Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచదేశాలను అతలాకుతలం చేసిన కోవిడ్-19పై పోరులో అత్యంత క్రియాశీలతతో వ్యవహరించి రాజకీయనాయకత్వం, అధికారయంత్రాంగం మరియు ప్రజానీకం మధ్య అసామాన్యమైన సమన్వయంతో ముందడుగు వేసింది కేరళ రాష్ట్రం. తక్కువ భూభాగంలో అధిక జనసాంద్రత కలిగినప్పటికీ కోవిడ్ కేసుల కట్టడిలో పురోగతి సాధిస్తూ నేటికీ కోవిడ్ మరణాల రేటు 0.5శాతం కంటే మించకుండా చర్యలు తీసుకోవడంలో సఫలమైంది.
1957లో ప్రజాస్వామ్య పద్ధలో ఎన్నికల ద్వారా తొలి కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడ్డది కేరళలోనే అవడం ఒక విశేషం కాగా కొద్ది సంవత్సరాల వ్యవధిలోనే నిఫా వైరస్‌నూ, తర్వాత కరోనా వైరస్ నూ సమర్థవంతంగా ఎదుర్కొన్నది కూడా కమ్యూనిస్టు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కావడం మరో విశేషం. ప్రపంచ ఆరోగ్య సంస్థ వంటి పలు అంతర్జాతీయ సంస్థల మన్ననలు పొందిన కేరళ రాష్ట్రంలో కోవిడ్ కట్టడికి తోడ్పడిన కొన్ని అంశాలను ఈ సందర్భంగా పరిశీలించి ఆ అనుభవాలను మిగిలిన రాష్ట్రాలూ, ప్రపంచ దేశాలూ ఉపయోగపెట్టుకోవడం సముచితం.
ఫస్ట్ వేవ్ లోనే పకడ్బందీగా అమలుజరిపిన 3టి విధానం (Stringent Implementation of Tracing, Testing & Treating) : మనదేశంలో మొట్టమొదటి కోవిడ్19 కేసు కేరళ రాష్ట్రంలోని త్రిస్సూరు జిల్లాలో నిర్థారించబడింది. చైనాలోని వూహాన్ నుంచి ప్రయాణం చేసివచ్చిన ఒక 20ఏండ్ల యువతి గొంతునొప్పి, పొడి దగ్గు వంటి లక్షణాలతో 2020 జనవరి 27న త్రిస్సూరు జనరల్ ఆసుపత్రికి రాగా ఆమెకు జరిపిన ఆర్.టి.పి.సి.ఆర్ పరీక్షలో కోవిడ్19 వ్యాధి ఉన్నట్లుగా 2020 జనవరి30 నాడు నిర్థారించారు. 19రోజుల తర్వాత ఆమెకు కోవిడ్ పరీక్ష నెగటివ్ రిపోర్టు రావడం, ఆ తర్వాత 24వ రోజున ఆమె ఆసుపత్రినుంచి డిశ్చార్జి కావడం జరిగింది. ఆమెను పూర్తిస్ధాయి ఐసోలేషన్ బ్లాక్‌లో ఉంచి చికిత్స జరపడమే గాక కాంటాక్ట్ ట్రేసింగ్ చేసిన త్రిస్సూరు జిల్లా వైద్యారోగ్య శాఖ అమెకు ప్రైమరి కాంటాక్ట్‌గా గుర్తించిన వ్యక్తులను 28రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంచి మానిటర్ చేసింది. 2020 జనవరి 30న మొట్టమొదటి కోవిడ్ పాజిటివ్ కేసు నిర్థారణ అయిన వెంటనే కేరళ ఆరోగ్య మంత్రి శైలజా టీచర్ అదే రోజు తిరువనంతపురం నుంచి 300కి.మీ ప్రయాణం చేసి త్రిస్సూర్ చేరుకుని రాత్రి 11గంటలకు వైద్యారోగ్య శాఖ, ఇతర జిల్లా అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడంతో కోవిడ్‌పై పోరుకు కేరళ రాష్ట్రం శ్రీకారం చుట్టినట్టయ్యింది. అప్రమత్తమయిన అధికారులు 24గంటలలో పాజిటివ్ వచ్చిన వ్యక్తి సంచరించిన రూట్ మ్యాప్ తయారుచేసి పబ్లిక్‌గా అనౌన్స్ చేశారు. పాజిటివ్ వ్యక్తితో కాంటాక్ట్‌లోకి వచ్చినట్టు అనుమానం కలిగిన ప్రజలు కూడా తాము