Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఈసారి జీడీపీ పాతాళానికి పడిపోయింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో మైనస్ 7.3గా నమోదైంది. ఇటీవల జాతీయ గణాంకాల కార్యాలయం ఈ డేటాను విడుదల చేసింది. ఒక నిర్దిష్ట సంవత్సరంలో దేశంలో ఉత్పత్తి అయిన సరకులు, సేవల మొత్తం విలువను స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) అంటారు. అయితే జీడీపీ పడిపోవడానికి కారణమేమిటి.. కారకులెవరు? బాధితులెవరు.. బాధ్యతలేమిటి అనే చర్చ ఒకవైపు ఉండగా.. జీడీపీనే దేశ ప్రగతికి కొలమానమా! సామాన్య ప్రజల జీవితాల్లో వస్తున్న మార్పులను ఇది ప్రతిబింబిస్తుందా అనే ప్రశ్నకు సమాధానం వెతుక్కోవాల్సిన అవసరముంది.
'మైనస్' ఐదు సార్లు మాత్రమే..
భారతదేశ చరిత్రలో కేవలం ఐదు సార్లు మాత్రమే జీడీపీ మైనస్‌గా నమోదైంది. 1958లో మైనస్ 1.2శాతం, 1966లో మైనస్ 3.66శాతం, 1973లో మైనస్ 0.32శాతం, 1980లో మైనస్ 5.2శాతం నమోదైంది. ఈ సారి ఇది ఎన్నడూ లేనంతగా మైనస్ 7.3శాతంగా నమోదైంది. అయితే మైనస్‌గా నమోదవడానికి అనేక కారణాలు ఉన్నాయి. 1965-66లో ఇండియా - పాకిస్థాన్ యుద్ధం జరగడం వల్ల భారతదేశ ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. 1979-80లో జీడీపీ మైనస్‌గా నమోదు కావడానికి దేశంలో నెలకొన్న కరువు పరిస్థితులు కారణమయ్యాయి. అంతేకాకుండా ఇరాన్లో రివల్యూషన్ రావడంతో పెట్రో ఉత్పత్తులు తగ్గడం, వాటి ప్రభావం భారతదేశంపై కూడా పడింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో మైనస్ 7.3కి జీడీపీ పడిపోవడానికి కరోనా మహమ్మారి, లాక్‌డౌన్‌తోపాటు ప్రభుత్వ వైఫల్యాలు కూడా కారణమయ్యాయని చెప్పవచ్చు. కరోనాకు పూర్వం నాలుగు సంవత్సరాల కింది నుంచే జీడీపీ పతనం కావడం మొదలైంది. 2016-17లో జీడీపీ వృద్ధిరేటు 8.3శాతంగా ఉంటే, 2017-18లో అది 7శాతానికి తగ్గిపోయింది. 2018-19లో అది మరింతగా దిగజారి 6.1శాతానికి పడిపోయింది. ఇక 2019-20లో ఏకంగా 4.2శాతానికి పతనమైంది. అయితే సానుకూల విషయమేమిటంటే గత త్రైమాసానికి సంబంధించి 1.6వృద్ధి రేటు నమోదు కావడం. అంతేకాకుండా 2020-21 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ మైనస్ 7.5గా నమోదవుతుందని ఆర్బీఐ అంచనా వేయగా, ఇది మైనస్ 7.3గా నమోదు కావడం శుభపరిణామమే. కరోనా థర్డ్ వేవ్ లాంటి సమస్యలు రాకుంటే 2021-22 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 7 నుంచి 9.5గా నమోదు అయ్యే అవకాశ ముంచని అంచనా వేస్తున్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరం రూ.145లక్షల కోట్లుగా ఉన్న జీడీపీ 2020-21లో రూ.135లక్షల కోట్లకు పడిపోయింది. భారత జీడీపీ మళ్లీ రూ.145లక్షల కోట్ల స్థాయికి చేరాలంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో వృద్ధి రేటు 10 నుంచి 11 శాతం మేర నమోదు కావాల్సి ఉంటుంది.
166 దేశాల్లో మైనస్!
