Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమెరికాకు అడుగడుగునా సవాల్ విసురుతూ, అనితర సాధ్యమైన లక్ష్యాలను అధిగమిస్తూ, అగ్రరాజ్య హోదా కోసం ప్రణాళికా బద్ధంగా అడుగులేస్తున్న ఆ రెండక్షరాల పొరుగుదేశమైన చైనా పేరును ప్రభుత్వం కొన్నాళ్ళుగా ప్రస్తావించడం లేదు. చైనాకు సంబంధించిన సానుకూల వార్తలూ దేశ మీడియాలో పెద్దగా కనిపించడం లేదు. అసలు ఏం జరుగుతుందో ఓసారి తెలుసుకుందాం.
గాల్వన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ, ఇరువైపులా జరిగిన సైనికుల మరణం, చైనాకు చెందిన పలు యాప్‌లను భారతదేశం పలుదఫాలుగా రద్దు చేయడం, దేశంలో వీధి, వీధినా ఉన్న చైనా బజార్లు అలాగే ఉన్నప్పటికి వాటి పేర్లు మాత్రం ఇండియా బజార్లుగా మారడం, ఇవన్నీ ఒక సంవత్సర కాలంలో జరిగినవే.
కిందటేట కరోనా వైరస్‌ను చైనా వైరస్ పేరుతో పిలిచి, వార్తలు ప్రసారం చేయడంతో పాటు రోజుకో పరిశోధనా సంస్థ, శాస్త్రవేత్త వైరస్ చైనా సృష్టి అని కనిపెట్టారని కథలు, కథలుగా పాశ్చాత్య మీడియా చేసిన ప్రచారానికి దేశీయ మీడియా కూడా వంత పాడింది. ఇప్పుడు ఏప్రిల్ నుంచి దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతం కావడంతో దేశంలో వైద్య సదుపాయాల లేమితో దేశం తీవ్ర సంక్షోభంలో ఉన్న సమయంలో ప్రపంచ మీడియా ముఖ్యంగా అమెరికా, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన మీడియా భారత్‌లో జరుగుతున్న కల్లోలం పేరుతో శవ దహనాల, స్మశానాల ఫోటోలు వేసి బ్యానర్ హెడ్డింగులతో ప్రచారం చేసారు. ఎక్కువగా మోడీ విఫలమయ్యారని, మోదీ నిర్లక్ష్యం అని, మోదీ అహంభావం వల్లనే ఈ పరిస్థితులు వచ్చాయని కథనాలు వచ్చాయి. అలాగే దేశంలో వ్యాప్తిలో ఉన్న 1.617 వేరియంట్‌ను ఇండియన్ వేరియంట్‌గా పేర్కొంటున్నారు. ఓ రకంగా గత సంవత్సరం చైనాను ముద్దాయిని చేసిన పాశ్చాత్య మీడియా ఈ సంవత్సరం భారత్‌ను అసహాయ స్థితిలో ఉన్న పేదదేశంగా చూపించింది. ఆ ప్రభావం భారత్‌ని ఇప్పటి వరకు పెద్దన్నగా చూస్తున్న శ్రీలంక, నేపాల్, మయన్మార్, భూటాన్, బంగ్లాదేశ్‌లపై పడే అవకాశాలను తోసి పుచ్చలేం.
చైనాతో జరిగిన ఘర్షణను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ఆ దేశం నుంచి మరిన్ని ఉద్రిక్తతలు తలెత్తే అవకాశాలుంటాయని భావించిన భారతదేశం, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లతో కలసి క్వాడ్‌లో చేరింది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో భాగస్వామ్య భద్రత ఇతర ప్రయోజనాలు పరిరక్షించటం, ముఖ్యంగా చైనా సైనిక, ఆర్థిక పెరుగుదలను నిలువరించడమే క్వాడ్ లక్ష్యంగా పేర్కొన్నారు. కానీ వాస్తవంగా జరుగుతున్న సంఘటనలు పూర్తి భిన్నంగా ఉంటున్నాయి. భారత్ ముందస్తు అనుమతి కాదు కదా కనీస సమాచారం కూడా లేకుండానే అమెరికా నావీ ఏప్రిల్ నెలలో హిందూ మహాసముద్రంలో, లక్ష ద్వీప్ ద్వీపాలకు సమీపంలో భారత దేశ ప్రత్యేక ఆర్థిక జోన్లోకి ప్రవేశించి మరీ యుద్ధ విన్యాసాలు చేయడంతో పాటు ఈ ప్రాంతంలో భారత్ వాదనలను సవాల్ చేయటానికే తాము విన్యాసాలు చేసామని, తాము అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా చేస్తున్నామని అమెరికా అధికారులు పేర్కొంది. అంతే కాదు కరెన్సీతో మోసాలకు పాల్పడుతూ తమ ప్రయోజనాలను దెబ్బతీస్తున్న