Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆధునిక ప్రపంచంలో అవకాశాలను అందిపుచ్చు కోవటంలో సగటు జీవికి ఆకలి - పేదరికం అడుగడుగునా అడ్డుపడుతున్నాయి. ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సామాజిక సమస్యలలో ఇవి ప్రధానమైనవి. ఇవి మానవాళి మనుగడకే పెను సవాళ్లు విసురుతున్నాయి. ఈ సమస్య కోట్లాది ప్రజలను కనీస అవసరాలకు దూరం చేస్తోంది. పేదరికాన్ని 2030 నాటికి అంతం చేయాలనే ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో పేర్కొన్నప్పటికీ, నేటి కరోనా సమస్య పేదరికాన్ని మరింత తీవ్రతరం చేసింది. ప్రపంచవ్యాప్తంగా 15.5కోట్ల మంది తీవ్రమైన ఆకలి సమస్యల్లో చిక్కుకున్నారని ఆక్స్ ఫామ్ నివేదిక వెల్లడించింది. ప్రతి నిమిషానికి 11 ఆకలి చావులు నమోదవుతున్నాయనే నివేదిక సారాంశమే దీని తీవ్రతకు నిదర్శనం. 2020లో జనాభా వృద్ధి స్థాయిని మించి ఆకలి సమస్య పెరిగిపోయిందని ఐక్యరాజ్యసమితి నివేదిక పేర్కొన్నది. ప్రపంచ జనాభాలో దాదాపు పదిశాతం మందికి పోషకహారలోపం ఉండవచ్చని అంచనావేసింది. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాతో ఆకలి పేదరిక నిర్మూలన కార్యక్రమాలు ఎంతవరకు సఫలీకృతం అవుతాయోననే సంశయాన్ని ఈ అధ్యయనం వ్యక్తం చేసింది. ఆధునిక కాలంలో ఎన్నడూ లేని విధంగా కోవిడ్-19 ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పేదలపై తీవ్ర ప్రభావం చూపిందని, 2021నాటికి ప్రపంచంలో 15 కోట్లమంది తీవ్ర పేదరికానికి గురయ్యే అవకాశముందని ప్రపంచబ్యాంక్ హెచ్చరించింది. కొత్త వ్యాపారాలు, కొత్త రంగాల్లో శ్రమ, నైపుణ్యాలు, ఆవిష్కరణలకు అవకాశాలు కల్పించాలని, కోవిడ్ తర్వాత ''విభిన్నమైన ఆర్థిక వ్యవస్థ'' కోసం దేశాలు సిద్ధం కావాలని కోరింది. కరోనా మహమ్మారి మహిళలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం, యూఎన్ అభివృద్ధి కార్యక్రమం (యూఎన్డీపీ) వెల్లడించింది. 2021 నాటికి దాదా పు 4.7కోట్ల మంది మహిళలు, బాలికలు తీవ్ర పేదరికంలోకి వెళ్లే అవకాశం ఉందని పేర్కొనడం ఆందోళన కలిగిస్తుంది.
ఆకలి-పేదరికానికి గల కారణాలు...
ఒక దేశంలో తక్కువ ఆదాయం, నిరుద్యోగం, అధిక జనాభా, వ్యవసాయం ప్రధానంగా ఉన్న ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక అసమానతలు, వనరుల అల్ప వినియోగం, అల్ప వేతనాలు, పౌర భాగస్వామ్యం లోపం, సంక్షేమ పథకాల వైఫల్యం లాంటి అంశాలు ఇప్పటివరకు పేదరికానికి ప్రధాన కారణమని దారిద్య్రరేఖను నిర్వచించిన ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. వీటన్నింటిని తోడు ఇటీవల కరోనా సంక్షోభం పేదరికానికి మరింత ఆజ్యం పోసిందని అనేక అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా కరోనా నియంత్రణకు ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ ప్రక్రియతో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయింది. దీంతో విద్య, వైద్య, ఆరోగ్య, ఆతిధ్య, రవాణా, పర్యాటక తదితర రంగాలలో పనిచేస్తూన్న కోట్లాదిమంది ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం పడింది. ఫలితంగా కుటుంబాల ఆర్థిక పరిస్థితి దిగజారింది. దాని ప్రభావం పెద్దలకంటే చిన్నారులు, పిల్లలపై మరింత తీవ్రంగా పడింది. లింగపరమైన అసమానతలకు దారి తీసింది. భారత్లో మెజార్టీ మధ్యతరగతి కుటుంబాల్లో ఇంటిపెద్ద సంపాదనే కుటుంబ సభ్యులందరికీ ఆహార సముపార్జనకు సాధనం. ఆయనే ఉపాధి కోల్పోవడంతో పేదలతో పాటు మధ్య తరగతి కుటుంబాలు సైతం ప్రభుత్వ రేషన్తో కాలం గడిపే పరిస్థితి నెలకొంది. చాలా కుటుంబాలు ఆకలి, అర్థాకలితో పోషకాహార లోపం, ఆరోగ్య సమస్యలతో రోడ్డున పడ్డారు. ఇది వారి ఆహార, ఆరోగ్య సంరక్షణపై తీవ్ర ప్రభావం చూపింది. మన దేశంలో వలస కార్మికుల సమస్యలు వర్ణనాతీతం అని చెప్పవచ్చు.
