Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రకృతి మనిషి కంటే అత్యంత ప్రాచీనమైనది. సృష్టిలోని జీవ, నిర్జీవ పదార్థాలను ఉపయోగించు కొని మానవ నాగరికత రూపుదాల్చింది. అనేక పరిణామాల అనంతరం శాస్త్రీయంగా మానవ వ్యక్తిగత, సామూహిక కార్యక్రమలు సామాజిక అభివృద్ధి దారితీసాయి. అభివృద్ధి పేరుతో పర్యావరణ జాగ్రత్తలు విస్మరించి సహజవనరులను అతిగా ఉపయోగించిన నాటినుంచి పర్యావరణ విధ్వంసం మొదలైయింది. ప్రధానంగా 18వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం తర్వాత ప్రకృతి వనరుల దుర్వినియోగం వేగంగా పెరిగి కాలుష్యం అధికమైంది. ఇది రేపటి తరాల భవిష్యత్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని ప్రపంచ మేథావులు, పర్యావరణ వేత్తలు ఆందోళన చెందారు. 1970 దశాబ్దంలో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో చర్చ ప్రారంభం అయింది. ఈ క్రమంలో పర్యావరణ విధ్వంసం లేకుండా జరిగే ఆర్థిక అభివృద్ధి, సుస్థిరాభివృద్ధి భావనగా 1980లో బ్రట్‌లాండ్ కమిషన్ నివేదిక ద్వారా వెలుగులోకి తెచ్చింది. 1987లో పర్యావరణ అభివృద్ధి పై ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన 'అవర్ కామన్ ఫ్యూచర్' ప్రోగ్రామ్‌లో భవిష్యత్ తరాల అవసరాలు తీర్చుకునే సామర్ధ్యాలను దెబ్బతీయకుండా ప్రస్తుత అవసరాలు తీర్చుకునే అభివృద్ధి సుస్థిర అభివృద్ధిగా శాస్త్రీయ నిర్వచనం ఇచ్చింది.
ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు
2015 సెప్టెంబర్‌లో ఐక్యరాజ్యసమితి సాధారణ సభ కేంద్రంగా నిర్దేశించిన 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు వరసగా పేదరిక నిర్మూలన, ఆకలి నిర్మూలన, ఆరోగ్య సంరక్షణ, జీవన ప్రమాణాలు పెంపు, నాణ్యమైన విద్య, లింగ సమానత్వం, తాగునీరు, పారిశుద్ధ్యం, అందుబాటు ధరల్లో శక్తి వనరులు, గౌరవప్రదమైన ఉపాధి, ఆర్థికవృద్ధి, పరిశ్రమలు, ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాలు, అసమానతల తొలగింపు, సుస్థిర నగరాలు, సమూహాలు, బాధ్యతాయుతమైన వినియోగం, ఉత్పత్తి, వాతావరణ పరిరక్షణ, సముద్ర, జల చరాల పరిరక్షణ, జీవ వైవిధ్యం, శాంతి, న్యాయం, బలమైన వ్యవస్థ సాధనకు 193 దేశాలు ఆమోదం తెలిపాయి. ఈ లక్ష్యాలు స్థూలంగా 17గా విభజించినప్పటికీ అవి ఒకదానితో మరొకటి అవినాభావ సంబంధాన్ని కలిగి ఉన్నాయి. కాబట్టి అభివృద్ధి అనేది స్థూలంగా సామాజిక, ఆర్థిక, పర్యావరణ అంశాల్లో సుస్థిరంగా ఉండాలి. అందుకు నిర్దేశించుకున్న ఈ లక్ష్యాలను ప్రపంచ వ్యాపితంగా 2030 లోపు ప్రతి దేశం సాధించాలని నిర్ణయించుకున్నాయి.
