Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ సాయుధ పోరాటంలో
కడవెండి గ్రామానికి చెందిన నల్ల నరసింహులు జీవిత భాగస్వామి నల్ల వజ్రమ్మ. సాయుధపోరాటం లోనూ, జీవితంలోనూ భాగస్వాములుగా వీరు కలిసి ఉద్యమాన్ని నిర్మించిన క్రమం ఎంతో ఆదర్శవంతమైనది. 1942 నుండి సాయుధ పోరాటం ముగించిన 1952 వరకు నల్ల వజ్రమ్మ పోషించిన పాత్ర నాటి తోటి సహచర మహిళలకు ఉద్యమ కార్యకర్తలకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. కడివెండి గ్రామంలో ఈమె నాయకత్వంలో జరిగిన చైతన్య కృషికి స్థానిక మహిళలు సహకరించడంతో మహిళా దళాలను ఏర్పాటు చేసుకుని సాంస్కతిక బందాలుగా పాటలను పాడుతూ, చుట్టుకాముడు ఆడుతూ, బుర్రకథ, గొల్ల సుద్దులతో గ్రామాలలో పటిష్టమైన రక్షణ వ్యవస్థను నిర్మించుకున్నారు. సాయుధ పోరాటంలో దళసభ్యురాలి గా కార్యకలాపాలను నిర్వహిస్తూ గర్భవతిగా ఉన్న తాను దళానికి ఆటంకం అని భావించి గర్భస్రావం చేయించుకొని చురుకైన పాత్ర పోషించినట్టు చరిత్ర ద్వారా తెలుస్తోంది. 1946 జూలై 4న విసునూరు దేశముఖ్ గుండాల దాడిని తిప్పికొట్టడానికి ర్యాలీగా బయలుదేరిన సంఘం కార్యకర్తలపై కడివెండి గ్రామంలో గుండాలు జరిపిన కాల్పుల్లో తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అమరత్వం తో ప్రజా ప్రతిఘటన 1947 సెప్టెంబర్ 11 నుండి 1951 అక్టోబర్ వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం గా చరిత్రలో నిలిచిన విషయాన్ని ఆ సందర్భంలో భర్త నల్ల నరసింహులుకు తగిన రీతిలో అనేక గ్రామాలు తిరుగుతూ మహిళలను చైతన్యవంతం చేస్తూ పోలీసులు, రజాకార్లను, గుండాలను రాళ్లతో, రోకలి బండలు, కారంపొడితో తరిమికొట్టిన ఘటనల్లో ఎర్రగొల్లపహాడ్ కు చెందిన పుట్నాల రామక్క, కడివెండి గ్రామానికి చెందిన చాకలి యాకమ్మ, షేరమ్మ, వెంపటి గ్రామానికి చెందిన మేదర బోయిన లచ్చవ్వ, పెద్ద తండాకు చెందిన పుల్లమ్మ వంటి అనేకమంది మహిళలకు ధైర్యాన్ని స్ఫూర్తిని నూరిపోసింది నల్ల వజ్రమ్మ.
తన ఊరు అత్తగారి ఊరు కడివెండి గ్రామమే కావడంతో పోలీసుల గుండాల రజాకార్ల నిఘా నిరంతరం ఉన్నప్పటికీ పట్టుదలతో తప్పించుకొని, తమ కుటుంబాలు ధ్వంసమైనా ప్రజా ఉద్యమాన్ని నిర్మించే క్రమంలో గ్రామాలలో పర్యటించి, ఓదార్చి, ధైర్యాన్ని నూరిపోసి, పోరాటంలో శిక్షణ ఇచ్చినటువంటి ఘనత నల్ల వజ్రమ్మది.
కడివెండి గ్రామంలో పోలీసులు గుండాలు రజాకార్లు 400 మందికి పైగా ప్రజలు, పార్టీ సభ్యుల పైన దాడి చేయడంతో పాటు నల్ల నరసింహులును పట్టి ఇవ్వమని హింసాకాండకు పూనుకున్నప్పుడు పక్క గ్రామాలలో నరసింహులు రక్షణ తీసుకుంటే భార్య వజ్రమ్మ కడవెండి గ్రామంలోనే ముస్లింలు, ఇతరుల సహాయంతో రక్షణ తీసుకుని వారి బారిన పడకుండా తనను, ఉద్యమాన్ని కాపాడుకున్నది. ఒత్తిడి తీవ్రమై నందున మేనమామ ఇంట్లో 15రోజులు ఉండి ఆ తర్వాత రఘునాథపల్లిలో బండి ఎక్కి సోలాపూర్ వెళ్ళిపోయి వజ్రమ్మ తప్పించుకున్నది.
