Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచ దేశాల సమగ్రా భివృద్ధిని ప్రభావితం చేయడంలో ప్రజారోగ్యం, విద్య ప్రధాన భూమికను నిర్వహిస్తాయని మనకు తెలుసు. నేటి బాలలే రేపటి ప్రపంచ కుగ్రామ పౌరులు. ప్రతి శిశువు జనన క్షణం నుంచి పెరిగే క్రమంలో వివిధ వ్యాధుల నుంచి జీవితకాలం తట్టుకోవడానికి, రోగ నిరోధకశక్తిని కల్పించడానికి పలు టీకాలు ఉపయోగపడుతున్నాయి. బాలలకు అందించే టీకా జాబితాలో బిసిజి (బాసిల్లస్ కాల్మెట్ గురిన్), హెప్-బి1 (హెపటైటిస్-బి), ఓపివి-0 (ఓరల్ పోలియో వ్యాక్సీన్), డిటిపి-3 (డిప్తీరియా, టెటనస్, పెర్ట్యూసిస్), పిసివి-1 (న్యూమోనికొక కాంజుగేట్ వ్యాక్సీన్), హిబ్-2 (హిమోఫిలస్ ఇన్ఫుయెంజా టైప్-1), యంసివి-1 (మీసిల్స్ కంటేనింగ్ వ్యాక్సీన్ ఫస్ట్ డోస్), యంయంఆర్-2 (మీసిల్స్, మంఫ్స్, రుబెల్లా) లాంటి పలు ముఖ్యమైన టీకా మందులు అందుబాటులో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలంతో వివిధ వయసుల్లో పిల్లలకు, గర్భిణి మహిళలకు అందించే టీకా ఔషధాల పంపిణి కార్యక్రమానికి తీవ్ర విఘాతం ఏర్పడి, పిల్లల ఆరోగ్య భవిష్యత్తు పెను ప్రమాదంగా మారిందని 7 ఆగస్టు 2021 సంచికలో 'ది లాన్సెట్' ప్రచురించిన పరిశోధనా వ్యాసం తెలియజేస్తున్నది. శాస్త్రవేత్త 'కేట్ ఖాసీ' పరిశోధనా బందం చేసిన పరిశోధనలు పిల్లలకు ఇవ్వాల్సిన సాధారణ టీకాల కార్యక్రమం 2020లో కరోనా వల్ల ఎంత వరకు జరిగిందనే కఠిన వాస్తవాలను సాధికారికంగా తెలియజేసింది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా పిల్లలకు టీకాలు సకాలంలో అందేలా ప్రభుత్వ యంత్రాంగం, పౌర సమాజం ప్రయత్నించడం మరువరాదని, రాబోయే రోజుల్లో కరోనా అలల తాకిడికి టీకా ఉద్యమం సకాలంలో అందకుండా మందగమనం జరిగితే శిశు మరణాలు పెరగవచ్చని తెలుపుతున్నది.
ప్రపంచ స్థాయిలో
కోవిడ్-19 విజృంభనతో ప్రపంచ మానవాళి, సమస్త సామాజిక వ్యవస్థలు లాక్డౌన్, కర్ఫ్యూ, సామాజిక క్రమశిక్షణల కారణంగా 7.7 శాతం డిటిపి-3 (డిప్తీరియా, టెటనస్, పెర్ట్యుసిస్) టీకాల కార్యక్రమం (సాధారణ పరిస్థితులతో పోల్చితే), 7.9 శాతం యంసివి-1 (మీసిల్స్ కంటేనింగ్ వ్యాక్సీన్) టీకాల కార్యక్రమం తగ్గాయని తెలుస్తున్నది. జనవరి -డిసెంబర్ 2020 మధ్య 30 మిలియన్ల పిల్లలు డిటిపి-3ని, 27.2 మిలియన్ పిల్లలు యంసివి-1 టీకాలను పొందలేక పోయారని తెలుస్తున్నది. 