భారతదేశంలో నిటిఆయోగ్ పర్యవేక్షణ
2018 నుండి ఈ నివేదికను నిటిఆయోగ్ విడుదల చేస్తోంది. దీనికోసం సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం నిటిఆయోగ్ పర్యవేక్షణలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాల, కేంద్ర పాలిత ప్రాంతాల పనితీరు పురోగతిని మదింపు చేస్తుంది. ఇందుకోసం ఐక్యరాజ్యసమితి ప్రకటించిన 17లక్ష్యాలలో 13 లక్ష్యాలు మాత్రమే ప్రతిపాదిక తీసుకుంటుంది. ఈ లక్ష్యాల మదింపు కొరకు 62 జాతీయ సూచికలతో 70 రకాల టార్గెట్లు 115రకాల అంశాలు పరిగణలోకి తీసుకొని హేతుబద్దంగా ర్యాంకులు కేటాయిస్తుంది. నిటి ఆయోగ్ బాధ్యతాయుతమైన వినియోగం, ఉత్పత్తి, వాతావరణ పరిరక్షణ, సముద్ర, జల చరాల పరిరక్షణ, బలమైన వ్యవస్థ సాధన లాంటి లక్ష్యాల పురోగతిని మదింపు చేయదు. వాటిని కేవలం దేశాల ర్యాంకు నిర్థారణ కొరకు ఐక్యరాజ్యసమితి మదిస్తుంది. స్థూలంగా సామాజిక, ఆర్థిక, పర్యావరణ అంశాలలో సాధించిన మార్కుల ఆధారంగా అఛీవర్, ఫ్రంట్ రన్నర్, పెర్ఫార్మర్, యాస్పిరెంట్ అని నాలుగు కేటగిరీల్లో రాష్ట్రాలను విభజిస్తుంది. ఈ నివేదిక ద్వారా వివిధ రాష్ట్రాలు సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో ఏ దశలో ఉన్నాయో తెలుసుకునే అవకాశం ఉంది.
సుస్థిర అభివృద్ధి లక్ష్యాల తాజా నివేదిక
తాజాగా 2020-21 సంవత్సరానికి సాధించిన పురోగతిని ఆధారం చేసుకుని నిటిఆయోగ్ ర్యాంకులను విడుదల చేసింది. గతంలో వరసగా 2 సార్లు మూడవ స్థానంలో నిలిచిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో వెనుకకుపోయి 69 స్కోరుతో ప్రంట్ రన్నర్ హౌదాతో 11వ స్థానానికి పడిపోయింది. గతంతో పోలిస్తే స్కోర్ రెండు మార్కులు పెరిగినప్పటికీ ర్యాంక్ మాత్రం ఏకంగా 8వ స్థానాలు పడిపోయింది. ఉత్తమ ఫలితాల సాధనలో దక్షిణ భారతదేశానికి చెందిన కేరళ 75 స్కోరుతో మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. 74స్కోరుతో హిమాచల్ ప్రదేశ్, తమిళనాడులు వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. అత్యంత పేలవమైన పనితీరు కనబరిచి స్కోర్ కేవలం 53తో బీహార్ చిట్టచివరి స్థానంలో ఉంది. కేంద్ర పాలిత ప్రాంతాల్లో చండీగఢ్ మొట్టమొదటి స్థానంలో ఉంది.