జాబితాలో భారత్‌ను అమెరికా ఆర్థికశాఖ చేర్చింది. చైనాను బెదిరించటానికని అమెరికా మాటలు నమ్మిన భారత్, తమ ప్రాంతంలోకి వచ్చిన అమెరికా నౌకలు ఏకంగా యుద్ధ విన్యాసాలు చేసినా, తమ కరెన్సీ వ్యవహారంపై నిందలు వేసినా నిమ్మకుండవలసిన పరిస్థితికి చేరింది. కిందటి సంవత్సరం బెదిరించి మరీ హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను ఎగుమతి చేయించుకున్న అమెరికా ఇప్పుడు వ్యాక్సిన్ ఉత్పాదనకు అవసరమైన ముడిసరుకును భారత్‌కు ఎగుమతి చేయటానికి మాత్రం నిషేధం విధించింది. మరో దేశమైన ఆస్ట్రేలియా ఏప్రిల్ నెలలో భారత్ నుంచి ప్రయాణికుల రాకను నిషేధించింది. ఎవరైనా అటువంటి ప్రయత్నం చేసినట్లయితే 50 వేల అమెరికన్ డాలర్లు అంటే మన కరెన్సీలో 36లక్షల రూపాయలు జరిమానా, దానితో పాటు ఐదేండ్లు జైలు శిక్ష ఉంటుందని హెచ్చరించింది. ఆ దేశంలో ఎంతో గుర్తింపు ఉన్న ఆస్ట్రేలియన్ ఫైనాన్షియల్ రివ్యూ పత్రికలో గాయాలతో కోలుకోలేని స్థితిలో పడి ఉన్న ఏనుగుతో భారత్‌ని పోల్చి దానిపై విజయదరహాసంతో కూర్చున్న మోడీ కార్టూన్‌ను ప్రచురించింది. ఇక మిగిలిన మరో దేశమైన జపాన్ పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోతోంది. దేశంలో విపరీతంగా పెరుగుతున్న కోవిడ్ కేసులు. ఇప్పటికే 18 లక్షల కోట్లు ఖర్చు పెట్టినప్పటికి కిందటేడు జరుపవలసిన ఒలింపిక్స్ ఈ సంవత్సరం అయినా జరుగుతాయో లేవో చెప్పలేని అనిశ్చితి. అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ భారత్‌కు తగిన విధంగా చేయూత నివ్వడంలో ప్రపంచ దేశాలు విఫలమయ్యాయని పేర్కొనడాన్ని దృష్టిలో పెట్టుకుంటే భారత్‌కు ఆయా దేశాలు అందించిన చేయూత కంటి తుడుపు మాత్రమే అని అర్థం అవుతుంది. అదే సమయంలో చిన్న దేశాలైన తైవాన్, భూటాన్, బంగ్లాదేశ్‌లు తమ శక్తి మేర భారత్‌కు ఆక్సిజన్ తదితర సామాగ్రి సరఫరా చేసాయి.
క్వాడ్ కూటమిలో చేరిన భారత్ పట్ల మిగిలిన మూడు దేశాల ప్రస్తుత ప్రతిస్పందన, మీడియా వ్యవహారశైలి ఇలా ఉంటే చైనా మీడియాలో ఎక్కడా భారత్‌కు వ్యతిరేకంగానో లేదా కించపరిచే వార్తలు లేకపోవడాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చైనీస్ సోషల్ మీడియాలో చైనా అంతరిక్షంలోకి పంపిన లాంగ్ మార్చ్ 5బి వెలుగు, భారత్‌లో ప్రస్తుతం జరుగుతున్న శవదహనాల వెలుగును పెట్టిన ఒక పోస్టును చైనాలోని సాధారణ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు ఇండియాకు బాసటగా ఉండాల్సిన సమయంలో కించపరుస్తారా అని విమర్శించడంతో రెండవ రోజే దానిని తొలగించారు. చైనా అధికారిక మీడియా సంస్థ అయిన గ్లోబల్ టైమ్స్ ఎడిటర్ కూడ భారత్‌ను కించపరిచే పోస్టులు చైనీస్ సోషల్ మీడియాలో ఉండకూడదని కోరారు. ఇదే సమయంలో స్వదేశీ మీడియా పోకడలు గమనిస్తే అమెరికా అధ్యక్షుడు భారత్‌కు సహకరిస్తాం అన్న వార్తకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. అప్పటికే రెండు విమానాల్లో భారత్‌కు రష్యా పంపిన ఆక్సిజన్, వెంటిలేటర్ల వివరాలు, కోవిడ్‌పై పోరులో భారత్‌కు అండగా నిలుస్తాం అన్న చైనా అధ్యక్షుడి సందేశం లాంటి వార్తలు ఎక్కడో ఓ మూలకు చేరిపోతాయి. కానీ చైనా రాకెట్ భూమిపైనా, జనావాసాల్లో అందునా ఢిల్లీలో కూలబోతుందని అంతరిక్ష శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేసినట్లు, శకలాలు