Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మా బహుజన మహిళల శ్రమతో అభివృద్ధి చెందిన ఈ కుల ఆధిపత్య సమాజం మా చరిత్రలను సాహిత్యాలను పక్కకు నెట్టింది. మాకోసం చరిత్రలో సాహిత్యంలో ఒక్క అక్షరం కూడా కేటాయించబడని అణచివేతలకు గురైన దృశ్యం మాది. మా పని పాట, ఆట, మాట, తిండి, తిప్పలు, తిరుగుబాట్లు అన్నీ మెయిన్‌స్ట్రీమ్ చరిత్రలకు ఆవల్నే పరిమళించినాయి. చరిత్రలో గెలిచినోల్ల ఆధిపత్య మగ పక్షాన్నే సామాజిక, సాహిత్య చరిత్రలు రికార్డయినాయి. ఓండిపబడినోల్ల చరిత్రల్ని, సాహిత్యాల్ని, కళల్ని, సాంస్కృతిక సామాజిక న్యాయప్రతిఘటనల్ని అన్నింటినీ అణగదొక్కారు. భారత, రామాయణ భాగవతాలు చేసిందంతా యిదే. ఇవి మానవీయ కోణాల నావిష్కరించడం కాకుండా యుద్ధతంత్రాలుగా నడిచినాయి. ఉత్పత్తి సంబంధాలు, ఉత్పత్తి శక్తులు, ఉత్పత్తి జెండర్లు కనిపించవు.
ఆధిపత్య కులాల మగ, ఆడ అనుభవజ్ఞుల నుంచి నిర్మించబడిన దృష్టికోణాల నుంచే చరిత్రలను, ఉద్యమాలను, సాహిత్యాలను అధ్యయనం చేసి రూపొందించడం జరిగింది. కానీ యివి ఉత్పత్తి శక్తులైన బహుజన మహిళా దృష్టికోణాల నుంచి, వారి అనుభవజ్ఞానం నుంచి నిర్మించబడాలి. అప్పుడే సమాజం అసమానతలు లేని మానవీకరణవైపు పయనిస్తుంది.
తెలుగునేల మీద అనేక విముక్తి పోరాటాలు జరిగాయి. జాతీయోద్యమం, కమ్యూనిస్టు, విప్లవ, దళిత, స్త్రీ, దండోర, తెలంగాణ ఉద్యమాల్లో మహిళల పాత్ర ప్రధానమైనది. ప్రజల విముక్తిని, శ్రామిక విముక్తిని వాగ్దానం చేసిన ప్రతి సామాజిక ఉద్యమం మహిళల భాగస్వామ్యాలపట్ల, సమస్యల పట్ల ఆధిపత్య మనువాదాలనే పాటించింది.
దళిత మహిళా చరిత్రల్ని, సాహిత్యాల్ని వెలికితీయాలంటే యింకా గనులు తవ్వి గాలించాల్సిన దుస్థితే. బహుజనులంటే ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ మగవాళ్ళను, స్త్రీలంటే అగ్రకులాల స్త్రీలను ప్రాతిపదికగా తీసుకొని ఈరెంటి అస్థిత్వాల మధ్య బహుజన కులాల మహిళల్ని, వారి సామాజిక జెండర్ అస్థిత్వాల్ని, రాజకీయ ఎజెండాల్ని అదృశ్యం చేయడం జరిగింది. అది యింకా కొనసాగుతుండటం బహుజన కులాల అశక్తత.
తెలుగు నేల మీద వచ్చిన బలమైన దళితోద్యమాలు తమ జాతి సమూహంలోని జెండర్ అస్థిత్వ కోణాల్ని, పీడనల్ని, జీవితాల్ని, అనుభవాల్ని, విముక్తిని గుర్తించి చేయందించే బాధ్యతను విస్మరించి క్రూరంగా దొర్సాండ్ల గుంపులోకి తోసేసి దళిత మహిళలకు తీరని అన్యాయం చేసాయి. దళిత మహిళల సమస్యలైన నిరక్షరాస్యత, బాల్య వివాహాలు, వెట్టి, జోగినీ దురాచారం, నిరుద్యోగ సమస్య, అత్యాచారాలు వీరిపైనే ఎక్కువగా జరగడం వంటి సీరియస్ సమస్యలు దళితోద్యమాలకు పట్టలేదు.
ఖైర్లాంజి ఘటనలో దళిత తల్లి కూతుళ్ల మీద క్రూరమైన అత్యాచారం, హత్యలు జరిగితే... ఫెమినిస్టులు మౌనం వహించి, తర్వాత వారి క్యారెక్టర్ మంచిది కాదని, అరుంధతీరారు లంటివాళ్ళు అవమానిస్తూ రాయడం జరిగింది. ఖైర్లంజి, లక్ష్మీపేట అత్యాచార మారణకాండల్లో ఆధిపత్య మహిళలు దగ్గరుండి కత్తులు, బరిసెలు అందించిన చరిత్రలు మన కండ్లముందే జరిగాయి.
