Authorization
Mon Jan 19, 2015 06:51 pm
1960ల్లో నార్మన్ బోర్లాగ్ నాయకత్వంలో వచ్చిన హరిత విప్లవంతో వరి, గోధుమ లాంటి పొట్టి పంటలను ఏండ్ల తరబడి సాగుచేయడంతో నేలలు నిస్సారమై ఎడారీకరణకు బీజాలు పడ్డాయి. 1970ల్లో వచ్చిన స్వల్పకాలిక వరి వంగడాల సాగుతో దిగుబడులు పెరిగినా, నాణానికి మరో వైపులా సారవంతమైన వ్యవసాయ నేలలు క్రమంగా నిస్సారమైన ఎడారులుగా మారే ప్రమాదపు అంచున ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యూపీ, బీహార్, పశ్చిమ బెంగాల్ లాంటి గంగా పరివాహక ప్రాంతాల్లో 5మిలియన్ హెక్టార్ల వ్యవసాయ క్షేత్రాలు ఎడారీకరణకు చేరువలో ఉన్నాయని శాస్త్రజ్ఞులు సూచిస్తున్నారు. సారవంతమైన నేలల్ని అవగాహనలేమి, అశాస్త్రీయ సాగు పద్ధతులతో నిస్సారమైన ఎడారి భూములుగా మార్చటంతో కరువుకాటకాలు పెరుగుతున్నాయని గమనించిన ఐరాస ప్రతి ఏటా జూన్ 17న 'ప్రపంచ ఎడారీకరణ, కరువు వ్యతిరేక పోరు దినం' పాటించట జరుగుతున్నది. భూగోళంపై ఉన్న నేలలో 40శాతం వరకు నీటి వసతులులేని బీడు భూములే (డ్రై లాండ్స్) ఉన్నాయని, ఈ భూముల్లో 2బిలియన్ల ప్రజలు జీవిస్తున్నారని అంచనా. ప్రపంచవ్యాప్తంగా 12మిలియన్ ఘనపు కిలోమీటర్ల శుష్క భూములు (అరీడ్ లాండ్స్) ఎడారీకరణకు లోనైనాయని, దాదాపు 20శాతం బీడు భూములు క్షీణత(డీగ్రెడేషన్)కు గురి అయ్యాయని గణాంకాలు వివరిస్తున్నాయి. భూగోళంపై ఉన్న 20శాతం నేలల్లో సగం వరకు ఎడారీకరణ ప్రమాదపు అంచున ఉన్నాయని, ప్రతి ఏటా 12మిలియన్ హెక్టార్ల సారవంతమైన నేల ఎడారీకరణ ఉచ్చులో పడుతున్నదని తేలింది. ఈ అవాంఛనీయ సంక్షోభ ఫలితంగా 3బిలియన్ల ప్రజలు ఆహార కొరతతో పేదరికంలోకి నెట్టబడడం జరుగుతున్నది. ఈ దుష్పరిణామాల వల్ల ఒక బిలియన్ ప్రజల ఆకలి చావులు పెరుగుతాయని పేర్కొనబడింది.