స్వచ్చందంగా టోల్ ఫ్రీ నెంబరుకు సమాచారమిచ్చి ట్రేసింగ్, టెస్టింగ్ విజయవంతమయ్యేలా సహకరించారు. ఇదే ఒరవడిని అటు అధికార యంత్రాంగం, ఇటు ప్రజలు తర్వాత కాలంలో కూడా కొనసాగించడంతో కేరళ రాష్ట్రంలో కాంటాక్ట్ ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్ అన్న విధానం విజయవంతంగా అమలయ్యి వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడం సులభతరమైంది. Break the Chain (వైరస్ వ్యాపించే గొలుసును ఛేదిద్దాం) అన్న పిలుపు అధికార యంత్రాగం, ప్రజలలో నాటుకుపోయి కోవిడ్ వ్యాప్తి కట్టడికి తారకమంత్రంలా పనిచేసింది. ఈ మొత్తం క్రమంలో రాష్ట్రస్థాయిలో తీసుకున్న వైరస్ కట్టడి విధానపు అవగాహనను జిల్లాస్థాయికి, తాలుకా స్థాయికి, గ్రామస్థాయికి అంచెలవారీగా బదలాయించి ఆచరణలో ఫలితాలు రాబట్టడంలో ప్రభుత్వానికీ, అధికార యంత్రాంగానికీ, అట్టడుగున ప్రజాబాహుళ్యానికీ మధ్య ఏర్పడ్డ సమన్వయం కీలకపాత్ర పోషించింది. కాంటాక్ట్ ట్రేసింగ్, టెస్టింగ్‌లో బయటపడ్డ పాజిటివ్ కేసులను ఐసోలేషన్‌లో ఉంచేందుకు పెద్దఎత్తున సెంటర్లు సిద్ధం చేసింది కేరళ రాష్ట్ర ప్రభుత్వం కేసులు అత్యధికంగా ఉన్న ఒక దశలో 1,70,000 ఐసోలేషన్ కేంద్రాలను ప్రజలకు ఇబ్బంది కలగని రీతిలో సమర్ధవంతంగా నిర్వహించింది. ఈ పరిణామాల ప్రారంభంలోనే అప్రమత్తమైన కేరళ రాష్ట్రం కేంద్రప్రభుత్వం కంటే ఒక్కరోజు ముందే లాక్డౌన్ అనౌన్స్ చేసిన విషయం గమనార్హం.
అధికార వికేంద్రీకరణ - గ్రామస్ధాయిలో ప్రజల భాగస్వామ్యం: గతంలోనే వామపక్షప్రభుత్వం అధికార వికేంద్రీకరణలో భాగంగా అమలులోకి తెచ్చిన ''ప్రజా ప్రణాళిక'' ద్వారా 30 నుంచి 45శాతం ప్రణాళికా నిధులు గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో ఖర్చు చేయడమనే చారిత్రక నేపథ్యం స్థానిక సంస్థల్ని బలోపేతం చేసి ప్రజల భాగస్వామ్యాన్ని పటిష్టం చేసింది. ఈ విధమైన ఆచరణాత్మకమైన వికేంద్రీకరణ వలన క్రిందిస్ధాయిలో గ్రామసభలు, పంచాయతి కమిటీలు స్థానిక ఆరోగ్య ప్రాధాన్యతల్ని గుర్తించడంలో, సమర్థవంతంగా నిధుల్ని వినియోగించుకునేలా చేయడంలో ప్రజల్ని భాగస్వాముల్ని చేయగల్గాయి. ప్రతి ఆరోగ్య సంరక్షణా పథకంలోనూ క్రియాశీలమైన ప్రజల ప్రత్యక్షపాత్ర ఉండేలా దోహదం చేసాయి. వికేంద్రీకరణలో స్థానిక ప్రజల భాగస్వామ్యం కాగితాలకు, మాటలకే పరిమితం గాకుండా కార్యాచరణలో కేరళ రాష్ట్రం సజీవ నమూనాగా నిలిచింది. ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యాన్ని సాధించిన ఈ స్ధానిక ప్రజా ప్రభుత్వాలు (LSGs- Local Self Governments) కోవిడ్19 సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో కేరళ రాష్ట్రానికి ఎంతగానో తోడ్పడ్డాయి. ఈ చారిత్రక నేపథ్యం ఫలితంగా కేరళ రాష్ట్రంలో కోవిడ్ 19పై పోరును ప్రజలే సేనానులుగా విజయపధంలో నడిపించగల్గారు.
