Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సైన్స్ పరిశోధన పరికల్పనలతో ప్రారంభమైనా, రుజువులతో ముందుకు సాగుతోంది. తనను తాను సరిదిద్దుకుంటుంది. 2010లో ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఇచ్చిన నివేదిక 2035 నాటి కల్లా హిమాలయాల పర్వతాలలోని హిమనినదాలన్ని భూతాపం కారణంగా కరిగిపోతాయని తెల్పింది. ఇది పెను వివాదానికి దారి తీసింది. దీనితో ఐపిసిసి వెంటనే తన నివేదికలో అంశాల్ని మార్చింది.
1970వ దశకంలో ప్రముఖ రసాయన శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత లైనస్ పౌలింగ్ విటమిన్ సి తీసుకుంటే సాధారణ జలుబు తగ్గుతుందని ప్రతిపాదించాడు. కానీ తర్వాత జరిగిన అధ్యయనంలో తేలిన విషయం ఏమిటంటే విటమిన్ సి జలుబుని పూర్తిగా నివారించలేదని, జలుబు తీవ్రతను కొంతమేరకు తగ్గించగలదని, జలుబు యొక్క కాల వ్యవధిని కొంత తగ్గించగలదని స్పష్టం అయ్యింది. ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త ఫ్రెడ్ హొయల్ బిగ్ బ్యాంగ్ అనే పదాన్ని సృష్టించారు. కానీ విశ్వ ఆవిర్భావానికి చెందిన బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ఆయన ఏనాడూ అంగీకరించలేదు. ప్రముఖ రచయిత మారియో లివియో బ్రిలియంట్ బ్లండర్స్ (ఫ్రమ్ డార్విన్ టు ఐన్ స్టీన్)అనే పుస్తకంలో అనేకమంది శాస్త్రవేత్తలు తమ తమ పరిశోధనలలో చేసిన తప్పులను చక్కగా వివరించారు. చార్లెస్ డార్విన్ తన ప్రకృతివరణ సిద్ధాంతానికి, గ్రెగర్ మెండల్ ప్రతిపాదించిన అనువంశికత సిద్ధాంతానికి తేడాలున్నాయి. లార్డ్ క్రెల్విన్ భూమి యొక్క వయస్సుని నిర్ధారించడంలో తడబడ్డాడు. లైనస్ పౌలింగ్ డీఎన్ఏ నిర్మాణాన్ని చేధించే క్రమంలో తడబడ్డాడు. తర్వాత వాట్సన్, క్రిక్ డి ఎన్ ఏ నిర్మాణాన్ని కనుగొన్నారు. తప్పులని సరిదిద్దుకునే అవకాశం సైన్సుకి ఉంటుంది.
గత వంద ఏండ్లలో సైన్స్ ఎంతో ప్రగతి సాధించింది. సైన్స్ వల్లే చరిత్రలో చక్రవర్తులకి కూడా లభించని సౌకర్యాలు ఈనాడు సామాన్యులకి లభిస్తున్నాయి. ఎన్నో వ్యాధులకి మందులు, చికిత్సా విధానం సైన్స్ పరిశోధనల ద్వారానే సాధ్యమైంది. కమ్యూనికేషన్ వ్యవస్థ అభివద్ధి చెందింది. సైన్సుని మరొక కోణంలో చూస్తే మానవాళికి సైన్స్ ఫలాలు ఏ మేరకు అందుతున్నాయో మనం గమనించాలి. అణుబాంబుల దాడులతో రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ అతలాకుతలం అయింది. తర్వాత అనేక దేశాలు పోటీ పడి అణు పరీక్షలు నిర్వహిస్తున్నాయి. పరిశ్రమల వల్ల కాలుష్యం పెరుగుతుంది. ముఖ్యంగా వాహన కాలుష్యం రోజురోజుకూ పెరుగుతోంది. వివిధ దేశాల మధ్య ఆయుధ పోటీ నానాటికీ తీవ్రతరం అవుతుంది. కాలుష్యం వల్ల వైరస్‌తో మనం నిరంతరం పరోక్ష యుద్ధం చేయాల్సి వస్తుంది. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరిగేకొద్దీ వైద్య ఖర్చులు తగ్గాలి. కానీ అందుకు విరుద్ధంగా జరుగుతుంది.
సామాన్యులకు శాస్త్రీయ దృక్పథం అవసరమే. కానీ వారు ఎదుర్కొనే సమస్యలకి పరిష్కారం చూపకపోతే వారు మతం వంటి మార్గాన్నే ఎంచుకుంటారు. మలేరియా వంటి జ్వరాలతో నేటికీ అనేకమంది చనిపోతున్నారు. క్షయ వంటి వ్యాధులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే తగ్గిపోతాయి. కానీ క్షయతో బాధపడే పేదవారికి సరైన వైద్యం అందడం లేదు. మతం ఒక వ్యవస్థగా ఉంటుంది. సైన్సుకి ఆ వెసులుబాటు లేదు. మతం ఒక నమ్మకం. సైన్స్ ఒక వాస్తవం. కాకపోతే సైన్స్ ప్రయోగాలు ఎక్కువగా ఇతర గ్రహాల గురించి జరుగుతున్నాయి. అవి అవసరమే కానీ, మనం ఎదుర్కోనే సమస్యలకి సైన్స్ సత్వర పరిష్కారాన్ని చూపాలి. సైన్స్ ఫలాలు సామాన్యులకు అందాలి. మన ఆలోచన మారకపోతే మనం మార్స్ పై అడుగుపెట్టినా ఆ గ్రహాన్ని కూడా డస్ట్ బిన్గా మారుస్తాం. వేగంగా పరుగెడుతున్న మనిషికి కరోనా కాస్తంత బ్రేక్ వేసింది. ఈ విరామంలో మనం గుణపాఠాలు నేర్చుకొని ముందడుగు వేస్తామో లేదో చూడాలి.
ఎం. రాంప్రదీప్
సెల్:9492712836