Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒకప్పుడు మన దేశంలో కన్యాశుల్కం ఉండేది. వృద్ధులు బాలికల తల్లిదండ్రులకి కొంత మొత్తం ముట్టచెప్పి చిన్నారులని వివాహం చేసుకునేవారు. వయోభారంతో ఆ వృద్ధులు మరణిస్తే బాలికలకు తిరిగి వివాహం చేసేవారు కాదు. మరికొన్ని ప్రాంతాల్లో భర్త మరణిస్తే, భార్యని సతీసహ గమనం పేరుతో చంపేవారు. పూలే దంపతులు, కందుకూరి, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ వంటి మహనీయులు చేసిన కృషి ఫలితంగా దేశంలో బాలికల స్థితిగతులలో కొంత మార్పు వచ్చింది. ఒకవైపు ప్రపంచం సాంకేతికంగా, ఆర్థికంగా వృద్ధి చెందుతోంది. మరోవైపు బాల్య వివాహాలు ఇప్పటికీ ఒక సమస్యగానే మిగిలి ఉన్నది. మరోవైపు 'బేటీ బచావ్షోబేటీ పడావో' వంటి పథకాలతో దేశంలో బాలికల సంక్షేమానికి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. అయితే, ప్రపంచంలో బాల్య వివాహాలు అధికంగా నమోదవుతున్న ఐదు దేశాల్లో భారత్ ఒకటిగా ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. యూనిసెఫ్ విడుదల చేసిన ఒక నివేదికలో ఈ విషయం వెల్లడైంది. 'కోవిడ్19 : ఎ త్రెట్ టు ప్రొగ్రెస్ అగైనెస్ట్ చైల్డ్ మ్యారెజ్' నివేదిక ప్రకారం.. 18ఏండ్ల కంటే తక్కువ వయసున్న బాలికల వివాహాలు జరుగుతన్న ఐదు దేశాల్లో భారత్ ఒకటి. ప్రపంచంలో ఇప్పుడున్న 65కోట్ల మంది బాలికలు, మహిళలకు తమ చిన్నతనంలోనే వివాహాలు జరిగాయి. ఇందులో దాదాపు సగం వరకు బంగ్లాదేశ్, బ్రెజిల్, ఇథియోపియా, ఇండియా, నైజీరియా దేశాలకు చెందినవే. ఇక సబ్సహారన్ ఆఫ్రికాలో 35శాతం మంది మహిళలకు 18ఏండ్ల కంటే తక్కువ వయసు ఉన్నప్పుడే పెళ్లిళ్లు జరిగాయి. బాల్య వివాహాలు జరిగిన వారి సంఖ్య దాదాపు 30శాతం మందితో దక్షిణాసియా తర్వాతి స్థానంలో ఉన్నది. లాటిన్ అమెరికా, కరెబియన్లలో 24శాతం బాల్య వివాహాలు నమోదయ్యాయి. మిడిల్ ఈస్ట్, ఉత్తర ఆఫ్రికాలలో 17శాతం, తూర్పు యూరప్, మధ్య ఆసియాల్లో దాదాపు 12శాతంగా ఉన్నాయి. కోవిడ్-19 కారణంగా నెలలు తరబడి పాఠశాలల మూసివేత, ఆర్థిక ఇబ్బందులు, తల్లిదండ్రుల మరణాలు వంటి కారణాలతో బాల్య వివాహాల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉన్నదని హెచ్చరించింది. 'కరోనా మహమ్మారి ఇప్పటికే బాలికలపై తీవ్ర ప్రభావం చూపింది. వారిని ఇబ్బందుల్లోకి నెట్టింది. బాల్య వివాహాలు వారి స్వేచ్ఛను హరిస్తాయి. కాబట్టి, వీటిని తప్పక నిర్మూలించాలి అని యూనిసెఫ్ తెల్పింది.
బాల్య వివాహాలతో అనేక సమస్యలు వస్తాయి. వయసు పరిణితి చెందకపోవడంతో బాలికలు వివాహ అనంతరం భర్త కుటుంబ సభ్యులతో ఎలా మెలగాలో తెలియదు. వారిలో హార్మోన్ల సమస్యలు తలెత్తుతాయి. గర్భ స్రావాలు జరిగే అవకాశం ఉంది. శిశు మరణాలు అధికం అవుతాయి. పుట్టిన శిశువులు బలహీనంగా ఉంటారు. బాల్య వివాహాలని నియంత్రణ చేయాలంటే వివాహ నమోదుపై దృష్టి పెట్టాలి. వివాహాలు జరిపే మత గురువుల యొక్క అనుమతి పత్రాలని ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమ్మ ఒడి వంటి పథకాన్ని అమలు చేస్తుంది. ఇటువంటి పథకాన్ని ప్రతి రాష్ట్రంలో బాలికలకు వర్తింపచేయాలి. కె.జి.బి.వి.లని మరిన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి. బాలికల కోసం పని చేసే పలు సంస్థలున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాలలో వీటికి భాగస్వామ్యం కల్పించాలి. ప్రతి సంవత్సరం జనవరి 24న జాతీయ బలికా దినోత్సవం జరుపుతాం. ఆక్టోబర్11న అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ దినోత్సవాలకి మహిళా దినోత్సవానికి ఇచ్చిన ప్రాధాన్యతని ఇవ్వాలి. కేరళ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు చాలావరకు బాలికా సాధికారతని సాధించాయి. ఈ మార్గంలో మిగతా రాష్ట్రాలు పయనించాలి.
- ఎం.రామ్ప్రదీప్
సెల్:9492712836