Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచ వ్యాప్తంగా 15కోట్ల మంది చిన్నారులు బాల కార్మికులుండగా ఇందులో రెండు కోట్ల మంది భారత్లోనే ఉండటాన్ని బట్టి మనదేశంలో బాల కార్మిక వ్యవస్థ యొక్క తీవ్రతను అంచనా వేయవచ్చు. మన దేశంలో జనాభా పెరుగుదల పేదరికం, నిరక్ష రాస్యతతో పాటు ప్రధానంగా వ్యవసాయాధారిత దేశం కావడం వల్ల బాలకార్మిక వ్యవస్థ ప్రధానమైన సామాజిక సమస్యగా కొనసాగుతున్నదని చెప్పవచ్చు. బాలకార్మికులను గుర్తించేటప్పుడు వయస్సునే ప్రధాన ప్రాతిపదికగా తీసుకోవాలన్న సూత్రాన్ని భారత రాజ్యాంగం నిర్మాతలు కూడా అంగీకరించారు. 14ఏండ్ల లోపు బాలలను ఫ్యాక్టరీలలో గాని, గనులలో గాని లేదా ఇతర ప్రమాదకర వృత్తులలోగాని చేర్చుకొని చాకిరి చేయించడాన్ని రాజ్యాంగంలోని 24వ అధికరణం నిషేధిస్తోంది. ఇది ప్రాథమిక హక్కుల్లో ఒకటిగా భావిస్తోంది. అదేవిధంగా '14ఏండ్లలోపు బాలలందరికీ ఉచిత, నిర్బంధ విద్యా వసతులు కల్పించాలి. రాజ్యాంగం అమలులోకి వచ్చిన మొదటి పదేండ్లలోగా ఈ లక్ష్యాన్ని అందుకోవాలి' అని ఆదేశిక సూత్రాలకు సంబంధించిన 45వ అధికరణం నిర్దేశిస్తుంది.
అంతర్జాతీయ కార్మిక సంస్థ ఐఎల్ఓ అంచనా ప్రకారం ప్రపంచంలో 5 నుంచి 14ఏండ్ల లోపు బాలకార్మికులు 12కోట్ల మంది పై చిలుకే ఉన్నారు. భారత్లో 2.6కోట్ల మంది ఉన్నారని ప్రపంచ బ్యాంకు అంచనా. వీరంతా పూర్తికాలం శ్రమ చేసే బాల కార్మికులు, వీరిలో చాలామంది ప్రమాదకరమైన పనులు చేస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశం ప్రపంచంలో కెల్లా అత్యధిక సంఖ్యలో బాల కార్మికులు గల దేశంగా కూడా కావడం విచారకరం. ఆడుతూ, పాడుతూ, పాఠాలు చదువుతూ కాలం గడపాల్సిన వీరంతా పరిశ్రమల్లో, పంట పొలాల్లో, పాడి గేదెలమధ్య, గనులలో, కార్ఖానాల్లో నలిగిపోతున్నారు. వెట్టి కార్మికులుగా మగ్గిపోతున్నారు. బలవంతంగా వ్యభిచార కూపంలో కూరుకుపోతున్నారు. అనాథలు, ఆప్తులు వదిలేసిన చిన్నారుల పరిస్థితి మరీ దయనీయంగా ఉందని బాలకార్మికులపై నిర్వహించిన అధ్యయన నివేదిక తెలిపింది.
బాలకార్మిక వ్యవస్థ బలపడటానికి ప్రధాన కారణం పేదరికం అనడంలో ఎలాంటి సందేహంలేదు. పేదరికం లేదా కుటుంబ ఆదాయం చాలా తక్కువ స్థాయిలో ఉండటంవల్ల తల్లిదండ్రులు తమ పిల్లలను పనికి పంపిస్తున్నారు. వేడినీళ్లకు చన్నీళ్లు లాగా పిల్లల సంపాదనతో సంసారాన్ని నడపవచ్చునని నిరుపేద తల్లిదండ్రులు భావించడం వల్లనే బాలకార్మికుల సంఖ్య పెరిగిపోతున్నది. ఏ ఏటికాయేడు పెరుగుతున్న జనాభాకు ఉపాధి అవకాశాలు కల్పించడం గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో సాధ్యం కావడం లేదు. దీంతో వ్యవసాయ పనులు కొరవడిన సమయంలో కూలీలు తమ పిల్లాపాపలతో పట్టణాలకు వలస వెళ్లి తమ పిల్లలను హౌటళ్ళు, సర్వీస్ సెంటర్లలో పెడుతున్నారు. తల్లిదండ్రులు తిరిగి తమ తమ స్వగ్రామాలకు వెళ్లినా వారి పిల్లలను మాత్రం పట్టణాల్లో వారు పనిచేస్తున్న యజమానుల వద్దే ఉంచుతూ కొంత అడ్వాసుగా తీసుకొంటున్నారు.
