మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. ఎమ్మెల్యేగా ఎన్నికైన సుందరయ్య 1964వరకు శాసనసభలోనూ ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. కమ్యూనిస్టుల బలం పెరిగినందున సుం దరయ్య ముఖ్యమంత్రి అవుతారని అందరూ అనుకున్నారు. కానీ అన్ని పార్టీలు కాంగ్రెస్ గూటిన చేరి ఎన్నడూ లేనంత విషాన్ని కమ్యూనిస్టులపై కక్కాయి. 1978 నుంచి 1983 వరకు కూడా ఆయన ఎమ్మెల్యేగా సేవ లందించారు. శాసనసభకు, పార్లమెంట్‌కు ఆయన సైకిల్‌పైనే వెళ్లేవారు. ప్రతిరోజూ సరైన సమయానికి చేరుకునేవారు. పార్లమెంట్లో ప్రసంగాలను అందరూ శ్రద్ధగా వినేవారు. సైకిల్‌పైనే తిరుగుతూ పనులన్నింటినీ సకాలంలో పూర్తిచేయడం అందరినీ ఆశ్చర్యపరిచేది. 20 ఏండ్లు ఎమ్మెల్యేగా ఉన్నా సాధారణ జీవితం ఎలా గడపచ్చో సుందరయ్య ఒక చక్కని ఉదాహరణగా నిలిచారు.
తుదిశ్వాస వరకు సీపీఐ(ఎం)లోనే...
1943లో మహారాష్ట్రకు చెందిన లీలాను సుందరయ్య ఆదర్శ వివాహం చేసుకున్నారు. బిడ్డల్ని కంటే ప్రజా సేవకు ఎక్కడ అడ్డమవుతుందోనని సహచరితో చర్చించి వెస్టెకమీ ఆపరేషన్ చేసుకున్నారు. నిబద్ధత గల కమ్యూనిస్టుగా, జీవితమంతా కచ్చితమైన క్రమశిక్షణ, సిద్ధాంత విలువలు పాటించిన నాయకుడు సుందరయ్య. 1985 మే 19న మద్రాసులోని ఓ ఆసుపత్రిలో అనారోగ్యంతో కన్నుమూశారు. 'మన పుట్టుక సాధారణమే అయినా.. మన మరణం ఒక చరిత్ర కావాలి' అనడానికి సుందరయ్య జీవితం నిలువెత్తు నిదర్శనం. ఆయన మార్గం నేటితరానికి అనుసరణీయం...
-ఎన్. అజరుకుమార్
సెల్: 9490099140