Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా కాలంలో అకాల మరణాల గురించి మృత్యు బాధితుల గురించి వినని రోజు లేదు. గత పుష్కర కాలంగా అతి సన్నిహితంగా చూస్తున్న కామ్రేడ్ యలవర్తి రాజేంద్రప్రసాద్ మరణవార్త వినాల్సి రావడం విచారకరం. ఊపిరితిత్తుల సంభందిత (సీపీఓడీ) వ్యాధితో కిమ్స్‌లో చేరిన రాజేంద్రప్రసాద్ ఊపిరి తీసుకోవడమే కష్టమై పోయి మే 13న సాయంత్రం 6గంటలకు కన్నుమూశారు. హాస్పిటల్లోనే 40లీటర్ల ఆక్సిజన్ ఆవశ్యకత ఏర్పడి కోవిడ్ సోకి చివరికి అవి తగ్గిన సమయంలోనే గుండెపోటు రావడంతో రాజేంద్రప్రసాద్ మరణం సంభందించిందని బంధువులు చెప్పారు. ఇదెంతో భాదాకరం. రాజేంద్రప్రసాద్‌ను చాలా మంది ప్రేమగా రాజా అని పిలుస్తుంటారు. ఆయనకంటే వయసులో చాలా చిన్నవాడు కావడమో, గౌరవప్రదమైన అనుబంధమో తెలియదు కానీ నేనెప్పుడూ అలా పిలువలేదు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య (ఏసీఎఫ్) వ్యవస్థాపకుల్లో ఒకరైన రాజేంద్రప్రసాద్ గురించి చాలా కాలంగా వింటున్నా, నా జ్ఞాపకం మేరకు నేను మొట్టమొదట కలిసింది మాత్రం 2009 జూలైలో జైలు నుంచి విడుదలైన తర్వాతనే. గడిచిన దశాబ్ద కాలంలో జరిగిన రెండు అరుణోదయ జనరల్ కౌన్సిల్స్‌లో ఒకటి నేను జైలులో ఉన్నప్పుడే జరిగింది. సాంస్కతిక ఉద్యమంతో ఉన్న అనుబంధం రీత్యా 2016లో జరిగిన సభల సందర్భంగా అరుణోదయ చరిత్ర, ఉద్యమ సంస్థల ఐక్యత లాంటి కొన్ని అంశాలపై తనతో మాట్లాడడం, కొన్ని వివరాలు సేకరించడమూ జరిగింది. అరుణోదయల ఐక్యతపై అప్పుడే ఆయనలో ఆశా నిరాశలు రెండు గమనించాను. విప్లవ సంస్థల ఐక్యతపైనా ఇలాంటి భావాలే ఆయనలో మెదిలాయి. వృత్తి రీత్యా వ్యాపారంలో మునిగి తేలుతున్న వాల్లలో ఇంతగా ప్రజా ఉద్యమాలతో, ప్రజా కళారంగంతో మిళితమైన వారు లేరనె చెప్పాలి. తాను పుట్టి పెరిగిన సంస్థ తమ కండ్లముందే ముక్కలైపోయి ఉండటాన్ని సహించలేక పుష్కరకాలంగా అందరూ ఐక్యం కావాలని ఆశించిన వాల్లలో, ఏ నిర్మాణంలో లేకుండా ఉన్న రాజేంద్రప్రసాద్ ముందుభాగాన ఉన్నాడని చెప్పడం అతిశయోక్తి కాదు. విప్లవోద్యమంలో ఉన్న ఒక తరాన్నే గాకుండా, విప్లవకారుల ఐక్యతను, యోగక్షేమాలను కోరుకునే వాల్లు ఒక్కరొక్కరుగా మన నుండి భౌతికంగా దూరమవుతూ వస్తున్నారు. ఇప్పుడు జోహార్లతో సరిపెట్టుకోకుండా ఏం చేయాలనే అంశం విప్లవ ప్రజా సాంస్కృతిక సంఘాలన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది.కల్లోల విప్లవ దశాబ్దం రేపిన ఆలోచన- ఆచరణల అంతర్మధనంలో పుట్టిన విప్లవ విద్యార్థి సంఘాల ప్రేరణే రాజేంద్రప్రసాద్ లాంటి ఎంతో మందిని తట్టిలేపింది.1955 ఆగస్టు 11న గుంటూరు జిల్లా అప్పికట్లలో యలవర్తి శంకర్రావు, కాళికాంబల తొలిచూలు బిడ్డగా జన్మించిన రాజేంద్రప్రసాద్‌కు తమ్ముడు పాండురంగారావు, సుజాతలు తోబుట్టువులుగా ఉన్నారు. పదవ తరగతి వరకు అప్పికట్లలో చదివిన రాజేంద్రప్రసాద్ ఇంటర్మీడియట్ బాపట్లలో పూర్తి చేశారు. తన తండ్రి రెండు సార్లు అప్పికట్ల గ్రామ పంచాయతి ప్రెసిడెంట్‌గా స్వాతంత్య్ర అభ్యర్థిగా గెలిచినందున వర్తమాన రాజకీయ పరిస్థితులపై చిన్ననాడే ఆయనలో చైతన్యం మొగ్గ తొడిగింది. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి సమాంతరంగా ప్రారంభమైన ప్రత్యేకాంధ్ర ఉద్యమ ప్రభావంతోనే 1972లో ఇంటర్మీడియట్ పూర్తి చేసి 1973లో హైదరాబాద్‌కు వచ్చారు. మాసబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజీలో రష్యన్ ఇంజనీరింగ్ టెక్నాలజీకి సంబంధించిన మోడరన్ డిప్లొమా ట్రైయినింగ్ (ఎండీటీ)లో 1973-74లోనే చదివాడు. ఉస్మానియా యూనివర్సిటిలో విప్లవ విద్యార్థి ఉద్యమ ప్రభావంతో పీడీఎస్‌యూలో చేరి 1974లో జరిగిన ప్రథమ మహాసభలో పాల్గొని చురుగ్గా పని చేశాడని, అందులోనే సాంస్కృతిక ప్రదర్శన నిర్వహించాడని మిత్రులు పేర్కొన్నారు. 1974లో ఉస్మానియా ఇంజనీరింగ్ కళాశాలలో కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రేరణతో ఏర్పడ్డ అరుణోదయ వ్యవస్థపకులలో తానూ ఒకరైనారు. ఆ తర్వాత ఎమర్జెన్సి నిర్భంధ చీకట్లలో ఆయన విప్లవ కార్యాచరణ సుదీర్ఘ కాలం కొనసాగకున్నా తాను ఎంచుకున్న ప్రతిపనిలోనూ ప్రత్యేకతను కనబరుస్తూ వస్తున్నారు.
