Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రజాజీవనం ఇం'ధనం'తోనే ముడిపడి ఉంటుంది. అత్యవసర సరుకుల నుంచి విలాసవంతమైన వస్తువుల వరకు ధరల నియంత్రణ ఇంధన రేట్లతో సంబంధం కలిగి ఉంటాయి. నేడు డీజిల్, పెట్రోల్ ధరలు సెంచరీ దాటి వేగంగా ముందుకు దూసుకుపోతూ, సామాన్యుల బతుకులను మరింత జటిలం చేస్తున్నాయి. కరోనా మహావిపత్తు భయంతో పాటు ఇంధనాల రేట్లు పెరగడం అన్ని వర్గాల ప్రజలను కలవరపెడుతున్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డీజిల్, పెట్రోల్ ధరల పెరుగుదల పట్ల తమకు ఏ సంబంధం లేదన్నట్లు చేతులు దులుపుకోవడం విచారకరం. దేశంలోనే తొలిసారి 12 జూన్ 2021న రాజస్థాన్ గంగానగర్‌లో డీజిల్ లీటర్ ధర రూ.100.05 దాటడం జరిగింది. 29 మే 2021న ముంబాయిలో తొలిసారి పెట్రోల్ లీటరు ధర రూ.100.99 చేరడం మనకు తెలుసు. గత 40 రోజుల్లో డీజిల్, పెట్రోల్ ధరలు 23 సార్లు పెరగడంతో కరోనా రెండవ వేవ్ వ్యాప్తికి సమానంగా ఇంధనాల ధరలు పెరగడం జరుగుతున్నది. 12 జూన్ 2021 శనివారం లీటరు పెట్రోల్ ధర 27 పైసలు, డీజిల్ ధర 23 పైసలు పెరగడంతో పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ మైలురాయి దాటడం సామాన్యులను కలవరపెడుతున్నది. ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం 4 మే 2021 నుంచి నేటి వరకు పెట్రోల్ ధర లీటరుకు రూ.5.72, డీజిల్ ధర రూ.6.25 పెరగడంతో వంద మార్కు దాటి దూసుకు పోతున్నాయి. రాష్ట్రాల పన్నులు (స్టేట్ టాక్స్), లోకల్ లేవీస్ ఆధారంగా ఇంధన ధరలు వివిధ ప్రాంతాల్లో వేరు వేరుగా నిర్ణయించబడతాయి. నేడు దేశ మెట్రో నగరాల్లో అత్యధిక రేట్లు ముంబాయిలో పెట్రోల్ రూ.102.30, డీజిల్ రూ.94.39 లీటరుకు లభిస్తున్నది. ఇప్పటికే పెట్రోల్ ధర రూ.100 మార్కు దాటడం మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, ఎంపి, కర్నాటక రాష్ట్రల్లో జరిగింది.
అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం కారణమని కేంద్ర ప్రభుత్వం చెపుతున్నా, కేంద్ర రాష్ట్రాల పన్నులు అధికంగా ఉండడంతో పెట్రోల్, డీజిల్ ధరలు రాకెట్ వేగంతో దూసుకు పోతున్నాయన్నది నిజం. గత సోమవారం 7 జూన్‌లో చమురు బారెల్ ధర రూ.71.49 ఉండగా, వారాంతం శుక్రవారం 11 జూన్‌లో రూ.72.69కు పెరిగింది. 1 జూన్ 2021 వివరాల ప్రకారం లీటరు పెట్రోల్‌పై సెంట్రల్ లేవీ 34.8శాతం, రాష్ట్ర టాక్స్ 23.08శాతం ఉన్నది. డీజిల్ లీటరు ధరపై సెంట్రల్ లేవీ 37.24శాతం, స్టేట్ టాక్స్ 14.64శాతం ఉంటుంది. కరోనా విపత్తు కారణంగా 2020లో అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ పెంచడం వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గలేదు సరి కదా మరింత పెరిగాయి. ఇదే రీతిలో రాష్ట్రాలు కూడా తమ పన్నులను తగ్గించే ప్రయత్నాలు చేయలేదు. 26 జూన్ 2010లో పెట్రోల్, 19 అక్టోబర్ 2014న డీజిల్ ధరలను డీరెగ్యులేట్ చేసిన కేంద్ర ప్రభుత్వం ఐఓసి, బిపిసియల్, హెచ్‌పిసియల్ లాంటి పబ్లిక్ సెక్టార్ కంపెనీలకు దేశీయ ధరలు పెంచుకునే అధికారాన్ని 'డైనమిక్ ఫుయల్ ప్రైసింగ్ వ్యవస్థ' ద్వారా కట్టబెట్టడంతో ధరల నియంత్రణ ప్రభుత్వాలపై లేకుండా పోయింది. పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభావితం చేసే అంశాల్లో ముడి చమురు ధరలు, డిమాండ్ పెరగడం, సప్లయి డిమాండ్ల మధ్య వ్యత్యాసం, కేంద్ర రాష్ట్రాల పన్నులు, డాలర్ మారకం రేటు, రవాణా చార్జీలు లాంటివి ముఖ్యమైనవిగా గుర్తించాలి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌లో లీటరు పెట్రోల్ రిటైల్ ధర రూ.91.38 ఉన్నట్టు అయితే అందులో చమురు కంపెనీల డీలర్ బేస్ ప్రైస్ (రవాణాతో కలిపి) రూ.29.7, స్టేట్ టాక్స్ రూ.25, సెంట్రల్ టాక్స్ రూ.33, డీలర్ కమిషన్ రూ.3.69 ఉంటుంది. 1 ఫిబ్రవరి 2021 వివరాల ప్రకారం ఇండియాలోకి రాష్ట్రాల్లో మహారాష్ట్ర థానేలో స్టేట్ టాక్స్ అత్యధికంగా రూ.26.86, మహారాష్ట్ర ఇతర ప్రాంతాల్లో రూ.26.22, ఎంపిలో రూ.25.96, ఆంధ్రప్రదేశ్‌లో రూ.24.69, రాజస్థాన్‌లో రూ.24.68గా వసూలు చేయబడుతున్నది.
కరోనా విపత్తు నుంచి కోలుకుంటున్న వినియోగదారులను రక్షించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డీజిల్, పెట్రోల్‌పై విధిస్తున్న పన్నులను కొంత మేరకైనా తగ్గించే దిశగా ఆలోచించాలి. కేంద్ర ప్రభుత్వం మరీ దుర్మార్గంగా టాక్స్‌లు, సెస్‌లు పెంచుతున్నది. చమురు ధరలతో మార్కెట్లో అన్ని సరుకులు, వస్తువుల ధరలు పెరగడం, ద్రవ్యోల్బనం ప్రభావితం కావడం జరుగుతుంది. కోవిడ్-19 కల్లోలంలో పేదరికం పెరిగిన నేపథ్యంలో మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టు డీజిల్, పెట్రోల్ ధరలకు రెక్కలు రావడం నిరుపేదలను మరింత సంక్షోభంలోకి నెట్టినట్టు అవుతున్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ పన్నులను సత్వరమే తగ్గించి పేదలను ఆదుకోవాలని ప్రజలు ఆశిస్తున్నారు.
- డా||బుర్ర మధుసూదన్‌రెడ్డి
సెల్: 9949700037