కేరళలో పెద్ద సంఖ్యలో ఇతర రాష్ట్రాల నుంచి పనుల నిమిత్తం వచ్చిన వలస కార్మికులున్నారు. అంతే గాక, 3.5 కోట్ల జనాభా ఉన్న కేరళ రాష్ట్రం నుంచి సుమారు 23లక్షల మందికి పైగా ప్రజలు గల్ఫ్ వంటి ఇతర దేశాలలో వివిధ వృత్తులలో పనిచేస్తున్నారు. విదేశాలలో ఉంటున్న కేరళ రాష్ట్రీయులు స్వగ్రామాలకు తిరిగివచ్చినప్పుడు వారి యోగక్షేమాలు చూసేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్థానిక గ్రామ కమిటీలు సంసిద్ధంగా వ్యవహరించాయి. విదేశాలనుంచి గ్రామాలకు తిరిగివచ్చిన వారికి క్వారంటీన్ కల్పించడంలో ప్రతి గ్రామపంచాయతీ చురుకుగా వ్యవహరించింది. భయాందోళనలకు గురికాకుండా అవగాహనతో కూడిన ధైర్యంతో కార్యాచరణకు పూనుకోవడం అన్ని గ్రామ పంచాయతీల స్థాయిలో జరిగింది. క్వారంటీన్లో ఉన్న వ్యక్తుల ఆహారాది అవసరాలను గ్రామపంచాయతీలు పర్యవేక్షించాయి. క్వారంటీన్ ప్రాంతంగా ప్రకటించిన ఇండ్లలోని వ్యక్తులకు గ్రామ పంచాయతీలే బాధ్యత తీసుకుని వారికి అవసరమైన రేషన్, ఇతర అవసరాలను ఇండ్లవద్దకే సప్లయి చేశాయి. ఆ విధంగా క్వారంటీన్లో ఉన్న వ్యక్తులు బయటకు వచ్చే అవసరం లేకుండా సహాయపడ్డాయి. ఫలితంగా వైరస్ వ్యాప్తి కట్టడికి తోడ్పడ్డాయి. ఇదే విధంగా లాక్డౌన్ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 87లక్షల కుటుంబాలకు నెలరోజులకు సరిపడా (17 రకాల సరుకులు కల్గిన) రేషన్ కిట్ ముందుగానే అందజేయడం జరిగింది. ఐసోలేషన్ కేంద్రాలలో సరైన మందులు వాడబడేలా, ఆరోగ్య సూచీలు పర్యవేక్షించేలా స్థానిక వైద్య సిబ్బంది విధులు నిర్వర్తించారు. ఐసోలేషన్ కేంద్రాలలోనే గాక, అనేక గ్రామాలలో స్థానిక హెల్ప్‌లైన్, వాట్సప్ గ్రూపుల ద్వారా ఇళ్లలో భౌతికదూరం పాటించే వసతి లేని వారికి అదే గ్రామంలోని ఇతర నివాసాలలో ఐసోలేషన్ కోసం ఆశ్రయం పొందేలా కూడా స్వచ్చందంగా ప్రోత్సహించారు.
పటిష్టమైన ప్రజారోగ్య వ్యవస్థ - కోవిడ్ పై పోరులో కీలక పాత్ర
ప్రజారోగ్యానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చిన కేరళ ప్రభుత్వం మొత్తం రాష్ట్ర స్ధూల జాతీయోత్పత్తి (GSDP - Gross State Domestic Product)లో 6.5శాతం ఆరోగ్య సంరక్షణా వ్యవస్థపైన ఖర్చు పెడుతుండటం గమనార్హం. ఇది కేంద్రం ఖర్చుపెడుతున్న లేదా జాతీయ సగటు 1.5శాతం కంటే నాలుగు రెట్లు ఎక్కువ. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా, గ్రామస్థాయిలో ఉండే ప్రాధమిక ఆరోగ్య కేంద్రం మొదలుకొని జిల్లా స్థాయిలో ఉండే టీచింగ్ ఆసుపత్రి దాకా పటిష్టమైన ప్రజారోగ్యవ్యవస్ధ వేళ్లూనుకుంది. ప్రజారోగ్య సూచీలలో అభివృద్ది చెందిన దేశాలకు దీటుగా పురోగతి సాధించింది. ఆరోగ్య సంరక్షణ పనితీరు అంశంలో పెద్ద రాష్ట్రాల గురించి కేంద్ర సంస్ధ నిటి ఆయోగ్ ప్రకటించిన నివేదిక (2017-18 reference year) వెల్లడించిన ప్రకారం స్ధూల ఆరోగ్య సూచీల పనితీరులో కేరళ స్కోరు 74.01గా ఉండగా, ఉత్తర ప్రదేశ్ స్కోరు 28.61గా ఉండటం గమనార్హం. ఆరోగ్య సూచీలకు సంబంధించి స్థిర అభివృధ్ధి లక్ష్యాలు సాధించడంలో కేరళ అన్ని రాష్ట్రాలకంటే ముందున్నది. రాష్ట్రవ్యాప్తంగా 950కు పైగా ఉన్న ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో 97.6శాతం కేంద్రాలలో వైద్యులు విధులు నిర్వర్తిస్తున్నారు. కేవలం 