వర్థమాన దేశాలలో నిరుద్యోగులకు, నిరుపేద కుటుంబాలకు సామాజిక భద్రత ఏమీలేదు. దీనితో నిరుపేద తల్లిదండ్రులు తమ పిల్లలను పనుల్లో పెడుతున్నారు. ఇది పరోక్షంగా ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తుంది. అంతేకాదు ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రపంచీకరణ వల్ల సంపన్న వర్థమాన దేశాల మధ్య పెరుగుతున్న ఆర్థిక అంతరాలు బాలకార్మికుల సంఖ్యనూ పెంచుతున్నాయి. నిరక్షరాస్యత కూడా బాల కార్మిక వ్యవస్థను పెంచి పోషిస్తున్నది. కేరళలో అక్షరాస్యత రేటు పెరగడం బాలకార్మికుల సంఖ్య తగ్గడాన్ని ఉదాహరణగా చూడవచ్చు.
గోరు చుట్టుపై రోకలి పోటులా ఇప్పుడు కరోనా మహమ్మారి మరింత అతలాకుతలం చేసింది. లక్షలాది మంది పిల్లలు తమ తల్లిదండ్రులను కోల్పోయి అనాథలయ్యారు. ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో కరోనా లాక్డౌన్తో పాఠశాలలు మూసివేయడంతో గ్రామీణ ప్రాంతాలలో 80శాతం మంది చిన్నారులు వారి తల్లిదండ్రులతో పాటు వ్యవసాయ పనులకు, పత్తి యేరుటకు వెళ్తున్నారని ఉపాధ్యాయులు తెలుపు తున్నారు. బాలికల విషయానికొస్తే వీరి శ్రమను రెండు రకాలుగా వాడుకుంటున్నారు. రెండు, మూడు తరగతులలోనే బడి మానిపించి బాలికలకు ఇంటి బాధ్యతలు అప్పజెప్పడం నిరుపేద కుటుంబాల్లో కనిపిస్తుంది. పలక, బలపం వయసులోనే తమ్ముళ్లను, చెల్లెళ్లను ఆడించడం, నీళ్ళు తేవడం, తల్లిదండ్రులు పనికి వెళ్తే ఇంటి బాధ్యతలు చూసుకోవడం కనిపిస్తూనే ఉంటుంది.
దేశంలోని మొత్తం బాల కార్మికులు 90శాతం మంది గ్రామ సీమల్లోనే ఉన్నారు. వీరంతా వ్యవసాయంలో వ్యవసాయ అనుబంధ రంగాల్లోగాని అడవికి వెళ్లి కట్టెలు తెచ్చే పనుల్లోగాని చేపలు పట్టే పనుల్లోగాని ఉన్నారు. వీరిలో 80శాతం మంది బాలికలు ఏడాదిలో 183రోజులపాటు పనుల్లో ఉంటున్నారని, మిగితా రోజుల్లో పనులు లేవని ఒక సర్వే చెబుతుంది.
వెట్టిచాకిరి అనేది బాలకార్మికులకే కాదు వయోజనులకు కూడా శాపంగా మారింది. 1976 నుంచి భారత్లో వెట్టిచాకిరి నిషిద్ధం. అప్పట్లో పార్లమెంటు వెట్టిచాకిరి వ్యవస్థ నిషేధం చట్టం ఆమోదించింది. అయినప్పటికి ఈ సంప్రదాయం ఇంకా కొనసాగుతూనే ఉంది. కనీస అంచనాల ప్రకారం దేశంలో కోటి మందికి పైగా వయోజనులు వెట్టిచాకిరీలో మగ్గుతున్నారు. వీరిలో 89శాతం మంది వడ్డీ వ్యాపారస్తులు వద్ద తీసుకున్న అప్పులు తీర్చడానికి వెట్టి చేస్తున్నవారే! కొంతమంది భూస్వాముల వద్ద మగ్గుతున్నారు. వ్యవసాయం, ఇటుకల తయారీ వంటి రంగాలలో వెట్టి కార్మికులు తమ శ్రమను దారపోస్తున్నారు. తల్లితండ్రులు చేసిన లేక తామే చేసిన అప్పులు తీర్చడానికి ఎక్కువమంది వెట్టి కార్మికులుగా మారుతున్నారు. ఇది పిల్లలకు, పెద్దలకు వర్తించుతున్నది.