తెలుగు సాహిత్య చరిత్రలో దళిత మహిళను నాయికగా సాహితీకరించింది తొలి ఆధునిక మహాకవి విశ్వనరుడు జాషువా. జాషువా వందేండ్లనాడే దళిత మహిళ దుస్థితిని, సలసల కాగించింన కన్నీటి బిందువని దు:ఖించాడు. దళిత మహిళకు కనీస అవసరాలు అయిన తిండి, గుడ్డ, నీడ లేని పేదరికాల్ని వాటి కారణాల్ని, మహిళా బతుకు చిత్రాన్ని 1930 నాడే తన అనాధ కావ్యంలో ఆవిష్కరించాడు. ఈ చైతన్యాన్ని, బాధ్యతల్ని దళిత సాహిత్యోద్యమం అందుకోలేకపోయింది. యిప్పటి దళిత మహిళలకీ శ్రమ దోపిడీ, వెట్టి, ఆకలి, అవమానాలు, కులహింసలు, లైంగిక హింసలు, దొర, దొర్సాని ఆధిపత్యాలు వీటిని ఎదుర్కోవడానికి సవర్ణ స్త్రీవాద సిద్ధాంతాలు సరిపోవు. సమస్యలు ఒకటి కానప్పుడు ప్రయోజనాలు కూడా ఒకటి కావు.
కుల నిర్మూలనకు అన్ని కులాల మహిళా విముక్తికై, మహిళా విద్య కోసం, మహిళా దురాచార నిరన్మూలన కోసం పోరాడిన బహుజన కులాల సామాజిక వైతాళికులైన సావిత్రబాయి ఫూలే, జ్యోతిరావు ఫూలే, పెరియార్, అంబేద్కర్, జాషువా, కాన్షీరామ్‌ల పట్ల వారి సామాజిక భావజాలం పట్ల స్త్రీవాద సాహిత్యాలు మౌనం వహించాయి.
కానీ బహుజన కులాల మహిళల పట్ల ఛీత్కారాలను, వ్యతిరేకతలను ప్రదర్శించిన వీరేశలింగం పంతులు, చలం, గురజాడ, కొడవటికంటి కుటుంబరావులు తమ బ్రాహ్మణ కులంలోని రుగ్మతలు తమ స్త్రీ సమస్యల వరకే పరిమితమైన సంస్కర్తలు, సాహిత్య కారులు కాగా వీరిని మొత్తం మహిళా సమాజ సంస్కర్తలుగా చూపించాయి ఆధిపత్య ఆడ మగ సాహిత్యాలు. స్త్రీవాద సాహిత్యం హిందూ కులగీత తమ మగగీత హద్దుల్లోనే సాహిత్య సృష్టి చేసిందనడానికి ఇవి నిదర్శనాలు.
ఆధిపత్య కులాల స్త్రీలకు పితృస్వామ్యమే శత్రువు అంటారు. పితృస్వామ్య విముక్తే వారి విముక్తి. కాని బహుజన కులాల మహిళల మగస్వామ్యాలు - స్త్రీ వాదులు చెపుతున్న పితృస్వామ్యాలు ఒకటికాదు. బహుజన కులాల ఆడమగలతో పాటు తమ మహిళల్ని కూడా వ్యవస్థీకృతంగా లోబర్చుకున్నదే పితృస్వామ్యము. బహుజన కులాల్లోని మగ సమాజానికి యింటివరకే పెత్తనంగానీ ఊరికి బానిసే. దళిత మహిళలు, బీసీ, ఎస్టీ మహిళలు కుల హింసలు, శ్రమ దోపిడీ, వెట్టి, దొర, దొర్సాని స్వామ్యాలు, యింటి మగస్వామ్యాలు, ఆకలి హింసలు, అత్యాచారాలు, అంటరాని తనాలు వంటి అనేక సామాజిక సమస్యల్నించి విముక్తి చెందాలి. స్త్రీవాదాలు, స్త్రీ సంఘాలు గృహ హింస వరకే లేదా ఆధిపత్య కులస్త్రీల సమస్యల వరకే పరిమితం కాకుండా బహుజన మహిళల వాస్తవ సామాజిక జీవన వాస్తవాల కుల జెండర్ రాజకీయాలను అర్థం చేసుకొని ఈ మహిళల పక్షాన పోరాడాల్సిన సామాజిక బాధ్యత ఉంది.