2శాతం మాత్రమే భర్తీ కావల్సివుంది. జిల్లా స్థాయి ప్రభుత్వాసుపత్రులలో కూడా దాదాపు అన్ని స్పెషలిస్టు వైద్య సేవలు పూర్తిస్ధాయిలో అందుతున్నాయి. ప్రయివేటు రంగంలో వైద్యసేవల వలన ప్రజలకు స్వంత డబ్బు ఖర్చు పెట్టుకునే ఆర్ధికభారాన్ని తగ్గించేందుకు కేరళ రాష్ట్రప్రభుత్వం ఆర్ద్రం (Aardram) పధకాన్ని ప్రవేశపెట్టింది. దీనిలో భాగంగా అనేక ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను ఫామిలీ ఆరోగ్య కేంద్రాలు(Family Health Centers)గా అప్‌గ్రేడ్ చేసింది. ఈ ఫామిలీ ఆరోగ్య కేంద్రాలు ప్రతిరోజూ ఎక్కువ గంటలు పనిచేయడంతో పాటు, వెబ్-ఆధారిత అప్పాయింట్మెంట్లతో కూడిన సౌకర్యాలు కూడా కల్పిస్తాయి. మరింత మంది సిబ్బందిని సమకూర్చుకున్న ఈ కేంద్రాలు బి.పి, షుగర్, డిప్రెషన్ వంటి వ్యాధులకు వ్యక్తిగత ప్రత్యేకచికిత్సలు అందిస్తాయి. అంతేగాక ఆర్ధ్రం పథకంలో భాగంగా జిల్లా ఆసుపత్రులలో కార్డియాలజి, నెఫ్రాలజి, న్యూరాలజి వంటి స్పెషాలిటి వైద్యచికిత్సలు కూడా అందుబాటులోకి తీసుకురాబడ్డాయి. కేరళ రాష్ట్రం కోవిడ్‌పై జరిపిన పోరులో ఇంతటి పటిష్టమైన మూడంచెల ప్రజారోగ్య వ్యవస్ధ కీలకపాత్ర వహించింది.
సంసిద్ధత-నిబద్దత-సమాచార పారదర్శకత కల్గిన రాజకీయ నాయకత్వం: ప్రజారోగ్యం పట్ల నిబద్ధత కల్గిన ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆరోగ్యమంత్రి శైలజా టీచర్ వంటి రాజకీయ నాయకత్వం అధికారంలో ఉండటం కూడా కోవిడ్19 పై పోరును సమర్ధవంతంగా ముందుకుతీసుకుపోవడంలో తోడ్పడింది. కోవిడ్ మొట్టమొదటి కేసు బయటపడ్డ వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా పూనుకుని ఇతర మంత్రులు, అధికారుల సమక్షంలో వైద్య, ఆరోగ్య రంగ నిపుణులతో చర్చించారు. రాజకీయ నాయకత్వం మరియు ఐ.ఏ.యస్ వంటి కార్యనిర్వాహక అధికారులు కూడా ఎడిడెమియాలజిస్టులు, వైరాలజిస్టులు వంటి సంబంధిత వైద్యరంగ నిపుణుల సూచనలు పరిగణనలోకి తీసుకుని కోవిడ్ పాండమిక్‌ను ఎదుర్కోడానికి తగిన ప్రణాళిక రూపొందించి ముందడుగు వేయడం గమనార్హం. ప్రతిరోజు సాయంత్రం టెలివిజన్ ద్వారా స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రజలనుద్దేశించి మాట్లాడి, వ్యాధి నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, పరిస్థితులు వివరించి అవగాహన కల్పించడం వంటి చర్యలు ప్రజలను కర్తవ్యోన్ముఖుల్ని చేసి ధైర్యంగా నడిపించేందుకు దోహదం చేశాయి. రకరకాలుగా గందరగోళపర్చే మీడియా చానల్స్ లేదా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టే అసంబద్దమైన వార్తలు, పాక్షిక సత్యాలు ప్రజలను గందరగోళపర్చకుండా సూటిగా కర్తవ్యోన్ముఖుల్ని చేసి కోవిడ్19పై పోరులో ముందుకు సాగేందుకు ఈ చర్య ఎంతగానో తోడ్పడింది. కేరళ ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ లో రోజువారి వివరాలు రెగ్యులర్ గా పొందుపర్చడం ప్రజలకు పారదర్శక సమాచారాన్ని చేరవేసింది. రాజకీయాలకు అతీతంగా కోవిడ్ విపత్తు ప్రాధాన్యతను గుర్తించి ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రతిపక్ష నాయకుడిని సైతం ఆహ్వానించి ఉమ్మడిగా ప్రెస్‌మీట్ పెట్టి కోవిడ్ నియంత్రణ గురించి ప్రజలనుద్దేశించి ప్రసంగించడం రాష్ట్రప్రజలలో భరోసాను నింపింది.