సహజ విపత్తులు లేదా మానవ కృత్రిమ కార్యాల వల్ల సారవంతమైన నేల నిర్వీర్యం, నిస్సారం కావడాన్ని ఎడారీకరణగా పేర్కొంటారు. ఈ నేలలకు పోషకాలను అందిస్తూ, వెంటనే సారాన్ని అందించని యెడల వ్యవసాయ యోగ్యతను కోల్పోయి, వ్యవసాయ వినియోగానికి పనికి రాకుండా శుష్క భూములుగా మారిపోతాయని గమనించాలి. సకాలంలో స్పందించని యెడల కొంత కాలానికి నేల నాణ్యత నశించి, క్రమంగా వ్యవసాయ దిగుబడులు పూర్తిగా తగ్గి, శాశ్వితంగా కోలుకోలేని దుస్థితికి చేరుతూ ఎడారులను తలపిస్తాయి. నేలను అత్యాశతో సాగుకు వాడితే పర్యావరణ కాలుష్యం, వాతావరణ ప్రతికూల మార్పులు, జీవ వైవిధ్య వినాశనం, అంటువ్యాధులు ప్రబలడం జరుగుతాయి. దీని పర్యవసానంగా నీటి కొరత, జీవన భృతి, ప్రకతి విపత్తులు కూడా చూడవచ్చు. వెంటనే మానవ సమాజం మేల్కొని ఎడారీకరణకు అడ్డుకట్టవేయని యెడల రాబోయే 25ఏండ్లలో 12శాతం ఆహార ఉత్పత్తి పడిపోయి, 30శాతం ఆహార ఉత్పత్తుల ధరలు పెరగడం, పేదరికం పెరగడం జరిగి, ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను అధిగమించడం వీలుకాని దుస్థితి వస్తుందని గమనించాలి. 2030 వరకు 350మిలియన్ హెక్టార్ల నిస్సార ఎడారి భూముల నాణ్యతను పునర్ ప్రతిష్టాపన చేయడంతో దాదాపు 26గీగా టన్నుల గ్రీన్‌హౌజ్ వాయువులు వాతావరణలోంచి తొలగించబడుతాయని అంచనా వేస్తున్నారు. ఎడారీరకణను కట్టడి చేయడంతో వ్యవసాయ ఉపాధులు, అనుబంధ పరిశ్రమలు, పోషకాహార లభ్యత, నీటి లభ్యత, జీవ వైవిధ్య పరిరక్షణ పెరిగి వాతావరణంలో సకారాత్మక మార్పులకు పునాది పడుతుంది.
కృత్రిమ ఎరువులు అధికంగా వాడడం, విచక్షణారహిత రసాయనాల వాడకం, అధిక నీటి వినియోగంతో దిగుబడులు పెరిగి ఆహార భద్రత సుసాధ్యమైనప్పటికీ ఏకకాలంలో ఎడారీకరణ కూడా పెరగడం విచారకరం. నేలలోని సారాన్ని అనేకేండ్లుగా దురాశతో లాగుతూ, దిగుబడులను పెంచుకునే ప్రయత్నాలలో రసాయన ఎరువులు, పురుగు మందులు వాడడంతో నేలలోని హిత సూక్ష్మజీవులు, ఇతర జీవులు నశించడంతో సారవంతమైన నేలలు క్రమంగా నిస్సారమై ఎడారీకరణకు చేరువ కావడం చూస్తుండగానే జరిగిపోయింది. నేల ఎడారీకరణ, నేల కోత, నేల నాణ్యతలో క్షీణతలు కాలక్రమంలో జరగడం వాస్తవ అనుభవంగా గుర్తిస్తున్నాం. అడవుల నరికి వేత, పచ్చిక బయళ్లు / చెట్టు చేమల్ని తొలగించడం, పశుగ్రాస వినియోగం, వ్యవసాయ క్షేత్రాల విస్తరణ, రోడ్ల నిర్మాణం, పట్టణీకరణ, పారిశ్రామికీకరణ లాంటి మానవ ఆధునిక క్రియలు ఎడారీకరణను అనేక రెట్లు పెంచడం జరిగింది. అత్యాధునిక యంత్రాల వినియోగం, ఒకే రకమైన పంటలు వేయడం, నేల నాణ్యతను అతిగా పీల్చడం, నేల కాలుష్యం లాంటి కారణాలతో నాణ్యమైన నేలలు నిస్సారమై ఎడారులను తలపించుట ప్రారంభమైంది. ఆహార వ్యర్థాలను తగ్గించడంతో పాటు పంట మార్పిడి పద్ధతులు, పరిమిత పట్టణీకరణ, విచక్షణాయుత ఎరువులు/ పురుగు మందులు వాడకం లాంటి అనేక చర్యలు ఎడారీకరణను అడ్డుకుంటాయి. మానవ కనీస అవసరాలైన కూడు, గుడ్డ, గూడులను అందించుటలో సారవంతమైన నేలలు ప్రధాన భూమికను నిర్వహిస్తున్నాయని, నేల సారాన్ని కాపాడడమంటే జీవన ప్రమాణాలను పెంచుకోవడమే అని భావిద్దాం. నాణ్యమైన మట్టి సువాసనను ఆస్వాదిస్తూ, పిడికిళ్లోకి తీసుకొని ముద్దాడుదాం.
- డా||బుర్ర మధుసూదన్‌రెడ్డి
సెల్: 9949700037