Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోవిడ్ మహమ్మారి ప్రభావం ప్రత్యక్షంగానే కాదు, పరోక్షంగా కూడా అనేక ప్రతికూల ప్రభావాలను కలిగిస్తూ ఉంది. కోవిడ్ సోకి ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా చితికి పోయాయి. ఎన్నో మరణాలు సంభవించాయి. ఎందరో అనాథలుగా మిగిలారు. ఉపాధి దొరకక ఎందరో ఆత్మహత్యలు చేసుకున్న వారు ఉన్నారు. భయంతో చాలా మంది తనువు చాలించారు. ఆక్సిజన్ కొరతతో అనేక ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇదే సమయంలో కోవిడ్ కారణంగా మరొక ఆందోళన ఇప్పుడు బయలు దేరింది. అదే చిన్న పిల్లలకు వేసే సాధారణ టీకాలు. పిల్లలకు ప్రాణాంతక వ్యాధుల నుండి రక్షణ కల్పించేందుకు పుట్టిన వెంటనే క్షయ, పచ్చకామెర్లు, పోలియో నివారణకు వినియోగించే బీసీజీ, ఓపీవీ, హెపటైటిస్-బి వ్యాక్సిన్లు అందిస్తారు. తదుపరి డోసులను నిర్ణీత వ్యవధిలో వేయిస్తారు. బీసీజీ, ఓరల్ పోలియో 6, 10, 14 వారాల్లో, రోటా వైరస్ 9 నుంచి 12 నెలల మధ్య, మీజిల్స్ రుబెల్లా 16 నుంచి 24 నెలల మధ్య రెండో డోసు, పెంటావాలెంట్ (డీపీటీ, ఓపీవీ, హెపటైటిస్) 6, 10, 14 వారాల్లో, తర్వాత డీపీటీ బూస్టర్ ఇలా చిన్నారులకు ఐదేండ్ల వరకు అందిస్తూ ఉండాలి. పదో ఏట డిఫ్తీరియా, టెటానస్కు మళ్లీ బూస్టర్ డోసు ఇవ్వాలి. బాలికలకైతే వీటితోపాటు 10-15ఏండ్లలోపు హెచ్పీవీ (హ్యుమన్పాపిలోమా వైరస్) టీకా రెండు డోసులు అందించాలి. ఈ టీకాలు అనేవి ఎన్నో ప్రమాదకర వ్యాధుల నుండి రక్షణ కలిపిస్తాయి. ఇవి నిర్ణీత సమయానికి వేయించకపోతే పిల్లలకు చాలా ముప్పు ఏర్పడుతుంది.
ప్రజారోగ్య చరిత్రలో ఈ టీకాలు అనేవి అత్యంత శక్తివంతమైన సాధనాల్లో ఒకటిగా చెప్పవచ్చు. పిల్లల శరీరాన్ని వ్యాధులకు వ్యతిరేకంగా ప్రతిరోధకాలను ఉత్పత్తి చేయడానికి ప్రేరేపించే వ్యాధుల యాంటిజెన్ల నుండి ఈ టీకాలు తయారవుతాయి. అందువల్ల ఇవి పిల్లల రోగనిరోధక శక్తిని పెంచి, వారు ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి. చిన్నారులకు టీకాలు వేయడం ఎంత ముఖ్యమో టీకా కార్డులో సూచించిన విధంగా షెడ్యూల్ను పాటించడమూ అంతే ముఖ్యం. వైద్యులు సిపారసు చేసే టీకా కార్డులో 18ఏండ్లు వయస్సు వరకు సిఫార్సు చేయబడిన అన్ని ముఖ్యమైన టీకాలు ఉంటాయి. అయితే కరోనా మహమ్మారి మాత్రం క్రమ బద్దంగా వేయించే ఈ టీకాలకు అవాంతరం ఏర్పరచి దాని వలన కలిగే ప్రయోజనాలను ప్రమాదంలో పడేసింది. దీనివలన పిల్లలకు ప్రాణాంతక వ్యాధుల నుండి రక్షణ కరువయ్యే భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనివలన పిల్లల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతూ ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. అయితే ప్రస్తుతం ప్రపంచం కోవిడ్ మహమ్మారి విషయంలో 2 దశలు దాటి 3వ దశకు సిద్ధంగా ఉంది. మొదటి దశలో చాలా దేశాల్లో లాక్డౌన్ కొనసాగింది. రెండవ దశలో ఇది మరింత వేగంగా వ్యాప్తిచెంది అనేక మరణాలకు కారణం అయ్యింది. 