Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశ్వవ్యాప్తంగా కరోనా ఉధృతిలో ఎందరో మునిగి పోయారు. దేశంలో లక్షలాదిమంది ప్రాణాలు తీసుకొని కోట్లాది మందిని ఇబ్బంది పెట్టి ఎప్పటికప్పుడు రంగులు మార్చుకుంటూ మానవ మనుగడకు పెను సవాల్ విసురుతున్న కంటికి కనబడని సూక్ష్మ జీవిని ఎదిరించే క్రమంలో మానవుడు నేటివరకూ పోరాడుతూనే ఉన్నాడు. దాదాపుగా ఏడాదిన్నరగా కరోనా విలయతాండవంలో నలిగి పోయిన కుటుంబాలలో ఎక్కువగా మధ్యతరగతి కుటుంబాలే ఉన్నాయి. కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఏదో ఒక చిరు ఉద్యోగం ఇన్నాళ్లు ఆసరాగా ఉండేది. కానీ కరోనా వల్ల అలాంటి చిరుద్యోగాలు మొదలు సాఫ్ట్వెర్ ఉద్యోగాల వరకు వివిధరకాల ఉద్యోగాలు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఎందరో ఉన్నారు. మొదటి దశలో కరోనా వైరస్ వల్ల ఉద్యోగాలు కోల్పోయిన వారి సంఖ్య తక్కువే కాదు. కానీ రెండవ దశ ఉధృతిలో గతరెండు నెలల్లోనే రెండు కోట్లకుపైగా ఉద్యోగాలు కేవలం కరోనా వల్లే కొల్పవడం విచారకరం. ఏప్రిల్, మే నెలల్లో దేశ వ్యాప్తంగా 2.27 కోట్ల మంది బతుకు తెరువు కోల్పోయి దిక్కుతోచని స్థితిలోకి వెళ్లారని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ సీఈఓ ప్రటించారంటే వైరస్ ఎంత ప్రభావితం చేసిందో అర్థం చేసుకోవచ్చు. మన దేశంలో 40కోట్ల మంది వివిధ స్థాయిల్లో ఉద్యోగులు ఉంటే ఇందులో సుమారు 2.27 కోట్ల మంది గడిచిన రెండునెలల్లోనే ఉద్యోగాలు కోల్పోవడం, అదికూడా కరోనా వైరస్ వల్లనే కావడం అనేది బాధ పెట్టె అంశం. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా గడిచిన ఏడాదిలో 10.8కోట్ల మంది పేదరికంలోకి జారిపోయారని ఐక్యరాజ్య సమతి నివేదిక వెల్లడించింది. వచ్చే ఏడాది 20కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోవచ్చని కూడా అంచనా వేసింది. ఉద్యోగకల్పన అంతంత మాత్రంగా ఉన్నందున 2023 వరకు ఇబ్బందులు తప్పవని అంతర్జాతీయ కార్మిక సంస్థ, వరల్డ్ ఎంప్లాయిమెంట్ అండ్ సోషల్ అవుట్‌లుక్‌లో వివరాలు వెల్లడించారు. ఈ లెక్కల పరంగా చూస్తే విశ్వవ్యాప్తంగా కరోనా విలయతాండవం ఎలావుందో చూడవచ్చు. కరోనా మొదటి దశలో లాక్డౌన్ కారణంగా కుప్పకూలిన ఆర్థికవ్యవస్థను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు కార్పొరేట్లకే కొమ్ముగాసాయి. అంతలోనే రెండవదశ కరోనా విజృంభించడం మరింతగా ఆర్థిక పరిస్థితి దిగజారడానికి కారణమైంది. ప్రపంచంలో ఉన్న దేశాలన్ని నష్టా నివారణకు నడుంబిగించాయి. మనదేశంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కానీ, నివారణకు చేయూత కానీ అందించలేక పోయింది. అంతేకాక రెండవదశ ఉధృతి అనేది మన దేశంలోనే ఎక్కువగా ఉండడానికి కారణమైంది.
మధ్యతరగతి ప్రజలు ఉద్యోగాలు కోల్పోయి కొందరు, ఉపాదిలేక మరికొందరు కుటుంబ పోషణకు రకరకాల అవతారం ఎత్తినా కూడా కుటుంబాన్ని మోయడం భారంగా మారుతున్నది. చేతిలో పనిలేక, కుటుంబాన్ని పస్తులుంచలేక, చేసిన అప్పులు తీర్చలేక, ముందుముందు ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుచున్నారు. పోయిన ఉద్యాగాలు సంపాదించు కోవడం అనేది యువతకు పెద్ద సవాలే. మళ్ళీ దొరికే ఉద్యోగం వారి అర్హతకు తగింది దొరుకుతుందో లేదో, సరిపడా వేతనం వస్తుందో రాదో తెలియదు. ఏ చోటకు వెళ్లిన కరోనా ప్రభావంతో అతలాకుతలం అయిన కుటుంబాలు, రోడ్డునపడ్డ బాధితులు, ఏ పని దొరకని కూలీలు, అసరాలేని కార్మికులు కనబడుతున్నారు. రోజువారి కూలిపై బతుకుతున్న పేద కుటుంబాలకు సాయం చేయడం ఎలా, వారి ఆర్థిక పరిస్థితికి అండగా నిలవడం ఎలా అనేది ప్రశ్న గానే మిగిలింది. గ్రామాల్లో, పట్టణాల్లో వేల మందికి ఉపాధి కల్పించిన ప్రయివేట్ పాఠశాలలు మూతపడం వల్ల పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయులు, బస్సు డ్రైవర్లు, క్లీనర్లు, అటెండర్లు, విద్యార్థులకు బిస్కట్స్, పెన్ను, బుక్కులు అమ్ముకొని పొట్టగడుపుకొనే ఎందరో నేడు ఉపాధి లేక రోడ్డునపడ్డారు. మన రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా ఉపాధ్యాయులను ఆదుకోవడానికి కొరకుకొంత నగదు, బియ్యం ఇచ్చి వారి కుటుంబాలకు బాసటగా నిలిచింది. అయితే ఇతర ప్రయివేట్ రంగాలలో ఉపాధి కోల్పోయిన వారికి, ఇతర దేశాల్లో ఉపాధికి వెళ్లి తిరిగి వచ్చిన వారికి కూడా ఏదో విదంగా వారికి ఆర్థిక సహాయం అందించి స్వయంగా కుటుంబాన్ని పోషించుకునే మార్గం చూపించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. ఇలాంటి వారికి ఉచితంగా ఆర్థిక సహాయం కంటే ఉపాధిని కల్పించడం ఈ మధ్య వస్తున్న కథనాల ప్రకారం కరోనా మూడవ దశ కూడా ఉంటుందని చెపుతుండంతో, సామాన్యులు ఎలా బతకాలి అనే ఆలోచనలో బుర్రబద్దలు చేసుకుంటున్నారు. యువతకు ఉపాధి కల్పించడం కొరకు ప్రభుత్వం ద్వారా బ్యాంకులు ముందుకు వచ్చి ప్రోత్సాహం అందిస్తే మరో రెండేండ్లలో తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశం అన్ని రంగాల్లో ప్రగతి సాధించవచ్చు. నిరుద్యోగ నివారణకు శాశ్వత పరిష్కారంగా యువతకు ప్రత్యేక అవగాహన మరియు ప్రోత్సాహము అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
- రఘుపతి రావు గడప
సెల్: 9963499282