Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''గుడిసె చుట్టూ భవంతులు మూగి... అస్థిపంజరం చుట్టూ అభివృద్ధి పథకాలు చేరి... తెగ బాధ పడినట్టు ఫోజులు! తెలుసుకోరా ఇవి ఎన్నికల రోజులు!?'' అని అలిశెట్టి ప్రభాకర్ రాసినట్టు హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా ప్రారంభమైన దళితబంధు పథకం రాష్ట్రంలో ఎంత మేరకు అమలవుతుంది? ఎంత మంది దళితుల బాగోగులను మెరుగుపరుస్తుందనే పలు ప్రశ్నలు తెలంగాణ సమాజం నుండి ఉద్భవిస్తున్నాయి. ఈ ప్రశ్నలకు గల కారణాలను, పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వ పనితీరును గతం నుండి పరిశీలిస్తే నూతన తెలంగాణ రాష్ట్రంలో రెండు పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. ఏడేండ్లు గడిచాయి. ఇప్పుడు తెలంగాణ ముఖ చిత్రం ఉహించుకుందా మంటే కొంత భయంగానూ, మరికొంత బెరుకుగానూ ఉంది. ఓ పక్క కాళేశ్వరం నుండి నీటి ధార టివీలలో హౌరెత్తిస్తూనే ఉంది. మరో పక్క మల్లన్న సాగర్ నిర్వాసితుల దయనీయమైన మూలుగులు వినిపిస్తూనే ఉన్నాయి. రైతు బంధు పథకంలో పేద రైతుకు కొంత పెట్టుబడితో ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తుందని ముఖంపై చిరునవ్వు పూయిద్దామంటే 18లక్షల కౌల్దారీ రైతుల చిన్న బోయిన ముఖాలు మౌనంగా ముకుళించుకుపోయిన దృశ్యం మాట పెలగనివ్వడం లేదు. రైతు భీమాతో గుండె నిండా ఊపిరి పీల్చుకుందామనుకుంటే, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆరేండ్లలో 6000 మంది రైతులు, అంటే సగటున సంవత్సరానికి వెయ్యి మంది చొప్పున ఆత్మహత్యలు, బలవన్మరణాలకు పాల్పడిన రైతుల కుటుంబాల రోదనలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. రైతు రాజ్యంలో వ్యవసాయం లాభదాయకం చేస్తానన్న నేపథ్యంలో రాష్ట్ర జీడీపీ వృద్ధిని పరిశీలిద్దాం. 2014-2015 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర జీడీపీ సుమారు నాలుగు లక్షల కోట్లు ఉండగా 2020-2021 ఆర్థిక సంవత్సరానికి అది దరిదాపు 10లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. మంచిదే. కానీ ఏయే జిల్లాలలో జీడీపీ వృద్ధి నమోదయ్యింది? ఏ ప్రదేశాలలో అయితే పారిశ్రామిక, సేవా రంగాలు అభివృద్ధి చెందాయో ఆ జిల్లాలలోనే ఆర్థిక వృద్ధి గోచరిస్తున్నది. వ్యవసాయం, వ్యవసాయ సంబంధిత ఉత్పత్తులు, అటవీ ఉత్పత్తులు మాత్రమే ఉన్న జిల్లాల్లో ఏమాత్రం జీడీపీ పెరగలేదు. అంటే ప్రభుత్వ ఆర్థిక విధానాలు రైతులకు తీపి మాటలు సేవా రంగాలకు అనుకూలం అన్నట్టే కదా?
