Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''నా తల్లిదండ్రులు నా చిన్నతనంలోనే చనిపోయారు. నేను కలకాలం జీవించాలనుకోవడం లేదు. నా లక్ష్యం నెరవేరింది. నేనేమి తప్పు చేయలేదు, అతనికి సరైన శిక్ష పడింది. అతను ఆ శిక్షకు అర్హుడు. నేను అతనిని చంపినందుకు పశ్చాత్తాపం చెందనవసరం లేదు'' అంటూ ఉద్దం సింగ్ తన ఉరి సమయంలో పలికారు. ఆయన
జనరల్ మైకెల్ ఓ డయ్యర్‌ను (అప్పటి పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్) చంపినందుకు ప్రసిద్ధుడయ్యాడు. ఈ డయ్యరే జలియన్ వాలాబాగ్ హత్యాకాండకు సూత్రధారి. ఈయన ఆదేశాల మేరకు ఎడ్వర్డ్ హ్యారీ డయ్యర్ భారతీయులపై కాల్పులు జరిపించారు. జలియన్ వాలాబాగ్ దురంతం భారత స్వాతంత్య్ర సంగ్రామ సమయంలో జరిగిన అత్యంత విషాదకరమైన సంఘటన. జలియన్ వాలాబాగ్ అనేది పంజాబ్‌లోని అమత్సర్ పట్టణంలో ఒక తోట. ఏప్రిల్ 13, 1919న బ్రిటిష్ సైనికులు జనరల్ డయ్యర్ సారథ్యంలో ఈ తోటలో బ్రిటిష్ వారి విధానాలకి వ్యతిరేకంగా సమావేశమైన నిరాయుధులైన స్త్రీ, పురుషులు, పిల్లలపైన విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పులు పది నిమిషాలపాటు కొనసాగాయి. 1650 రౌండ్లు కాల్పులు జరిగాయి. అప్పటి ఆంగ్ల ప్రభుత్వ లెక్కల ప్రకారం 379 మంది మరణించారు. కానీ ఇతర గణాంకాల ప్రకారం అక్కడ 1000కి పైగా మరణించారు. 2000 మందికి పైగా గాయపడ్డారు.
భారతదేశంలో దీనికి ప్రతిగా తీవ్రమైన ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. పంజాబ్‌లో జరుగుతున్న స్వాతంత్య్రోద్యమానికి మరింత ఆజ్యం పోసింది. 1920లో గాంధీజీ ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా సహాయ నిరాకరణోద్యమం ప్రారంభించడానికి నాంది పలికింది. భగత్‌సింగ్ విప్లవకారుడిగా మారడానికి కూడా ఈ సంఘటనే కారణం. విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్, బ్రిటిష్ ప్రభుత్వం తనకిచ్చిన సర్ బిరుదును ఇంగ్లండు ప్రభువుకు తిరిగి ఇచ్చివేశాడు. మొత్తం మీద ఈ సంఘటన స్వాతంత్య్రోద్యమానికి మరింత స్ఫూర్తినిచ్చి వేగవంతం చేసిందని చెప్పవచ్చు.
ఉద్ధం సింగ్ 1899 డిసెంబర్ 26న జన్మించారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులని కోల్పోయారు. భగత్ సింగ్ స్ఫూర్తితో విప్లవబాటబట్టారు. కొంతకాలం గదర్ పార్టీలో పనిచేశారు. జలియన్ వాలాబాగ్ దుర్ఘటనకి కారణమైన డయ్యర్‌ని చంపడమే జీవిత ఆశయంగా పెట్టుకున్నారు. అందుకు ఆయన ఇంగ్లండ్ వెళ్లారు. ఈ దుర్ఘటన జరిగిన 21ఏండ్లకు 1940 మార్చి 13న డయ్యర్‌ని ఉద్దం సింగ్ కాల్చి చంపి, అనంతరం బ్రిటిష్ అధికారులకి లొంగిపోయారు. ఆయనకు అదే ఏడాది జులై 31న మరణశిక్ష అమలు చేశారు. ఉద్దమ్ సింగ్ తన పేరును రాం మొహమ్మద్ సింగ్ ఆజాద్‌గా, భారతదేశంలోని మతాలైన హిందూ, మహమ్మదీయ, సిక్కు మతాలకు ఏకత్వాన్ని ఆపాదిస్తూ మార్చుకున్నాడు. ఇతడి త్యాగానికీ, దేశభక్తికీ మెచ్చుకొని ఇతడిని షహీద్-ఎ-అజం (వీరులలో అగ్రగణ్యుడు) గా వ్యవహరిస్తారు. నేటి కాలంలో దేశవ్యాప్తంగా అనేక సమస్యలు ఉన్నాయి. ఒకవైపు మతోన్మాదం పెరుగుతుంది. మరొకవైపు పాలకుల నిర్లక్ష్యం వల్ల నిరుద్యోగం, పేదరికం పెరుగుతుంది. వీటిపై ఉద్ధం సింగ్ వంటి త్యాగమూర్తుల స్ఫూర్తితో నేటి యువత పోరాడవలసిన అవసరం ఉంది.
- ఎం. రాంప్రదీప్
సెల్: 9492712836