లాక్డౌన్ సమయంలో కమ్యూనిటి కిచెన్స్: లాక్డౌన్ సమయంలో ఏ ఒక్కరూ ఆకలి బాధకు గురికాకూడదు అన్న ముఖ్యమంత్రి విజయన్ పిలుపుకు స్పందనగా రాష్ట్రవ్యాప్తంగా కమ్యూనిటి కిచెన్ సేవలు ప్రారంభమయ్యాయి. లాక్డౌన్ వలన రోజుకూలి చేసుకుని బతికే కార్మిక, వ్యవసాయ కూలీ వంటి పేదలు, వలస కార్మికులు, ఇతర బడుగువర్గాల ప్రజలు ఆకలి బాధకు గురికాకుండా రాష్ట్రవ్యాప్తంగా కమ్యూనిటి కిచెన్ పేరిట ప్రతిరోజూ రెండున్నర లక్షల ఆహారపు ప్యాకెట్లు సరఫరా చేయబడ్డాయి. పేదలు, లబ్దిదారులకు ఉచితంగా ఇంటివద్దకే రోజూ మూడు పూటలా సరఫరా చేయబడ్డాయి. లబ్దిదారులు కాని ఇతర ప్రజలు కూడా ఈ ఆహారాన్ని రూ.20 నామమాత్రపు ధరకు పొందగల్గే అవకాశం కల్పించారు. స్థానిక ప్రజాప్రభుత్వాల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ ''కుదుంబశ్రీ ప్రాజెక్టు'' నెట్వర్క్ సభ్యులైన మహిళల భాగస్వామ్యంతో కోవిడ్ నియమావళిని పాటిస్తూ ఆహారం వండి సరఫరా చేయడం జరిగింది. కేరళ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఇందుకు కావల్సిన సరుకులు అందజేసింది. ఆరోగ్యసేన (Health Army) పేరిట వాలంరీ గ్రూపులు, ఆశా వర్కర్లు, గ్రామీణ బాలసంరక్షణా కేంద్ర టీచర్లు, వాట్సప్ గ్రూపుల సభ్యులు, స్థానిక యువత.. ఇలా అనేక సెక్షన్ల ప్రజలు ఈ కమ్యూనిటి కిచెన్ నిర్వహణ, ఆహార పంపిణీలో సహకారమందించారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో నిర్దేశించబడ్డ ఫోన్ నెంబర్‌కు కాల్ చేసి ఈ ఆహారాన్ని సమీపంలోని కమ్యూనిటి కిచెన్‌లో పొందగల్గేలా అమలు జరిపారు. కేరళ రాష్ట్రంలోని 14 జిల్లాలలో 1255 కమ్యూనిటి కిచెన్లు ఈ విధంగా నిర్వహించబడ్డాయి. అర్థిక కార్యకలాపాలు స్తంభించిన సమయంలో ఈ కమ్యూనిటి కిచెన్ల నిర్వహణ వలన పేదల, వలస కార్మికుల ఆకలి తీరడమే గాక రోజువారీ లాక్డౌన్ మినహాయింపు సమయంలో రేషన్ కొనుగోలు కోసం గుంపులుగా గ్రోసరి దుకాణాల వద్ద జనం గుమికూడకుండా కూడా ఉపయోగపడింది. కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి అతి ముఖ్యమైన భౌతిక దూరం పాటించడం అనే సూత్రాన్ని ఈ కమ్యూనిటి కిచెన్ ప్రక్రియ సులభతరం చేసింది.