నిర్మూలనకు చేపట్టాల్సిన చర్యలు
ప్రపంచాన్ని అభివృద్ధి పథంలో నడిపించటం కోసం మొదట చేయాల్సిన పని దారిద్య్రాన్ని నిర్మూలించటం. ప్రజారోగ్య వ్యవస్థను మెరుగుపర్చుకోవాలి. అభివృద్ధిని పరుగులు పెట్టించటంతో పాటు అన్ని వర్గాలకు సమానంగా అందే విధంగా కృషి చేయాలి. సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంతోపాటు సాధికారిక కార్యక్రమాలకు నాంది పలకాలి. ముఖ్యంగా ప్రజల జీవన ప్రమాణాల పెంపుకై వ్యవసాయం, సామాజిక రంగం, ఉపాధి కల్పన వంటి రంగాలపై పెద్ద ఎత్తున ఖర్చు చేయాలి. అందరికీ సమానంగా విద్య, వైద్య సౌకర్యాలు అందరికీ అందుబాటులో ఉండే వాతావరణం సృష్టించాలి. లింగ భేదం లేకుండా మహిళలకు ఆర్థిక రక్షణ కల్పించే ప్రత్యేక విధానాలను తీసుకురావాలి. వారికి ఆర్థిక స్వావలంభన కల్పించాలి. భారత్ వంటి దేశాల్లో వ్యవసాయానికి తగిన ప్రాధాన్యమివ్వటం తప్పనిసరి. ఈ రంగంలో సాధించే అభివృద్ధి వల్ల రెండింతలు పేదరికం తగ్గుతుందనే ఆర్థిక వేత్తల అంచనాలున్నాయి. ఇప్పటివరకు దేశంలో అమలు చేస్తున్న పేదరిక నిర్మూలన కార్యక్రమాలను పటిష్టంగా అమలు పరచాలి. నైపుణ్యాల కల్పన, యువతకు విరివిగా ఉపాధి అవకాశాలు కల్పించటంపై ప్రభుత్వాలు దృష్టిసారించాలి. దానికై సాంకేతిక పరిజ్ఞానాన్ని కొత్త పుంతలు తొక్కించడంతో పాటు పరిశ్రమల స్థాపనకు పెట్టుబడి పెట్టాలి. పర్యావరణానికి హాని కలిగించని సుస్థిరాభివృద్ధి చర్యలకై ప్రతి ఒక్కరు ప్రతిన పూనాలి. ప్రపంచ దేశాలు ఆర్థికాభివృద్ధితో పాటు మానవాభివృద్ధి దిశగా సమగ్ర కార్యాచరణ రూపొందించాలి. పౌర సేవల వినియోగా నికై ప్రతి ఒక్కరిని అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పించే వికేంద్రీ కృత ప్రజాస్వామ్య వ్యవస్థలను బలోపేతం చేయాలి. ఐరాసతో పాటు ప్రపంచ బ్యాంకు గ్రూపు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ వంటివి పేదరిక నిర్మూలన కార్యక్రమాలకు ఆయా దేశాలకు తోడ్పాటు అందించాలి. అప్పుడే నేటి సంక్షోభానికి చమరగీతం పాడడంతో పాటు పేదరికం అంతం అవుతుంది.
- ఎస్ . శ్యామల
సెల్: 8008539905