కరోనా మహమ్మారి విజంభణ, లాక్డౌన్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న 194 దేశాల్లో 166 దేశాల్లో జీడీపీ మైనస్‌గా నమోదైంది. అయితే 28 దేశాల్లో జీడీపీ వృద్ధి రేటు సానుకూలంగా ఉంది. వీటిలో చైనా, తైవాన్, బంగ్లాదేశ్, వియత్నాం లాంటి దేశాలు ఉన్నాయి. జీడీపీ హెచ్చు, తగ్గులకు నాలుగు అంశాలు ప్రధానంగా ప్రభావం చూపుతాయి. సామాన్య ప్రజల వ్యయ వినియోగం, కార్పొరేట్ల పెట్టుబడులు, ప్రభుత్వ వ్యయం, నికర ఎగుమతులు. కరోనా మహమ్మారి, లాక్డౌన్ కారణంగా ఉద్యోగాలు ఊడిపోయాయి. వ్యాపారాలు సాగలేదు. దీంతో ప్రజల దగ్గర డబ్బులు లేకుండాపోయాయి. గతేడాదితో పోల్చుకుంటే 97 శాతం దేశ జనాభా ఆదాయం గణనీయంగా పడిపోయిందని సీఎంఈఐ (సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ) అనే సంస్థ ఓ సర్వేలో తేల్చింది. భారతదేశంలో 7.5కోట్ల మంది ప్రజలు పేదరికంలోకి నెట్టివేయబడ్డారని అమెరికాకు చెందిన ప్యూ రీసెర్చ్ సెంటర్ వివరించింది. దీంతో 90 శాతం ప్రజలు అత్యవసర ఖర్చులకు మాత్రమే పరిమితమయ్యారు.
జీడీపీనే కొలమానమా..
దేశ ప్రగతికి జీడీపీనే కొలమానమని, జీడీపీ గణాంకాలు ఎంత ఎక్కువగా ఉంటే దేశ ఆర్థిక వ్యవస్థ అంత బలంగా ఉన్నట్టు, అన్ని రంగాలు అంతగా ముందుకు వెళ్తున్నట్టు భావిస్తారు. అయితే దేశ ప్రగతికి జీడీపీ ఒక్కటే పూర్తి కొలమానంగా భావించలేమని నిపుణులు చెబుతారు. జీడీపీ ఇండికేటర్ అనేది సామాన్య ప్రజల జీవితాలను ప్రతిబింబించదు. ఉదాహరణకు మనం ఓ రోడ్డు పనులనే తీసుకుందాం.. పది కిలోమీటర్ల రోడ్డును ప్రభుత్వం వేయిస్తే.. దాంట్లో అవినీతి జరిగి, రోడ్డు నాణ్యత లేకపోవడం వల్ల కొన్నాళ్లకు అది పూర్తిగా దెబ్బతింటుంది. దీంతో ప్రభుత్వం మళ్లీ అక్కడ రోడ్డు వేయిస్తుంది. ఇలా పదేండ్లలో మూడు నుంచి నాలుగు సార్లు జరుగుతుంది. ఒకే రోడ్డు పదేండ్ల పాటు మన్నికగా ఉండటంతో పోల్చుకుంటే మూడు నాలుగు సార్లు రోడ్డు వేయడం జీడీపీ వృద్ధికి ఉపకరిస్తుంది. అయితే అలా చేయలేం కదా! ప్రపంచంలోని వివిధ దేశాలు జీడీపీ వృద్ధిని చూపెట్టడానికి ప్రజలకు ఉపయోగంలోకి రాని, లాభంలేని అనేక పనులను చేస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. జీడీపీ వృద్ధి చెందుతుందంటే దాని వల్ల సామాన్య ప్రజలకు అనేక రకాలుగా సౌలభ్యం ఏర్పడుతున్నాయని, వారు ఆనందంగా ఉంటున్నారని చెప్పలేం. ఉదాహరణకు ఒకరు చౌక ధరలో నేరుగా ఆన్లైన్ ద్వారా విమాన టికెట్టును కొన్నారనుకుందాం. దీంతో జీడీపీకి అంతగా లాభముండదు. అదే సమయంలో అదే వ్యక్తి ఒక ట్రావెల్ ఏజెంట్ ద్వారా టికెట్టును కొంటే, ఆ ట్రావెల్ ఏజెంట్ ఓ వైబ్ సైట్లో రీసెర్చ్ చేస్తే.. అలా మధ్యవర్తులు పెరిగితే.. వ్యయం పెరుగుతుంది. తద్వారా ఇది జీడీపీ వృద్ధికి ఉపకరిస్తుంది. అయితే అలా చేయడానికి ఎవరూ ఇష్టపడరు కదా! జీడీపీ అనేది దేశ సగటు ప్రగతిని చూపిస్తుందే తప్ప సంపద పంపిణీ ఎలా జరుగుతుందో చెప్పదు. జీడీపీని లెక్కించాలంటే వినిమయ వ్యయం, ప్రభుత్వ వ్యయం, పెట్టుబడి వ్యయం, నికర ఎగుమతులను లెక్కలోకి తీసుకుంటారు. 