ఇప్పుడు అస్తిత్వ కుల జెండర్ సాహిత్యాలు చాలా బలంగా వస్తున్నాయి. అయినా ఆధిపత్య కులాల రచనలే సాహిత్యంగా చలామని అవుతున్నాయి. ఆధిపత్య కులాల రచయితలు, రచయిత్రులు అణగారిన వారిపై రచనలు చేస్తే... అది ప్రధాన స్రవంతి సాహిత్యంగా, యూనివర్సల్ సాహిత్య గుర్తింపులుంటాయి. కానీ అణగారిన సమూహాలు తమ అసమానతల్ని, అనుభవాల్ని, సాహిత్యంగా మలిస్తే.. అది దళిత సాహిత్యంం అనీ పరిమితమైనవనీ ఆ సాహిత్య విస్తృతులూ, విశిష్టతలూ కుదించడబడుతాయి. యింకా శిల్పం లేదని, అర్థం కాలేదనీ, బూతనీ స్థానిక సాహిత్యాలను పక్కన పెడుతున్నాయి ఆధిపత్య సాహిత్య రాజకీయాలు.
ఇలా మా చుట్టూ కుల సమాజాలు అల్లిన అనేక అణచివేతలు, వివక్షలు, సంతోషాలు, దు:ఖాలు, అవమానాలు, నిరసనలు, తిరుగుబాటులు, అనుభవాల నుంచే ఈ బహుజన కులాల మహిళా సాహిత్యం. చారిత్రకంగా చూసినా బహుజన మహిళలు నాయకత్వంలో, రాజ్యాలేలినవాళ్ళలో కనిపిస్తారు. 12వ శతాబ్దంలో ఎల్లమ్మ ఢిల్లీ సుల్తాన్ల మీద పోరాడిందని మైసూర్లో వన్నియార్లు ఇప్పటికీ పాడుకుంటారు. అదే కాలంలో రుద్రమదేవి, రజియా సుల్తానలు పరిపాలకులుగా ఉన్నారు. ఆధునిక కాలంలోనూ సంస్కర్తలుగా, సాహిత్య కారులుగా, యుద్ధనారీలుగా, సైనికాధికారులుగా, ప్రజా ప్రతినిధులుగా, రాజ్యాంగ పరిషత్‌లో మెంబర్లుగా ఈ సమాజానికి ప్రభావవంతమైన సేవనందించి, సమాజ మార్పు కోసం యుద్ధం చేసిన, కృషి చేసిన చరిత్రలు ఈ మధ్యనే వెలుగు చూస్తున్నాయి.
భారతదేశ మొదటి ఉపాధ్యాయుని సావిత్రిబాయి ఫూలే. ఆమెతో పాటు ఉపాధ్యాయినులుగా పనిచేసిన ఫాతిమా బేగం, సుగుణాబాయి, భారతదేశ మొదటి దళిత రచయిత్రి ముక్తా సాల్వే, యుద్ధ నారీమణులు జల్కారి బాయి, ఉదాదేవి, సైనికాధ్యక్షురాలు కుయిలీ, రొమ్ము, కోసిచ్చి రొమ్ము పన్ను రద్దు చేయించిన నాంగేళి, గొప్ప కళాకారిణి వితాబాయి, రాజ్యాంగ పరిషత్‌కి మెంబర్ దాక్షాయినీ వేలాయుధన్, జాతీయోద్యమ నాయకురాలు సాహిత్యకారిణి తాడి నాగమ్మ, అంబేద్కర్‌తో కలసి పనిచేసిన తారాబాయి షిండే, బిజిలీఫాసుల్యాదేవి, మహావీర్ భాంగిన్, ఠాకూర్ భూస్వాములను దెబ్బకు దెబ్బతీసి వణికించిన పూలన్‌దేవి, ఆంధ్రప్రదేశ్ మొదటి మహిళా దళిత మహిళగా డిప్యూటీ స్పీకర్‌గా, ప్రజా ప్రతినిధిగా, మంత్రిగా, తెలంగాణ తొలిదశ ఉద్యమ నాయకురాలు సదాలక్ష్మి, బాలికా వివాహాలకు వ్యతిరేకంగా పోరాడిన బన్వారీ దేవి, అంబేద్కర్ పెట్టిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి ప్రజాప్రతినిధిగా ఆంధ్రప్రదేశ్ నుంచి గెలిచన మహిళా నాయకురాలు ఈశ్వరీబాయి యిలా కొందరు.. యింకా మరుగునబడిన చరిత్రలు తవ్వాల్సిన పని మిగిలే ఉంది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలు ఊరు, వాడ, తండ బాంచ బతుకుల్ని వదిలి చదవాలి, రాయాలి, ఉద్యోగాలు చేయడానికి నిరంతరం ఉద్యమించాలి, సాధించుకోవాలి. మానవహక్కుల కోసం అన్ని రకాల వివక్షల్ని ధిక్కరించే నాయకత్వాలు చేయాలి. రాజ్యాధికారాలు లక్ష్యంగా ఎదిగి సమాజానికి సమన్యాయం పంచే మట్టి మహిళల మానవత్వం జయించి జెండాలా ఎగరాలి. ఈ ధిక్కారదారులన్నీ మట్టిమహిళ రాజ్యాధికారంవైపుగా పయనించాలి.
- జూపాక సుభద్ర