Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భగవద్గీత అనే మాటకు భగవంతుని గీతం అని అర్థం. మహా ఇతిహాసంగా ప్రసిద్ధికెక్కిన మహా భారతం 6వ పర్వంలో 23-40 శ్లోకాలలో భగవద్గీత దర్శనమిస్తుంది. విష్ణువు అవతారాలలో 8వ అవతారం కృష్ణావతారం. యదుకృష్ణుడు కురుక్షేత్ర సంగ్రామంలో పాండవ వీరుడైన అర్జునుడికి రథసారథిగా సాయపడ్డాడు. రథసారథి అయిన కృష్ణుడికి అర్జునుడికి మధ్య జరిగిన సంభాషణను సంజయుడు దృతరాష్ట్రుడికి నివేదిస్తాడు. అదే భగవద్గీత.
కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభమవుతుండగా అర్జునుడు ఉన్నట్టు ఉండి యుద్ధమంటే విరక్తి చూపుతాడు. అన్నదమ్ములను దాయాదులను నిర్మూలించే మారణ హౌమంలో ప్రముఖ పాత్ర పోషించలేనంటాడు. మహా మారణకాండకు మరస్సు సిద్ధపరిచేందుకు అర్జునుడు అడిగే ప్రశ్నలకు సమాధానంగా కృష్ణుడు ఒక తాత్వికచట్రాన్ని వివరించాడు. అదే భగవద్గీత అయితే కృష్ణుడు ఎన్ని చెప్పినా అర్జునుడు భయపడిందే చివరకు జరిగింది.
దివ్యవాక్కులుగా పేరొందిన ఈ గీతను ఒక్కొక్కరు ఒక్కోరకంగా వివరించారు. ఒక వివరణకు మరో వివరణకు పొంతన లేదు. వీటిని చూస్తే అసలు మూలంపైనే సందేహాలు తలెత్తక మానవు. ఒక నైతిక తత్వం అది ఏదైనా కానీ, అందరికీ ఒకే విధంగా అర్థం కావాలి. అలా కాకుండా సమాజంలోని రకరకాల వారు దానిని రకరకాలుగా అర్థం చేసుకున్నారంటే అర్థం ఏమిటి? ఆ తత్వంలోనే పరస్పర భిన్నమైన అవగాహనలు ఇమిడి ఉన్నాయన్నమాట. అందువల్లనే భగవద్గీత నుండి ఎవరికి తోచిన అర్థం వారు లాగగలిగారు.
మహాత్మాగాంధి గీతలో అహింసను ప్రధానంగా చూసారు. ఆదిశంకరుడు గీతలో అద్వైతాన్ని దర్శించాడు. సర్వేపల్లి రాధాకష్ణన్ గీత ఒక నైతిక ప్రబోధం అని భావించారు. జాతీయోద్యమ నాయకుడైన బాల గంగాధర తిలక్ గీత అన్నది శక్తిని సమకూరుస్తుందని, కార్యాచరణను బోధిస్తుందని అంటాడు. క్రీ.శ. 10వ శతాబ్దపు యమునాచార్యుడు, నారాయణుడే అత్యుత్తమమైన బ్రహ్మాస్వరూపం అని చెప్పటం గీత ముఖ్య ఉద్దేశ్యం అంటాడు. అలానే విశిష్టాద్వైత రామానుజాచార్యులు, ద్వైతవాదమద్వాచార్యులు, మరో రకంగా గీత ఉద్దేశ్యాలను అర్థం చేసుకున్నారు. అరవింద ఘోష్ అయితే గీతా అధ్యయనం కొరకు స్వతంత్ర పోరాటాన్నే ఒదిలివేసాడు. వీరందరు గీతను ఆశ్రయించినవారే. కానీ గత నుండి రకరకాల అర్థాలను లాగారు. అందువల్ల దీని మూలాన్ని ఏమేరకు విశ్వసించాలన్నదే పెద్ద ప్రశ్నార్థకమవుతున్నది. కానీ ప్రజల వైపు నుండి వ్యవస్థను పరామర్శించిన తాత్వికులు ఎవరూ కూడా భగవద్గీతను ఆశ్రయించలేదు. కబీర్ కానీ, తుకారాం కానీ, చైతన్యుడు కానీ, మన వేమనగాని.