ఎప్పుడు, ఎక్కడ పడతాయో అంటూ అమెరికా రక్షణ విభాగం అధికార ప్రతినిధి చేసిన ప్రకటనకు అంతులేని ప్రాముఖ్యత ఇస్తారు. మళ్ళీ ఆ రాకెట్ జనావాసాల్లో కాదు అంతర్జాతీయ జలాల్లోనే పడుతుందని చైనా వారు చెపుతున్న వివరాలకు అంత ప్రాముఖ్యత ఇవ్వరు. ఇప్పుడు దేశంలో మారుమూల గ్రామాల్లోనూ అందుబాటులో ఉన్న ఆక్సిమీటర్లు అత్యధికంగా చైనా నుంచి దిగుమతి చేసుకున్నవే. ఇక దేశంలో ఆక్సిజన్ కన్సన్ట్రేటర్ల కొరత తీవ్రంగా ఉంది. అవి తగినంతగా ఉంటే మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చని వైద్యులు కూడా ఆందోళన పడిన విషయం అందరికి తెలిసిందే. భారత్ నుంచి ఇప్పటికే 60 వేల ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల ఆర్డర్లు వచ్చాయని, వాటిలో 30వేల ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు 5 వేల వెంటిలేటర్లు, 4 వేల టన్నుల మందులు, 22 మిలియన్ల మాస్కులు ఇప్పటికే భారత్‌కు అందించ గలిగామని, మిగిలినవి మే నెలాఖరులోగా అందించడానికి మేడే రోజు కూడ కార్మికులు పనిచేసారని, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తాము భారత్‌కు వెన్నంటి ఉంటామని చైనా ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెలిపింది.
యాప్‌లు నిషేధించడంతో చాలా మంది భారత్-చైనాల మధ్య వ్యాపార లావాదేవీలు కూడ ఆగిపోయాయని భావించే అవకాశం లేకపోలేదు. కానీ 2019లో 8574 కోట్ల డాలర్లు వ్యాపారం జరగ్గా, 2020లో 7515 కోట్ల డాలర్లు లావాదేవీలు జరిగాయి. ఈ సంవత్సరం ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి.
కేవలం అమెరికా మెప్పు కోసం భారత్ ఇరాన్ నుంచి ముడి చమురు సరఫరాను రద్దుచేసుకోవడంతో పాటు, అమెరికా ఆంక్షల భయంతో క్రమేణా ఇరాన్‌కు దూరం జరుగుతూ ఉంది. ఇదే సమయంలో ఆంక్షల చట్రంలో ఆర్థికంగా దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న ఇరాన్‌కు చైనా ఆర్థిక చేయూతనందించింది. ఇరాన్‌తో మైత్రీపూర్వక వ్యవహారాలతో భారత్‌కు చేకూరే ప్రయోజనాలు అనేకమున్నా భారత్ ఉద్దేశ్యపూర్వక నిర్లిప్తతతో ఆర్థికంగాను నష్టమే చేకూరింది. ఇరాన్‌లోని ఫర్జాద్ బి సహజవాయు క్షేత్రాన్ని భారత్‌కు చెందిన ఓయన్‌జిసి విదేశ్ 2008లో షార్సీ తీరం వద్ద గుర్తించింది. దీనికై భారత్‌కు చెందిన వ్యాపార సంస్థలు 40కోట్ల డాలర్లు వరకు అక్కడ కాంట్రాక్టును దృష్టిలో పెట్టుకుని ఖర్చు చేసాయి. కానీ ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకున్న ఇరాన్ ప్రభుత్వం ఆ కాంట్రాక్టుని స్వదేశీ సంస్థకు అప్పజెప్పింది.
ప్రజల్లో పదే పదే జాతీయ భావం, భావోద్వేగాలు రెచ్చగొట్టడం, యుద్ధ నినాదాలు చేయడం, ఇతర దేశాలపై వ్యతిరేక ప్రచారాలకు ఊతమివ్వడం వంటి అల్ప విషయాల వల్ల రాజకీయ పార్టీలకు ఉపయోగం, ఎన్నికల్లో గెలుపు సంభవించవచ్చు. కానీ దేశ పురోగతికి మాత్రం అడ్డంకులు అని గతంలో విన్నాం ఇప్పుడు అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నాం. ప్రజలు విచక్షణతో ఆలోచించకుండా నాయకుల నినాదాల ఊబిలో దిగబడితే నష్టపోయేది భావి తరాలే కాబట్టి ఇకనుంచైనా అమెరికా మెప్పు కోసం కాకుండా దేశ ప్రయోజనాలపై భారత్ నాయకత్వం దృష్టి పెట్టాలి.
- జి. నరసింహ ప్రసాద్
సెల్:9440734501