Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్రంలో రెండేండ్లుగా విశ్వ విద్యాలయాలకు రెగ్యులర్ వైస్ ఛాన్స్లర్ (వీసీ)లు లేని పాలన కొనసాగింది. ఎక్కడి గొంగడి అక్కడే అన్న చందంగా యూనివర్సిటీల పరిస్థితి తయారైంది. విద్యార్థులకు దిక్సూచి కేంద్రాలైన విశ్వవిద్యా లయాలు దివాళా తీశాయి. ఇన్ఛార్జీ వీసీలతో యూనివర్సిటీల అభివద్ధి కుంటుపడటమే కాకుండా, విద్యావ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. ఈ ప్రభుత్వం మొత్తానికి యూనివర్సిటీలపై దృష్టి సారించింది. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ పది యూనివర్సిటీలకు వీసీలను నియమించడం జరిగింది. అయితే ఈ కొత్త వీసీల ముందు వారు సాధించవలసిన సవాళ్లున్నాయి. వాటికి పరిష్కార మార్గాలను వెతుక్కోవాల్సి వస్తున్నది. గత వీసీలు కొనసాగించిన పాలన విధానాన్ని, ప్రస్తుత వీసీలు పున్ణపరిశీలన చేయాల్సిన అవసరం ఉన్నది. వీసీ పదవి తూతూ మంత్రంలా కాదు. అది ఒక రాజ్యాంగ బద్ధమైన గవర్నర్ చేత నియమించబడే నియామక ప్రక్రియ. విశ్వవిద్యాలయాలనేవి విశ్వ విజ్ఞాన కేంద్రాలు. ఇప్పుడు నూతన వీసీల ముందు ఎన్నో సవాళ్లున్నాయి. ఎందుకంటే గత వీసీలు చేసిన పొరపాట్లు, ఇప్పుడున్న వీసీలు చేయకుండా వారి సమర్థతను, శక్తిసామర్థ్యాలను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న కార్యక్రమా లను సమీక్షించి, వాటిని అనుకూలమైన విధంగా కొనసాగించాలి. విశ్వవిద్యాలయాలు విద్యార్థుల భవిష్యత్‌ను మార్చే గొప్ప విజ్ఞాన కేంద్రాలు. గత రెండేండ్లుగా వీసీలు లేక పాలన వ్యవస్థ ఎక్కడికక్కడే స్తంభించిపోయింది. ముందు దానిని గాడిలో పెట్టాలి.
సిబ్బంది కొరతను తీర్చాలి
ముఖ్యంగా యూనివర్సిటీలలో ఆచార్యుల కొరత తీవ్రంగా ఉంది. ఇంత తీవ్రమైన సమస్యను పరిష్కరించాలంటే వెంటనే నియామక చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్లను నియమించాలంటే తగిన అర్హతలున్న వారిని ఎంపిక చేయాలి. ఏ ఒక్క రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులను తీసుకోకూడదు. యూజీసీ నిబంధనల ప్రకారం వారికి తగిన అర్హతలు కలిగి ఉండాలి. అకడమిక్ క్వాలిఫికేషన్ ఒక్కటే కాకుండా, అన్ని సబ్జెక్టులపై అవగాహన ఉండాలి. విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే శక్తిసామర్థ్యాలుండాలి. ఇలాంటి వారిని ఎంపిక చేస్తే విద్యా వ్యవస్థ కుంటుపడకుండా సమర్థవంతంగా కొనసాగడానికి వీలుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన ప్రయివేటు యూనివర్సిటీలలో సామాన్య విద్యార్థులు చదువుకునే అవకాశం లేదు. ఎందుకంటే ప్రయివేటు యూనివర్సిటీలలో రిజర్వేషన్ ఉండదనీ, అసెంబ్లీ సాక్షిగా విద్యాశాఖ మంత్రి తేల్చి చెప్పారు. కావున ప్రయివేటు విశ్వవిద్యాలయాల కంటే ఉన్నతంగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను అభివద్ధి చేయాల్సిన అవసరముంది. యూనివర్సిటీలలో ఇప్పటి వరకు ఖాళీగా ఉన్న పోస్టులు టీచింగ్, నాన్ టీచింగ్, బ్యాక్లాగ్ పోస్టులనూ సాధ్యమైనంత త్వరలో భర్తీ చేయాలి.
ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను కాపాడాలి
ప్రభుత్వ రంగంలో ఉంటూ ప్రభుత్వానికి వెన్నుపొటు పొడిచేలా చేస్తున్న కొందరి అవినీతి వల్ల విద్యా వ్యవస్థ నడ్డి విరిగి, చావలేక బతకలేని పరిస్థితిలో ఉంది. కావున ప్రభుత్వ యూనివర్సిటీలు కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నది. ఇవి నిర్వీర్యం కాకుండా చూడాలి. ఇవే వీసీల ముందున్న ప్రధాన సవాళ్లు. యూనివర్సిటీలలో చదువుతున్న వారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ పేద విద్యార్థులు మాత్రమే. కావున కార్పొరేట్లకు దీటుగా ఆ విద్యార్థులను తీర్చిదిద్దాలి. వారికి తగిన శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయాలి. యూనివర్సిటీలలో ఉండే ఎస్సీ, ఎస్టీ సెల్, బీసీ సెల్ అలాగే వికలాంగుల సెల్‌లను అభివద్ధి చేయాలి. అవి కేవలం నామమాత్రపు కేంద్రాలుగా కాకుండా, బాధ్యాతయుతమైనవిగా భవిష్యత్‌ను తీర్చిదిద్దే కేంద్రాలుగా అభివృద్ధి చేయాలి. వాటికి నిధులు కేటాయించాలి. అలాగే పరిశోధనపైన, పటిష్టమైన అవగాహన కలిగేలా చేయాలి. పీహెచ్డీ డిగ్రీలు ఇవ్వడం కాదు.. పీహెచ్డీ పూర్తి చేసి డాక్టరేట్ పొందిన వ్యక్తులకు ఎక్కడో ఒకచోట ఉద్యోగం పొందేటట్టు చేయాలి. వారి పరిజ్ఞానాన్ని మానవ వనరులుగా ఉపయోగించుకోవాలి. ఈ విషయాలన్నీ కొత్త వీసీల ముందున్న సవాళ్లు. వాటిని సమర్థవంతంగా పరిష్కరిస్తారనీ, యూనివర్సిటీల భవిష్యత్‌ను మెరుగుపరుస్తారని ఆశిద్దాం. విద్యార్థి ఉద్యమాలకు కేంద్రాలైన యూనివర్సిటీలకు కొత్త వీసీలను నియమించడం స్వాగతిద్దాం.
- డాక్టర్ కాటేపాగ యుగందర్
సెల్:9951260370