గీతలో కొంత మతబోధన, తాత్వికత, కొంత లౌక్యం, కొంత ధైర్యవచనం, కొంత వీర స్వభావం గురించిన ప్రేరణ, ప్రతిఫలాపేక్ష, చివరకు బెదిరింపు అన్నీ కలగలిసి ఉన్నాయి. భగవద్గీతలో ప్రధానంగా కనిపించే అంశాలు :1. వర్ణ వ్యవస్థను బలంగా సమర్థించటం 2. గీతకన్నా ముందు కాలంలో ప్రచారంలో ఉన్న పరస్పర విరుద్ధమైన విభిన్న భావాలు, సాంఖ్య, యోగ, మీమాంస, వేదాంత, బౌద్ధ సంప్రదాయాలు ఇవన్నీ ఫలానా అని చెప్పకుండా అన్ని తన అభిప్రాయాలుగా చెప్పటం. 3.. భక్తి భావాన్ని ప్రవేశ పెట్టటం.
గీత4-13. చాతుర్వర్ణం మయాసష్టం - గుణకర్మ విభాగశ:
తస్య కర్తారమపి మాం - విర్ద్వకర్తారమవ్యయమ్||
ఈ నాలుగు కులాలు వాళ్ళ గుణ కర్మలను అనుసరించి తేడాను సృష్టించింది నేనే అంటాడు కృష్ణుడు, భగవంతుని గొప్ప పనుల జాబితాలో ఈ తేడాల సృష్టి కూడా ఒకటి.
గీత 9-32 మాం హి పార్థ! వ్యపాశ్రిత్య - యేపిస్య్ణు పాపయోనయ:
స్త్రీయో వైశ్యాస్తథా శూద్రా - తేపి యాంతిపరాంగతిమ్|| అంతేకాదు నన్ను శరణుజొచ్చినవారు, ఎవరైనా సరే వారు పాపిష్టి జన్మనెత్తిన స్త్రీలు, వైశ్యులు, సూద్రులు ఎవరైనా సరే అంటే ఏమిటి? మొత్తం స్త్రీలు, చమటోడ్చి పనిచేసే వైశ్యులు, శూద్రులు పాపిష్టి జన్మ పొందినవారన్నమాట.
గీతలో అంతర్వాహిణిగా సాగే భక్తిభావం అంతకు ముందున్న శ్వేతాశ్వరోపనిషత్ నుండి గ్రహించిందే. ఆ ఉపనిషత్తు నుండి అనేక శ్లోకాలను గీత సంగ్రహించింది. అలాగే గీత 2-55, 72 భాగంలోని భావాలు బౌద్ధమతం నుండి గ్రహించినవే. గాంధీ మహాత్ముని ఆశ్రమంలో రోజు ప్రార్థనలలో ఉపయోగించేది ఈ భాగం నుండే. అలాగే కఠోపనిషత్తు నుండి అనేక పద్యాలను గీతలో చేర్చారు. ఉపనిషత్తుల నుండి కాపీ కొట్టిన గీతాకారుడు వాటన్నింటిని వాసుదేవకతం అనిపించాడు. శ్రీకృష్ణుడు ఉపనిషత్తు అనే గోవును పితికి గీతామతం అనే పాలను అర్జునుడికి ఇచ్చాడు. కృష్ణుడు పాలు పితుక్కున్నది ఈ ఉపనిషత్తుల నుండే. ఉపనిషత్తులు గోవులు, కృష్ణుడు వాటిని పితికే గోపాలుడు. పాలు గీతామతం. ఆ పాలు తాగిన దూడ ధీమంతుడైన అర్జునుడు. ఈ సాక్ష్యాలను బట్టి గీతా రచన ఉపనిషత్తుల,
అలానే బౌద్ధమతం తర్వాతనే రచించబడిందనేది నిష్కర్మగా చెప్పవచ్చు. అందుకే దీని రచనా కాలాన్ని క్రీ||శ|| 150-350 మధ్య అయి ఉంటుందని చరిత్రకారులు నిర్ధారణ చేసారు.