బాలకార్మిక నిషేధం చట్టం: పసి వయసులో ఉన్నవారిని పనులకు బలి చేయకుండా ఉండేందుకు బాల కార్మిక నిషేధ చట్టం 1986లో రూపొందించారు. 1935లో బాలకార్మికుల ఉద్యోగాల చట్టం (ఎంప్లాయిమెంట్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్)ను తొలగించి ఈ చట్టం రూపొందించారు. ఈ చట్టం కింద 14ఏండ్ల వయసు పూర్తికాని, డబ్బు రూపేణా లేదా వస్తు రూపంలో వేతనం తీసుకొని పనిచేసేందుకు నియమితులైన వారు బాల కార్మికులు. 1989లో ఐక్యరాజ్య సమితి నిర్వచనం ప్రకారం 18ఏండ్లలోపు ఉన్నవారిని బాల్య దశగా గుర్తించాలి. 2018లో 18ఏండ్లలో బాలబాలికలను కూడా ఈ చట్టం పరిధిలోకి తీసుకొచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఈ చట్టాన్ని అమలు చేయవలసి ఉంటుంది. దీనిని పకడ్బందీగా అమలు పరిచేందుకు ప్రభుత్వానికి సలహా ఇచ్చేందుకు బాలకార్మిక సాంకేతిక సలహామండలి కేంద్రం ఏర్పాటు చేసింది.
బీడీల తయారీ, తివాచీల నేత, సిమెంట్ ఉత్పత్తి సంచుల్లో నింపటం, వస్త్రాలపై ప్రింటింగ్, అద్దకం, నేత, అగ్గిపెట్టెలు, ప్రేలుడు పదార్థాలు, బాణాసంచా తయారీ, మైకా కోత, విభజన, షెర్లాక్ తయారీ, సబ్బులు తయారీ, తోలుశుద్ధి, ఊలుశుద్ధి, నిర్మాణాల పరిశ్రమ, పలకలు, బలపాల పరిశ్రమ, విలువైన రాళ్లతయారీ, సీసం, పాదరసం, క్రోమియం, మ్యాంగనీస్, క్రిమిసంహారాల వంటి విష పదార్థాలతో ఉత్పత్తి తయారీ పరిశ్రమలలో బాల కార్మికులుతో పనులు చేయించుకూడదని ఫ్యాక్టరీల చట్టం 1948 సెక్షన్ 2 (బి) క్రింద నిషేధించింది. ఇవే కాకుండా ఇతర సంస్థలలో జరీ, ఎంబ్రాయిడరీ, రత్నాల పాల్సింగ్, పలకలు తయారీ పరిశ్రమలో బాలకార్మికుల కూడా రద్దు చేసింది.
బాలకార్మికుల పునరావాసం: 2018లో కేంద్ర ప్రభుత్వం బాలల సంక్షేమానికి అన్ని రాష్ట్రాల్లో రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయిలో కమిటీ వేసి 18ఏండ్ల లోపు బాల బాలికలను గుర్తించి పునరావాస కేంద్రాల్లోను, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టల్లో చేర్చి వారికి విద్యాబోధన నేర్పించాలని ఆదేశించింది. జిల్లాలో ఐసీడీసీ వారితో జిల్లా బాలల పరిరక్షణ కమిటీ వేసి ఎన్జీఓ సంస్థలతో కలిసి పనిచేసి బాలకార్మికులను గుర్తించాలి.
ఐఎల్ఓ కృషి: ఐఎస్ఓ బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు భారతదేశంలో భాగస్వామ్య కార్మిక సంఘాలతో కలిసి అవగాహనా కార్యక్రమాలను చేపడుతుంది. ప్రపంచంలో 15కోట్ల మంది ఉన్నారనీ, 2021 నుంచి 2025 నాటికి బాలకార్మికులులేని సమసమాజాన్ని నిర్మిద్దామనీ, అందుకు అందరు సహకరించాలని పిలుపునిచ్చింది. బాలకార్మికులు లేని ప్రపంచాన్ని నిర్మించడంలో మన వేగం పెంచాలి. రండి కలిసి పని చేద్దాం.. బాలకార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం..
- ఉజ్జిని రత్నాకరరావు