Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన కాలం మహామనిషి, అచంచల దేశభక్తుడు, స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ సాయుధ పోరాట సారథి, ఈ దేశ తొలి ప్రతిపక్షనేత, తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత.. మార్క్సిస్టు మహారుషి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య. 1 మే 1913లో పుట్టి, 1985 మే 19న అమరుడైన సుందరయ్య తన 72 సంవత్సరాల జీవితంలో 60ఏండ్లు ప్రజా ఉద్యమాలకే ధారపోశారు. తన యావదాస్తి పేదలకు పంచి, స్వార్థరహిత జీవనంకై కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకొని, కులాంతర, మతాంతర ఆదర్శ వివాహం చేసుకున్న మహామనిషి సుందరయ్య.
ఈ ప్రపంచంలో గొప్ప కమ్యూనిస్టుల జాబితా తయారుచేస్తే అందులో మొదటి పదిమందిలో సుందరయ్య ఉంటారు. ఆయన ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమ యోధుడు. దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత. ప్రారంభం నుంచి కనుమూసేదాకా ఆయన కేంద్ర కమిటీ (కమ్యూనిస్ట్ పార్టీ) సభ్యులు. పొలిట్‌బ్యూరో సభ్యులు. కమ్యూనిస్టు గాంధీగా ఆయన్ని అందరూ గౌరవించేవారు. పి.ఎస్.గా పార్టీశ్రేణులు పిలుచు కునేవారు. బెంగాల్, త్రిపుర, కేరళ రాష్ట్రాల్లో సీపీఐ(ఎం) ప్రభుత్వాల ఏర్పాటులోను, పార్లమెంట్ ఉభయ సభల్లో పార్టీని ప్రతిపక్ష స్థానంలో నిలబెట్టడంలోనూ ఆయన కృషి వెలకట్టలేనిది. ఆయన జరిపిన సైద్ధాంతిక పోరాటం, సీపీఐ(ఎం) ఏర్పాటు చేయడంలో ఆయన కృషి కార్యకర్తలందరికీ ఒక పాఠ్యాంశమే.
30ఏండ్ల వయస్సులో ఒక చక్కటి విజన్‌తో ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి ప్రాజెక్టుల నిర్మాణాలకోసం ఆయన రాసిన గ్రంథాలు నేటికీ మార్గదర్శకాలు. నైజాంకు వ్యతిరేకంగా 1946లో ప్రారంభమైన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట సారధిగా ఆయనపాత్ర విస్మరించలేనిది. నిAతీఎవస ర్తీబస్త్రస్త్రశ్రీవర aఅస ూవరరఱశీఅరు అనే గ్రంథం రాసారు. ప్రజాశక్తి 1942లో ప్రజాశక్తి స్థాపనలో కీలక పాత్ర పోషించారు. బ్రిటిష్ పాలనాకాలంలో మద్రాసుశాసనసభలో ప్రజా ప్రతినిధిగా అడుగుపెట్టిన సుందరయ్య 1982 దాకా అనేసార్లు చట్టసభల్లో పనిచేసారు. రాజాజీ, సంజీవరెడ్డి, గోపాల్‌రెడ్డి, చెన్నారెడ్డి లాంటి సీఎంల అందరి పాలనలో పార్టీనేతగా పనిచేసారు. అసెంబ్లీలో, పార్లమెంట్లో పూర్తి వివరాలు, ఆధారాలతో మాట్లాడి అధికార పక్షంసైతం అర్థం చేసుకొని గౌరవించేలా విశిష్ట వ్యక్తిత్వంతో పనిచేసారు. ఖైదులో మగ్గుతున్న చివరి తెలంగాణ పోరాట యోధున్ని సైతం విడుదల చేయమని నాటి నీలం సంజీవరెడ్డితో పోరాడిన వ్యక్తిత్వం సుందరయ్యది. నేటి అమరవీరుల స్థూపం వద్ద నాటి ధర్నా చౌక్ ఉండేది. వర్షంలో సైతం కార్మికుల పక్షాన పోరాటం చేస్తున్న సుందరయ్యను సాక్షాత్తూ ముఖ్యమంత్రి సంజీవరెడ్డి గొడుగుతీసుకొని వచ్చి అసెంబ్లీలోకి తోడ్కొని వెళ్ళారట! ఒకసారి ఇందిరాగాంధీని కలుసుకోదలచి విజిటింగ్ కార్డు పంపారట పీఎస్. ఆమె ఛాంబర్ నుంచి బైటికి వచ్చి వేచిఉన్న సుందరయ్య దగ్గరకొచ్చి ''వారికి ఎప్పుడు వీలుంటే అప్పుడు రమ్మనండి అనుమతి కోసం వేచి చూడకండి'' అందిట ఇందిరాగాంధీ. ఇలా ఎన్నెన్నో ఘటనలు.. సంఘటనలు.. పోరాట చరిత్రలు చెప్పుకోవచ్చు. పార్టీ కార్యకర్తల్ని గుర్తుపెట్టుకోవడం, నిక్కచ్చిగా (సైద్ధాంతిక చర్చలో) మాట్లాడటం.. తన భావాలతో ఏకీభవించని ఇతర పార్టీలవారినీ గౌరవించడం.. వ్యక్తి ఆరాధనను వ్యతిరేకించడం.. కమ్యూనిస్టు పార్టీని దేశం అంతా విస్తరింపజేయడంలో ఆయన కృషి అమోఘం.