గీత వేదక్రతువులైన యజ్ఞయాగాదులను నిరశించింది. వేదాలు పట్టుకు వేళ్ళాడుతూ వేదక్రతువులను నిర్వహించటం ద్వారా పవిత్రత, అధికారం లభిస్తాయి అనుకునేవారు మూర్ఖుు అంటాడు కృష్ణుడు.
వేదకాలంలో పాపము, భక్తి అనేవి వైదిక భావాలేకావు. గీతలో కృష్ణుడు చెప్పుకున్నట్లుగా వైదిక దేవతలెవరు సకల పాపాలను ప్రక్షాళన చేయగలమని చెప్పుకోలేదు.
గీత 18-66 సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం ప్రజ
అహం త్వాం సర్వ పాపేభ్య: మోక్షయిస్వామి మాశుభ: కృష్ణుడు ఇతర విశ్వాసాలు, ఆచారాలు, కర్మకాండలు అన్ని ఒదిలేసి కేవలం నన్ను మాత్రమే నమ్ముకో, భయపడకు. నేను అన్ని పాపముల నుండి విముక్తి చేస్తానంటాడు.
అర్జునుడు తన బంధువులను చంపటానికి ఎందుకు వెనకాడకూడదంటే యుద్ధం చేయటం క్షత్రియుడిగా నీ ధర్మం కాబట్టి అని కృష్ణుడు అంటాడు. ఎవరి వర్ణ ధర్మాలు వారు ఆచరించాలి అంటూనే సర్వ ధర్మములను విడిచి ఇతర విశ్వాసాలు, ఆచారాలు కర్మ కాండలు అన్నీ ఒదిలేసి నన్ను శరణువేడితే అన్ని పాపాల నుండి విముక్తం చేస్తానంటాడు. క్షత్రియుడికి యుద్ధభూమి నుండి పారిపోవటం కంటే మరణించటమే మేలు అని కృష్ణుడు అర్జునుడికి ఉపదేశిస్తాడు. కానీ తానుమాత్రం జరాసంధుడితో యుద్ధం చేయలేక ద్వారకకు పలాయణం చిత్తగిస్తాడు. అందువల్ల ఈనాటికి రణ్ డౌడ్ అంటే యుద్ధభూమిని ఒదిలినవాడు అనే పేరు ఆయనకు ఉన్నది. రాజ్యం కోసం బంధువులను చంపటం క్రొత్త విషయం ఏమీ కాదు. కృష్ణుడు స్వయానా మేనమామనే కాక రాజు కూడా అయిన కంసున్ని చంపాడు. గీతాసారం ఏమిటి? నీ కర్తవ్యం నిర్దేశించినట్లయితే నీ సోదరులను కూడా ఎలాంటి మమకారం చూపకుండా చంపేయి. నాపై విశ్వాసం ఉన్నంతకాలం నీ పాపాలన్నీ ప్రక్షాళన అవుతాయి. ఈ పనిచేయటానికి భగవద్వాక్యాలు అవసరమా? ఎలాంటి సందేహం లేకుండా సింహాసనం కోసం కొట్టుకు చచ్చిన సోదరులు, తండ్రీకొడుకులు భారతదేశంలో కోకొల్లలు.