కేరళ పోలీస్ క్రియాశీలక పాత్ర: లాక్డౌన్ రూల్స్ అమలు జేయడంలో కేరళ పోలీసుశాఖ కీలకమైన పాత్ర పోషించింది. క్రియాశీలకంగా వ్యవహరించిన పోలీస్ శాఖ అనేక ప్రాంతాలలో జియోఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. హైరిస్క్ క్వారంటీన్ ప్రాంతంలో జీపీయస్, ఆర్.ఎఫ్.ఐ.డి. ట్యాగ్స్ , వైఫై, మొబైల్ ఫోన్ ట్రాకింగ్ వంటి అంశాలతో నిర్వచించిన కృత్రిమ సరిహద్దురేఖ వద్ద వ్యక్తుల కదలికల్ని వెనువెంటనే పసిగట్టి హెచ్చరించడం జియో ఫెన్సింగ్ ప్రత్యేకత. కేరళ పోలీస్ యంత్రాంగం రాష్ట్రం నలుమూలలా సుమారు 300 డ్రోన్స్‌ను ఉపయోగించి వీటిద్వారా గమనించడం, హెచ్చరికల్ని అనౌన్స్ చేయడం చేసింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్స్ సహకారంతో కేరళ పోలీస్ ''బ్లూ టెలి-మెడ్'' అనే మొబైల్ యాప్ ద్వారా ఉచిత వీడియో కన్సల్టేషన్ సౌకర్యం కల్పించింది. కేరళ పోలీస్ మీడియా సెల్ ఆధ్వర్యంలో పాపులర్ మలయాళ సినిమా పాటల రూపంలో ప్రజలకు సోషల్ మీడియా ద్వారా కోవిడ్-19 అవగాహనను పెంపొందించింది. ఆరుగురు యూనిఫాం ధరించిన కేరళ పోలీసులు కోవిడ్19 నివారణకై ''చేతులు శుభ్రపరచుకునే విధానం'' గురించి అవగాహన కల్పిస్తూ మలయాళ సినిమా పాట ట్యూన్లో రూపొందించిన వీడియో అంతర్జాతీయంగా ప్రశంసలు పొందింది. అలాగే కోవిడ్19 వైరస్‌కు భయపడి పారిపోతున్న వ్యక్తి, దారిలో ఒక పోలీస్, ఒక డాక్టర్ సహాయంతో చేతులు శానిటైజ్ చేసుకుని ముఖానికి మాస్కు పెట్టుకుని వైరస్‌ను తిప్పికొట్టిన ''బ్రేక్ ది చైన్'' అనే వీడియో కూడా విస్త్రతంగా ప్రచారమయ్యింది. డాక్టర్లు, సినీ పరిశ్రమ, సోషల్ మీడియా యాక్టివిస్టులు, స్టార్ట్-అప్స్.. ఇలా అందరి సహకారాన్నీ తీసుకుని కేరళ పోలీసు శాఖ కోవిడ్‌పై పోరాటంలో తన క్రియాశీలక పాత్ర పోషించింది.
స్టార్ట్-అప్స్ క్రియాశీలక పాత్ర: కేరళ స్టార్ట్-అప్ మిషన్ ''బ్రేక్ కరోనా'' పేరిట వినూత్నమైన ఐడియాలకు పిలుపునివ్వగా సుమారు 1947 ఐడియాలు, 351 పరిష్కారాలు ఆవిష్క్రతమయ్యాయి. ఇందులో భాగంగా ఆవిష్కరించబడ్డ సాంకేతిక పరికరాలు కోవిడ్19 కట్టడిలో ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఉదాహరణకు అసిమోవ్ రోబోటిక్స్ (Asimov robotics) అభివృద్ధి చేసిన రోబోలు. ఈ రోబోలు ఆఫీసులు, షాపింగ్ మాల్స్ వంటి పబ్లిక్ ప్రదేశాల ప్రవేశాల వద్ద హాండ్ శానిటైజర్స్ చల్లడం, ఐసోలేషన్ వార్డులలో పేషెంట్ల వద్దకు ఆహారం, మందులు, ఇతర వస్తువులు అందించడం, ఉపయోగించి పడవేసిన వస్తువుల్ని డిస్-ఇన్ఫెక్ట్ చేయడం, పేషెంట్లకు డాక్టర్లతో మాట్లాడేలా సహాయపడటం వంటి పనులు చేయగల్గాయి. ఇటువంటి పనులలో రోబోలను వినియోగించుకోగల్గడం కోవిడ్19 వ్యాప్తి అరికట్టడంలో క్రియాశీలకమైన ముందంజగా చెప్పుకోవచ్చు.Qkopy అనే ఆన్లైన్ సర్వీసెస్ సంస్థ GoK (Government of Kerala) డైరెక్ట్ యాప్ ను అభివృద్ధి చేసింది. దీనిద్వారా మొబైల్ ఫోనులో కేరళ ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమాచారం అప్డేట్స్, కోవిడ్19 అలర్ట్స్ ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. QuikDr Healthcare యాప్ ద్వారా ప్రభుత్వం టెలిమెడిసిన్ ద్వారా ఉచితంగా వైద్యుల సలహా పొందే సౌకర్యం ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వం, డాక్టర్లు, పోలీసులు,ప్రజల భాగస్వామ్యంతో ఉమ్మడిగా కృషి చేసి స్టార్ట్-అప్స్ కోవిడ్19 నియంత్రణలో కీలకపాత్ర పోషించాయి.