1992 మే 10న వివాహబంధంతో ఒకటైన ధనలక్ష్మి, రాజేంద్రప్రసాద్లిరువురిని నేనింతవరకు ఒంటరిగా ఎప్పుడు చూడలేదు. విప్లవాభిమానమైన, కళా పోషణైనా వారి కార్యాలయ పనియైనా, ఎక్కడైనా ఇద్దరు జంటగా దర్శనమివ్వాలిసిందే. విద్యా విజ్ఞానాల్లోను, క్రమశిక్షణ, ప్రేమా, ఆప్యాయతల్లోనూ వారితో ఏమాత్రం తీసిపోని పిల్లలిద్దరిని కల్పితే వారిది ఆదర్శ కుటుంబం. వారిలో ఎవరు కూడా ఒకరినొకరు ఆదేశిస్తున్నట్లు గాకుండా ఒకరినొకరు ఆదరించినట్టు, అనుసరించినట్టు నేను చూసాను. ఇది అన్ని కుటుంబాల్లో సాధ్యం కాదు.
తన ఊపిరితిత్తుల వ్యాధికి ఆయన ఎంచుకున్న జల విద్యుత్ ఉత్పాదన రంగమే కారణమని పిల్లలిద్దరు చెప్పారు. ఊపిరితిత్తుల ద్వారా అందే ఆక్సిజన్ లోపాలతో గుండె సమస్యలు రెండూ కలెగల్సి రావడంతో పలుసార్లు స్టెంట్లు వేసుకున్నారు. కానీ రెండు సంవత్సరాలుగా అనారోగ్య సమస్యలు తనను తీవ్రంగా వెంటాడుతూనే ఉన్నాయి. దానికి ఒక మెరుగైన పరిష్కారం వెతుకుతున్న సమయంలోనే కార్డియాక్ అరెస్ట్‌తో రాజేంద్రప్రసాద్ మనల్ని శాశ్వతంగా విడిచి వెళ్లారు.
2012 ఏప్రిల్ 14న జార్జిరెడ్డి 40వ వర్థంతి కార్యక్రమంలో విప్లవోద్యమ పాత మిత్రులు కల్సుకోవడం ఒక ఎత్తయితే, అదే సంవత్సరం సెప్టెంబర్ 8న మిత్ర జనం పాటల సవ్వడి కార్యక్రమం నన్ను ఉద్యమ కవిగా పరిచయం చేసిన సందర్భం కూడా. దాని నిర్వహణ పనులను తన భుజం మీద వేసుకుని 'మిత్ర పర్వం' పుస్తకానికి, కార్యక్రమ విజయానికి తన వంతు సహకారం చేశాడు. ప్రతి వేదికను ఇలా స్వంతం చేసుకుని పరుగులెత్తడం ఆయన సహజ స్వభావమని నాకు తర్వాతర్వాత అర్థమయ్యింది. అమరుడు కానూరి వెంకటేశ్వరరావు స్మారక అవార్డు కార్యక్రమం ఒకటి పెట్టాలని 2020లోనే ఆయన ప్రతిపాదించి అందుకు తాత తర్వాత మరో సీనియర్ కళాకారుడు కామ్రేడ్ బోయ సుంకులు (బొల్లవరం)కు ప్రథమ అవార్డు ఇవ్వాలని ప్రతిపాదించాడట. కోవిడ్ కారణంగా ఈ కార్యక్రమం వాయిదా పడినా రాజా చివరి కోరిక నెరవేరాలని ఆశిద్దాం. మరణించే ఒక రోజు ముందు తన కుటుంబ సభ్యులను పిలుచుకుని తన పీడీఎస్‌యూ, అరుణోదయ సహచరులందరికి రెడ్ శాల్యుట్ చెప్పమన్నాడట. ఇప్పుడు ఆ సహచరులంతా కలిసికట్టుగా రాజేంద్రప్రసాద్‌కు జోహార్లు చెప్పడమే గాదు, తామంత ఐక్యంగా సాగుతామని చాటడమే ఆయనకు నిజమైన నివాళి కాగలదని నా భావన.
- అమర్