యుద్ధభూమిలో చిన్న అపాయం ఎదురైనా కృష్ణుడికి తట్టినన్ని అపాయకర ఉపాయాలు ఎవరికీ తట్టవు. భీష్ముడి ప్రతిజ్ఞను అవకాశంగా తీసుకొని అర్జునుడికి శిఖండిని డాలుగా అడ్డం పెట్టుకొని భీష్ముణ్ని సంహరించటం, నిరాయుధుడిగా ఉన్న కర్ణుడి పై ఆయుధం ప్రయోగింపజేసి హతమార్చటం, జయద్రధుడిని చంపటానికి సూర్యాస్తమయ భ్రమను కల్పించటం, ద్రోణున్ని చంపటానికి ధర్మరాజుతో అశ్వద్ధామ హత: కుంజర: అనిపించటం, ధుర్యోధనుని వధించటానికి అతడి తొడలపై కొట్టమని భీమున్ని సైగ చేయటం ఇవన్నీ కృష్ణుడు ఇచ్చిన సలహాలు. ఇలాంటి ఘోరమైన పనులు ఇంకా ఉన్నాయి. శల్యపర్వంలో చివర వీటన్నింటి గురించి ప్రశ్నించగా వాళ్ళను చంపటానికి వేరే మార్గం లేదని, మరో రకంగా విజయం సాధించటం సాధ్యం కాదని చెప్పుకున్నాడు కృష్ణుడు. ఇలాంటి కుట్రపూరిత కార్యకలాపాలు అర్థశాస్త్రంలో ఆచరణాత్మక రూపంలో అనేకం ఉన్నాయి. గీతా బోధన చేయటానికి కల్పించబడిన కృష్ణుడు దైవత్వం ఆపాదించబడిన మానవ మాత్రుడే. చాలా విషయాలలో అసాధారణ వ్యక్తి కావొచ్చు. కానీ లోటుపాట్లున్న మనిషే. అందుకే కొన్ని చోట్ల తనను మానవుడుగాను, మరొకొన్ని సందర్భాలలో దేవుడిగాను చెప్పుకుంటాడు. కృష్ణుడి శేష జీవిత కథ-యాదవుల కులక్షయం, అందులో పుత్రుడు ప్రద్యుమ్నుడి చావు, అన్న బలరాముడు క్షతగాత్రుడవటం, తుదకు తన సాధారణ దయనీయ మరణం ఇవన్నీ అతడు కేవలం మానవమాత్రుడే అనటానికి సాక్షాలు.
అర్జునుడిని యుద్ధానికి సంసిద్ధం చేసే క్రమంలో కృష్ణుడు అంతకు ముందున్న తాత్వాక సిద్ధాంతాలన్నింటిని క్రోడీకరించాడు. వాటిని తనకు అనుకూలంగా మలచి అన్నిటి గమ్యము ఒక్కటేనని అందువలన తనను సర్వోన్నత దేవుడిగా విశ్వసించమని చెప్పాడు.
కృష్ణుడు జ్ఞానయోగం, కర్మయోగం, భక్తియోగం, ధ్యానయోగం, సాంఖ్యయోగం ఇలా రకరకాల తాత్విక భావాలను బోధించినప్పటికి అర్జునుడు నిర్వికారంగానే ఉంటాడు. కృష్ణుడికి సహనం నశిస్తుంది. ఇప్పుడిక దండధారణ చేయటం తప్ప మరో గత్యంతరం లేదు. అందుకని మహా భయంకర విశ్వరూపం దాలుస్తాడు. నా ఆశీర్వాదం వలన అన్ని అవరోధాలు అధిగమించగలుగుతావు. కానీ అహంభావంతో నా సలహాను పెడచెవిని పెడితే నాశనం అయిపోతావు అని బెదిరింపుగా చెపుతాడు. కృష్ణుడు అగ్రహౌదగ్రుడు అయ్యాడని, విశ్వరూపం ధరించాడని అలంకారిక భాషలో చెప్పటం దీని అర్థం. కానీ కృష్ణుని యొక్క అంత భీకర స్వరూపం ముందెన్నడూ చూడలేదు. దానితో అర్జునుడు మెత్తబడగాడు. చిట్ట చివరకు అర్జునుడు తన భ్రమలన్ని తొలగిపోయాయని, కృష్ణుడి సలహా ప్రకారం చేయటానికి తాను సిద్ధపడతాడు. అర్జునుడిని మానసికంగా లోబరుచుకోవటంలో విజయం సాధించానని కృష్ణుడు భావిస్తాడు. యుద్ధానికి సన్నిద్ధుడ్ని చేస్తాడు. యుద్ధం చేయటానికి అర్జునుడు ఎందుకు విముఖత చూపాడు? అర్జునుడు తెగల జీవితానికి అలవాటుపడిన గణవ్యవస్థను నమ్మిన తత్వం గలవాడు. గణవ్యవస్థలో ఇతర గణాలకు చెందినవారితో యుద్ధం చేయటం, వాళ్ళను హతమార్చటం, దోచుకోవటం, వాళ్ళ సంపదలను నాశనం చేయటం అన్నీ కూడా నీతివంతమైన పనులే, కాని గణంలోపల మాత్రం పరస్పరం ఏమాత్రం హాని కలిగించకూడదు. ఒక కుదురుకు చెందినవారంతా సజాతుల క్రిందే లెక్క వారికీ హాని తలపెట్టకూడదు. అంటే ఇంకా ఘనవ్యవస్థ నియమ నిబంధనల నుండి బయట పడని స్థితి అర్జునుడిది. అందువల్లనే సజాతులపై, అంటే అన్నదమ్ములు, గురువులు, దాయాదులపై యుద్ధానికి సంశయిస్తాడు. కాని కృష్ణుడు మారుతున్న కాలానికి, మారుతున్న నీతి సూత్రాలకు, కొత్త యుగానికి దూత. ఆస్తికోసం, రాజ్యం కోసం తోబుట్టువులను కూడా చంపవచ్చును. ఎటువంటి కుటిల నీతిని అయినా ప్రయోగించవచ్చును. అలా మారిన కాలానికి ప్రతీక కృష్ణుడు. కాబట్టే మహాభారత యుద్ధం రాజ్యాధికారానికి, రక్త సంబంధానికి పొత్తులేదనే రుజువు చేసింది.