నాటి గెరిల్లా పోరాటంలోని మూల సూత్రం దళాలు ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి కదులుతూ శత్రువు యొక్క కదలికలను అంచనావేయడం, శత్రువు బలం పెద్దగా ఉన్నప్పుడు తిరోగమన పద్ధతిలో సంచరించడం వంటి విషయాలలో దళ సభ్యురాలిగా వజ్రమ్మ ఉద్యమాన్ని కాపాడుతూనే తనను తాను రక్షించుకుని ఎంతటి త్యాగానికైనా అనేకసార్లు సిద్ధపడింది.
గ్రామ రాజ్యాల స్థాపన, పేదవారికి భూముల పంపకం విషయంలో రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ ప్రాంతంలో జరిగినటువంటి పంపకాల కార్యక్రమంలో పురుషులతో పాటుగా నల్ల వజ్రమ్మ కూడా కడవెండి, దేవరుప్పుల, కామారెడ్డి గూడెం, మొండ్రాయి, రామవరం, రామన్నగూడెం, ధర్మాపురం, పాకాల ముత్తారం, పోచంపల్లి, రంగాపురం, పాలకుర్తి వంటి అనేక గ్రామాలలో పాల్గొని అటు దళానికి ఇటు ప్రజలకు బాసటగా నిలిచినట్లు చరిత్ర ద్వారా తెలుస్తున్నది.
నిండు గర్భవతి అయిన నల్ల వజ్రమ్మ ఉద్యమ నేపథ్యంలో అడవుల్లో తిరగడం మంచిది కాదని భావించిన కమిటీ బాధ్యులు ఎర్ర గుంటుపల్లి, దేవరకొండ తదితర ప్రాంతాలలో రహస్యంగా ఉంచడానికి రక్షణ ఏర్పాట్లు చేస్తే తాను పోరాడటానికి సిద్ధమని, ఆపద సమయంలో కూడా తన కర్తవ్యానికి సంసిద్ధతను తెలిపినప్పటికీ కమిటీ ఆమె రక్షణకు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది.
గర్భవతిగా ఉండడంతో భీమదేవరపల్లిలోని ఆస్పత్రిలో చేరిన తర్వాత, భర్త నల్ల నరసింహులు జాడ కోసం ఆమెను అరెస్టు చేసి తీసుకు పోవడానికి పోలీసులు కుట్రలు చేసినా భరించింది. 1952 జూన్ 6న ఆడ శిశువుకు జన్మనిచ్చినప్పటికీ వెంటనే ఆమెను అరెస్టు చేసి సికింద్రాబాద్ సెంట్రల్ జైలుకి పంపించి చిత్రహింసలకు గురి చేశారు. పసిపాపకు తనకు గుడ్డలు పాలు లేకున్నప్పటికీ వారి హింసను భరించింది. వజ్రమ్మ తల్లి గారి ఇంటిపై పోలీసులు దాడి చేసిన క్రమంలో తన తండ్రికి దెబ్బలు తగిలి చనిపోయిన విషయం కూడా జైల్లో ఉన్న తనకు తెలియదు. అంటే ఎంతటి నికృష్టమైన పరిస్థితులను ఉద్యమ కార్యకర్తగా వజ్రమ్మ ఎదుర్కొన్నదో మనం అవగతం చేసుకోవచ్చు. భర్త పరారీ కుట్రకేసులో ఆరు నెలల జైలు శిక్ష అనుభవించడం తో పాటు దేవరకొండ హైదరాబాదులో జరిగిన పోరాటాల్లో కూడా కేసులు ఎదుర్కొని తన పోరాట పటిమను చాటుకుంది కానీ లొంగి పోలేదు.
అనేక ఉరిశిక్షలు నల్ల నరసింహులుకు కాయం అయినప్పటికీ అంతర్జాతీయంగా జరిగిన పోరాట ఫలితంగ, నాటి ప్రతిపక్ష నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య గారి కషి వలన ఉరి శిక్ష నుండి బయటపడి 1959 జనవరి 26న నల్ల ఆయన స్వేచ్ఛా ప్రపంచంలోకి వచ్చాడు. జీవితమంతా పోరాటం రూపంలో కలిసి సాగించిన భార్యాభర్తలు ఇరువురు తెలంగాణ పోరాటం జరిగిన నేలమీదనే నివసించడానికి నిర్ణయించుకొని జనగామలో నివసిస్తూ ప్రజల కష్టసుఖాలలో పాల్గొని ఉద్యమం తర్వాత కూడా ఇద్దరూ కలిసి ప్రజల కోసమే పని చేసినారు.
వజ్రమ్మ కంటే ముందుగానే భర్త నర్సింహులు 1993లో చనిపోయినా వీరనారిగా తనను తాను రుజువు చేసుకున్న వజ్రమ్మ 2017 మే 26న తనువు చాలించింది. నల్ల వజ్రమ్మ జీవితం అనుభవాలు నేటితరానికి స్ఫూర్తి దాయకం. ఆ స్ఫూర్తిని కొనసాగిం చడమే ఆమెకు నివాళి.
- వి. మల్లేశం
సెల్:9014206412