2020 ఏప్రిల్ మాసంలో అత్యధికంగా 4.6 మిలియన్ పిల్లలు (31.3 శాతం) డిటిపి-3టీకాలను, 4.4మిలియన్ పిల్లలు (30.1శాతం) యంసివి-1 టీకాలకు కరోనా వల్ల దూరం అయ్యారు. అర్హతగల పిల్లల్లో డిటిపి-3 టీకాలను 76.7శాతం, యంసివి-1 టీకాలు 78.9 శాతం మాత్రమే పొందగలిగారని వివరించింది. ఉత్తర/ లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్, దక్షిణ ఆసియా, కరేబియన్ దేశాల్లో సాధారణ టీకా కార్యక్రమానికి కరోనా వల్ల అధిక ఆటంకాలు ఏర్పడడం గమనించారు. 2020 రెండవ అర్థభాగంలో టీకా కార్యక్రమం తిరిగి పుంజుకుందనే వార్త కొంత ఉపశమనాన్ని ఇచ్చింది. పలు వ్యాధులకు జీవితకాలం రక్షణ కల్పించే ముఖ్య టీకాలకు పిల్లలు దూరం కావడం లేదా పాక్షికంగా పొందడంతో వారి జీవితకాల ఆరోగ్యంపై తీవ్రప్రభావం పడవచ్చని హెచ్చరిస్తున్నారు. 2020లో టీకాలు పొందని పిల్లలకు 2021లో అయినా టీకాలు వేయించ డానికి విస్తత ఏర్పాట్లు చేయాలని సూచించారు.
భారత దేశ స్థాయిలో
కరోనా ప్రభావంతో ఇండియాలో టీకా కార్యక్రమం అధిక ఆటంకాలను ఎదుర్కొంటున్నదని తెలుస్తున్నది. భారతదేశంలో కూడా కరోనా విపత్తు ఉప్పెన వల్ల పిల్లల టీకా కార్యక్రమం 2020లో 70శాతం మాత్రమే జరిగిందని, 30 శాతం పిల్లలకు సకాలంలో వ్యాక్సినేషన్ అందలేదనేది వాస్తవం. కరోనా తొలి, రెండవ వేవ్ కారణంగా ఆరోగ్య / పారామెడికల్ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఇవ్వాల్సిన టీకాలను అందించలేక పోవడం జరిగింది. ఇండియాలో ప్రతి ఏట 2.65 కోట్ల పిల్లలు, 2.9 కోట్ల గర్భిణి స్త్రీలు 'యునివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్' కింద టీకాలు పొంది 12వ్యాధుల నుంచి రక్షణ పొందుతున్నారు. పిల్లల వైద్యుల వివరాల ప్రకారం కొన్ని సమయాల్లో 50శాతం వరకు టీకా కార్యక్రమం తగ్గిందని తెలుపడం విచారకరం. డబ్ల్యూహెచ్ఓ అంచనాల ప్రకారం కోవిడ్-19 కారణంగా మిలియన్ల భారతీయ పిల్లలు టీకా అందని కారణంగా ప్రమాదంలో పడవచ్చని తెలిపారు. భారత్‌లో జనవరి - మార్చి 2021లో డిటిపి-3 టీకాలు 99శాతం అందగా, టీకాలు పొందని లేదా పాక్షికంగా పొందిన పిల్లలను గుర్తించి తగు చర్యలు సత్వరమే తీసుకోవాలని సూచిస్తున్నారు. 23 మిలియన్ల బాలలు 2020లో సాధారణ టీకాలు పొందలేక (2019తో పోల్చితే అదనంగా 3.7 మిలియన్ల పిల్లలు) పోయారు. కరోనా ఉచ్చులో చిక్కిన పేద మురికి వాడల కుటుంబాలకు చెందిన 17 మిలియన్ల పిల్లల పరిస్థితి నేటికీ దయనీయంగా మారింది. నేటి చిన్నారులకు సకాలంలో అందవలసిన టీకాలను అందిస్తూ, రేపటి బాధ్యతగల ఆరోగ్యవంతమైన పౌరసమాజాన్ని తయారు చేయాల్సిన యజ్ఞంలో ప్రభుత్వం, ప్రజలు, తల్లితండ్రులు తమదైన ప్రత్యేక పాత్రను పోషించాడానికి ముందుకు రావాలని కోరుకుందాం.
- డాక్టర్ బుర్రా మధుసూదన్‌రెడ్డి
సెల్: 9949700037