వేదాలలో కాని, ఉపనిషత్తులలోకాని, కర్మ సిద్ధాంతం లేదు. వేదాలలో కర్మలు అంటే యజ్ఞాల సందర్భంగా ఆచరించే కర్మకాండలు లేదా కార్యక్రమాలు. ఆ తరువాతి కాలంలో దానికి వేరే అర్థం వచ్చింది. కర్మలు అంటే (బహుశా గత జన్మలో) చేసిన పనులు అని అవి భవిష్యత్తులో నిర్ణయిస్తాయని కొత్త సిద్ధాంతం పుట్టుకొచ్చింది.
దానికి మూలం వ్యవసాయం అభివృద్ధి అవుతున్న క్రమంలో వచ్చింది. నేలలో నాటే విత్తనం మొలకెత్తి ఫలాన్నిస్తుంది. విత్తనం నాటటం అన్నది కర్మ, ఫలాలను లేదా పంటలను ఇవ్వటం అన్నది ఫలితం. ఈ అనుభవం నుండే చేసిన పనులు పరిపక్వం అయ్యి ఫలితంగా దారితీస్తాయి అనే భావన పుట్టింది. అదే కర్మ సిద్ధాంతంగా రూపొందింది. అసలు కర్మ, పరిపక్వం కావటం, ఫలం ఇవ్వటం అనే మాటలోనే వ్యవసాయ సంబంధ ధ్వని ఉన్నది. ఈ రకమైన భావనయే తరువాతి కాలంలో పూర్వజన్మలో చేసుకున్న పాప పుణ్యాల ఫలితాలను ఈ జన్మలో అనుభవించక తప్పదన్న భావనకు దారితీసింది. అలాగే అహింస అనే భావన ఆరంభమవ టానికి యజ్ఞక్రతువుల సందర్భంగా విపరీతమైన పశుబలులు. యజ్ఞాల పేరుతో ఆవు, ఎద్దు, గుఱ్ఱం, గొట్టె, మేక మొదలైన వాటిని బలి ఇవ్వటం సర్వ సాధారణమైపోయింది. అది యజుర్వేద కాలానికి మరింత పెరిగింది. యజ్ఞంలో బలికాని పశువంటూ లేదంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా ఆవులను, ఎద్దులను బలి ఇవ్వటం వలన అప్పుడే అభివృద్ధి అవుతున్న వ్యవసాయానికి పశువుల కొరత ఏర్పడింది. బలి ఇవ్వటం ద్వారా వచ్చే మాంసాహారం ఎక్కువ కాలం నిల్వ ఉండదు. దాని స్థానంలో వ్యవసాయానికి ఎద్దులను విరివిగా వాడితే వచ్చే పంట మాంసాహాం భుజించేవారికన్నా 20 రెట్ల మందికి ఆహారం అందించవచ్చు. సమాజం ఎప్పుడూ ఒకడుగు ముందుకు అభివృద్దివైపుకే అడుగులు వేస్తుంది. ఇది చరిత్ర సత్యం. ఈ కారణంగానే యజ్ఞాలకు క్రతువుల, కర్మ కాండలకు వ్యతిరేకంగా వ్యవసాయకులు తిరగబడ్డారు. ఆ తిరుగుబాటు అహింసా సిద్ధాంతానికి దారితీసింది. ఆనాడు వ్యవసాయాన్ని ప్రోత్సహించింది ప్రధానంగా క్షత్రియులు. దానికి చరిత్ర సాక్షి గౌతమబుద్ధుడు. బుద్ధుడు యజ్ఞయాగాలను తీవ్రంగా వ్యతిరేకించాడు. అహింసను ఒక తాత్విక సిద్ధాంతంగా ప్రతిపాదించాడు. వ్యవసాయం అభివృద్ధి అయ్యేకొద్ది, యజ్ఞక్రతువులను