3వ దశలో మాత్రం పిల్లల్లో ఎక్కువ ప్రభావం ఉంటుంది అనే వార్తలు వింటున్నాం. మొదటి దశలో లాక్డౌన్ ఆంక్షలు రెండవ దశలో హాస్పిటల్స్ అన్నీ కూడా కోవిడ్ రోగులతో కిక్కిరిసి పోవడం. సాధారణ వైద్య సేవలకు అవకాశం లేక పోవడం, ఇటువంటి విపత్తులో కరోనాకు భయపడి దేశంలో చాలామంది తల్లిదండ్రులు పసిపిల్లలకు సాధారణ టీకాలనూ వేయించడం లేదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ప్రమాదకర వ్యాధుల నుంచి రక్షణ ఇచ్చే ఈ టీకాలను వేయించకపోవడం ముప్పుగా పరిణమించొచ్చని హెచ్చరిస్తున్నారు. అధికారిక అంచనాల ప్రకారం మన దేశంలో 20లక్షల నుంచి 22లక్షల వరకు ఏడాది లోపు పిల్లలకు ప్రతి నెలా జాతీయ ఆరోగ్య కార్యక్రమాల కింద ఇచ్చే సాధారణ టీకాలను వేయించడం లేదని తెలుస్తోంది. అంటే ఈ లెక్కన ఏడాదికి సుమారు 2.6 కోట్ల మంది పిల్లలకు సాధారణ వ్యాక్సినేషన్ జరగడం లేదు. కోవిడ్ రెండో ఉధృతి సమయంలో 18నెలల లోపు పిల్లలకు సాధారణ వ్యాక్సినేషన్ దాదాపు 60-70 శాతం పడిపోయినట్లు వైద్య నిపుణులు తెలిపారు. అయితే ఒకటి రెండు నెలలు ఆలస్యమైనప్పటికీ పిల్లలకు టీకాలు మాత్రం తప్పనిసరిగా వేయించాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా టీకాలు వేయించడం ఆలస్యమవుతున్న కొద్దీ అవి అడ్డుకునే వ్యాధుల ముప్పు పెరుగుతుంది. ముఖ్యంగా కోరింత దగ్గు, డిఫ్తీరియా, ధనుర్వాతం, తట్టు లాంటి వ్యాధులు కోవిడ్ కంటే ప్రమాదకరమని చెబుతున్నారు. ప్రాథమికంగా అవసరమయ్యే టీకాలు తప్పనిసరి కాబట్టి తగు జాగ్రత్తలు పాటించి తల్లిదండ్రులు తమ పిల్లలను ఆసుపత్రులకు తీసుకొచ్చి టీకాలు వేయించడం ద్వారా పిల్లలకి ఎదురయ్యే ముప్పు నుండి బయటపడవచ్చు. అయితే చిన్నారులను ఆసుపత్రులకు తీసుకొచ్చే ఈ సమయంలో తల్లులు గ్లౌజులు, మాస్కులు ధరించడం. పిల్లలకు ఒంటి నిండా దుస్తులు తొడగటం. సురక్షిత దూరం పాటించడం వంటి జాగ్రత్తలు విధిగా పాటించాలి. పిల్లలకు ఇచ్చే వ్యాక్సిన్ విషయంలో ఒక్కో డోసు మధ్య కనీసం 4వారాల వ్యవధి ఉండాలని, గరిష్టంగా 6 వారాలు దాటకూడదని, మరీ ఇబ్బందికర పరిస్థితులు తలెత్తి మొదటి ఏడాది ఏవైనా టీకా డోసులు ఇవ్వలేకపోతే రెండో ఏడాది పూర్తయ్యేలోపు తప్పనిసరిగా ఇవ్వాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అన్ని టీకాలు తప్పనిసరిగా వేయించినవుడే బిడ్డకు పూర్తి రక్షణ ఏర్పడుతుంది. ఇప్పటి వరకూ కోవిడ్ పిల్లలకు ఎక్కువ సోకక పోవడానికి పిల్లలకు క్రమం తప్పకుండా సాధారణ టీకాలు ఇవ్వడమే ప్రధాన కారణం అని కూడా కొన్ని వైద్య పరిశోధనలు చెబుతున్నాయి. ఈ క్రమంలో వారికి షెడ్యూల్ ప్రకారం వేసే టీకాల విషయంలో జాప్యం చేస్తే 3వ దశలో ఎక్కువ ప్రభావం పిల్లలపై ఉంటుంది అనేది కూడా ఆ పరిశోధనల అభిప్రాయం. వీటిని అన్నింటినీ దృష్టిలో ఉంచుకుని సాధారణ టీకాల ప్రాధాన్యతను, ముఖ్యంగా క్రమం తప్పకుండా వేయించవలసిన ఆవశ్యకతను తల్లి తండ్రులు గుర్తించాలి.
ప్రభుత్వం కూడా కోవిడ్ విపత్తు దాటే వరకూ తాత్కాలికంగా అయినా అదనపు వైద్య సిబ్బందిని నియమించి వారి ద్వారా కేవలం సాధారణ టీకాలు మాత్రమే అందించే ఏర్పాటు చేస్తే, దైర్యంగా తల్లి తండ్రులు వచ్చి తమ పిల్లలకు టీకాలు అందించగలరు. దీనితో పాటు పత్రికలలో ప్రసార మాధ్యమాలలో కూడా పిల్లల టీకాల విషయమై విస్తృత ప్రచారం చేయాలి. నిర్ణీత సమయంలో వాటిని వేయించక పోవడం వలన కలిగే ముప్పును గ్రామాలలో కూడా విస్తృత ప్రచారం ఇవ్వగలగాలి. సాధారణ టీకాలు క్రమం తప్పకుండా ఇవ్వగలిగితే పిల్లలకు కోవిడ్ ముప్పు నుంచి చాలా వరకూ తప్పించవచ్చు అనే వైద్యుల అభిప్రాయాలకు కూడా విస్తృత ప్రచారం ఇవ్వగలిగితే పిల్లలకు సంభవించే అనేక రుగ్మతలనుండి బయట పడేయటమే కాకుండా ప్రాణాంతక ముప్పు లేకుండా పిల్లలను కాపాడిన వాళ్ళం అవుతాం. ఆరోగ్యదాయక భావి భారత పౌరులను దేశానికి అందించిన వాళ్ళం అవుతాం.
- రుద్రరాజు శ్రీనివాసరాజు
సెల్: 9441239578