కోవిడ్19 వైద్య చికిత్సలో ప్రొటోకాల్స్‌పై వైద్యులకు అవగాహన: సెకండ్ వేవ్ ప్రారంభంలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రయివేటు రంగాలలోని వైద్యులు, నర్సింగ్ సిబ్బందికి ప్రభుత్వం కోవిడ్ చికిత్స అవగాహన జూమ్ మీటింగ్ ల ద్వారా కల్పించింది. చికిత్సలో భాగంగా ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనే అంశాలపైన విస్తృతంగా అవగాహన కల్పించే చర్యలు చేపట్టింది. సీనియర్ వైద్య నిపుణుల సహకారంతో రోగలక్షణాలలో వస్తున్న మార్పులు, చికిత్సలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించింది. ఉదాహరణకు కోవిడ్19 రోగికి ఏ దశలో రెమెడెసివిర్ వంటి ఇంజక్షన్ ఇవ్వాలి, స్టిరాయిడ్స్ ఇవ్వాలి, ప్లాస్మా ఇవ్వాలి, ఆక్సిజన్ పెట్టాలి అనే అంశాల పైన విపులంగా అవగాహన కల్పించడం జరిగింది. ఫలితంగా కొన్ని రాష్ట్రాలలో కనబడ్డ బ్లాక్ ఫంగస్ వంటి కాంప్లికేషన్స్ కేరళ రాష్ట్రంలో కానరాలేదు. అంతేగాక ప్రతి జిల్లాలోనూ సీనియర్ పల్మోనాలజిస్టులు, ఇన్ఫెక్షస్ డిసీజిస్ స్పెషలిస్టులతో కూడిన అడ్వయిజరి సెల్ ఏర్పాటు చేశారు. కోవిడ్ చికిత్సలో ఏ విధమైన సందేహాలు కల్గినా ఆ జిల్లాలోని వైద్యులు ఆ సెల్ గైడెన్స్ తీసుకోవచ్చు. ఈ చర్యల ఫలితంగా కోవిడ్ చికిత్సలో కేరళ రాష్ట్రంలో గుణాత్మకమైన మెరుగుదల ఏర్పడి మరణాల రేటు తగ్గిచడానికి తోడ్పడింది. అంతేగాక, వ్యాధి లక్షణాలు కనబడ్డ వెనువెంటనే అలర్ట్ అయ్యి వైద్యసలహా పొందేలా ప్రజలను విస్త్రతంగా చైతన్యపర్చడం వలన సకాలంలో చికిత్స జరిగి ప్రాణనష్టాన్ని పెద్దఎత్తున తగ్గించగల్గారు.
సెకండ్ వేవ్‌కు సంసిద్ధత: కోవిడ్ 19 మొదటి వేవ్ కల్గించిన నష్టాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొన్న కేరళ రాష్ట్రం సెకండ్ వేవ్‌కు ముందుగానే ప్రతి గ్రామ పంచాయతీలో కోవిడ్ చికిత్సా కేంద్రంగా మార్చదగ్గ అర్హతలున్న ఏదో ఒక భవనాన్ని గుర్తించింది. ఆ భవనంలో పేషెంట్ బెడ్స్, పల్స్ ఆక్సిమీటర్స్, ధర్మామీటర్స్, మందులు, ఆక్సిజన్ వంటి ఇతర మౌలిక సదుపాయాలు కల్పించి వాటిని CFLTC (Covid First Line Treatment Center) కోవిడ్ ప్రధమ చికిత్సా కేంద్రాలుగా ప్రకటించింది. ప్రతి జఖీూుజలో 5 నుంచి 10శాతం బెడ్స్‌కు ఆక్సిజన్ సౌకర్యం కల్పించింది. ఈ చర్య ఫలితంగా స్థానిక గ్రామపంచాయతీలోనే కొద్దిపాటి లక్షణాలున్న కోవిడ్ రోగులకు బెడ్ సౌకర్యం, చికిత్స అందుబాటులో ఉంటుందన్న స్పృహ ప్రజలలో కలిగి వారిలో విశ్వాసం పెరిగి వ్యాధిని ధైర్యంగా ఎదుర్కొనేటట్లు తోడ్పడింది. ఇదిగాక ఆసుపత్రులలో సౌకర్యాలను మెరుగుపర్చే ప్రయత్నాలలో భాగంగా కేరళ ప్రభుత్వం వెంటిలేటర్లను రెట్టింపు సంఖ్యలో అందుబాటులోకి తెచ్చింది. ఆక్సిజన్ ఉత్పత్తిని రోజుకు సగటున 219.22 మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి పెంచింది. సెకండ్ వేవ్‌లో సగటు ఆక్సిజన్ డిమాండ్ కేరళ రాష్ట్రంలో రోజుకు 74 మెట్రిక్ టన్నులు కాగా, మిగులు ఆక్సిజన్‌ను కొన్ని రోజుల పాటు ఇతర రాష్ట్రాలకు కూడా సరఫరా చేసి ఆదుకోగలిగింది. 