వ్యతిరేకించే కొద్ది బుద్ధుని తాత్విక సిద్ధాంతమైన అహింస సమాజాన్ని మరింతగా ప్రభావితం చేసింది. దానితో మాంసాహారులైన పురోహితవర్గం సహితం శాఖాహారులుగా మారక తప్పలేదు. పురోహిత వర్గానికి సమాజంలో తగు స్థానం, విలువ ఉండాలంటే విధిగా శాఖాహారులు కావలసి వచ్చింది. భారత ఉపఖండంలో అహింసా కర్మ సిద్ధాంతాలను ప్రతిపాదించి ప్రజలను ప్రభావితం చేసింది బుద్ధుడు బౌద్ధమతం. అయితే అవే సిద్ధాంతాలు తరువాతి కాలంలో బ్రాహ్మణ మతానికి కీలకమయ్యాయి. బౌద్ధాన్ని దేశాలనుండి పారదోలుతూ బౌద్ధుల అహింసా కర్మ సిద్ధాంతాన్ని తమ సొంతం చేసుకున్నారు. వస్తారంగా ప్రాచుర్యం పొందిన కృష్ణ పరమాత్మ చేత ఈ రెండు సిద్ధాంతాలను చెప్పించి, ఈ ఉపదేశాన్ని భగవద్గీతగా మహాభారతంలో ప్రవేశపెట్టారు. బుద్ధుడే లేకపోతే భగవద్గీత సాధ్యమయ్యేదే కాదు. యజ్ఞకాండకు వ్యతిరేకంగా పుట్టిన ఈ అహింసా సిద్ధాంతం, జనమే జయుడు నాగజాతిని హింసాత్మకంగా నాశనం చేయటానికి జరుపుతున్న యజ్ఞసందర్భంలో వైశంపాయనుడు చెప్పిన కథ భారతం. హింసాకాండకు వెరుస్తున్న అర్జునుడికి హింస చేయటం నీ ధర్మం అని కృష్ణుడు చేసే ఉపదేశంలో భాగంగా ఈ భగవద్గీతను మహాభారతంలో ప్రవేశపెట్టటం జరిగింది.
మహాభారతం, సంజయుడు దృతరాష్ట్రుడికిలా చెప్పాడని, జ్యయేజయునికి వ్యాసుడు చెప్పాడు. వ్యాసుడు ఇలా చెప్పాడని నైమిశారణ్యంలోని ఉగ్రశ్రవుడు అనే కవిగాయకుడు తన చుట్టు చేరిన ఋషులతో చెప్పాడు. ఆ ఋషులు వారి శిష్యులకు, ఆ శిష్యులు ప్రశిష్యులకు ఆ ప్రశిష్యులు ప్రప్రశిష్యులకు చెప్పారు. అలా 8800 శ్లోకాలతో మొదలైన జయం లేదా జయేతిహాసం 24000 శ్లోకాలుగా పెరిగి భారతమై, తరువాతి కాలంలో లక్ష శ్లోకాల మహాభారతమయ్యింది. 24000 శ్లోకాలు ఉన్న భారతంలో భగవద్గీత ప్రస్థావనే లేదు. భగవద్గీతలోని మరి కొన్నింటిని పరామర్శిద్దాం:
గీత 2-22 వాసాంపి జీర్ణాని యధా విహయ నవాని గఛతి వరోపరాణి
తథాశరీరాణి విహాయ జీర్ణాన్ అన్యాని నంయాతి నవానిదేహి
మనిషి చిరిగిన బట్టలు విడిచి కొత్త బట్టలు ఎలా ధరిస్తాడో, అదే విధంగా జీవాత్మ జీర్ణించిన శరీరాన్ని విడిచి క్రొత్త శరీరాన్ని ధరిస్తుంది. అలాంటప్పుడు సంతోషించి బారసాల పాటలు పాడుకోవాలిగాని, బాధపడటం ఎందుకు?