తెలంగాణలో సెంటు భూమి కూడా లేని దళిత కుటుంబాలు 3లక్షల దాకా ఉన్నాయని, వాటిలో ఒక్కొక్క కుటుంబానికి 3ఎకరాలు ఇస్తామని, ఇవి కాక 3 ఎకరాల భూమి కంటే తక్కువ భూమి కలిగిన దళిత కుటుంబాలు మరో మూడు లక్షలు ఉంటాయని, వాటిని కూడా ఒక్కో కుటుంబానికి కనీసం మూడు ఎకరాలు ఉండేలా తక్కువయిన భూమిని కొని వారికి కేటాయిస్తామని ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసి ఏడేండ్లయింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి నాలుగేండ్లలో 32జిల్లాలలో 549 కోట్ల రూపాయిలు వెచ్చించి 12,393 ఎకరాల భూమిని కొని 5,759 దళిత కుటుంబాలకు పంచారు. మిగిలిన 2లక్షల 94కుటుంబాల సంగతి, 3 ఎకరాల పొలములేని 3 లక్షల కుటుంబాల సంగతి ఏమైంది? పంపిణీ చేసిన 13 వేల ఎకరాల భూమి కూడా చాలా వరకు సాగు యోగ్యం కాదని, సాగు నీటి సౌకర్యం లేనిదని, ఒక సంవత్సరం పాటు వ్యవసాయానికి పెట్టుబడి ప్రభుత్వమే సమకూరుస్తుందన్న హామీని ప్రభుత్వం నిలబెట్టుకోలేదని, లబ్ది దారులకంటే ఎక్కువ లాభం పొందింది భూమిని అమ్మిన భూకామందులేనని అనేక విమర్శలు ఈ పథకం గురించి ఉన్నాయి. వీటిల్లో ఏ విమర్శకూ ప్రభుత్వ పెద్దల నుంచి సమాధానం లేదు. గణాంకాలు పరిశీలిస్తే రాష్ట్రంలో సగటు తలసరి ఆదాయం పెరిగిందని కనిపిస్తుంది. కానీ రాష్ట్ర జనాభా 3 కోట్ల 50 లక్షల పైచిలుకు ఉంటే అందులో 2కోట్ల 80 లక్షల మంది నేటికీ నిత్యవసర సరుకుల కోసం ప్రభుత్వ ప్రజా పంపిణీ వ్యవస్థ మీదే ఆధారపడి ఉన్నారన్న వాస్తవమూ ఆ గణాంకాల వల్లే తెలుస్తుంది.
ఏ సమాజానికయినా సహజ అభివృద్ధి సూచిక విద్య, వైద్య రంగాలలో సాధించిన ప్రగతి మాత్రమే. తెలంగాణ ఉద్యమ సమయంలో 'కేజీ టు పీజీ' ఉచిత విద్య అన్నది అన్ని వర్గాలను ఆకట్టుకున్న నినాదం. నిజంగా అది గొప్ప ఆశయం. కానీ ఆచరణలో ఏమైంది. కొన్ని గురుకుల పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు స్థాపించారు. వీటిల్లో ఇంగ్లీష్ మాధ్యమం, పోషకాహారం, మంచి శిక్షణ అందుబాటులో ఉంచారు. అందులో చదువుతున్న నిమ్నవర్గాల పిల్లలు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ఇంతవరకు అభినందనీయమే. కానీ ఇవి ఎంతమంది అవసరాలు తీరుస్తున్నాయి? ఆ పాఠశాలలను కూడా కులాల వారీగా, వర్గాల వారీగా స్థాపించారు. దేశమంతా ప్రస్తుతించిన కొఠారి కమిషన్ సిఫారసు కామన్ స్కూల్ పద్ధతి తెలంగాణ ప్రభుత్వ విధానానికి వ్యతిరేకమా?
రెసిడెన్షియల్ స్కూళ్ల విషయం అలా ఉంటే, ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఈ ఏడేండ్ల కాలంలో మరీ దిగజారి పోయింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రభుత్వ ఎజండాలోనే లేకపోవడం అత్యంత శోచనీయం. చివరి సారిగా ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్ద కాలం కిందట 2012లో ఉపాధ్యాయ నిమాయకాలు జరిగాయి. 20,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. రాష్ట్ర ఆదాయంలో ప్రతి ఏటా 30శాతం బడ్జెట్ విద్యా రంగానికి కేటాయించాలని కొఠారి కమిషన్ సూచిస్తే, 2014-15 ఆర్థిక సంవత్సరంలో 10శాతం కేటాయించి చేతులు దులిపేసుకున్నారు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం ఒక్కో శాతం తగ్గిస్తూ వస్తున్నారు. కళాశాలల్లో కాంట్రాక్ట్ పద్ధతిన నియామకాలు, విశ్వ విద్యాలయాల పరిస్థితి దారుణం. గవర్నర్ చీవాట్లు పెడితే గాని ఉప కులపతుల నియామకం జరగలేదు. పరిశోధన నత్త నడకన నడుస్తున్నది. యూనివర్సిటీలలో మొత్తం 2,979 బోధనా సిబ్బందికి సంబంధించిన పోస్టుల్లో 2,152 పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే ఉన్నత విద్యను ప్రయివేటీకరించి పేద వర్గాలకు దానిని అందని ద్రాక్షలా చేయడమే ప్రభత్వ ఉద్దేశ్యమా? దశాబ్దాల కాలం సాగిన ఉద్యమంలో సబ్బండ వర్గాలు తెలంగాణలో విజ్ఞాన సమాజం నెలకొంటుందని కన్న కలలు ఏమయ్యాయి.