ఒకసారి పార్టీ ఆఫీసులో తన కార్యాలయంలో కారుడ్రైవర్‌తో అతని కుటుంబ విషయాలు, ఉద్యోగంలోని సాధక బాధకాలు పిఎస్గారు వింటున్న తరుణంలో ఓ పారిశ్రామిక వేత్త గది డోర్ తీసుకొని లోపలికి రాగా ''నేను మా కామ్రేడ్స్‌తో మాట్లాడుతున్నాను.. దయచేసి కొంత సమయం వేచి ఉండండి'' అని ఆయన్ని బయటకు పంపారట. అదీ సుందరయ్య వ్యక్తిత్వం. కార్యకర్తల్ని చూసేతీరు.
ఒకసారి నెల్లూరులో ఎన్నికల ప్రచారంలో ఓ రాత్రి ఓ ఆసామి ఇంట్లో బస భోజనం ఏర్పాట్లు చేసారు. కారు డ్రైవర్‌కు కింద, పి.ఎస్.కు డాబాపై డైనింగ్ టేబుల్‌పై పెట్టారు. డ్రైవర్ గురించి వాకబ్ చేస్తే అతనికి కింద భోజనం పెట్టాం అన్నారట.. అంతే... వెంటనే లేచి తనకూ అక్కడే భోజనం పెట్టమన్నారాయన.
బెజవాడలో మొగల్రాజుపురంలో ఆయన విగ్రహం పెట్టబోగా, కోపగించి 'పెట్టవద్దు' అని హెచ్చరించారట. అప్పటికే బతికున్న ఆచార్యరంగా - సంజీవరెడ్డి లాంటి వారి విగ్రహాలున్నాయి అక్కడ. విగ్రహాలకు ఆయన వ్యతిరేకి.
నా పదేండ్ల వయస్సులో 1974లో కనకమేడల రంగారావు స్వతంత్ర అభ్యర్థిగా ఉయ్యూరులో పోటీచేస్తే వారికి దగ్గరగా ఉండే మా నాన్న కాంగ్రెస్ అభ్యర్థికి పనిచేసారట. ''మీమిత్రుల్ని గెలిపించరూ'' అని పీఎస్ అంటే తాను కాంగ్రెస్ అని చెప్పరట మానాన్న.. అయినా ఆయన్ని పిఎస్ గౌరవించేవారు.
తారువాత మా గ్రామ సీపీఎం కార్యదర్శితో పిఎస్ గారిని పలుసార్లు కలవడం జరిగింది. చివరగా వారి అమ్మాయి పెండ్లి సందర్భంగా పిఎస్గారిని ఆహ్వానించడానికి నేను, నాగుమల్లి బాబూరావు 1985 మార్చి నెలలో కలిసాం. మా గ్రామ సీపీఎం సభ్యులైన కోలేటి ఆదిశేషు, వేదుల నారాయణ, (ఉమ్మడి పార్టీ నుంచి సభ్యులు) గురించి పిఎస్గారు అడగడం నన్ను ఆశ్చర్యపరిచింది. గొప్ప విషయం. కార్యకర్తల్ని కంటికి రెప్పలాకాపాడే పిఎస్ నేటి తరానికి నిత్య స్మరణీయులు..
- టి. చక్రవర్తి
సెల్: 9393804472