గీత 2-11 గతాసూనగ తాసూంశ్చ నామశోచంతి పండితా:
జ్ఞానులైన వారు మరణించినవారి గురించిగాని, జీవించి ఉన్నవారి గురించిగాని శోకించరు. - మరి అభిమన్యుడిని చంపినప్పుడు ఈ జ్ఞానం ఏమైంది, ఎక్కడికి పోయింది.
గీత 2-55 ప్రజహాతి యదాకామాన్ పర్వాన్ పార్ధ మనోగతాన్
ఆత్మన్యేవాత్మనా తుష్ట్ణ స్తితప్రజ్ఞప్త దోచ్యతే
ఎవరైతే అన్ని కోరికలు త్యజించి తమలో తామే సంతృప్తులై ఉంటారో వారే నిజమైన స్థితప్రజ్ఞులు. -అలాంటప్పుడు చస్తే వీరస్వర్గం జయిస్తే రాజభోగాలు అని ఆశచూపటం ఎందుకు?
గీత 2-37హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వానా భోక్ష్యసే మహీమ్
తస్మాదులిష్ట కౌంతేయ యుద్ధాయ కతనిశ్చయ:
అర్జునా చనిపోతే స్వర్గం ప్రాప్తిస్తుంది. జయం పొందితే రాజభోగాలు. రెండు విధాలా లాభమే. అందువల్ల కతనిశ్చయుడవై యుద్ధానికి లే..
గీత 2-38 సుఖ దు:ఖే సమే కత్వాలాభ లాభౌ జయం జరు
తతో యుద్ధాయ యుజ్యస్వ నైనం పాపమవాప్స్యపి.
సుఖ దు:ఖాలను, లాభనష్టాలను, జయాపజయాలను సమానంగా భావించి యుద్ధానికి సన్నిద్దుడవుకా, దీనివల్ల నీకు పాపం అంటదు.
గీత 11-33 తస్మాత్ త్వముత్తిష్ట యశో లభస్వ జిత్వాశతన్ భుంక్ష రాజ్యం సమద్ధమ్
కాబట్టి లే అర్జునా! యశస్సు పొందు. శత్రువులను జయించి సమద్ధమైన రాజ్యం అనుభవించు, -మరి సుఖం, దు:ఖం, గెలుపు, ఓటమి, కీర్తి, అపకీర్తి అన్ని సమానమైనప్పుడు కృష్ణుడు జయము, కీర్తి వీటి ఆశ ఎందుకు చూపుతున్నట్లు.
గీత 2-18 అంతనంత ఇమే దేహా: నిత్యస్యోక్తా: శరీరిణ:
అనాశినో2ప్రమేయస్య తస్మాద్యు ధ్యస్వభారత
ఆత్మ ధరించే శరీరాలన్ని నశించిపోయేవే. కానీ జీవాత్మ నాశనము లేనిది. నిత్యమైనది. కావున అర్జునా యుద్ధం చేయి. - కానీ ఎప్పుడో ఒకసారి చావాలి కాబట్టి ఇప్పుడే చచ్చిపో అనే తర్కం కనిపిస్తుంది ఇక్కడ.
దేవుడి యొక్క గుణగణాలు ఎలాంటివి అయినా వాటిని ప్రశ్నించకుండా, నిర్ణబంధంగా విధేయత చూపటమే గీతలోని భక్తి సారాంశం.