94శాతంగా ఉన్న అసంఘటిత రంగాన్ని జీడీపీ గణాంకాలు లెక్కలోకి తీసుకోవు. దీంతో ఆ రంగం పరిస్థితి జీడీపీ గణాంకాల్లో ప్రతిఫలించదు. అసంఘటిత రంగాన్ని పరిగణనలోకి తీసుకుంటే జీడీపీ అనేది మరింత దారుణంగా ఉంటుంది. దేశ ప్రగతికి జీడీపీని పూర్తి స్థాయిలో కొలమానంగా భావించకున్నా.. దీన్ని పూర్తిస్థాయిలో పట్టించుకోకుండా ఉండలేం. దేశ ఆర్థిక సగటును చూడాలంటే జీడీపీ ఒక ముఖ్యమైన సూచిక అని మాత్రం చెప్పవచ్చు. ఆర్థికవ్యవస్థకు సాయపడటానికి అవసరమైన విధానాలను రూపొందించటానికి విధానకర్తలు జీడీపీ గణాంకాలను ఉపయోగించుకుంటారు. భవిష్యత్ ప్రణాళికలను నిర్ణయించటానికి ఒక కొలమానంగా జీడీపీ గణాంకాలు ఉపయోగపడతాయి. అయితే జీడీపీ దాస్తున్న విషయాలను తెలుసుకోవాలంటే ఇతర సూచికలపై కూడా ఆధారపడాల్సిన అవసరముంది. ఆకలి, శాంతి, పర్యావరణ పనితీరు, వాయు కాలుష్యం, లింగ అసమానత, మానవ అభివృద్ధి తదితర సూచికలను పరిగణనలోకి తీసుకుంటేనే నిజమైన అభివృద్ధిని లెక్కించవచ్చు. అప్పుడే దేశ ప్రగతిని పూర్తిస్థాయిలో తెలుసుకునే అవకాశముంటుంది.
ప్రభుత్వ వ్యయం పెరగాల్సిన అవసరం..
జీడీపీ వృద్ధిని పెంచాలంటే, సామాన్య, పేద ప్రజలకు సహాయ పడాలంటే ప్రభుత్వాలు తమ వ్యయాలను పెంచాల్సిన అవసరముంది. సెంట్రల్ విస్టా లాంటి ప్రాజెక్టులపై కాకుండా.. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చేలా ప్రభుత్వ వ్యయం ప్రస్తుతం అవసరమని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం ప్రభుత్వానికి సూచించారు. కరోనా మహమ్మారి సమయంలో కేంద్రం తీసుకున్న చర్యల వల్ల సరఫరా వ్యవస్థ కాస్త మెరుగుపడిందని చెప్పవచ్చు. తయారీ రంగం కొంతైనా పుంజుకున్నట్టు పన్నుల వసూళ్లను బట్టి తెలుస్తోంది. కానీ ఆ తయారైన ఉత్పత్తులను కొనేవారు కరువయ్యారు. అమెరికాతోపాటు పలు దేశాలు చేసిన విధంగా తమ పౌరులకు నేరుగా నగదు బదిలీ చేసి ఆదుకుంటే సానుకూల ఫలితాలు వచ్చే అవకాశముంటుంది. ప్రజల చేతుల్లోకి డబ్బు వస్తే ఖర్చు పెరిగి, జీడీపీ వృద్ధి అయ్యే అవకాశాలున్నాయి. కరోనా టీకాలు కూడా సాధ్యమైనంత త్వరగా అందరికీ అందు బాటులోకొస్తే ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరిగి, అన్నీ రంగాలూ క్రమేపీ పుంజుకునే అవకాశాలున్నాయి.
- మహమ్మద్ అరిఫ్
సెల్:9618400190