ప్రభుత్వ వైద్య రంగం కుదేలయి పోయింది. ప్రభుత్వ దావఖానాలలో వైద్య సిబ్బంది పూర్తి స్థాయిలో లేరని, వందలాదిగా పోస్టులు ఖాళీగా ఉన్నాయన్న వార్త మనసును కలచి వేస్తుంది. ప్రయివేట్, కార్పొరేట్ ఆసుపత్రులది ఇష్టా రాజ్యంగా నడుస్తున్నది. కోవిడ్ సెకండ్ వేవ్‌లో తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వం ప్రకటించిన మరణాల సంఖ్య కంటే వాస్తవంగా ఒక్క హైదరాబాద్ నగరంలోనే వంద శాతం ఎక్కువ మరణాలు సంభవించాయని 'ద హిందూ' పత్రిక రాసిందంటే వైద్య రంగం ఎంత రోగ గ్రస్థమైందో ఊహించుకోవచ్చు.
తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాలు అన్న అంశాల కేంద్రంగా ఎగిసి పడి తెలంగాణ ఏర్పడడంతోటే నిధుల సమస్య పరిష్కారమైందని చాలా మంది భావిస్తుంటారు. నిజమే. తెలంగాణ నుండి వసూలైన పన్నులు గానీ, తెలంగాణకు కేటాయించబడ్డ నిధులు గానీ తెలంగాణ కోసమే వెచ్చిస్తున్నారు. కానీ ప్రాజెక్టుల నిర్మాణంలో వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఎవరికిస్తున్నారు? ఇక ఉద్యోగాలు, నియామకాలు లేక తెలంగాణ యువత నిరాశ నిస్పృహలోకి జారుకుంది. రైతుల ఆత్మహత్యల్లాగా కొలువుల్లేక నిరుద్యోగుల ఆత్మహత్యలు తెలంగాణలో ప్రారంభమయ్యాయి. ఈ పాపం ఎవ్వరిది? లక్షా తొంభై వేల ఖాళీలన్నీ, కుంచించుక పోయి చివరికి అవి 50 వేలయ్యాయి. 50 వేల పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించి నెలలు గడుస్తున్నా నోటిఫికేషన్ గతిలేదాయె. యువత అశాంతికి లోనయితే సమాజం అతలాకుతల మవుతుందని ప్రభుత్వ పెద్దలకు తెలియదా? ఇలా ఎన్నో వాగ్దాన భంగాలు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు ఆవిరైపోయాయి. కేంద్రంలో బీజేపీ పరిపాలనలో ప్రజాస్వామ్య వాతావరణం అడుగంటి పోతున్నా, పౌర సమాజం అణిచివేతకు గురవుతున్నా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు నోరుమెదపడం లేదు. ఆదుకోవలసిన రాజకీయ రంగం నిస్తేజానికి గురై మాటల బింకాలతో కాలం గడుపుతుంది. సమస్యల సుడిగుండంలోంచి బయట పడాలంటే తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరాలంటే ఏం చేయాలి? ఈ ప్రశ్నకు సమాధానమే రాష్ట్ర భవిష్యత్తుకు మార్గం చూపగలదు.
- ఎన్. శ్రీనివాస్
సెల్ : 9676407140