చివరగా ముగింపు:
14వది అయిన అశ్వమేధపర్వంలో మరో గీతను చేర్చారు. అర్జునుడు కృష్ణున్ని అడుగుతాడు. బావా, భారత యుద్ధానికి ముందు నీవు చెప్పిందంతా మర్చిపోయాను. మళ్ళీ మరొక్కసారి చెప్పాలని కోరతాడు. అప్పుడు చెప్పిన దానిని మొత్తం జ్ఞాపకం చేసుకోవటం తనకు కూడా సాధ్యం కాదని కృష్ణుడు అంటాడు. దానికి బదులు మరో గీతను చెబుతాడు. అదే అణుగీత, దీనిని మొదటి భగవద్గీతతో ఏమాత్రం పోల్చటానికి వీలులేదు. కాకుంటే ఈ అణుగీత బ్రాహ్మణులను ఆకాశానికి ఎత్తుతుంది. ఈనాడు దానిని ఎవరూ చదవరు.
అయితే భగవద్గీత ఈ ఆధునిక యుగానికి ఏ విధంగా, ఎలా ఉపయోగపడుతుంది. భూయజమాని లేదా భూస్వామి ఆ భూమిమీద పనిచేసేవారు, పాలేర్లు భూస్వామి ఎన్ని ఆగడాలు చేసినా నిర్ణబంధంగా విధేయత చూపటం నేర్చుకోవాలా? ఒక కంపెనీ యజమాని కార్మికులను ఎంతో దోచుకుంటున్నా నిర్ణబంధంగా విధేయత చూపాలా? నా విష్ణు: పథివీపతి: రాజును మించిన దేవుడు లేడని ఇప్పుడు పరిపాలిస్తున్న పాలకులే దైవాంశ సంభూతులని, వారిని ప్రశ్నిస్తున్న వారిమీద అరాచక చట్టాలను ప్రయోగిస్తూ జైళ్ళపాలు చేస్తున్న ఈ పాలకులకు, ఈ దైవాంశ సంభూతులకు నిర్ణబంధంగా విధేయత చూపుతూ బతకాల్సిందేనా? ఇది భగవద్గీత ఆధునిక యుగానికి ఇచ్చే సందేశం. అలాగే కుళ్ళ కంపు కొడుతున్న కుల వ్యవస్థ, కోరలు చాచుతున్న కుల వ్యవక్షత కొనసాగాలని భగవద్గీత మనకు ప్రభోదిస్తుంది. ఈ ఆధునిక యుగంలో కూడా కుల వ్యవస్థను కొనసాగించాల్సిందేనా? మనిషిని మనిషిగా చూసే సమాజం నిర్మించుకోవద్దా? అయితే బహుళ ప్రాచుర్యం పొందిన ఈ భగవద్గీతను పాలక వర్గాలు సమాజంలో వివిధ రంగాలలో అమలు పర్చటానికే ప్రయత్నిస్తున్నారు. ప్రజలకు తెలియకుండానే దానిని సాధనంగా ఉపయోగించుకుంటూనే ఉన్నాయి పాలకవర్గాలు. దానికి తోడు కొంతమంది కలాల సైన్యం, సమాజంలోని కొన్ని వర్గాలు ప్రజలను అణచిపెట్టి ఉంచటానికి, ప్రశ్నించటమే నేరంగా భావిస్తూ పాలకుల అడుగులకు మడుగులొత్తే సాహిత్యాన్ని వెదజల్లుతూనే ఉన్నారు. అందువల్ల ఆధునిక యుగంలోని సమస్యలకు, వాటి పరిష్కారానికి భగవద్గీత ఏమాత్రం సమాధానం చెప్పలేదు. ఉపయోగపడదు కూడా. చాలా మంది భగవద్గీతను ఉత్తినే గౌరవిస్తారు. గౌరవించేవారిలో అతి కొద్దిమంది మాత్రమే చదువుతారు. మరి కొద్దిమంది మాత్రమే అర్థం చేసుకుంటారు. మన భౌతిక జీవితంలోని వాస్తవికపై ఆధారపడి నిర్దిష్టంగా ఆలోచించాల్సిన తరుణంలో ఈ రకమైన మిశ్రమభావాలు ఎందుకూ పనికిరావు. సాహిత్య సౌందర్యం కోసం చదువు కోవచ్చు.
- పి.బి.చారి
సెల్:9704934614