Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ ప్రభుత్వం ఆదాయం పెంచుకోవడం కోసం ప్రభుత్వ భూముల్ని అమ్మడం తీవ్ర ఆక్షేపనీయం. అసలు ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మడం ఏంటి? ప్రజా ఆస్తులకి ధర్మకర్తగా ఉండాల్సిన ప్రభుత్వం ఈ రకంగా భూములను అమ్మాలని నిర్ణయం తీసుకోవడం నిజంగా అనాలోచిత నిర్ణయం.
ఇప్పటికే సెజ్‌ల పేరుతో, పరిశ్రమల పేరుతో, స్టూడియోల పేరుతో, బాబాలకు ఆశ్రమాల పేరుతో తెలంగాణలో వేలాది ఎకరాల భూమి అన్యాక్రాంతం అయింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తరువాత భూముల విలువ అనేక రెట్లు పెరిగింది. ప్రస్తుత భూమి ధర కోట్లలో పలుకుతుంది. ఈ నేపథ్యంలో గతంలో అన్యాక్రాంతం కాగా, మిగిలిన భూములు కూడా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు కబ్జా చేసే పనుల్లో ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. సుమారు 70మంది ఎమ్మెల్యేల మీద భూ ఆక్రమణ ఆరోపణలు ఉన్నాయి. మరి ఈ ఆక్రమణల నుంచి ప్రభుత్వ భూముల్ని కాపాడాల్సిన ప్రభుత్వం అటువైపు చర్యలు తీసుకోకపోగా ఉన్న భూముల్ని అమ్మాలనుకోవడం మరీ దౌర్భాగ్యం.
ప్రభుత్వ భూ కేటాయింపులను చూస్తే ఒక్కోసారి చాలా విస్మయం కలుగుతుంది. పేదవాడు తనకు ఇంటిజాగా కోసం 60గజాలు అడిగితే కాల్చిచంపిన ముదిగొండ లాంటి సంఘటనలు చూసాం. ఇప్పటికీ అనేక కుటుంబాలు కనీసం సొంత నివాస స్థలాలు లేక అద్దె ఇళ్లల్లో ఉంటున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇంకా కలగానే మిగిలిపోయింది. ఒక వైపు తెలంగాణ ఉద్యమంలో ప్రధాన హామీగా ఉన్న దళితులకు మూడెకరాల భూమి ఒక హామీగానే మిగిలిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ''భూ పంపిణీ నిరంతర ప్రక్రియ అని, ప్రభుత్వం భూమి దొరకని చోట కొని దళితులకు పంపిణీ చేస్తుందని'' చెప్పారు. మరి దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఒక్క ఎకరా కూడా కొనుగోలు చేయలేదు. పేదలకు ఇవ్వాల్సి వస్తే ఇంత నిర్లక్ష్యంగా ఉండే ప్రభుత్వాలు బడా బాబులకు మాత్రం ఎంతో ఉదారత చూపిస్తాయి.
తెలంగాణ వస్తే రామోజీ ఫిల్మ్ సిటీని లక్ష నాగళ్లతో దున్నుతా అన్న కేసీఆర్ ర్రాష్ట ఏర్పాటు తరువాత అదే ఫిల్మ్ సిటీలో ప్రతిపాదిత ''ఓం సిటీ''కి భూములను కేటాయించడానికి నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. తనకు ఇష్టమైన చినజీయర్ స్వామికి యాదగిరిగుట్ట దగ్గర అతి విలువైన భూముల్ని అతి తక్కువ ధరకే ఇస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కొత్తగా ఒక సిమెంట్ కంపెనీ కోసం తనకు దగ్గరివాడుగా చెప్పుకొనే ఒక వ్యక్తికి ఆరువందల ఎకరాలకు పైగా ఇస్తున్నట్టు సమాచారం. ఇలా బడాబాబులకు భూ కేటాయింపుల విషయంలో చేతికి ఎముక లేనట్టు ప్రవర్తించే ప్రభుత్వాలు పేదవాడి విషయంలో మాత్రం చాలా కఠినత్వం ప్రదర్శిస్తున్నాయి.
దళితులకు మూడెకరాల భూ పంపిణీకి భూ కొరత ప్రధాన సాకుగా చెపుతున్న ప్రభుత్వం. ఇప్పుడు ప్రభుత్వ భూముల్ని అమ్మడం ఏ విధంగా చూడాలి. ఇవ్వాల దళితులే కాదు అనేక కుటుంబాలు కనీసం సాగు భూమి ఏమో కానీ ఉండడానికి ఇల్లు కూడా లేని దౌర్భాగకర పరిస్థితుల్లో ఉన్నాయి. మనిషి మనుగడకు ప్రాథమిక అంశాలైన కూడు గుడ్డ ఆవాసం అందించడం సంక్షేమ రాజ్యం యొక్క ప్రథమ లక్షణం. మరి వీటిని విస్మరించి. మిగిలిన భూమిని కూడా విక్రయించాలనుకోవడం అక్రమం, అన్యాయం. ఇది భవిష్యత్ తరాలకు ప్రభుత్వ భూమి లేకుండా చేస్తుంది. నిజంగా ప్రభుత్వం చెపుతున్నట్టు ఖజానాకు ఆదాయం కావాలంటే అనేక ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనంతగా ఎక్కువగా తెలంగాణలో శాసనసభ్యుల వేతనాలు ఉన్నాయి. ఒక్కొక్క ఎమ్మెల్యే రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల వరకు ప్రతీనెల వేతనాల రూపంలో పొందుతున్నారు. కరోనా వల్ల కుదేలైన ఆర్థిక వ్యవస్థ మళ్ళీ గాడిన పడేంత వరకు వాళ్ళ వేతనాలు బాగా తగ్గించవచ్చు కదా? అయినా ప్రజా సేవ పేరుతో ఎమ్మెల్యేలుగా గెలిచిన వారికి లక్షల్లో వేతనాలు ఎందుకో! ఇంకో ప్రత్యామ్నాయ మార్గం. చిన్న సన్నకారు రైతులకు మాత్రమే రైతుబంధు వర్తింపచేయడం. ఇప్పటికే రైతుబంధు భూస్వాములకు విందుగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి. కేవలం ఐదు ఎకరాల లోపు రైతులకు మాత్రమే రైతుబంధు వర్తింపచేయడం ద్వారా ఒక సీజన్‌కు రెండువేల ఐదు వందల కోట్లు ఖజానాకు మిగులుతాయి. ఇలా రెండు సీజన్లకు కలిపి సంవత్సరానికి ఐదువేల కోట్లు మిగులుతాయి. ఇలాంటి ప్రత్యమ్నాయ ఆలోచనల ద్వారా ఆదాయం పెంచే మార్గాలు చూడాలి తప్ప ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మడం ద్వారా కాదు. ఇకనైనా ప్రభుత్వం ఆలోచించి భూ విక్రయ ఆలోచనను విరమించుకుని ఆ భూములను భవిష్యత్ అవసరాలకు వినియోగించే విధంగా చూడాలి.
పరమేష్ అనంగళ్ల
సెల్:7672030609