2020 ఏప్రిల్ నెలలో కేరళ రాష్ట్రంలో ఆక్సిజన్ ఉత్పత్తి సగటున 50LPM (Litres Per Minute) కాగా, 2021 ఏప్రిల్ నెల నాటికి 1,250 50LPM (Litres Per Minute)కు పెంచుకోగల్గింది. పరిస్థితి తీవ్రతను గమనించి స్పందించిన కేరళ రాష్ట్రం గత సంవత్సరంన్నర కాలంలో చేపట్టిన చర్యల ఫలితంగా ప్రస్తుతం 23 ఆక్సిజన్ ప్లాంట్స్ ను నెలకొల్పుకోగల్గింది. సెకండ్ వేవ్ తీవ్రతకు అనుగుణంగా సామర్ధ్యం కల్గిన ప్రయివేటు ఆసుపత్రులలో 50శాతం పడకలు కోవిడ్ కేసులకు కేటాయించేలా, ప్రయివేటు మెడికల్ కాలేజి ఆసుపత్రులలో సైతం 75శాతం పడకలు కోవిడ్ కేసులకు కేటాయించేలా చర్యలు తీసుకున్నది. కోవిడ్ వేక్సినేషన్ ప్రక్రియలో కూడా దేశంలోనే జీరో వేస్టేజి ఘనతను కేరళ రాష్ట్రం సాధించింది. వేస్టేజిని దృష్టిలో పెట్టుకుని పంపబడ్డ అదనపు వేక్సిన్లను కూడా ప్రజలకు ఉపయోగించి దేశంలోనే రికార్డు సాధించింది. సాధారణంగా రవాణా, నిల్వ, టీకా వేసే ప్రక్రియలలో జరిగే లోపాలవల్ల కలిగే వేస్టేజిని దృష్టిలో ఉంచుకుని నిర్దేశిత సంఖ్య కంటే కొద్దిశాతం వేక్సిన్లను అదనంగా కేటాయించడం జరుగుతుంది. వేక్సిన్లలో వేస్టేజికి దారితీసే మూడు అంశాలైన రవాణా, నిల్వ, టీకా వేయడం అనే ప్రక్రియలలో ఎక్కడా లోపం రానివ్వకుండా తగిన జాగ్రత్తలు ముందుగానే తీసుకోవడం వల్ల, నర్సింగ్ సిబ్బందికి చక్కటి ముందస్తు శిక్షణ ఇవ్వడం వలన కేంద్రం నుంచి కేరళకు సరఫరా అయిన 73,38,806 మందికి నిర్దేశించబడ్డ డోసులతో 74,26,164 మందికి వేక్సినేషన్ చేయగల్గారు.
150 సంవత్సరాల సామాజిక న్యాయ ఉద్యమాల చరిత్ర కలిగిన కేరళ గత కొన్ని దశాబ్దాల క్రితమే దేశంలోనే అత్యధిక అక్షరాస్యత సాధించి, పటిష్టమైన ప్రజారోగ్య సంరక్షణా వ్యవస్థను కలిగివుండి అచ్చమైన అధికార వికేంద్రీకరణతో సాధ్యమైన నిజమైన ప్రజల భాగస్వామ్యంతో సంసిద్ధత, నిబద్ధత కల్గిన రాజకీయ నాయకత్వంలో కోవిడ్‌పై జరిపిన పోరు నుంచి విలువైన పాఠాలు నేర్చుకుని కోవిడ్‌పై పోరాటాన్ని ముందుకు తీసుకోపోవాల్సిన ఆవశ్యకత మిగతా రాష్ట్రాల పైన, ప్రపంచదేశాలపైన ఎంతైనా ఉన్నది.
రాష్ట్రం జనాభా సంఖ్య మొత్తం కోవిడ్ కేసులు మరణాలు మొత్తం కోవిడ్ కేసుల్లో
2020సం. (జూన్ 27,2021 నాటికి) (జూన్ 27,2021 నాటికి) మరణాల శాతం
కర్నాటక 6.9 కోట్లు 28,34,630 34743 1.22
తమిళనాడు 7.7 కోట్లు 24,65,874 32290 1.30
ఆంధ్రప్రదేశ్ 5.2 కోట్లు 18,79,872 12599 0.67
తెలంగాణ 3.8 కోట్లు 6,22,593 3,651 0.58
కేరళ 3.5 కోట్లు 28,88,895 12,880 0.44
వ్యాసకర్త:డా||కె.శివబాబు
- జహీరాబాద్ గౌరవాధ్యక్షులు
- జనవిజ్ఞానవేదిక ,సంగారెడ్డి జిల్లాకమిట.