వెనుకబడిన ధనిక రాష్ట్రం
అందరికి నాణ్యమైన విద్యుత్ అనే అంశంలో మినహా దాదాపు మిగిలిన అన్ని లక్ష్యాలలోను తెలంగాణ పనితీరు అథమంగానే ఉంది. తెలంగాణలో ప్రతి లక్షమందిలో దాదాపు 100మంది మహిళలపై వివిధ రకాల నేరాలు జరుగుతున్నాయని చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం 5శాతానికే పరిమితమైందని నివేదిక విశ్లేషించింది. పేదరిక నిర్ములనలో గతంలో 13వ స్థానంలో ఉండగా నేడు 17వ శాతానికి దిగజారింది. ప్రధానంగా రాష్ట్రంలో ఐదేండ్లలోపు పిల్లల్లో 30.8శాతం మంది బరువు తక్కువగా ఉన్నట్లు నిటిఆయోగ్ తెలిపింది. పిల్లలకు తల్లిపాలు, ప్రొటీన్లు, పౌష్టికాహారం అందకపోవడంతో బరువు తగ్గుతున్నారని పేర్కొంది. అలాగే పేదరికం కూడా ఇందుకు ఓ మూల కారణమని తెలిపింది. రాష్ట్రంలో 49.8శాతం మంది గర్భిణులు రక్తహీనతతో బాధపడుతున్నట్టు నిటిఆయోగ్ తన రిపోర్టులో పేర్కొంది. జనాభాకు తగిన వైద్య సిబ్బందిలో 10వ స్థానం నుంచి 19వ స్థానానికి పడిపోయింది. ఉపాధి, ఆర్థికవృద్ధిలో ఒకటి నుంచి మూడవ స్థానానికి పడిపోయింది. పరిశ్రమలు, ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాల కల్పనలో 10వ స్థానంలో నిలిచింది. పట్టణ ప్రాంతాల సురక్షితలో 5 నుంచి 15వ స్థానానికి వినియోగం, ఉత్పత్తిలో 15నుంచి 20వ స్థానానికి పడిపోయింది. శాంతి, న్యాయం, సంస్థల బలోపేతంలో 10 నుంచి 20వ స్థానానికి దిగజారింది. వాతావరణ పరిరక్షణ విషయంలో కనీస స్థాయిలోనే పనితీరు కనబరిచింది. గతేడాది మార్చిలో కరోనా వైరస్ ఫస్ట్ వేవ్ మొదలవగానే కొన్ని రాష్ట్రాలు హెల్త్ స్టాఫ్‌ను వేగంగా రిక్రూట్ చేసుకున్నాయి. ఇందులో కేరళ మొదటిస్థానంలో ఉంది. కేరళలో ప్రతి 10 వేల మందికి 115 మంది, ఆ తర్వాత ఏపీలో 95 మంది హెల్త్ స్టాఫ్ ఉన్నారు. హెల్త్స్టాఫ్ తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో కింది నుంచి మూడో స్థానంలో తెలంగాణ ఉంది. జనాభాకు తగ్గట్లు డాక్టర్లు, నర్సులను నియమించుకోవడంలో రాష్ట్ర సర్కార్ ఫెయిలైంది. రాష్ట్రంలో ప్రతి 10 వేల మందికి 10మంది డాక్టర్లు, నర్సులు, మిడ్‌వైవ్స్ మాత్రమే ఉన్నట్టు నిటిఆయోగ్ వెల్లడించింది.
తెలంగాణ వ్యయాలను తప్పుబట్టిన కాగ్
తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులో భారీ అంకెలతో గారడీ చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం పరుస్తూ ప్రజలను మభ్య పెడుతున్న విషయాలు కాగ్ బట్టబయలు చేసింది. అంకెలు చూసి సంబర పడడం తప్ప ఆచరణలో ఏమీ లేదని ధృవపరిచింది. గత ఏడాది కాగ్ సమర్పించిన ఏడు నివేదికలను శాసనసభ బడ్జెట్ సమావేశాల చివరిరోజున, ప్రవేశపెట్టారు. కాగ్ ఈ ఏడు నివేదికల్లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క డొల్లతనాన్ని దుబారాను ఎత్తిపడుతూ స్వతంత్ర వ్యయ నియంత్రణపై దృష్టి పెట్టాలని అభిప్రాయపడింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని వెల్లడించిన దాంట్లో నిజంలేదని పలు నివేదికలు బట్ట బయలు చేస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కీలక రంగాల అభివృద్ధి పట్ల దృష్టి సారించాలని సుస్థిరాభివృద్ది నివేదిక హెచ్చరిస్తుంది.
- డాక్టర్ ఎపున్నయ్య
సెల్:9948017934